25, నవంబర్ 2013, సోమవారం

నిర్జన వారధి గానే వదిలేద్దామా



                        “అసలు ఈ పుస్తకం ఎందుకు చదవాలి?”అనే ప్రశ్న తోనే మనం ప్రారంభిద్దాం. అసలు పుస్తకాలే చదివేవాళ్ళు కరువైపోతున్న ఈ రోజుల్లో ఈ పుస్తకాన్ని ఎంత మంది చదువుతారో తెలియదు. అసలీ పుస్తకాన్ని ఎందుకు చదవాలి ?

                             దానికి ఒక్కటే సమాధానం. ఒక ఉదాత్త చరిత్రను ......మానవీయతను దర్శింఛి మీకు తెలియకుండానే మీ కళ్ళలో నుండి అది ఆనందమో .....దుఖమో తెలియని స్థితిలో కారుతున్న నీళ్ళను కూడా పట్టించుకోలేని అనుభూతిని మీరు కోరుకుంటే ఈ పుస్తకాన్ని చదివి తీరవలసిందే . సమాజ పరిణామం ఆగదు. కానీ ఆ రోజుల్లో మాకు దొరికింది ......ఈనాటి యువకులకి దొరకనిది ఒక్కటే ......“ఉత్తేజం”. భిన్న ఆలోచనలే లేని చోట నిజమైన  ఘర్షణ ఉండే అవకాశమే లేదు. భిన్న ఆలోచనల.....సిద్దాంతాల ఘర్షణ ఉన్న సమాజం లో పుట్టేదే నిజమైన ఉత్తేజం తప్ప మిగిలినదంతా రాజు గారి భార్యలు .....ఉంపుడుగత్తెల ఆంతరంగిక పోరాటమే తప్ప మరేమీ కాదు.

                               స్వాతంత్ర్య పోరాటానికి ఒక బాలిక గా ఉన్నప్పుడే అంతగా ఎందుకు స్పందించాలి.... నిజంగా ఆమెకు జన్మనిచ్చిన తలిదండ్రుల పెంపకం ఎంత గొప్పది....బాల్య వితంతువుకి వివాహం చేసినా  ఆమెను పోరాట మార్గంలోకి అనుమతించిన ఆ మహనీయులకి .....నారాయణ కాలేజ్ గాని..... చైతన్య కాలేజ్ గానీ ఇంటర్నల్ గా పెట్టే పరీక్షలలో మార్కులు తక్కువ రాగానే గాభరా పడిపోయే ఈ నాటి తలిదండ్రుల మైన మాకూ ఎంత తేడా .......

                               గూండాలను తరిమి తరిమి కొట్టిన ఆ మహనీయురాలి జ్ఞాపకాలలోని విజయవాడ ను కుల రక్కసి కరాళ నృత్యంచేస్తున్న నేటి విజయవాడ ను పోల్చి చూస్తే చాలు మన రాజకీయ పార్టీలు .....మీడియా... ప్రజలను ముందుకు తీసుకు వెళ్తున్నాయో ....వెనుకకు తీసుకు వెళ్తున్నాయో చెప్పడానికి . అసలు అభ్యుదయం  అంటే ఏమిటో తిరోగమనం అంటే ఏమిటో తెలియకుండా పిల్లలను పెంచేస్తున్న మాకూ ....తన తరువాతి రెండు తరాలవారిలో  కూడా అత్యున్నత చైతన్యం నింప గలిగిన ఆ నిత్య యౌవ్వనరాలు తో పోలిస్తే మేమేప్పుడో వృద్దులమై పోయాం. వోట్లు రాల్చగలిగే గూండాల ...ఫాక్షనిస్టుల విగ్రహాల మాటున జాతీయ నాయకుల విగ్రహాలు దాక్కుంటుంటే  చూసి కూడా టీవీ రియల్ కోసం....ఆఫీస్ టైం కోసం .....పిల్లల కాలేజ్ టైం అయిపోతుందని ........క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం పరుగులు తీస్తున్నాం . ఆ తరువాత కూడా ఇంకా టైం ఉందనుకుంటే ముందుగానే టికెట్స్ రిజర్వు చేయించుకుని తిరుపతి ...షిర్డీ యాత్రలకు వెళ్తాం తప్ప .....పరలోక సుఖాలకు కర్చీఫ్ వేసుకుంటాం తప్ప......ఎంతో అవసరమైతే తప్ప వోటు వేయడానికి కూడా బయటకు రాలేము. ఎలా వస్తాం..... రోడ్ మీద మెత్తగా జారిపోయే కార్లను కలర్ టీవీలో అందులోనూ పక్కన మాంచి అమ్మాయి కూర్చుంటే డ్రైవ్ చేస్తుంటే ఉండే మజా ను చూపిస్తుంటే ఆనందంగా కలలలోకి జారిపోతూ బ్రతికేస్తున్నాం. ఎప్పుడో విద్యార్ధి దశలో “వీరులార.....వీరులార.....ఎర్రజెండ....యోధులార .....” అని పాడుకున్న రోజులు జ్ఞాపకానికి కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నాం.



                                కానీ ఈ పుస్తకం మరొక్క సారి మాకొక మార్గం చూపించింది. తన జీవితం మరొకరికి భారం కాకుండా ఆ మహనీయురాలు ఎలా జాగ్రత్త పడిందో చూసిన తరువాత ఇప్పుడు మేము నడుపుతున్న పడవను ఇప్పుడున్న పరిమితులలోనే ఒక తీరానికి చేర్చిన తరువాత మరలా మేము ఏ బాట పట్టాలో తెలిపింది . ఆ మహా తల్లిని నిర్జన వారధిగా మిగలనీయం.

                                 అటువంటి అమ్మమ్మ దొరికిన అనూరాధ ధన్యురాలైతే .....ఈ పుస్తకాన్ని బయటకు తీసుకు రావడానికి కృషి చేసిన అనురాధ (చిన్ని) తో  పరిచయం ఉన్న మేమంతా ధన్యులం.