"అర్జెంట్ గా మన వూళ్ళో అదేదో......... ఆటంట ...... ఆ ..గుర్తుకు వచ్చింది ...... స్క్వాష్ ....... అంట ...... దానికి డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ పెట్టేద్దాం బావా ....... " రాంబాబు ఒగొర్చుకుంటూ వచ్చాడు.
నీకేమైనా మతి పోతోందా ...... ఆ గేమ్ గురించి నీకేమైనా తెలుసా .....?"
"నాకేం తెలీదు బావా ...... కానీ మన ఊళ్ళో ఆ టోర్నమెంట్ పెట్టాల్సిందే ..... "
"కారణం చెప్పకుండా ....... నువ్వు ....... మధ్యాన్నమే లార్జ్ .... వేసేసావా ..... ?"
"ఛా ... ఛా ఇంకా లేదు బావా ...... మన రాజు లేడూ ....... ఆడు అప్పుడెప్పుడో హైదరాబాద్ లో ఉద్యోగం వెలగపెట్టినప్పుడు కొద్దిరోజులు అదేదో క్లబ్ లో ఆడేడంట. "
"అయితే ..... "
"ఆడికింకో ఆటేదీ రాదు .... "
"అసలు నీవు దేని గురించి మాట్లాడుతున్నావో అర్ధం కావడం లేదు ....... నీవొక లార్జ్ వేసుకుని రా ..... కరెక్ట్ గా మాటలోస్తాయ్ .... "
"నీవెంత మంచివాడివి బావా .... ఒక్క పదినిమిషాలే ...... "
..... మాట మీద నిలబడ్డాడు . సరిగ్గా 10 నిముషాల్లో నా దగ్గర ఉన్నాడు.
"చెప్పు ..... అసలు ఆ రాజు కి వచ్చిన ఒక్క ఆట కే మనం టోర్నమెంట్ ఎందుకు పెట్టాలి ...... ఏ కబాడీ యో .... వాలీబాలో పెడితే హాయిగా మన స్కూల్ గ్రౌండ్ సరిపోతుంది ..... టీములూ ఎక్కువొస్తాయ్ ...... "
" అదే ఉండ కూడదు ..... మన రాజు ని హీరో ని చెయ్యాలంటే ఇదొక్కటే మార్గం "
"నీకో దణ్ణం రా బాబూ ...... నన్ను నమిలి పడేస్తున్నావ్ ..... "
"ఇప్పుడు కబాడీ ..... వాలీ బాల్ టోర్నమెంట్ పెట్టేవే అనుకో .... దాంట్లో గెలిచినా..... ఆ గొప్పంతా టీమంతా పంచేసుకుంటది . పైగా మనం గెలుత్తామనే గారంటీ లేదు ..... కాబట్టి ఈ స్క్వాషో ..... గేసో .... టోర్నమెంట్ పెడితే మన రాజు గాడు గెలవడం ఖాయం .... "
"గెలిస్తే .... ?"
" ఆ దెబ్బతో మన రాజు గాడిని హీరో చేసి ... ఆ తరువాత ... సర్పంచ్ చేయడం ఖాయం ..... "
"ఒకడిని హీరో ని చేయడం ఇలాగా .... ? వాడి చేత ఒక నాలుగేళ్ల పాటు మంచి పనులు చేయించొచ్చు కదా ... "
"నువ్వు చదువుకున్నావ్ కానీ లోకజ్ఞానం అస్సలు లేదు .... బావా ... అందుకే అక్క అలా తిట్టుద్ది ... "
"చిత్తం ..... తమరు గడించిన లోకజ్ఞానాన్ని సెలవివ్వండి ... "
"ఒక్క పది నిముషాలే ....... " మరలా బయటకు పొయ్యాడు.
కరక్ట్ గానే ప్రత్యక్ష మయ్యాడు
"ఉప్పుడు ...పనికి మాలినదేమీ అమ్మకూడదనేది ... మన తాతలనాటి నీతి .... మరి అలాంటి పనికి మాలిన వస్తువుని ప్రపంచం అంతా ఇదే టెక్నిక్ తో అమ్మేస్తున్నారా లేదా ?"
"నేనూ ఒక లార్జ్ వెయ్యాలో ఏమిటో ఖర్మ .... " అనుకున్నాను
" పట్టుమని పది దేశాల్లో కూడా ఆడని క్రికెట్ ప్లేయర్స్ ని ... స్టార్లని చేసి ..... రంగు నీళ్ళమ్ముకునే వాళ్ళు .... కోక్ కలిపిన పొట్టు అమ్ముకునే వాళ్ళు .... వేల కోట్లు సంపాదించేది ఈ టెక్నిక్ మీదే కదా .... "
"ఊరుకోమ్మా ...... వాళ్ళు బోల్డన్ని టాక్స్ లు కూడా కడతారు ..... "
"ఛా .... ఈ గ్లాసుడు నీళ్ళు రేటెంత బావా? "
"పది పైసలు మించి ఉండదు "
"మరి వీటిని రూపాయికి అమ్మగలిగాననుకో .... నలభై పైసలు టాక్స్ కడితే నాకేమైనా నష్టమా .... పైగా బావా వీళ్ళ లో ఎవరైనా క్రికెట్ టోర్నమెంట్ లకు తప్ప ... ఈ దేశంలో ఏదైనా పెద్ద కాలేజీలు ఏమైనా కట్టారా ... హాస్పిటల్స్ కట్టారా ... ?"
"గ్లోబలైజేషన్ లో అలా మనమేమీ ఆపలేమమ్మా ..... "
"చెయ్యాలంటే ఏదైనా చేయొచ్చు బావా .... గవర్నమెంట్ కావాలనుకుంటే ఆళ్ల కుండే పెద్ద డాక్టర్లను టీవీల్లోకి పట్టుకొచ్చి .... ఒరెర్రెదవల్లారా ..... రంగునీళ్ళ కంటే .... మన కొబ్బరి నీళ్ళు ... మజ్జిగ ... పాలు చవక ... శ్రేష్టం అని చెప్పించలేదా .....
నాకు చాలా నవ్వొచ్చింది మా రాంబాబు అమాయకత్వానికి
"రాజ్యాలే కూలిపోతాయ్ ... " మనసులోనే అనుకున్నాను
" ఆయన్నీ ఒదిలెయ్ బావా ..... ఆ స్క్వాషో మరోటో క్రీస్తు పూర్వం నుండీ ..... ఇక్కడ ఉందనీ .... ముస్లిం దండయాత్రల వల్లా ... బ్రిటిషోడి వల్లా జనం మరిచి పోయ్యారనీ .... మన "రాజు" దానిని పైకి తేవాలని దేశ దేశాలు తిరిగి ఈ ఆట నేర్చుకోనచ్చారనీ .... పేపర్లో ఎయించేత్తాను ..... టీవీ లో కూడా చెప్పించేత్తాను . నీకేమైనా అనుమానమా ..... నాలుగు రూపాయల కోసం అడ్డంగా ఓడిపోయ్యేవాడిని కూడా ..... అఖండ విజయంతో గెలిచేస్తాడని చెప్పేస్తున్నారు .... "
మా రాంబాబు మూడో రౌండ్ కోసం బయటకు పొయ్యాడు.