31, డిసెంబర్ 2012, సోమవారం

సంవత్సరాంతపు ఆలోచన...సరి కొత్త సబ్సిడీ పధకం...ఫ్రీ గా ఉపయోగించొచ్చు...









"అయితే వాళ్ళు ఉదయం 7 గంటలకల్లా మన ఇంట్లో ఉంటారంటావ్"

"........"

"అంతేలే గోదావరి ఎక్స్ ప్రెస్  ఎప్పుడూ లేట్ ఉండదు"

"........."

"గోదావరి ఎక్స్ ప్రెస్  ఒకటో నంబర్ ప్లాట్ ఫార్మ్ మీదకు ఇచ్చి చస్తున్నాడు...ఎనిమిదో నంబర్ మీదకు ఇస్తేనే మన గోపాలపట్నానికి కన్వీనియెంట్..ఏది ఏమైనా 7 గంటలకల్లా ఇంటికి చేరుకుంటారులే"

"......."

"హైదరాబాదుకి మధ్యానానికల్లా ఫ్లైట్ వచ్చేస్తుంది కదా....రాత్రంతా గోదావరిలో ఏసీ లో బాగానే రెస్ట్ ఉంటుంది..ఫరవాలేదు"

".........."

"మరి టిఫిన్ ఏర్పాట్లు మాటేమిటి...మనింట్లో ఒక్క పూటే ఉంటారని అంటున్నావు కదా.."

"......."

"మనమేది పెడితే అదే తింటారని నాకు మాత్రం తెలిసి చావదేమిటి...నాలుగు సంవత్సరాల తరువాత వస్తున్నారు...ఏదో స్పెషల్ ఉంటే బెటర్ కదా..." 

"........."

"ఒక పని చేయి పెసరట్టుప్మా...చేయి"

"........."

"అలాగే అంటే కాదు...మొన్న వారం  పెసరట్ల లో ఉల్లిపాయముక్కల కంటే ఇసుకే బాగా కనిపించింది"

"......."

"ఆ దిక్కుమాలిన .....కిరాణా కొట్టుకు వెళ్ళొద్దంటే వినవు...హాయిగా మాంచి సూపర్  బజార్  కు వెళ్ళమంటే...నీకు నాలుగడుగులు వేయడమంటే గగనమై పోతుంది"

"......."

"నువ్వెన్ని చెప్పు నేను వినను....కోట్లు పెట్టి షాపులు పెట్టి క్వాలిటీ మైంటైన్ చేయక పోతే రెండో రోజే నెత్తి మీద గుడ్డ వేసుకోవాలి...కాబట్టి నీవు సూపర్ బజార్ లో పెసర పప్పు తీసుకో. అలగే ఉప్మా రవ్వ కూడా అక్కడే తీసుకో..."

"......"

"నీ స్వంత బుర్ర వాడకు. నేను చెప్పింది విను...ఇంకొక విషయం చెప్పు. పెసర పప్పు బెటరా...పెసర గుళ్ళు బెటరా...."

"........."

"పెసర గుళ్ళు ఐతే కాస్త ఎక్కువ సేపు నానాలి కానీ .....టేస్ట్  కు అవే బెటర్"

"............."

"సరదాగా కాస్సేపు మనతో గడపడానికి వస్తున్నారని నాకు పదే పదే గుర్తు చేయనక్కర లేదు.వచ్చేది మీ స్వంత తమ్ముడు కాక పోయినా అమెరికా నుండి అక్క వరసైన నిన్ను చూడడానికి ఆగుతునాడంటే ఆ మాత్రం మర్యాద చేయక పోతే ఏడ్చినట్లుంటుంది" 

"........."

"ఏమిటి....ఆ టైం కే మీ తమ్ముడి కుటుంబం కూడా ఇక్కడికే  వస్తారా?"

"......" 

"వాళ్ళు కూడా ఇక్కడే  టిఫిన్ తింటారా...సీతమ్మ ధార నుండి ఎంత సేపు వస్తారు..హాయిగా టిఫిన్ చేసి రావొచ్చు కదా..."

"......."

"అంత మందికి పెసరట్లు వేస్తూ కూర్చుంటే నీకు మధ్యాహ్నం వరకూ వంటగదిలోనే సరిపోతుంది"

"......."

"అదేమీ కుదరదు....పెసరట్లే టిఫిన్...కావాలంటే పెసరట్లు మీ తమ్ముడి కుటుంబానికి పెట్టిన తరువాత ...రుబ్బిన పిండి చాలలేదని సీతమ్మ ధార తమ్ముడి కుటుంబానికి ఉప్మా తో సరి పెట్టేయ్..."

"........."

"మీ తమ్ముడు... మరదలు ..వంటగదిలోనే పీట వేసుక్కూర్చుని కబుర్లు చెబుతారా...అంటే నేను వాళ్ళతో మాట్లాడేదేదీ ఉండదా...."

"......."

"చిన్నప్పుడు అలాగే ఉండే  వాడని ఇప్పుడు కూడా అలాగే ఉంటాడని ఎలా అనుకుంటావ్..అంత పెద్ద ఉద్యోగం చేస్తూ...మారడని గారంటీ ఏమన్నా ఉందా..మీ ఎస్ కోట  నీ చిన్నప్పటి లానే ఉందా.?"

"........"

"పెసరట్లలోకి ఎన్ని చెట్నీలు చేస్తావ్..."

"........"

"ఉప్మా ఉన్నంత మాత్రాన ఒక్క చట్నీతో సరిపెట్టేస్తే ఏమి బాగుంటుంది...కొబ్బరి చట్నీ తో బాటు అల్లం చట్నీ కూడా ఉండ  వలసిందే.అసలు మా గోదావరి జిల్లా వాళ్ళకు తెలిసినట్టు మీ ఉత్తరాంధ్రా వాళ్ళకు టేస్ట్ లు తెలిసి చావవు.."

"........."

"శ్రీ  శ్రీ ..గురజాడ ..ఇక్కడి వాళ్ళా..వెధవ కౌంటర్ లు వేయకు....ముందు పెసరట్ల గురించి అలోచించు"

".........."

"అన్నీ అంత తేలిగ్గా తీసుకో వద్దని నీకు అనేక సార్లు చెబుతున్నాను....కొబ్బరి చత్నీ మరీ పిండిలా  గ్రైండ్  చేసేస్తావ్...నంజుకుంటున్నప్పుడు కొబ్బరి తగులుతూ ఉండాలి...అందుకు ఒక పని చేయ్...మొత్తం కొబ్బరి అంతా చట్నీ చేయకుండా కొంత కోరిన కొబ్బరి చట్నీ లో కలుపు."

"......."

"పచ్చి వాసనేమీ రాదు. దేనికైనా కొంత వెరైటీ మైంటైన్ చేయాలి"

"........"

"జీవించే విధానంలో వెరైటీ ఉండాలా....మీ నాన్నకు చెప్పు...మంచి ఉద్యోగం చేతూ కూడా మడిగట్టుక్కూర్చుని ఉన్న మడి కూడా అమ్మేసాడు.సరేలే కానీ ఉల్లిపాయలేమి  చేస్తావ్?

"......."

"అబ్బా ఏదో ఐనిస్టీన్ లా మాట్లాడేసావ్. ముక్కలు కోసి వేస్తారన్న సంగతి అందరికీ తెలుసు. అలా కాకుండా అవే ముక్కలు కాస్త నూనెలో వేయించి పెసరట్ల మీద జల్లితే  మరింత టేస్ట్ గా ఉంటాయి."

"........"

"మరీ అంత ఆయిలీ ఫుడ్ తినరా....ఇండియా లో ఉన్న నాల్రోజులకు కొలెష్ట్రాల్ ఏమీ పెరిగి పోదులేవోయ్....ఒక్క నిముషం ఫోన్ పెట్టేయనా...యే పొయ్యి మీదైనా ..యేదైనా మాడబెట్టావా...?"

"......."

"మీ తమ్ముడు కాల్ చేస్తున్నాడా...సరే... "

"................"

"ఏడ్చినట్లుంది ...అనుకోకుండా లీవ్ కర్టైల్ చేసుకోవలసి వచ్చిందా...మీ చిన్నాన్న..పిన్ని రేపు ఇక్కడ నుండి ఫ్లైట్ కు బయలుదేరుతున్నారా.....నిన్నెందుకు రమ్మనడం..ఇప్పటికిప్పుడు ట్రైన్ కు రిజర్వేషన్ దొరుకుతుందా..."

"......."

"తత్కాల్....వొల్వో బస్ టికట్ తీసే అంత సీనేమీ లేదు...ఉండు వేపగుంట దాటాను....బస్ దిగిన తరువాత తిన్నగా ఇంటికే వస్తాను..అప్పుడు మాట్లాడదాం." 


కొత్తవలస నుండి గోపాల పట్నం వరకూ నా పక్కన కూర్చున్న పాసింజర్ సెల్ ఫోన్ వాడిన విధానం ఇది.దీంట్లో సెల్ లోనే మాట్లాడవలసినంత విషయం  ఏముందో పాఠకుల విజ్ణతకే వదిలేస్తున్నా....

ఇంకొక  విషయం నేను గమనించింది ఏమిటంటే మా ఇంట్లో అంట్లు తోమడానికి పెట్టుకున్న పని అమ్మాయి దగ్గర నుండి ...మా కాంక్రీట్ పనులలోకి వచ్చే మొత్తం పని వారందరికీ సెల్ ఫోన్ లు ఉన్నాయి. అంతే కాదు వీళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డ్  లు కూడా ఉన్నాయి. అంటే బియ్యం మొదలైనవన్నీ రేషన్ మీద తెచ్చుకొనే సదుపాయం ఉంది. వీళ్ళందరూ కూడా సెల్ ఫోన్ లలో మాట్లాడే విషయాలు చాలా వరకూ పై విధంగానే ఉంటాయి.
బియ్యం లాంటివి సబ్సిడీ మీద వస్తుంటే వీరందరూ  దానికి పెట్టే ఖర్చు కంటే ఎక్కువగానే సెల్ ఫోన్ రీచార్జ్ లకు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు నెలకు ఎంతోకంత రేషన్ మీద ఫ్రీ టాక్ టైం సదుపాయం కలగజేస్తే బాగుంటుందేమో....అసలు అన్ని  సబ్సిడీలు ప్రకటిస్తున్న రాజకీయ నాయకులకి ఇలాంటి దివ్యమైన ఆలోచన ఎందుకు రాలేదో అర్ధం కాదు.

అంతిమంగా  ఎవరు లబ్ది పొందుతున్నారన్నది కాకుండా ఆ పూటకి ఎంత లాభం అన్నదే పరమావధిగా ప్రజల ఆలోచనా సరళి ఉన్నంత వరకూ ప్రభుత్వ  సబ్సిడీలతోనే కార్పొరేట్ సంస్థలు పెద్దవి అవ్వొచ్చు...పేదవాడు తన అజ్ణానంతో రోజు రోజుకూ మోసగించబడుతూ క్రిందకు దిగ జారుతూనే ఉంటాడు. ఒక కొస మెరుపు ఏమిటంటే రైల్వే లాంటి పెద్ద ప్రభుత్వ సంస్థలు తమ సీ. యూ. జీ. ఫోన్ కాంట్రాక్ట్  సాటి ప్రభుత్వ  రంగ సంస్థైన బీ.ఏస్.ఎన్.ఎల్. కు కాకుండా ఎయిర్  టెల్ కు ఇచ్చింది.

26, డిసెంబర్ 2012, బుధవారం

"నేను నా వూరిలో ఎందుకుండాలి?"




చాలా కాలం తరువాత అయినవిల్లి లంక వెళ్ళాను.వెళ్ళిన కారణం బాధాకరమైనదే అయినప్పటికీ చాలా కాలం తరువాత ఆ రోడ్ లో ప్రయాణించడం చాలా ఆహ్లాదాన్నిచ్చింది. ఏదైనా వాహనం ఆగగానే పరుగుపెట్టుకొచ్చే పూలమ్ముకునే పిల్లలు వాళ్ళ చేతుల్లో ఉండే రంగు రంగు పూల దండలు....పేదరికంలో ఉన్నా నాలుగు గోడల మధ్యా జీవితం మొత్తం గడిపేసే చాలా రకాల ఉద్యోగుల కంటే వీళ్ళు చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది.వేమగిరి దాటగానే మొదలయ్యే నర్సరీలు హై వే మీద వెళ్ళే వాళ్ళకు కనువిందు చేస్తూ ఉంటాయి.అవి దాటగానే గోదావరి పలకరిస్తుంది.జొన్నాడ బ్రిడ్జ్ మీదుగా గోదావరి మాతకు "హలో" చెప్పుకుంటూ ముందుకు వెళ్ళగానే రావులపాలెం సెంటర్..కోనసీమ ముఖద్వారం.దానిని కూడా దాటుతున్నప్పుడు రోడ్ కు ఒక వైపు ఉండే కాలువ..వేరే వైపు ఉండే అరటి తోటలు అంతా అహ్లాదమే...కొత్త పేట రాకుండానే తగిలే జగ్గుపాలెం జంక్షన్ నుండి విడిపోయే ఇరుకు రోడ్ ముక్తేస్వరం వరకూ కాస్త ఇబ్బంది పెడుతుంది.ముక్తేస్వరం రాకముందే తగిలే అయినవిల్లి క్షేత్రం దేవాలయాలు....మొత్తానికి నాకు పెళ్ళైన మొదటి సంవత్సరం ఆషాఢానికి ఆ వూరు వెళ్ళిన దగ్గర నుండీ ఆ వూరు అంటే నాకు ఎప్పుడూ ప్రత్యేకాభిమానమే.అప్పటికే మా మామయ్యగారు ( మా శ్రీమతి కి చిన్నాన్న గారు అంటే పిన్ని గారి భర్త) యీ ప్రపంచాన్ని వీడి పది రోజులు కావస్తోంది కాబట్టి అందరి ముఖాల్లు కాస్త తెరిపిన పడ్డాయి.డెబ్భై నిండని ఆయన నిద్రలోనే యీ లోకాన్ని వీడడం మా అందరికీ ఎంతో బాధ కలిగించింది.తెల్లని పంచెలో ఉదయాన్నే  చుట్ట కాల్చుతుంటే ఒక సంస్కృతికి  ప్రతిబింబంగా కనబడేది.మా వూరు పట్టణానికి అత్యంత సమీపం లోనే ఉండడంతో మా వూరు..మా చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఉండే మిగిలిన బంధువుల ప్రవర్తనకూ యీయన ప్రవర్తనకూ తేడా స్పష్టంగా ఉండేది.అందులోనూ మా శ్రీను  (మా శ్రీమతి పిన్ని గారి అబ్బాయి)మా శ్రీమతి కి అనుంగు శిష్యుడు కాబట్టి 2 రోజులు సెలవు పెట్టి మరీ ఆ వూరు వెళ్ళాను.



పెద్ద ఇల్లు. ఆ రోజుల్లో దగ్గర దగ్గర 15 అడుగుల ఫిల్లింగ్ చేయించి ఆ ఇల్లు కట్టారు.వరదలు ఆ వూరికి వచ్చి పోతుంటాయి కాబట్టి ఆ భయం లేకుండా ఉండడానికి అలా ఫిల్లింగ్ చేయించారు. చుట్టూ పెద్ద పెరడు. మా శ్రీను ఉద్యోగ రీత్యా తణుకు  లో ఉంటాడు.ఇల్లంతా అద్దెకు ఇవ్వాల్సి వస్తుందేమో.అదే మాట మా శ్రీను తో అన్నాను.
"ఇప్పుడు అదే పెద్ద చిక్కు వచ్చి పడింది బావా..."

"యే..అద్దెకు యివ్వడానికి మీ అమ్మ ఒప్పుకోడం  లేదా...."

"అదేమీ లేదు ..అద్దెకు ఉండే వాళ్ళే లేరు"

"ఇన్ని సదుపాయాలున్న ఇల్లు...కళ్ళకద్దుకుని ఉండొచ్చు కదా..."

"నీకొక్క సంగతి చెప్పనా బావా...మా వూరిలో పది సంవత్సరాల తరువాత మొన్న ఒక గృహప్రవేశ కార్యక్రమం జరిగింది."
"అంటే..."
" ఏమీ లేదు కరెక్ట్ గా చెప్పాలంటే ..మొత్తం మీద జనాభా పెరుగుతోంది...కానీ మా వూరు ..ఇదే కాదు ఈ పక్క ఉన్న లంకలన్నీ....నెమ్మదిగా ఖాళీ అవుతున్నాయి. "

"మరి వ్యవసాయం..."

"ఏదో టైం పాస్ కావాలంటే చేయాలి..."

ప్రహరీ గోడమీదుగా రోడ్ వైపుకు చూసాను. రాముల వారి కోవెల..పక్కనే పూజారి గారి ఇల్లు...కనుచూపు మేర కనబడుతున్న కొబ్బరి చెట్లు వాటి చాటున దాక్కున్నట్లుగా ఉన్న పెంకుటిల్లు....ఇక్కడ ఉండలేక జనం పట్టణాల వైపు పరుగు తీస్తున్నారు.బాధ వేసింది.

"కొబ్బరికాయకు రేటు లేదా..."

"ఉండొచ్చు..ఉండకపోవచ్చు..గారంటీ మాత్రం లేదు...నిజంగా చెప్పాలంటే పూర్తి గాలివాటం బ్రతుకులై పొయ్యాయి రైతులవి.."

"కానీ యీ స్వచ్చత...ఇవన్నీ టౌనుల్లో ఉండవు కదా శ్రీనూ..."

"నిజం బావా...నీవు చిన్నప్పటి నుండీ నన్ను చూస్తున్నావ్...నాకెప్పుడూ ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటూ బ్రతకాలనే ఉంటుంది.కానీ నా ఇష్టా ఇష్టాలకు నా పిల్ల భవిష్యత్తును పణంగా పెట్టలేనుగా." చాలా అవేదనతోనే అన్నట్లుగా అనిపించింది.

ఇంకా వేరెవరో అతిధులు వస్తే పలకరించడానికి శ్రీను వెళ్ళాడు.ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద కొబ్బరి డొక్కల ప్రోగు ఉంది.ఇంత కొబ్బరి ఇక్క్ద నుండి ఉత్పత్తి అవుతున్నప్పుడు ఇక్కడ పీచు పరిశ్రమల్లంటివి డెవలప్ చేయలేదెందుకో...

ఇంకొకటి అలోచిస్తుంటే చాల భయంగా ..బెంగగా అనిపిస్తోంది. నెమ్మదిగా ఈ గ్రామాలు ఇక కనబడవా... 

భౌతిక పరిస్తితుల బట్టి వెళ్ళక తప్పదు.మన ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఆర్ధిక విధానాలబట్టే కదా భౌతిక పరిస్థితులు రూపు దిద్దుకొనేది.మనసులో అలోచనలు ముసురుకుంటున్నాయి.వంటవాడు వచ్చి తేవలసిన సామాన్ల లిస్ట్ ఇస్తున్నాడు.వింటుంటే అన్నీ పాత రకం కూరలే వినబడ్డాయి.ఆ తరువాత పంతులు గారు కార్యక్రమానికి కావలిసిన సామాన్లు చెప్పారు.ఇద్దరు కుర్రాళ్ళు బైక్ లు తీసుకుని రెడీ అయ్యారు.



శ్రీను మరలా వచ్చి కూర్చున్నాడు.

"వడ్డించడానికి కుర్రాళ్ళు నిలబడతారా...లేక దానికి కూడా బయటి వాళ్ళను పురమాయిస్తున్నావా?"

"లేదు ..ఇక్కడ కూడా సెల్ ఫోన్ లు వాడతారు కానీ మరీ అంత అర్ధం లేకుండా కాదు"

టీ లు వచ్చాయి.రాక రాక వచ్చాం..ఒక్క సారి ఎప్పుడో తిరిగిన గ్రామం కాబట్టి ఒక సారి పొలాల వైపు వెళ్ళడానికి తయారయ్యాను.

కేవలం మారిన అభిరుచులే ప్రజలను పట్టణాలవైపు పరుగెట్టుస్తున్నాయని అర్బన్ జనం అనుకొంటూ ఉంటారు.నిజాల లోతుల్లోకి ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు?"

పొలాన్నుండి ఇంటికి తిరిగి వచ్చ్హాను.

"ఎక్కడికి పోయావ్..నీకోసం ఇందాకడనుండీ సుజాత...పెద్ద కళ్ళ బుజ్జి ఎదురు చూస్తున్నారు." శ్రీమతి నా మాట కోసం ఎదురు చూడకుండా వాళ్ళను పిలవడం కోసం లోపలికి వెళ్ళింది. యీ పేర్లు విన్నట్లే గుర్తు.మనుషులు కూడా గుర్తుకు వస్తున్నారు.మొదట ఈ వూరు వచ్చినప్పుడు అంతా చాలా చనువుగా ....కలుపుగోలుగా ఉండే వారు.

"ఇడిగోనే మీ ప్రసాద్ బావ " శ్రీమతి మాట విని అటు వైపు చూసాను.శ్రీమతి కరెక్ట్ గానే కనిపించింది కానీ ఆ వెనుక ఉన్న సరీసృపాలు ఎవరు..? అంటే వీళ్ళే...అమ్మో ...ఇంతకూ కళ్ళజోడు పెట్టుకుని సన్నాగా ఉండే సుజాతెవరో...అదే మాట పైకి కూడా వచ్చేసింది.

"నేను చెప్పానా....ప్రసాద్ బావ నన్ను గుర్తుంచుకుంటాడని" ఒక సరీసృపం జవాబిచ్చింది.

హమ్మయ్య అనుకున్నాను

"బాగున్నావా సుజాతా..."పలకరించేసాను.

"ఒరేయ్....అన్నిటి నిండా నీళ్ళు నింపేయండి.ఉదయం మరలా కరెంట్ ఉండదు.
నిజమే కరెంట్ ఉండదు.



అక్కడ కూడా మా వాడి స్నేహితులు ఉన్నారు.

"రేపు స్కూల్ మానెయ్యరా...మరలా రేపు సాయంత్రం వైజాగ్ వెళ్ళిపోతాం కదరా.." మా వాడు బ్రతిమాలుతున్నాడు.

ఆ కుర్రాడికి కూడా మానెయ్యాలనే ఉన్నట్లుంది. వాళ్ళ నాన్న వైపు ఆశగా చూశాడు. అతడు నాకు తమ్ముని వరసే.

"ఒరేయ్...పెదనాన్న వాళ్ళు సిటీ లో ఉంటార్రా....అక్కడన్నీ మంచి స్కూళ్ళే ఉంటాయి.బాగా చదువు కోవచ్చు..కాబట్టి వాడు ఎన్నిరొజులు మానేసినా కవర్ చేసుకోగలడు"

నాకే బాధనిపించింది.జాలిగా పెట్టిన ఆ కుర్రాడి ముఖం లోకి చూడలేకపొయ్యాను.

చిద్రమవుతున్న పల్లె జీవితం. రైతులకు నిత్యం జీవన పోరాటం.రేసులో పాల్గొనాలనే ఆరాటం. కానీ అది వాళ్ళకు సాధ్యం కాదని వాళ్ళకు అర్ధం అవుతూనే ఉంది కానీ...ఏం చేయాలో తెలియని పరిస్థితి.

ఆ తండ్రి మాటల్లో అబద్దమేమీ లేదు.

పల్లెల్లో చదువు చెప్పరా...చదువుకు అర్ధమూ...పరమార్ధమూ మారిన పరిస్థితులు....

ఆ మధ్య   " నువ్వు నాకు నచ్చావ్" అనే సినిమా బాగా హిట్ అయ్యింది. డానిలో హీరో ఒక చోట "పగలంతా పని చేసుకుని హాయిగా సినిమాకు వెళ్ళొచ్చి ..."అంటూ కోరికలు తగ్గించుకొని పల్లెల్లో కూడా సంతృప్తిగా ఎలా బ్రతకొచ్చో చక్కగా వివరిస్తాడు.ఆ రోజుల్లో ఆ ఒక్క దైలాగ్ కోసం ఆ సినిమా సీడీ కొని ఇంట్లో ఉంచుకున్నాను.

ఇప్పుడు కూడా ఆ మాత్రం సామాన్య రైతుకు అందుబాటులో ఉంటే వాళ్ళు ఆనందంగా జీవించేస్తారు.కానీ ఎలా...
నగరాల్లో.....పట్టణాల్లో ఉన్నవాళ్ళకు మాత్రమే రేస్ లో పాల్గొనే చాన్స్ ఉండేలా మన ప్రభుత్వ విధానాలు ఎందుకు రూపొందాలి?  
అత్యంత ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్ చదవబొయ్యే వాళ్ళు సైన్స్ లేబొరేటరీ  చూపకుండానే ఉత్తీర్ణులను చేసే కార్పొరేట్ కాలేజ్ లకు పర్మిషన్ ఎలా వచ్చింది? 
రెండేళ్ళ జీవితాన్ని ఇంచుమించు సూర్యుడి ముఖం చూడనీయకుండా ...బాల్యం-యౌవనాల సంధి కాలాంలో విద్యార్ధులను పూర్తిగా సమాజానికి దూరంగా ఉంచి వాళ్ళలో అసంపూర్ణ వ్యక్తిత్వాలను ఎవరు పెంచుతున్నారు? యీ విధంగా చదువుతున్న వాళ్ళకు మాత్రమే అత్యున్నత ప్రొఫెషనల్ కాలేజ్ లలో సీట్స్ వచ్చె విధంగా మన విద్యా వ్యవస్థ ఎందుకు ఉండాలి?
కాలేజ్ లన్నీ యూనిఫార్మ్ గా ఉంటే గ్రామాలు...పట్టణాలు తేడా లేకుండా అసలైన టేలెంట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఉన్నత విద్యకు అవకాశాలు వచ్చేవి కదా...
ఇప్పుడు అందరికీ తెలిసిన ఒకే ఒక్క కామన్ విషయేమిటంటే ఏదోల నీవు ఏదో కార్పొరేట్ స్కూల్/కాలేజ్ లలో చదివితేనే టాప్ కాలేజ్ లలో సీట్ వస్తుందని.నీకు తెలియకుండానే నీవు రేస్ లోకి నెట్టబడుతున్నావు.
గిట్టుబాటు కాని వ్యవసాయాలూ చేస్తూ....కనీసం కరెంట్ ఉండని గ్రామాల్లో బ్రతికే బదులు చచ్చినట్లు రైతులంతా దొరికిన కౌలుకు తమ పొలాలని  వదిలి అలవాటు లేని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ శవాల్లా  బ్రతికే పరిస్థితులు ఏ ఒక్క రాజకీయ పార్టీ అన్నా గమనించిందా....
ఈ రేట్ రేస్ కు వ్యతిరేకంగా ఒక్క రాజకీయ పార్టీ అన్నా మాట్లాడే ధైర్యం చేస్తుందా?
మొత్తానికి జరగుతున్న విషయాన్ని కరెక్ట్ గా చెప్పాలంటే రైతుల చేత "పొమ్మనలేక పొగబెట్టినట్లు"గా గ్రామాలు ఖాళీ చేయిస్తున్నారు. వ్యవసాయం ఎవరు చేస్తారో పాలక వర్గాలకు కరెక్ట్ అంచనా ఉంది.గిరిజనుల చేత అడువులు....రైతుల చేత గ్రామాలు ఖాళీ చేయించే ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.
రాత్రి చాలా సేపు యీ విధమైన అలోచనా స్రవంతి నడుస్తూనే ఉంది. రేవుకి వెళ్దువుగాని లే ఇక అని శ్రీమతి మాటలకు మెలుకువ వచ్చింది.
పిల్లలెవరూ స్కూల్ మాన లేదు.బంధువులంతా పోగయ్యారనే ఆనందం వాళ్ళకు మిగల లేదు.భోజనాలయ్యాయి.కూరలు మాత్రం పాత సాంప్రదాయ కూరలే.చాలా బాగున్నాయ్.  తిరిగి బయలు దేరాం.కానీ మా శ్రీను మాటలు మాత్రం నా చెవుల్లో ఇంకా గింగురుమంటూనే ఉన్నాయ్.

"నేను ఈ వూరిలో ఎందుకుండాలి?"

7, డిసెంబర్ 2012, శుక్రవారం

చలిచీమలు ఐకమత్యం పోగొట్టుకున్న నాడు.......


నా చిన్నప్పుడు మా వూరిలో ఒకాయన అప్పుల బాధలు భరించలేక I.P..(Insolvement procedure) పెట్టాడు.ఆయన అప్పులు ఎందుకు చేసాడో నాకైతే తెలియదు కానీ నేనెరిగుండగా ఆయన ఎక్కువగా వీధిలోకి రావడం నేను చూడలేదు.ఎప్పుడూ ఏదో పోగుట్టుకున్నట్లుగా వీధి అరుగు మీదే కూర్చుని ఉండేవాడు. బహుశా నేననుకోవడం ఆయనలో అపరాధ భావన మనసులో ఉన్నందువలనే పదిమందిలోనికి రాలేక పొయాడని......... అందరూ ఇది  నమ్ముతారనే అనుకుంటాను.




ఇంకొక విషయానికి వస్తే మా వాడి స్కూల్ గేట్ కు ఎదురుగా రోడ్ డివైడెర్ లో ఖాళీ ఉండని కారణం వలన గేట్ పక్కన ఉండే రోడ్ లో ఒక దిశలో  మాత్రమే ప్రయాణం చేయగలుగుతాం. కానీ గేట్ కు కొద్ది పాటి వెనుకగా డివైడెర్ లో రోడ్ క్రాసింగ్ కోసం ఖాళీ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మా వాడిని స్కూల్ లో దిగబెట్ట వలసి వచ్చినప్పుడు గేట్ నుండి ఆ కాస్త ముక్క ఒక పక్కగా బండిని నడిపించుకొని వచ్చి డివైడెర్ లో ఖాళీ వదిలిన భాగం  నుండి రోడ్ క్రాస్ చేయడం నా అలవాటు.ఆ మద్యన అలా చేస్తున్నప్పుడే రాంగ్ రూట్ లో వస్తున్న ఒకడు నన్ను గుద్దినంత పని చేసాడు.పైగా అడ్డంగా వాదించడం కూడా మొదలు పెట్టాడు.వచ్చిందే రాంగ్ రూట్ ( నాది కొంత వరకూ అదే కావచ్చు కాబట్టే కానీ జనం నడిచే భాగం  లో నుండే నేను నా టూ వీలర్ ను నడిపించుకొని తీసుకు వెళ్తున్నాను అది కూడా ఆ రోడ్ లో ఏ మాత్రం రద్దీ ఉండదు కాబట్టి ఆ మాత్రం దూరమైనా నడిపించే ధైర్యం చేస్తున్నాను లేదంటే సక్రమమైన రూట్ లోనే వెళ్ళి ఉండే వాడినని నిజాయితీగా చెబుతున్నాను. ) కానీ నన్ను గుద్దబోయినతడు మాత్రం 80 కిలో మీటర్ల వేగంతో వస్తున్నాడు.అతగాడు మా ఇద్దరిదీ  ఒకే విధమైన నేరమని వాదించాడు.నేను అలోచించిందేమిటంటే నేను చేస్తున్న పని వలన ఎవరికీ హాని జరిగే అవకాశమే  లేదు కాబట్టి ఆ మాత్రం బండిని నడిపించాను పైగా డ్రైవ్ చేయకుండా నడిపించాను కాబట్టి అది కేవలం వస్తువును మోస్తున్న కాలి నడికతో సమానమని ...కానీ అతగాడు ఒప్పుకోకుండా "మీది రైటైతే నాదీ రైటే ...మీది రాంగ్ ఐతే నాదీ రాంగే" అంటూ వాదించడం మొదలు పెట్టాడు. నాకు వొళ్ళు మండి అతగాడి బండి తాళం చెవులు తీసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్ళడానికి సిద్దమయ్యాను.అప్పటికే మా చుట్టూ కొంతమంది చేరి ఉన్నారు పైగా వాళ్ళెవరికీ అతగాడి భజన చేయడం వలన ఉపయోగం ఏమీ లేదు కాబట్టి అతగాడిని కాస్త గట్టిగా మందలించి గొడవను సర్దుబాటు చేసారు.అతగాడు అంత దారుణంగా...కాస్త కూడా అపరాధ భావన లేకుండా అలా వాదించడం నన్ను కొంత నిశ్చేష్టుడిని  చేసిన మాట మాత్రం వాస్తవం. కానీ ఇదేమీ ఆశ్చర్య  పోవలసిన అవసరం లేని విషయమేనని కొద్ది రోజుల తరువాత మా రమణ చేసిన హితోపదేశం వలన అర్ధం అయ్యింది.

రమణంటే మా దగ్గర తాపీ మేస్త్రీగా పని చేయడానికి ప్రయత్నించి వాడికున్న చేతి వాటం వలన మా కాంట్రాక్టర్స్ చేత పనిలోనుండి వెళ్ళగొట్టబడిన వాడు.పనైతే మానేశాడు కానీ వాడి వూరు పక్కనే ఉండడం వలన అప్పుడప్పుడు దర్శనమిస్తూ ఉంటాడు.నాకంటే వయసులో బాగా చిన్న వాడు కాబట్టి నాకు వాడిని  "ఒరే" అని సంభోదించడం అలవాటు అంతే గాని నాలో కులాధిక్య భావజాలాన్ని  మాత్రం వెదకొద్దని విన్నవించుకొని మన కధలోకి వస్తున్నాను. ఇది నవంబర్ నెల కాబట్టి ఆఫీస్ బయట చెట్టు కింద కూర్చుని ఉన్న నా దగ్గరికి నవ్వుకుంటూ వచ్చాడు.మనిషి హుషారుగా ఉన్నాడు. తలకు నూనె రాసి దువ్వాడు..ఇస్త్రీ బట్టలు.

" ఏదైనా పని లో కానీ చేరావేంట్రా ..బండి హుషారు మీదుంది" పలకరించాను.
"లేద్సార్....ఇక పని చేయవలసిన అవసరమే ఉండదు"
"అదేరా....గాలితో ఆకలి తీర్చుకొనే మంత్రాన్నేమైనా కనిపెట్టావా?"
"అదేమీ లేదు సార్...నేను ఎలక్షన్లో నిలబడదామనుకుంటున్నాను.."
వులిక్కి పడ్డాను.వాడు దొంగతనాలు చేస్తాడని అందరికీ తెలుసు..తాగుతాడు...అసలు నమ్మకస్తుడు కాదు.మరి వీడికింత ధైర్యం అలా వచ్చేసింది.అనుకోకుండా అదే మాట పైకి కూడా అనేశాను.
"సారూ లోకం మొత్తం మారిపోతోంది......నేను దొంగనైనా ఫరవాలేదు...నా  టెక్నిక్ లు నాకుంటాయ్"
"దొంగవని తెలిసీ కూడా నీకెలా వోట్లు వేస్తార్రా...అసలు నువ్వు ప్రచారానికి ఏ ముఖం పెట్టుకుని వెళ్తావో నాకైతే అర్ధం కావడం లేదు"
" మరి మీకంతే తెలుసు.నేను యీ మద్య పనికి ఆహార పధకంలో ఉన్నప్పుడు బోల్డంత ఖాళీ ఉండేది.పేపర్ తెగ చదివాను. బయట జనాన్ని చూసాను.కాబట్టే నేనేం చేస్తే బాగుంటుందో అర్దమైపోయింది."
"ఏమర్దమయ్యిదిరా....దొంగలకు కూడా జనం వొటేస్తారనా....."
"అదే సార్...మీరు కరెక్ట్ గానే కని పెట్టారు."
గతుక్కుమన్నాను. నేనేదో వేళాకోళంగా అంటే వీడు అదే నిజమంటాడేమిటి.."
"ఇప్పుడు జనం ఎలా ఉన్నారో మీకు తెలియట్లేదు.మా వూళ్ళో మా కులపోళ్ళకి ఒక చెరువుంది.అదేంటో  తెలియదు కాని దాన్లో చేపలు మాంచి రుచిగా ఉంటాయని అంతా అనేవారు.మా తాత అప్పట్లొ మా కులానికి పెద్ద మనిషి. అప్పుడింకా యీ కాంక్రీటు స్లీపర్లు లేవు కాబట్టి ఎప్పుడూ లైన్ పనులు అవుతూ ఉండేవి.ఈ చెరువులో చేపలకు వేలం పాట ఉండేది.ఆ డబ్బులెట్టి వెదురు గంపలూ గడ్డపార్లూ ..పారలూ..లాంటివి కొని మా తాత ఇక్కడోళ్ళని అంతా పేద్ద ముఠాగా చేసాడు.ఎక్కడ పెద్ద పనులున్నా ముందు మా వూర్లో వాళ్ళనే పిలిచేవారు.పనీ చేయించేవాడు...రేటూ తీసుకునే వాడు."

"మరిప్పుడేమయ్యింది?"
" మా నాన్న హయాం వచ్చే సరికే కాస్త సినిమా పిచ్చి ముదిరి పోయింది...ఎవడికో ఏదో అయిడియా వచ్చింది....ఈ చెరువు పాట డబ్బు పెట్టి జాతర చెయ్యాలన్నాడు.మా నాన్న వొప్పుకోలేదు. పైగా అప్పటికే మా నాన్న మరి కొంత మంది..... కొత్త మతం తీసుకున్నారు.అవతలివాళ్ళకు వంక దొరికింది. మొత్తానికి కొంత డబ్బు జాతరకీయడానికి ఒప్పుకున్నారు"
"అదేంట్రా ...అసలు మీ నాన్నే మొత్తం చెరువు తాలూకు డబ్బు నొక్కేస్తుంటే  మీ కులంలోనే కొంతమంది ఎదురు తిరిగారనీ... వాళ్ళ పీడ వదిలించుకోడం మీ నాన్నే జాతర పేరు మీద మందు అలవాటు చేసి వాళ్ళ కోసం కొంత ఖర్చు పెట్టి మిగిలిందంతా మీ నాన్నే నొక్కేసే వాడని మీ వాళ్ళే చెప్పారు. పైగా ఆ డబ్బుతో చెరువు నిండా ఉండే కలువ పూలు గుర్తుండే లా నీ కోసం మాంచి ఇల్లు కూడా కట్టడం మొదలు పెట్టాడట  కదా.....మీ  వాళ్ళ లోనే ఎవరో చదువుకున్న వాడి చేత కలువల నిలయలాంటి పేరు కూడా పెట్టాడట"
"తమరేమీ నమ్మకండి సార్....మా వూరోళ్ళంతా వెధవలు..."
"భలే చెబున్నావురా  బాబూ....నువ్వేదో పెద్ద విప్లవకారుడిలా....ఏదో మీ వూరి భూస్వాములంతా నీకు వ్యతిరేకంగా కుట్ర చేసినట్లుగా....అసలు  రైల్ ఏక్సిడెంట్ లో మీ నాన్న చనిపోక పోతే ఇంకా నీవు మీ నాన్న కలసి  దారుణంగా మేసేసి ఉండేవాళ్ళని కూడా చెబుతున్నారు."
"మనలో మన మాట సార్...మీరు చెప్పేవన్నీ నిజమే  కావొచ్చు కానీ ఈ సారి పంచాయితీ ఎలక్షన్లో నేను గెలవడం ఖాయం."
"అంత ఖచ్చితంగా ఎలా చెప్పేస్తున్నావురా బాబూ..."
"దానికి చాలా లెక్కలుంటాయి సార్....నా కులం లో ఎక్కువ మంది నా మతం వాళ్ళు కాదు అలాగే నా మతం వాళ్ళు ఎక్కువ మంది కూడా నా కులం వాళ్ళు కాదు..కానీ వాళ్ళకుండే ప్రయోజనాల కోసం ఇద్దరూ నాకే వోటేస్తారు.మీకింకొక సంగతి చెప్పనా....వార్డు మెంబర్ ల కింద నా తరుపున పోటీ చెయ్యడానికి అప్పుడే ఎంత మంది తయారై పోతున్నారో..."
నాలో సహనం చచ్చి పోయింది.
" ఒరెయ్..నీవొక దొంగ వెధవ్వి..ఆ సంగతి వూరంతా తెలుసు కదరా....నీ పోటీదార్లు వూరంతా ప్రచారం చేయలేరా...?"
"అదే  సార్ మీకర్ధం కానిది..నాకు నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే  హక్కుంది....నోరుంది.ఆరోపణలు చేసే హక్కుంది. ఎన్ని అబద్దాలైనా సిగ్గులేకుండా చెప్పేయగలను.పది సార్లు పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరిగినవాడిని.మరెన్ని సార్లైనా వెళ్ళడానికి సిద్దపడే ఉంటాను.అంతే కాదు నాకు తోడుగా  మా కుటుంబ సభ్యులు కూడా సిగ్గులేకుండా ఎన్ని అబద్దాలైనా ఆడగలరు.ఇదంతా జనం నమ్మేస్తారని కాకపోయినా ఎదుటి వాళ్ళు చెప్పే నిజాలను పలచన చేయడానికి బాగా పనికి వస్తాయి.జనానికి పట్టని ఇంకొక విషయం కూడా చెబుతాను. నా పోటీదార్లు కూడా నేను,మా నాన్న చేసిన వెధవ పనులను చెప్పుకుంటూ పోతూనే దానికి విరుగుడుగా ఏమి చేయొచ్చో చెప్పరు."
"అంటే ఇది నీ పోటీదార్ల బలహీనతే అంటావ్"
"పోటీదార్లంటే వాళ్ళూ అంత పెద్ద చరిత్ర ఉన్న వాళ్ళు కాదనుకోండి.అందుకే జనానికి వాళ్ళన్న పెద్దగా నమ్మకం లేదు.కనీసం నాకొక దొంగల రాజ్యం ఉన్నది.నాకంటే చిన్న దొంగతనాలు చేసే వాళ్ళంతా నన్ను నాయకుడిగా చూడాలనుకుంటున్నారు.ఒక దొంగో దోపిడీదారో రాజ్యాధినేత అయితే దొంగలంతా హాపీ యే కదా సార్..."
నా బుర్ర గిర్రున తిరగడం మొదలు పెట్టింది.
"పోనీ నీ దొంగతనాలేవేవో నీవేడవకుండా నీకీ రాజకీయాధికారం ఎందుకురా ....ఏదోలా నడిపించుకుంటున్నవు కదా..."
"సారూ అధికారంలో ఉన్న వాళ్ళూ నాకంటే మంచి వాళ్ళలా ఏమీ అనిపించ లేదు.బెయిల్ లాంటివి కావలసి వచ్చినప్పుడల్లా వాళ్ళనీ వీళ్ళనీ బ్రతిమాలాడ వలసి వస్తోంది. ఎందుకీ శ్రమంతా అని మా నాన్నెనకాల తిరిగినోడే నన్ను ఎగదోశాడు.ఆడు మాత్రం అటూ ఇటూ కాకుండా ఉన్నాడు. ఒక్క విషయం గురువుగారూ....నేను గెలిచే వాతావరణం కనబడితే ఇప్పుడు పెత్తనం చేస్తున్న వాళ్ళలో చాలా మంది యే మాత్రం సిగ్గుపడకుండా నా వైపుకు రావడం ఖాయం.ఎందుకంటే వీళ్ళేమీ పెద్ద పెద్ద సిద్దాంతాలున్న వాళ్ళేమీ కాదు.ఎందుకంటే నేను మా నాన్నెనకాల తిరిగే టప్పుడు మా వూరికి అక్కడెక్కడో ఉండే జమీందార్ లాంటి వాడు వచ్చాడు.ఆడికి లేని ఫేక్టరీ ఇంకెక్కడా లేదంట.కానీ మనిషి మాత్రం ఒకటో రకం లుచ్చా అని జనం చాలా మంది అనేవారు.అప్పటికి అధికారంలో ఉండే మా మాజీ ప్రెసిడెంట్ ఆయన్ను భుజాల పెట్టుకొని మోసేశాడు.ఆ తరువాత వచ్చిన ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఏకంగా ఆయన్ను తల మీద పెట్టుకుని మొక్కేస్తన్నాడు.మరి నన్నందుకీళ్ళు మొయ్యరనిపించింది...అందుకే నేనే ప్రెసిడెంట్ అయిపోవాలనుకున్నాను"
"ఆ జమీందార్ లుచ్చా అని నీకెవరు చెప్పార్రా.."
"మీరు మా వూరెప్పుడూ రాలేదు కదూ...మా పేటకవతల ఒక కూలిపోడానికి సిద్దంగా ఉన్న పెంకుటిల్లు ఒకటుంటాది. దాని మీద ఒక ఎర్రటి జెండా ఎగురుతూ ఉంటాది. అందులో దగ్గుకుంటూ ఒక ముసలాయన ఉంటాడు. ఒకప్పుడు అంటే మా నాన్న కుర్రాడిగా ఉన్నప్పటి  వరకూ ఆయన చుట్టూ  చాలా మంది ఉండేవారంట.ఏటయ్యిందో నాకు తెలీదు కానీ మా నాన్న చెబుతూ ఉండేవాడు ఆయనతో ఉండే వాళ్ళంతా పది ముక్కలై పొయ్యారంట.ఓ పక్క మా వూరి పెద్ద రైతులంతా దొరికింది దొరికినట్టు మింగేత్తా  వుంటే యీళ్ళేమో నాదంటే  నాది రైటంతూ తన్నుకు చచ్చారంట.యీళ్ళెందుకు తన్నుకుంటున్నారో  మా తాతకి..నాన్నకి ఏమీ అర్ధమై చావలేదంట.ఆ మాటకొస్తే ఈళ్ళెనకాల తిరిగే చాలా మంది పరిస్థితి ఇంతే నంట.తన్నుకు చస్తున్న వీళ్ళతో ఎందుకని అప్పటి వరకూ వీళ్ళనక ఉన్న జనమంతా వూళ్ళో  ఉన్న పెద్ద రైతులెనక సర్దుకున్నారు.ఇప్పుడు ఆ ముసలాయన ఒక్కడే మిగిలాడు.కానీ నా లాంటాడు పని లేక పోతే ఆయన మాటలు వింటాడు కానీ లేదంటే ఎవడూ పట్టించుకోడు"
"కనీసం నీవు దొంగవన్న సంగతన్నా ఒప్పుకుంటాడా ఆయన"
"ఏమో సారూ ..ఆయన దగ్గరున్న సిద్దాంతాలలో  దీని గురించి లేదంట..అందుకని ఎక్కువ పట్టించుకోడు...పట్టించుకున్నా ఆయన మాట వినీవోడు ఎవడూ లేడు."
"కుర్రాళ్ళెవరైనా ఆయనతో మాట్లాడతారా.."
రమణ ఎందుకోగాని ఫకాల్న నవ్వేశాడు.
"ఆళ్ళెవరితోనూ మాట్లాడరు సారూ...చెవులో ఎప్పుడూ అ ఫోన్లు పెట్టుకుని ప్రపంచంతో సంబందం లేకుండా ఉంటారు. మా మేనల్లుడు చదువుకొనదానికి మా ఇంట్లోనే ఉంటాడు. కనీసాం ఆడు నిద్ర పోయినప్పుడైనా చెవులోనుండి వాటిని తీస్తే ఠాక్కుమని లేచి కూర్చుంటాడు.కాబట్టి ఆళ్ళను అసలు లెక్క లోకి తీసుకోకూడదు."
" అంటే మొత్తం దొంగలంతా కలసి రాజ్యాధికారం చేస్తుంటే మిగిలిన జనం అంతా అన్నీ మూసుకొని చూస్తూ .......సబ్సిడీలు కింద మీరు పడేసే ఎంగిలి తింటూ బ్రతకాలన్న మాట "
" మరి మీలాంటోళ్ళంతా నాకెందుకులే అని తెలిసిన నిజాలను కూడా పది మందికీ తెలియ చెప్పకుండా....హాయిగా ఉద్యోగాలు..చేసుకుంటూ...జీతాలు తీసుకుంటూ....ఇంటికెళ్ళి హాయిగా టీ వీ లో సీరియల్స్ చూసుకుంటూ..... పిల్లలకి ఎంట్రేన్స్  టెస్ట్స్ లో రాంకులు వస్తున్నాయో లేదో మాత్రమే చూసుకుంటూ అందరూ కలసి ఆనందంగా బ్రతికే మార్గాల గురించి చూడకుండా ఎవడికి వాడు బాగు పడి పోయే మార్గాలు మాత్రం చూసు కుంటుంటే ఖచ్చితంగా నాకు తాళాలు ఇచ్చినట్లే......మీరెలాగూ మారరు....మమ్మలని అధికారం లోకి రానీకుండా ఆపలేరు. మీ బలహీనతే మా బలం...."రమణ నవ్వుకుంటూ ఆనందంగా వెళ్ళిపొయ్యాడు.
చాలా సేపు నా మెదడు లో ఏదో హోరు........తట్టుకోలేని నేను ఆ చెట్టుకిందే ..కుర్చీలో మగత నిద్ర పొయ్యాను. స్వాతంత్ర్యం రాక ముందు నుండీ మొన్న మొన్నటి వరకూ ఉన్న మహానుభావులంతా విచారకరమైన ముఖాలతో ముసురుకున్న చీకట్లలో  నుండి ఏదో వైపుగా కాంతి రేఖ కనిపించదా అని ఆశగా చూస్తున్న దృశ్యం కలలగా వచ్చింది.
ఇది ఎవరి వల్ల అవుతోందని ఎదురు చూడ్డం అనవసరమనిపిస్తోంది. ఎందుకో కాలేజ్ రోజులు గుర్తుకొచ్చాయి. కేవలం ముగ్గురు సహచరులుతో మొదలుపెట్టిన స్టూడెంట్స్ ఫెడరేషన్  బ్రాంచ్....... మొత్తం కాలేజ్ అంతా దాని ప్రభావం లోకి తీసుకుని రాగలగడం ....దాని తరువాత కాలేజ్ లోనూ...మా గ్రామం లోనూ... తీసుకొచ్చిన మార్పులు అన్నీ గుర్తుకొచ్చాయి. ఏదో ఒకటి చేయాలి  .లేచి నిలబడ్డాను. మళ్ళీ కుర్రాణ్ణయ్యాననిపిస్తోంది........