7, మార్చి 2012, బుధవారం

మరొక్క సారి హనుమంతుల వారు పూనితే....

అప్పటి ఉత్తేజం ఎక్కడికి పోయింది ?                       

                           నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు తణుకు  లో అప్పుడప్పుడు సీ. పీ ఐ. ఆఫీస్ కు వెళ్తుండే వాడిని. అప్పటికి అదే వారి ప్రజా సంఘాలకి కూడా కేంద్రంగా ఉండేది. నేను చాలా సార్లు ఒక వ్యక్తిని అక్కడ చూస్తుందే వాడిని. అక్కడే తనకున్న సమయమంతా గడుపుతూ మము మాట్లాడుకునే మాటలన్నీ చాలా శ్రద్దగా వింటుండే వాడు. కొద్దికాలానికే అతడు అక్కడ ఒంటెద్దు బళ్ళ సంఘానికి నాయకుడని తెలిసింది. మేమొద్దని అంటున్నా కూడా అప్పుడప్పుడు వెళ్ళి టీలు కూడా తెస్తుండే వాడు. యీ పోస్ట్ రాసే ఉద్దేశం కలిగిన నాటి నుండీ అతడి పేరు గుర్తుకు తెచ్చు కోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ సఫలీకృతుడను కాలేక పొయ్యాను. మన అవసరం కొద్దీ అతడి పేరు పద్దయ్య అనే అనుకొందాం. సరే మనకు పేరుతో అంత పని లేదు కానీ అతడి గురించి ఆనాటికి మా గురుతుల్యులు శ్రీ ( నిజంగా ఐతే కామ్రేడ్ అని సంభోదించాలి)  భూపతి రాజు సుబ్బరాజు గారు చెప్పిన కొన్ని సంగతులు నేనెప్పటికీ మరిచి పోలేను. చాలా సంవత్సరాల ముందు జరిగిన ఒక సంఘటన...... ఆ సమయంలో మన పద్దయ్య చూపిన తెగింపు గురించి ఆయన ఒక సారి చెప్తుంటే మేము ఆశ్చర్య   పోక తప్పింది కాదు.  ఆ రోజుల్లో తణుకు లో చదివి విదేశాలకెళ్ళిన విద్యార్థి ఒకరు స్టూడెంట్ ఫెడరేషన్ కార్యకర్త....అభ్యుదయ భావాలున్న వాడు. అతడికి విదేశాలకు వెళ్ళేటప్పుడే అతడి దగ్గరి బంధువుల అమ్మాయితో వివాహం నిశ్చయం చేసి అక్కడికి పంపించారు. అంతా బాగానే ఉంది గాని ఆ వూరికి అప్పట్లో ఒక స్వామీజీ వేంచేయడం....వారిని వూళ్ళో  ఉన్న ఉనంత వర్గాల వారంతా ప్రతిదినం  సేవించుకోడానికి  పోటీ పడడం జరిగింది. సినిమాల్లో చూపినట్లుగానే ఆ స్వామీజీకి ప్రతిరాత్రీ శ్రీకృష్ణులు  వారు పూనేవారట. ఆ సమయంలో వారు కొంత మందికి యేకాంత సేవ కూడా అనుగ్రహించేవారట. ఇంతవరకూ యీ భారత దేశం లో అన్ని చోట్లా జరిగే  విషయమే కానీ యెప్పుడైతే తమ తోటి విద్యార్థి చేసుకోబోయే అమ్మాయికి  కూడా స్వామీజీ వారు యేకాంత సేవ అనుగ్రహించడంతో కధ అడ్డం తిరిగింది. వాళ్ళంతా కలసి ఒక పధకం వేసారు. యేకాంత సేవ అనుగ్రహించిన రోజున భజన ప్రారంభం అయ్యింది.స్వామి వారికి యధావిధిగా శ్రీకృష్ణులు  వారు పూనేసారు. చుట్టూ చేరిన భక్తులంతా పారవశ్యంతో ఊగి పోతుండగా ఆ సంఘటన జరిగిన ఆ సంఘటన అందరినీ నోట మాట రానీయకుండా జరిగింది. పద్దయ్య " ఓరీ కృష్ణా..నీవిక్కడ ఉన్నావా..... "అంటూ వచ్చి  బండ రాయితో స్వామి తల మీద అడ్డంగా  ఒక్కటిచ్చాడు. పెద్దలంతా తేరుకొనేసరికి కుర్రాళ్ళంతా బిల బిల మంటూ లోపలకు వచ్చేసారు పద్దయ్య వెనుకే......" అతడు పద్దయ్యే కానీ సాయంత్రం అయ్యేసరికి అతడికి హనుమంతుడు పూనుతున్నాడ నీ.... శ్రీకృష్ణుల వారికీ ..యీయనకూ పాత తగువులు యేవో ఉన్నాయనీ.....అందుకు హనుమంతులు వారు శ్రీకృష్ణుల వారికోసం వెతుకుతుంటే అడ్రసు ఇప్పటికి దొరికిందనీ....." వాదించడం మొదలు పెట్టారు. యీ లోపులో స్వామి వారిని హాస్పిటల్ కి కూడా తీసుకెళ్ళ వలసిన అవసరం కూడా ఉండడంతో వారి వెంటే కొంత మంది భక్తులు వెళ్ళారు. విద్యార్థులంతా పోలీస్ కేస్ కు కూడా రెడీ అన్నారు. పరువు పోతుందనే భయంతో స్వామి వారు యే కంప్లైంట్ ఇవ్వ లేదు. పాపం ఆ విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్ళ లో చదవ లేదు కాబట్టి కాస్త ఆలోచనా  శక్తి...సమాజాన్ని ముందుకు నడిపే బుద్ది ఉన్న వాళ్ళు.

ఇదంతా జ్ఞాపకం రావడానికి  ముఖ్య కారణానికి ఇప్పుడు వద్దాం. 


 సిద్దాంతాల రచ్చ లోకి నేను వెళ్ళ దలుచు కోలేదు ...ఒక రాజకీయ ఆల్టర్నేటివ్ యేర్పాటు చేయడంతో బాటు ఒక హేతుబద్ద ఆలోచనను కొంతైనా  సమాజంలో అభివృద్ది చేయడంలో ఆ నాడు కమ్యూనిష్టులు కృతకృత్యులయ్యారు. ఆ పార్టీలు స్వతంత్రంగా ఉన్నంత సేపూ వాటి ప్రజా సంఘాలు కూడా యెంతో కొంత తమ పాత్రను పోషిచగలిగాయి. అడవి బాట పట్టిన వారిని మినహాయిస్తే పబ్లిక్ లో మిగిలిన యెర్రదనాన్ని ముందు పసుపు రంగు...ఆ తరువాత మూడు రంగులు......మరలా పసుపు రంగు......మింగేసిన తరువాత.....మిగిలిన దాన్ని కూడా ఇంకే రంగు మింగేస్తుందో తెలియక జనం ఇప్పటికే తికమక తో చస్తూ.....ముందు నొయ్యి..వెనుక గొయ్యి..చందాన ఉన్న రాజకీయాలలో గత్యంతరం లేక తమకున్న  హక్కుని ఉపయోగించుకొనే తాపత్రయంతో మాత్రమే వోటు వేయవలసిన పరిస్థితి మాత్రమే ఉంది.