7, డిసెంబర్ 2012, శుక్రవారం

చలిచీమలు ఐకమత్యం పోగొట్టుకున్న నాడు.......


నా చిన్నప్పుడు మా వూరిలో ఒకాయన అప్పుల బాధలు భరించలేక I.P..(Insolvement procedure) పెట్టాడు.ఆయన అప్పులు ఎందుకు చేసాడో నాకైతే తెలియదు కానీ నేనెరిగుండగా ఆయన ఎక్కువగా వీధిలోకి రావడం నేను చూడలేదు.ఎప్పుడూ ఏదో పోగుట్టుకున్నట్లుగా వీధి అరుగు మీదే కూర్చుని ఉండేవాడు. బహుశా నేననుకోవడం ఆయనలో అపరాధ భావన మనసులో ఉన్నందువలనే పదిమందిలోనికి రాలేక పొయాడని......... అందరూ ఇది  నమ్ముతారనే అనుకుంటాను.




ఇంకొక విషయానికి వస్తే మా వాడి స్కూల్ గేట్ కు ఎదురుగా రోడ్ డివైడెర్ లో ఖాళీ ఉండని కారణం వలన గేట్ పక్కన ఉండే రోడ్ లో ఒక దిశలో  మాత్రమే ప్రయాణం చేయగలుగుతాం. కానీ గేట్ కు కొద్ది పాటి వెనుకగా డివైడెర్ లో రోడ్ క్రాసింగ్ కోసం ఖాళీ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మా వాడిని స్కూల్ లో దిగబెట్ట వలసి వచ్చినప్పుడు గేట్ నుండి ఆ కాస్త ముక్క ఒక పక్కగా బండిని నడిపించుకొని వచ్చి డివైడెర్ లో ఖాళీ వదిలిన భాగం  నుండి రోడ్ క్రాస్ చేయడం నా అలవాటు.ఆ మద్యన అలా చేస్తున్నప్పుడే రాంగ్ రూట్ లో వస్తున్న ఒకడు నన్ను గుద్దినంత పని చేసాడు.పైగా అడ్డంగా వాదించడం కూడా మొదలు పెట్టాడు.వచ్చిందే రాంగ్ రూట్ ( నాది కొంత వరకూ అదే కావచ్చు కాబట్టే కానీ జనం నడిచే భాగం  లో నుండే నేను నా టూ వీలర్ ను నడిపించుకొని తీసుకు వెళ్తున్నాను అది కూడా ఆ రోడ్ లో ఏ మాత్రం రద్దీ ఉండదు కాబట్టి ఆ మాత్రం దూరమైనా నడిపించే ధైర్యం చేస్తున్నాను లేదంటే సక్రమమైన రూట్ లోనే వెళ్ళి ఉండే వాడినని నిజాయితీగా చెబుతున్నాను. ) కానీ నన్ను గుద్దబోయినతడు మాత్రం 80 కిలో మీటర్ల వేగంతో వస్తున్నాడు.అతగాడు మా ఇద్దరిదీ  ఒకే విధమైన నేరమని వాదించాడు.నేను అలోచించిందేమిటంటే నేను చేస్తున్న పని వలన ఎవరికీ హాని జరిగే అవకాశమే  లేదు కాబట్టి ఆ మాత్రం బండిని నడిపించాను పైగా డ్రైవ్ చేయకుండా నడిపించాను కాబట్టి అది కేవలం వస్తువును మోస్తున్న కాలి నడికతో సమానమని ...కానీ అతగాడు ఒప్పుకోకుండా "మీది రైటైతే నాదీ రైటే ...మీది రాంగ్ ఐతే నాదీ రాంగే" అంటూ వాదించడం మొదలు పెట్టాడు. నాకు వొళ్ళు మండి అతగాడి బండి తాళం చెవులు తీసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్ళడానికి సిద్దమయ్యాను.అప్పటికే మా చుట్టూ కొంతమంది చేరి ఉన్నారు పైగా వాళ్ళెవరికీ అతగాడి భజన చేయడం వలన ఉపయోగం ఏమీ లేదు కాబట్టి అతగాడిని కాస్త గట్టిగా మందలించి గొడవను సర్దుబాటు చేసారు.అతగాడు అంత దారుణంగా...కాస్త కూడా అపరాధ భావన లేకుండా అలా వాదించడం నన్ను కొంత నిశ్చేష్టుడిని  చేసిన మాట మాత్రం వాస్తవం. కానీ ఇదేమీ ఆశ్చర్య  పోవలసిన అవసరం లేని విషయమేనని కొద్ది రోజుల తరువాత మా రమణ చేసిన హితోపదేశం వలన అర్ధం అయ్యింది.

రమణంటే మా దగ్గర తాపీ మేస్త్రీగా పని చేయడానికి ప్రయత్నించి వాడికున్న చేతి వాటం వలన మా కాంట్రాక్టర్స్ చేత పనిలోనుండి వెళ్ళగొట్టబడిన వాడు.పనైతే మానేశాడు కానీ వాడి వూరు పక్కనే ఉండడం వలన అప్పుడప్పుడు దర్శనమిస్తూ ఉంటాడు.నాకంటే వయసులో బాగా చిన్న వాడు కాబట్టి నాకు వాడిని  "ఒరే" అని సంభోదించడం అలవాటు అంతే గాని నాలో కులాధిక్య భావజాలాన్ని  మాత్రం వెదకొద్దని విన్నవించుకొని మన కధలోకి వస్తున్నాను. ఇది నవంబర్ నెల కాబట్టి ఆఫీస్ బయట చెట్టు కింద కూర్చుని ఉన్న నా దగ్గరికి నవ్వుకుంటూ వచ్చాడు.మనిషి హుషారుగా ఉన్నాడు. తలకు నూనె రాసి దువ్వాడు..ఇస్త్రీ బట్టలు.

" ఏదైనా పని లో కానీ చేరావేంట్రా ..బండి హుషారు మీదుంది" పలకరించాను.
"లేద్సార్....ఇక పని చేయవలసిన అవసరమే ఉండదు"
"అదేరా....గాలితో ఆకలి తీర్చుకొనే మంత్రాన్నేమైనా కనిపెట్టావా?"
"అదేమీ లేదు సార్...నేను ఎలక్షన్లో నిలబడదామనుకుంటున్నాను.."
వులిక్కి పడ్డాను.వాడు దొంగతనాలు చేస్తాడని అందరికీ తెలుసు..తాగుతాడు...అసలు నమ్మకస్తుడు కాదు.మరి వీడికింత ధైర్యం అలా వచ్చేసింది.అనుకోకుండా అదే మాట పైకి కూడా అనేశాను.
"సారూ లోకం మొత్తం మారిపోతోంది......నేను దొంగనైనా ఫరవాలేదు...నా  టెక్నిక్ లు నాకుంటాయ్"
"దొంగవని తెలిసీ కూడా నీకెలా వోట్లు వేస్తార్రా...అసలు నువ్వు ప్రచారానికి ఏ ముఖం పెట్టుకుని వెళ్తావో నాకైతే అర్ధం కావడం లేదు"
" మరి మీకంతే తెలుసు.నేను యీ మద్య పనికి ఆహార పధకంలో ఉన్నప్పుడు బోల్డంత ఖాళీ ఉండేది.పేపర్ తెగ చదివాను. బయట జనాన్ని చూసాను.కాబట్టే నేనేం చేస్తే బాగుంటుందో అర్దమైపోయింది."
"ఏమర్దమయ్యిదిరా....దొంగలకు కూడా జనం వొటేస్తారనా....."
"అదే సార్...మీరు కరెక్ట్ గానే కని పెట్టారు."
గతుక్కుమన్నాను. నేనేదో వేళాకోళంగా అంటే వీడు అదే నిజమంటాడేమిటి.."
"ఇప్పుడు జనం ఎలా ఉన్నారో మీకు తెలియట్లేదు.మా వూళ్ళో మా కులపోళ్ళకి ఒక చెరువుంది.అదేంటో  తెలియదు కాని దాన్లో చేపలు మాంచి రుచిగా ఉంటాయని అంతా అనేవారు.మా తాత అప్పట్లొ మా కులానికి పెద్ద మనిషి. అప్పుడింకా యీ కాంక్రీటు స్లీపర్లు లేవు కాబట్టి ఎప్పుడూ లైన్ పనులు అవుతూ ఉండేవి.ఈ చెరువులో చేపలకు వేలం పాట ఉండేది.ఆ డబ్బులెట్టి వెదురు గంపలూ గడ్డపార్లూ ..పారలూ..లాంటివి కొని మా తాత ఇక్కడోళ్ళని అంతా పేద్ద ముఠాగా చేసాడు.ఎక్కడ పెద్ద పనులున్నా ముందు మా వూర్లో వాళ్ళనే పిలిచేవారు.పనీ చేయించేవాడు...రేటూ తీసుకునే వాడు."

"మరిప్పుడేమయ్యింది?"
" మా నాన్న హయాం వచ్చే సరికే కాస్త సినిమా పిచ్చి ముదిరి పోయింది...ఎవడికో ఏదో అయిడియా వచ్చింది....ఈ చెరువు పాట డబ్బు పెట్టి జాతర చెయ్యాలన్నాడు.మా నాన్న వొప్పుకోలేదు. పైగా అప్పటికే మా నాన్న మరి కొంత మంది..... కొత్త మతం తీసుకున్నారు.అవతలివాళ్ళకు వంక దొరికింది. మొత్తానికి కొంత డబ్బు జాతరకీయడానికి ఒప్పుకున్నారు"
"అదేంట్రా ...అసలు మీ నాన్నే మొత్తం చెరువు తాలూకు డబ్బు నొక్కేస్తుంటే  మీ కులంలోనే కొంతమంది ఎదురు తిరిగారనీ... వాళ్ళ పీడ వదిలించుకోడం మీ నాన్నే జాతర పేరు మీద మందు అలవాటు చేసి వాళ్ళ కోసం కొంత ఖర్చు పెట్టి మిగిలిందంతా మీ నాన్నే నొక్కేసే వాడని మీ వాళ్ళే చెప్పారు. పైగా ఆ డబ్బుతో చెరువు నిండా ఉండే కలువ పూలు గుర్తుండే లా నీ కోసం మాంచి ఇల్లు కూడా కట్టడం మొదలు పెట్టాడట  కదా.....మీ  వాళ్ళ లోనే ఎవరో చదువుకున్న వాడి చేత కలువల నిలయలాంటి పేరు కూడా పెట్టాడట"
"తమరేమీ నమ్మకండి సార్....మా వూరోళ్ళంతా వెధవలు..."
"భలే చెబున్నావురా  బాబూ....నువ్వేదో పెద్ద విప్లవకారుడిలా....ఏదో మీ వూరి భూస్వాములంతా నీకు వ్యతిరేకంగా కుట్ర చేసినట్లుగా....అసలు  రైల్ ఏక్సిడెంట్ లో మీ నాన్న చనిపోక పోతే ఇంకా నీవు మీ నాన్న కలసి  దారుణంగా మేసేసి ఉండేవాళ్ళని కూడా చెబుతున్నారు."
"మనలో మన మాట సార్...మీరు చెప్పేవన్నీ నిజమే  కావొచ్చు కానీ ఈ సారి పంచాయితీ ఎలక్షన్లో నేను గెలవడం ఖాయం."
"అంత ఖచ్చితంగా ఎలా చెప్పేస్తున్నావురా బాబూ..."
"దానికి చాలా లెక్కలుంటాయి సార్....నా కులం లో ఎక్కువ మంది నా మతం వాళ్ళు కాదు అలాగే నా మతం వాళ్ళు ఎక్కువ మంది కూడా నా కులం వాళ్ళు కాదు..కానీ వాళ్ళకుండే ప్రయోజనాల కోసం ఇద్దరూ నాకే వోటేస్తారు.మీకింకొక సంగతి చెప్పనా....వార్డు మెంబర్ ల కింద నా తరుపున పోటీ చెయ్యడానికి అప్పుడే ఎంత మంది తయారై పోతున్నారో..."
నాలో సహనం చచ్చి పోయింది.
" ఒరెయ్..నీవొక దొంగ వెధవ్వి..ఆ సంగతి వూరంతా తెలుసు కదరా....నీ పోటీదార్లు వూరంతా ప్రచారం చేయలేరా...?"
"అదే  సార్ మీకర్ధం కానిది..నాకు నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే  హక్కుంది....నోరుంది.ఆరోపణలు చేసే హక్కుంది. ఎన్ని అబద్దాలైనా సిగ్గులేకుండా చెప్పేయగలను.పది సార్లు పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరిగినవాడిని.మరెన్ని సార్లైనా వెళ్ళడానికి సిద్దపడే ఉంటాను.అంతే కాదు నాకు తోడుగా  మా కుటుంబ సభ్యులు కూడా సిగ్గులేకుండా ఎన్ని అబద్దాలైనా ఆడగలరు.ఇదంతా జనం నమ్మేస్తారని కాకపోయినా ఎదుటి వాళ్ళు చెప్పే నిజాలను పలచన చేయడానికి బాగా పనికి వస్తాయి.జనానికి పట్టని ఇంకొక విషయం కూడా చెబుతాను. నా పోటీదార్లు కూడా నేను,మా నాన్న చేసిన వెధవ పనులను చెప్పుకుంటూ పోతూనే దానికి విరుగుడుగా ఏమి చేయొచ్చో చెప్పరు."
"అంటే ఇది నీ పోటీదార్ల బలహీనతే అంటావ్"
"పోటీదార్లంటే వాళ్ళూ అంత పెద్ద చరిత్ర ఉన్న వాళ్ళు కాదనుకోండి.అందుకే జనానికి వాళ్ళన్న పెద్దగా నమ్మకం లేదు.కనీసం నాకొక దొంగల రాజ్యం ఉన్నది.నాకంటే చిన్న దొంగతనాలు చేసే వాళ్ళంతా నన్ను నాయకుడిగా చూడాలనుకుంటున్నారు.ఒక దొంగో దోపిడీదారో రాజ్యాధినేత అయితే దొంగలంతా హాపీ యే కదా సార్..."
నా బుర్ర గిర్రున తిరగడం మొదలు పెట్టింది.
"పోనీ నీ దొంగతనాలేవేవో నీవేడవకుండా నీకీ రాజకీయాధికారం ఎందుకురా ....ఏదోలా నడిపించుకుంటున్నవు కదా..."
"సారూ అధికారంలో ఉన్న వాళ్ళూ నాకంటే మంచి వాళ్ళలా ఏమీ అనిపించ లేదు.బెయిల్ లాంటివి కావలసి వచ్చినప్పుడల్లా వాళ్ళనీ వీళ్ళనీ బ్రతిమాలాడ వలసి వస్తోంది. ఎందుకీ శ్రమంతా అని మా నాన్నెనకాల తిరిగినోడే నన్ను ఎగదోశాడు.ఆడు మాత్రం అటూ ఇటూ కాకుండా ఉన్నాడు. ఒక్క విషయం గురువుగారూ....నేను గెలిచే వాతావరణం కనబడితే ఇప్పుడు పెత్తనం చేస్తున్న వాళ్ళలో చాలా మంది యే మాత్రం సిగ్గుపడకుండా నా వైపుకు రావడం ఖాయం.ఎందుకంటే వీళ్ళేమీ పెద్ద పెద్ద సిద్దాంతాలున్న వాళ్ళేమీ కాదు.ఎందుకంటే నేను మా నాన్నెనకాల తిరిగే టప్పుడు మా వూరికి అక్కడెక్కడో ఉండే జమీందార్ లాంటి వాడు వచ్చాడు.ఆడికి లేని ఫేక్టరీ ఇంకెక్కడా లేదంట.కానీ మనిషి మాత్రం ఒకటో రకం లుచ్చా అని జనం చాలా మంది అనేవారు.అప్పటికి అధికారంలో ఉండే మా మాజీ ప్రెసిడెంట్ ఆయన్ను భుజాల పెట్టుకొని మోసేశాడు.ఆ తరువాత వచ్చిన ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఏకంగా ఆయన్ను తల మీద పెట్టుకుని మొక్కేస్తన్నాడు.మరి నన్నందుకీళ్ళు మొయ్యరనిపించింది...అందుకే నేనే ప్రెసిడెంట్ అయిపోవాలనుకున్నాను"
"ఆ జమీందార్ లుచ్చా అని నీకెవరు చెప్పార్రా.."
"మీరు మా వూరెప్పుడూ రాలేదు కదూ...మా పేటకవతల ఒక కూలిపోడానికి సిద్దంగా ఉన్న పెంకుటిల్లు ఒకటుంటాది. దాని మీద ఒక ఎర్రటి జెండా ఎగురుతూ ఉంటాది. అందులో దగ్గుకుంటూ ఒక ముసలాయన ఉంటాడు. ఒకప్పుడు అంటే మా నాన్న కుర్రాడిగా ఉన్నప్పటి  వరకూ ఆయన చుట్టూ  చాలా మంది ఉండేవారంట.ఏటయ్యిందో నాకు తెలీదు కానీ మా నాన్న చెబుతూ ఉండేవాడు ఆయనతో ఉండే వాళ్ళంతా పది ముక్కలై పొయ్యారంట.ఓ పక్క మా వూరి పెద్ద రైతులంతా దొరికింది దొరికినట్టు మింగేత్తా  వుంటే యీళ్ళేమో నాదంటే  నాది రైటంతూ తన్నుకు చచ్చారంట.యీళ్ళెందుకు తన్నుకుంటున్నారో  మా తాతకి..నాన్నకి ఏమీ అర్ధమై చావలేదంట.ఆ మాటకొస్తే ఈళ్ళెనకాల తిరిగే చాలా మంది పరిస్థితి ఇంతే నంట.తన్నుకు చస్తున్న వీళ్ళతో ఎందుకని అప్పటి వరకూ వీళ్ళనక ఉన్న జనమంతా వూళ్ళో  ఉన్న పెద్ద రైతులెనక సర్దుకున్నారు.ఇప్పుడు ఆ ముసలాయన ఒక్కడే మిగిలాడు.కానీ నా లాంటాడు పని లేక పోతే ఆయన మాటలు వింటాడు కానీ లేదంటే ఎవడూ పట్టించుకోడు"
"కనీసం నీవు దొంగవన్న సంగతన్నా ఒప్పుకుంటాడా ఆయన"
"ఏమో సారూ ..ఆయన దగ్గరున్న సిద్దాంతాలలో  దీని గురించి లేదంట..అందుకని ఎక్కువ పట్టించుకోడు...పట్టించుకున్నా ఆయన మాట వినీవోడు ఎవడూ లేడు."
"కుర్రాళ్ళెవరైనా ఆయనతో మాట్లాడతారా.."
రమణ ఎందుకోగాని ఫకాల్న నవ్వేశాడు.
"ఆళ్ళెవరితోనూ మాట్లాడరు సారూ...చెవులో ఎప్పుడూ అ ఫోన్లు పెట్టుకుని ప్రపంచంతో సంబందం లేకుండా ఉంటారు. మా మేనల్లుడు చదువుకొనదానికి మా ఇంట్లోనే ఉంటాడు. కనీసాం ఆడు నిద్ర పోయినప్పుడైనా చెవులోనుండి వాటిని తీస్తే ఠాక్కుమని లేచి కూర్చుంటాడు.కాబట్టి ఆళ్ళను అసలు లెక్క లోకి తీసుకోకూడదు."
" అంటే మొత్తం దొంగలంతా కలసి రాజ్యాధికారం చేస్తుంటే మిగిలిన జనం అంతా అన్నీ మూసుకొని చూస్తూ .......సబ్సిడీలు కింద మీరు పడేసే ఎంగిలి తింటూ బ్రతకాలన్న మాట "
" మరి మీలాంటోళ్ళంతా నాకెందుకులే అని తెలిసిన నిజాలను కూడా పది మందికీ తెలియ చెప్పకుండా....హాయిగా ఉద్యోగాలు..చేసుకుంటూ...జీతాలు తీసుకుంటూ....ఇంటికెళ్ళి హాయిగా టీ వీ లో సీరియల్స్ చూసుకుంటూ..... పిల్లలకి ఎంట్రేన్స్  టెస్ట్స్ లో రాంకులు వస్తున్నాయో లేదో మాత్రమే చూసుకుంటూ అందరూ కలసి ఆనందంగా బ్రతికే మార్గాల గురించి చూడకుండా ఎవడికి వాడు బాగు పడి పోయే మార్గాలు మాత్రం చూసు కుంటుంటే ఖచ్చితంగా నాకు తాళాలు ఇచ్చినట్లే......మీరెలాగూ మారరు....మమ్మలని అధికారం లోకి రానీకుండా ఆపలేరు. మీ బలహీనతే మా బలం...."రమణ నవ్వుకుంటూ ఆనందంగా వెళ్ళిపొయ్యాడు.
చాలా సేపు నా మెదడు లో ఏదో హోరు........తట్టుకోలేని నేను ఆ చెట్టుకిందే ..కుర్చీలో మగత నిద్ర పొయ్యాను. స్వాతంత్ర్యం రాక ముందు నుండీ మొన్న మొన్నటి వరకూ ఉన్న మహానుభావులంతా విచారకరమైన ముఖాలతో ముసురుకున్న చీకట్లలో  నుండి ఏదో వైపుగా కాంతి రేఖ కనిపించదా అని ఆశగా చూస్తున్న దృశ్యం కలలగా వచ్చింది.
ఇది ఎవరి వల్ల అవుతోందని ఎదురు చూడ్డం అనవసరమనిపిస్తోంది. ఎందుకో కాలేజ్ రోజులు గుర్తుకొచ్చాయి. కేవలం ముగ్గురు సహచరులుతో మొదలుపెట్టిన స్టూడెంట్స్ ఫెడరేషన్  బ్రాంచ్....... మొత్తం కాలేజ్ అంతా దాని ప్రభావం లోకి తీసుకుని రాగలగడం ....దాని తరువాత కాలేజ్ లోనూ...మా గ్రామం లోనూ... తీసుకొచ్చిన మార్పులు అన్నీ గుర్తుకొచ్చాయి. ఏదో ఒకటి చేయాలి  .లేచి నిలబడ్డాను. మళ్ళీ కుర్రాణ్ణయ్యాననిపిస్తోంది........