1, డిసెంబర్ 2014, సోమవారం

తలిదండ్రులకు చిన్న విన్నపం .......





నేను చిన్నప్పుడు చదివిన తాడికొండ రెసిడెన్సియల్ స్కూల్ కు ప్రిన్సిపాల్ గా శ్రీమతి సుగుణ గారుండేవారు. సెలవులకి వచ్చిన విద్యార్ధులు తిరిగి వచ్చేటప్పుడు తినుబండారాలతో రావడం పరిపాటి. కానీ ఇది విద్యార్థుల్లో అసమానతలు పెంచుతుందనే ఉద్దేశ్యంతో ఆవిడ ఇవి పబ్లిక్ తినడాన్ని ఒప్పుకునే వారు కాదు. కనీసం విద్యార్థి దశలో అయినా అసమానతలు లేకుండా ఉండాలనే ఆవిడ ఆలోచనతో మేము ఆ రోజుల్లో అంత సమ్మతం కానప్పటికీ ఈ రోజున ఆమె ఆలోచనల విలువ అర్ధం అవుతుంది.
ఇప్పుడు చాలా కాలేజ్ లలో కాని స్కూళ్ళలో కానీ ఇటువంటి నిబంధనలేవీ కనబడవు. తమ బిడ్డ ల కళ్ళలో ఆనందం కనబడాలి అంతే......అది వారి తోటి వాళ్ళ మీద చూపే ప్రభావాలతో వాళ్లకు సంబంధం ఉండదు. ఒక క్లాసులో ఒక ధనిక విద్యార్ధి ఉంటాడనుకుందాం. అతగాడు తన బర్త్ డే కి చాలా ఖర్చు చేసి స్నేహితులందరికీ ఏదో ఒక విలాసవంతమైన హోటల్ లో పార్టీ అరేంజ్ చేస్తాడు. అటెండ్ అయిన స్నేహితులందరికీ వారి వారి బర్త్ డే లకు ఏదో విధంగా అంత స్థాయి కానప్పటికీ .....ఏదో ఒక మంచి హోటల్ లో పార్టీ యీయవలసిన అవసరం ఏర్పడుతుంది. కనీసం ఆయా తలిదండ్రులకి ...ఆనందం అనే విషయం మీద సరైన కాన్సెప్ట్ ఉంటే ఇంత చిన్న వయసులో ఉన్న పిల్లలకి ఇంత విలాసవంతమైన అలవాట్లు అవసరమా ......అనే మీమాంస వస్తుంది. పిల్లలను బాధ పెట్టలేని తలిదండ్రులు తమ అవసరాలను ఎక్కడో ఒక చోట తగ్గించుకొని పిల్లలకి ఈ పార్టీ బిల్లులు కట్టవలసిన పరిస్థితులు ఉండవచ్చు. దానిలో ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకో .....హాస్పిటల్ అవసరం ఉన్నవాళ్ళకి మందులు తగ్గించవలసిన పరిస్థితులున్నా ఆశ్చర్య పోనవసరం లేదు .
మా దగ్గర ఒక పెయింటర్ పని చేస్తూ ఉంటాడు. చాలా బాధ్యత గా పని చేస్తాడు.  క్వాలిటీ లో కాంప్రమైజ్ ఉండదు. రోజంతా ఒక హెల్పర్ ను పెట్టుకుని దుమ్ముకొట్టుకుంటూ పనిచేస్తుంటాడు. అతడికి మా అపార్త్మెంట్లోనే ఒక పెయింటింగ్ పని ఇప్పించాం . ఒక రోజు నేను క్రిందికి దిగేసరికి ‘పల్సర్ 220 CC ‘బైక్ మీద అతడిని ఎవరో కుర్రాడు డ్రాప్ చేస్తున్నాడు. ఎంక్వైరీ చేస్తే తెలిసిందేమిటంటే ఆ కుర్రాడు ఈ పెయింటర్ కొడుకే. రాజశేఖర రెడ్డి గారి దయ వలన ఏర్పడిన తామర తుంపర లోనిదే ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ వెలగపెడుతున్నాడు. కాబట్టి అతగాడు కాలేజ్ కి వెళ్లి రావడానికి instalment లో ఇది కొనిచ్చాడు. ఇది విన్న వెంటనే నా మనసులో వెంటనే మెదిలిన ప్రశ్న ఏమిటంటే  ఒక వేళ పాపం ఈ పెయింటర్ రెండు మూడు నెలలు జబ్బు పడితే ఆ instalment ఆ కుర్రాడు ఎలా కడతాడు? చైన్ స్నాచింగ్ చేశా ....

ఈ మద్య వచ్చిన సినిమాలలో “వేదం “ సినిమాకి ఒక ఉన్నత స్థానం ఉంది. దాంట్లో స్పృశించిన సామాజిక అంశాలు వర్తమానానికి అత్యంత దగ్గరగా ఉంటాయి. ఆనందానికి నేటి యువత దృష్టిలో ఉన్న అర్ధం .....దానిని ఏదో విధంగా అందుబాటులోకి తెచ్చుకోవడానికి నేరం చేయడానికి వెరవని సామాజిక పరిస్థితులు ఒక పక్క చూపిస్తూనే ........నిజమైన ఆనందం అంటే అవగాహన చేసుకున్న యవత వలన సమాజం ఎంత లాభం పొందుతుందో .....స్పష్టంగా చూపించడంలో దర్శకుడు కృతకృత్యుడయ్యాడు. కాబట్టి ఆరోగ్యవంతమైన సమాజం కావాలనుకునే చేడ్ బాధ్యత గల తలిదండ్రులు తమ పిల్లలకు అసలైన ఆనందం అంటే ఏమిటో అర్ధం అయ్యేలా చేయగలుగుతారు. ఆ భాద్యత లేదనుకునేవాళ్ళు ఏమి చేస్తారో నాకు తెలియదు.