15, జూన్ 2014, ఆదివారం

కాబోతున్న గుళ్ళు ..... ఇప్పుడే మొక్కేస్తే కొంత పుణ్యం క్రెడిట్ లో పడిపోతుంది




" అటు చూడు "

మూర్తి నేను చూపిన వైపుకి తిరిగాడు.

"ఏముంది ?"

" ఫోటోలు తగిలించిన ఆ చెట్టు కనబడలేదా "

మేమిద్దరం విశాఖపట్టణం లోని న్యూకోలనీ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వైపు

వెళ్ళే రోడ్ లో ఎడమ వైపు ఉన్న ఈ చెట్టుకి సమీపం లో ఉన్నాం.

"అవును చాలా సార్లు చూసాను "

"ఇప్పుడింకా నయం ..... మూడు రోజుల ముందు వరకైతే ఇంకా చాలా ముందుకి ఆ ఫోటోలు పేర్చేసి ఉండేవి . "

"ఇంతకూ ఇది నాకెందుకు చూపిస్తున్నావ్ ?"

"ఏమో ...ఎవరు చూడొచ్చారు ..... కొద్ది సంవత్సరాలలో ఇది ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమై కూర్చుంటుందేమో .... ?"

"ఎలా .... ఇంత  బిజీ రోడ్ లో ..... నీకేమైనా మతి పోయిందా ?

"చూడు బాబూ మన ఆసీల్ మెట్ట వినాయకుడి గుడి కూడా ఇలా సరదాగే ... ఎవరో షిప్పింగ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఆఫీస్ వాస్తు కోసం గోడలో వినాయకుడి విగ్రహం పెడితే ఏర్పడిందే ..... అంతే  కాదు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న గుళ్ళన్నీ  ఇంచుమించు ఇలానే ఏర్పడతాయ్ "

"ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయ్ ..... పార్టీలు కూడా మారుతూనే ఉన్నాయ్ .... కానీ ఈ విషయాల జోలికి ఎవరూ రారెందుకో ?

" చూడమ్మా .... గీటురాళ్ళు మారుతున్నాయ్ ..... నీవు చేసిన పని ప్రజలకు ఎంత మేలు చేస్తుందన్నది  secondary thing..... దాని వలన మనకు ఎన్ని వోట్లు పెరగ బోతున్నాయన్నదే సరి కొత్త గీటురాయి . రోడ్ కి అడ్డంగా వస్తుంది కదా అని ఏ గుడి మీద చేయి వేసినా నిప్పు రాజు కోవడం ఖాయం ..... ప్రజల కోసం ఒక వేళ  ఏ ప్రభుత్వం అన్నా అంత సాహసం  చేసినా నిప్పు రాజెయ్యడానికి  బోలెడన్ని చానళ్ళు రెడీ గా ఉంటాయ్ . రోడ్ కి అడ్డంగా ఎక్స్టెండ్ చేయబడి ఉన్న గుడి వలన ట్రాఫిక్ కు ఎంత అంతరాయం కలుగుతుందో చూపించడానికి ఎవడికీ సాహసం చాలదు  .....కానీ  "

"నీవు మరీ గురూ .. వాళ్లకు మాత్రం TRP రేటింగ్ అవసరం ఉండదా ఏమిటి ? కొన్ని విషయాలు ఎంత అవసరమైనవి అయినప్పటికీ  వాటిలో తలదూర్చకుండా ఉంటే క్షేమంగా ఉంటామని ప్రతి పాలక పక్షమూ భావిస్తూ ఉంటుంది. ఎవడిదో పెళ్లి అవుతూ ఉంటుంది ... రాత్రి 12 గంటల ముహూర్తం కావచ్చు ... తెల్లవారగట్ల 5. 00 గంటల ముహూర్తం కావొచ్చు ఇష్టం వచ్చినట్లు బాణసంచా కాల్చి నిద్రలు పాడు చేస్తున్నారా లేదా .... వీటినాపే  రూల్స్ లేవా ... అన్నీ ఉంటాయ్. నీవన్నట్లు సరైన గీటు రాళ్ళు ఉండే పార్టీలు వస్తే చాలు "