20, అక్టోబర్ 2013, ఆదివారం

( వయస్సు ఉడిగిన ఉడతల )... భీకర పోరాటం ....

                         ఆ గుడిసె పక్క నుండి వెళ్ళుతున్నప్పుడు మాత్రమే  వినిపించే అంత మంద్ర స్వరంతో లోపల ఎవరో ఇద్దరు కేకలు వేసుకుంటున్నారు . స్వరాన్ని బట్టి చూస్తే  ఇద్దరూ  వృద్దుల లా ఉన్నారు .  జాగ్రత్తగా వింటే వాళ్ళు ఏదో విషయం మీద వాగ్యుద్ధం చేసుకుంటున్నారని అర్ధమయ్యింది . దారిన పోయే ఒక దానయ్యను అడిగాను వారి గురించి .
" ఆ .... మీ పని మీరు చూసుకోండి ..... సారూ ... "
"అది కాదయ్యా ...పాపం  పెద్ద వాళ్ళ లా ఉన్నారు వాళ్ళలా గట్టిగా వాడులాడుకుంటుంటే పట్టించుకోనట్టు వెళ్లి పొతే ఏం బాగుంటుంది .....?"
"మీరు ఈ వూరికి కొత్తలా ఉన్నారు ..... మాకైతే ఇది రోజూ అలవాటైందే ........ "
"అంటే "
"ఒకప్పుడు వాళ్ళిద్దరూ బలమైన వాళ్ళే ....బాగా బతికినా వాళ్ళే .....చాలా మంచి వాళ్ళు, పద్దతైన వాళ్ళే . జనం కూడా వాళ్ళెనెకే ఉండేవారు .  ఒక సారి ఇద్దరికీ తగువయ్యింది .....  విడిపోయ్యారు ...... ఆ తరువాత వాళ్లిద్దరూ వాళ్ళ వాళ్ళ వాదనలు కరెక్ట్ అని నిరూపించుకునేందుకు అడ్డ మైన వాళ్ళతో  జత కట్టేవారు . జనానికి నెమ్మదిగా వీళ్ళిద్దరి కంటే ఆ  అడ్డమైన వాళ్ళే నయమనిపించారు . ఎందుకంటే ఈ ఇద్దరూ  ఎవరితో ఎప్పుడు ఎందుకు జతకడతారో అర్దమయ్యీది కాదు . జనం ఈళ్ళని ఎప్పుడో వదిలేసారు . అయినా వీళ్ళిద్దరూ వాదించుకోడం మానలేదు . ఎల్లండి బాబూ మీకేదైనా పనుంటే చూసుకోండి " అనేసి దానయ్య కూడా వెళ్లిపొయ్యాడు .


                             పైది చదివిన వారికి ఇది ఏదో సారూప్యత కోసమే రాసానని చాలా మందికి అర్ధం అయ్యే ఉంటుంది . నిజమే ... జరిగిన విషయాలు తెలుసు . జరుగుతున్నది అర్ధం అవుతూనే ఉంది . జరగబోయ్యేది తెలుస్తూనే ఉంది . నేను యువకుడిగా ఉన్నప్పుడు నాకు పూర్తి మనోబలం ... జవసత్వాలు ఇచ్చిన (మూల ) సిద్దాంతాన్ని అవలంబిస్తున్న పార్టీలు పది ముక్కలై .... మొత్తంమీద ప్రజలకు దూరమై ఇప్పుడు తమ ఉనికికే ముప్పు ఏర్పడుతున్నప్పుడు కూడా అతి చిన్న విషయానికి ... వీధికెక్కి రాద్దాంతం చేసుకుంటున్న వీళ్ళు రాబోయే తరాలకు మిగిల్చే వారసత్వం ఏమిటో నా బోటి సామాన్యులకు బోధపడకుండా ఉంది .

                             విప్లవ సిద్దాంతంతో అడివి బాట పట్టిన వారి గురించి నాకు తెలిసింది తక్కువ . కాబట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉంచిన కమ్యూనిస్ట్ పార్టీల గురించే నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను  .  1977 లో వచ్చిన జనతా ప్రభుత్వం  1979 వచ్చే సరికల్లా కూలి పోవడానికల్లా వారిలో వచ్చిన లుకలుక లే కారణమని అమాయకులనుకోవచ్చు కానీ పూర్తిగా మెటీరియలిస్టిక్ గా ఉండే వీళ్ళేలా  అనుకున్నారో నాకు ఇప్పటికీ అర్ధం కాదు . అప్పటికే సాంప్రదాయ పారిశ్రామిక వేత్తలను  అధిగమించి ముందుకు పోవడానికి అడ్డ దారులు వెదుక్కుంటున్న లంపెన్ పారిశ్రామిక వర్గం వీరి కళ్ళబడలేదా ? బహుశా మార్క్సిజం లో దీని గురించి ప్రస్తావన లేదని దీని గురించి పట్టించుకోలేదేమో పాపం . భారత ఆర్ధిక వ్యవస్థకు ,రాజకీయ ... సామాజిక వ్యవస్థలకు  దీనివలన కలగ బోయే కీడు తెలిసీ కూడా వీళ్ళు ఐక్యంగా ఆ తరువాత ఎలక్షన్స్ లో ఉండ లేక పొయ్యారు . అప్పట్లో జరిగిన ఆర్ధిక అవకతవకలను ఒక R.S.S.సానుభూతి పరుడైన మేధావి పట్టించుకున్నట్లుగా వీళ్ళు పట్టించుకోలేక పొయ్యారు .


                          ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే . కనీసం ఉమ్మడిగా ఉన్నప్పుడు బలంగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు భౌతిక దాడులు చేసుకోడమే  కాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసుకుని పూర్తి గా వీరి సిద్దాంతానికి ... వ్యతిరేకంగా ఉండే వాళ్ళని చక్కగా గెలిపించి ప్రజలకు రాజకీయ వినోదాన్ని పంచారు .

                         సోషలిజం అనేది ఒక రాజకీయ సిద్దాంతం మాత్రమే కాదు ... ఒక ఉత్కృష్ట  మానవతా  భావన.... దానిని చేరుకోడానికి రాజకీయ పోరాటమే కాకుండా సామాజిక ... సాంస్కృతిక రంగాల్లో ఎంతో పోరాటం చేయవలసి ఉంటుందని తెలిసీ కూడా ఏ మాత్రం సిద్దాంత సారూప్యత లేని తోకలుగా మిగిలి అన్ని రంగాల్లోనూ ఉనికిని కోల్పోతున్న దయనీయ స్థితి లో కూడా వీధి పోరాటాలు మాన లేదు . ఒక ముఖ్యమంత్రి తన స్వప్రయోజనాలకోసం వేలాది ఎకరాల భూమిని పందేరం చేస్తున్నప్పుడు చేసిన పోరాటం కంటే  వీరిద్దరూ ఒకరి పై ఒకరు బురదజల్లు కోడానికే భాష ను గొంతుకలను ఎక్కువ వాడుతున్నట్టున్నారు . వీరు ఒక విషయం గమనించారో లేదో తెలియదు కానీ వీరు ఏదైనా పోరాటం చేసినప్పుడు పెద్దగా పట్టించుకోని పత్రికలు వీరు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగ గానే వీరి నాయకులు ఉచ్చరించిన ప్రతి పదం పొల్లు పోకుండా వేస్తున్నారు .

                         ఈ క్రింద ఉన్న మాప్ ను ఒక సారి చూడండి . నేను ఇంతకు ముందు వేరొక పోస్ట్ లో వాడినదే . 






                   వేలకొద్దీ ప్రయాణం చేసే రోడ్ లో ఉన్న ఈ ప్రార్ధనా మందిరాల గురించి ఇప్పుడు మరొక సారి ప్రస్తావించవలసి వచ్చింది . 1981-82 ల లో తణుకు పట్టణం లో చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ కళాశాల ముందు భాగం లో ఉన్న దేవాలయ భూమిని వేలం వేయాలనుకున్నప్పుడు దాని వెనుక ఎవరున్నదీ తెలిసి కూడా ప్రజలను చైతన్య వంతులని చేసి దానిని తిప్పి కొట్టిన విద్యార్ధి లోకం లో నేనూ ఒకడినై నందుకు నాకు ఈ రోజుకీ గర్వంగా అనిపిస్తుంది. కానీ రోజూ వేల మందిని ఇబ్బందుల పాలు చేస్తున్న ఈ ప్రార్ధనా మందిరాల ఆక్రమణ లకు వ్యతిరేకంగా ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ ముందుకు రాలేదు . ప్రతి ఒక్కరికీ వోట్ల లెక్కే .  పిల్లి కాదు ..... పులి లాంటి మత .... కుల .. గ్రూపు ... రాజకీయాల మెడలో గంట కట్టాలి .

                          ఈ నాడు నేనొక మధ్య తరగతి ఉద్యోగస్తుడను .... నాకు అన్యాయం అనిపించిన ప్రతి విషయానికి వ్యతిరేకంగా నేను పోరాడలేను . కానీ ఈ పని కొంత వరకూ ఆనాడు చైతన్యంతో ఉండే విద్యార్ధి సమాఖ్యలు చేసేవి . మరి ఈ నాడు ఎందుకు అవన్నీ వెనక్కు పోతున్నాయి? నేరస్తుల ప్రపంచం నెమ్మదిగా మొత్తం సమాజాన్ని ..... ఆర్ధిక వ్యవస్థనే కాక అన్ని వ్యవస్థలను కబ్జా చేస్తున్నప్పుడు ఐక్యంగా ఈ పరిస్థితిని ఎదుర్కోవలసిన చైతన్యవంతులు ముక్కలు ముక్కలుగా విడిపోవడం ఎవరికి లాభం చేకూరుస్తుందో ఈ పార్టీల నాయకులకు తెలియదా ? సెక్యులరిజం పేరు మీద కేంద్రప్రభుత్వానికి ..... నేరస్తుల ముఠాలకు ఊడిగం చేసే వారిని అక్కున చేర్చుకుంటే ప్రజల విశ్వసనీయతను కోల్పోతామని తెలియదా? "వీరిద్దరూ ఐక్యంగా ఉన్న తరువాత కదా మిగిలిన సెక్యులర్ పార్టీ లతో చెలిమి చేయాలి" అని ప్రతి సామాన్యుడూ అనుకుంటాడు ఒక్క ఈ పార్టీల నాయకులు తప్ప .

                       ఉధృతంగా వర్షం పడుతున్నప్పుడు ముందు తడవకుండా ఉండడానికి గొడుగు వెదుక్కుంటాం  కానీ వర్షం రావడానికి కల కారణాలను ..... వర్షం వలన రాబోయే ఉపద్రవాల గురించి చర్చిస్తూ కూర్చోం . ముందు మనకు నీడ దొరికిన తరువాత అవన్నీ చర్చిస్తాం . కాకపొతే అది మనబోటి సామాన్యులు చేసే పని . కమ్యూనిస్ట్ పార్టీల నాయకుల ఆలోచనలు విభిన్నంగా ఉండొచ్చు . 1964 లో భారత దేశ పరిస్థితికి .. నేటి పరిస్థితికి అన్ని విషయాలలోనూ చాలా తేడా ఉంది .  అప్పటి పరిస్థితులు చీలికకు దారి తీసి ఉండొచ్చు . కాని ఈ నాటి పరిస్థితులలో జాతీయ సంపత్తిని దోచుకునే స్థాయికి ఎదిగిన నేరమయ ప్రపంచాన్ని పెకలించక పోతే భారతదేశ జనాభా మొత్తం నేరగాళ్ళ పడగ నీడల్లో బిక్కు బిక్కు మంటూ బ్రతకవలసిన ఆవశ్యకత కలుగుతుందని అర్ధం కావడం లేదా ? లేదా దీనికి కూడా మార్క్సిస్ట్ గ్రంధాలను రిఫర్ చెయ్యాలా? ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఐక్యతా రాగం కాకుండా యుద్ద భేరీలు మ్రోగిస్తే మాత్రం ఇది భారత రాజకీయ చరిత్రలో అది ఒక పెద్ద కుట్రగానే భావించ వలసి వస్తుంది .