11, నవంబర్ 2014, మంగళవారం

కధలోని పాత్రలన్నీ కల్పితాలే ..... ఒక్క ఆవేదనలు తప్ప ....





(ఈ క్రింది కధలోని పాత్రలన్నీ కల్పితాలే ..... ఒక్క ఆవేదనలు తప్ప ..... )

రాజమండ్రి .... 

హోటల్ రివర్ బే ..... 

సూట్ నం . 203

కిటికీలలో నుండి గోదావరి ని చూస్తూ కూర్చుంటే కలిగే ఆనందాన్ని అనుభవించాలి కానీ వర్ణించడం కష్టం .... 

******


“ఏమిటీ..... మళ్ళీ చెప్పు .....”
నిర్మాత గారు కుర్చీ లో నుండి ముందుకు వంగారు
రచయితకు  హుషారు పెరిగింది. అసలే కొత్త నిర్మాత...... చెప్పిందల్లా వింటాడని నమ్మకం....
“అవును సార్ అంతా సూపర్ వెరైటీ .....మన టేకింగే స్పెషల్ ......ప్రేక్షకులు కుర్చీలకతుక్కుని లేవరు....”
“ఆ సీను మళ్ళీ చెప్పు “
“ హీరో కి జలుబు చేస్తుంది ......హీరోయిన్ ని ఎత్తుకుని  వెళ్ళడానికి విలన్ మనుషులు వస్తారు . హీరోకి ఆవేశం వస్తుంది . జలుబు కూడా ఉంది కదా ......గట్టిగా ముక్కు చీదుతాడు. ఆ చీమిడి లోని ఫోర్స్  భూమిని చీల్చేస్తుంది .....బీటలు వారేట్టు చేస్తుంది .....ఆ బీటల్లోనుండి నీరు పైకి తన్నుకు వచ్చి కరక్టుగా ఒక మంచి పారాబోలిక్ షేప్ లో హీరోయిన్ పై పడుతుంది  హీరోయిన్ ఈ విచిత్రాన్ని జీర్ణించుకునే లోపు లోనే మొత్తం తడిచి పోయి కలల్లోకి వెళ్ళి పోతుంది .....పాట .....”
“మరి రౌడీ లు .....”
“వాళ్ళు కూడా మన ప్రేక్షకుల్లాగే వెర్రి వాళ్ళే కదా ...... పాట పూర్తయ్యే వరకూ ఫైటింగ్ మొదలు పెట్టరు. అయినా డ్రీమ్ సీక్వెన్స్ తరువాత డైరక్ట్ గా ఫైట్ సీను బాగోదు కాబట్టి సింపుల్ గా హీరో రిమోట్ తో సుమోలు పేల్చేసి రౌడీలను బెదరగోట్టేస్తాడన్న మాట “
నిర్మాత ఫీలింగ్స్ పెద్ద్డగా మారలేదు.
ఇంకా ఇంప్రెస్ చెయ్యాలన్న నిర్ణయానికొచ్చి రచయిత ....
“ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది సార్ .....”
నిర్మాత ముందుకు వంగాడు.
“పారిపోతున్న రౌడీలలో ఒకడిని చూసి హీరో షాకవుతాడు. అతడి చిన్నతనంలో చని పోయిన అతగాడి మావయ్య పోలికలు ఆ రౌడీలో స్పష్టంగా ఉంటాయి. అంటే తన మావయ్య మళ్ళీ పుట్టినట్లు హీరో కి అర్ధం అయిపోతుంది.”
“అయితే ....?”
నిర్మాత అడిగాడు. రచయితకు  హుషారు పెరిగి పోయింది.
“చూసారా .....మీకు కూడా క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఆ రౌడీ బట్టలన్నీ మట్టిగొట్టుకుని పోయుంటాయ్. వెంటనే హీరో తన షర్టు విప్పి ఆ రౌడీ కి ఇచ్చేస్తాడన్న మాట. చూసారా సార్ ఒకే షాట్ కి రెండు పిట్టలు. ఈ విధంగా మనం హీరో సిక్స్ పాక్ బాడీ చూపించేస్తాం. ప్రేక్షకుల్ని సెంటిమెంట్ తోనూ  కొడతామన్న మాట.”
“ఫాంట్ కూడా విప్పేసి ఇచ్చేయొచ్చు కదా .....”
నిర్మాత సీరియస్ గా అంటున్నాడో.... వేళాకోళంగా అంటున్నాడో ....రచయిత కు  బోధపడలేదు.  తిరిగి నిర్మాతే మాట్లాడడం ప్రారంభించేడు.
“నేను సినిమా తీయాలనుకుంటున్నానని ఒక్క మాట చెప్పగానే ఈ వెధవ తిన్నగా నీకు ఫోన్ చేసేసేడు.....”
పక్కనే ఉన్న స్టూడెంట్ లాంటి కుర్రాడిని చూపించి అన్నాడు.
రచయిత  కంగారు పడ్డాడు.
“సార్ ...సబ్జక్టు కావాలంటే మార్చుకోవచ్చు ....నా దగ్గర సోషియో ఫాంటసీస్ ....సైంటిఫిక్ ఫిక్ షన్స్ చాలానే ఉన్నాయి ....”
“నీవు నన్ను పూర్తిగా చెప్పనీయ్ ..... నాకూ ఒక కొడుకున్నాడు కానీ వాడిని హీరోని చేద్దామని నేను అనుకోడం లేదు ...వాడు చదువుకున్నాడు ...అమెరికాలో మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు .....ఒక విధంగా సినిమాకి పెట్టుబడి పరోక్షంగా వాడిదే..... ”
“అయితే మన అమెరికా షూటింగ్ అంతా బాబే చూసుకుంటాడన్న మాట “
“కొంచెం నేను చెప్పేది పూర్తయ్యే వరకూ మాట్లాడకు ....మా అబ్బాయి దీంట్లో ఎక్కడా తలదూర్చడు....రెండో విషయం ఏమిటంటే  కధ ఇంకా నిర్ణయం కాలేదు ...లోకేషన్స్ ఎలా నిర్ణయించేస్తున్నారు?“
“లోకేషన్స్ దేముందిలే సార్ .....అయితే కధ మీద ముందు కూర్చుందాం .....”
“కానీ మీరు చెప్పిన నికృష్టపు ఫార్ములా కధలు నాకొద్దు “
రచయితకు కొంచెం ఇగో దెబ్బతింది. కానీ పైకి కనబడనీయ లేదు.
“సార్ ఫీల్డ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ......”
“ఆహా కంగారు పడొద్దు ....నేను మీ టేలెంట్ ను ఏ మాత్రం చిన్న చూపు చూడడం లేదు. కానీ మీరు కధ మీద కూర్చునే ముందు నా గోల కాస్త వినాలి “
“ఎంత మాట .....చెప్పండి “ రచయిత కూల్ అయ్యాడు
“మాది ఈ ఊరే .....అంటే ఇది మరీ ఇంత పెద్దది కాక ముందు నుండీ ఇక్కడే ఉంటున్నాను. జాంపేట కూరగాయల మార్కెట్ లో నాకొక దుకాణం ఉండేది. అదేదో పెద్ద దుకాణమేమీ కాదు విస్తరాకుల దగ్గరనుండి ఉల్లిపాయల వరకూ అన్నీ అమ్మే వాడిని. బ్రతుకు ఈడుస్తానికి సరిపోయేది. అప్పుడు నాకో స్నేహితుడు ఉండేవాడు. వాడు మెయిన్ బజార్ లో జట్టు కార్మికుల సంఘానికి నాయకుడిగా ఉండే వాడు. ఎందుకో తెలియదు వాడి మాటలు నాకు వేరే ప్రపంచం గురించి కలలు కనేలా చేసేది. కష్టపడినదానిని బట్టి వేతనం .....కావలిసిన చదువు ...కులాలు ..మతాలు లేని ప్రపంచం .......వాడి తో బాటు చాలా సమావేశాలకు వెళ్ళే వాడిని. ఇదంతా నేను యువకుడిగా ఉన్నప్పుడు ....
                                  ఆ  తరువాత పెళ్ళయ్యింది. కొడుకు పుట్టాడు. వాడు పుట్టిన కొద్ది రోజులకే భార్య గర్భసంచి కి వచ్చిన జబ్బు వలన ఇక పిల్లలు పుట్టరని నిర్ణయం అయ్యింది. హాస్పిటల్స్ కి భారీ ఖర్చులు పెట్టుకోగల స్తోమత లేదు కానీ ఏదో గండం గడిచి బయట పడ్డాం. అంతకు ముందు నేనెప్పుడైనా బయటకు వెళితే తను షాపులో కూర్చునేది. రెండు మూడు సంవత్సరాలు చాలా ఒడి దుడుకులు పడ్డాం. జీవితం ఒక గాడిన పడుతుందనుకునే సరికి మా వాడు చెప్పిన మాటలు నన్ను చాలా కృంగదీశాయి. మిత్రుల కింద ఉండవలసిన వాళ్ళే శత్రువుల కంటే దారుణంగా పగ వాళ్ళ లా కొట్టుకునే వారు. నెమ్మదిగా నా షాపు ....కుటుంబమే జీవితం అయిపోయాయి. మా వాడి సాంగత్యం వలన కొన్న పుస్తకాలు మాత్రం   అడపా దడపా కొని చదువుతూనే ఉండేవాడిని. నా అదృష్టం కొద్దీ నా వలన నా కొడుక్కీ ఆ అలవాటు వచ్చింది. వాడు మంచి కాలేజ్ నుండే ఇంజనీరింగ్ చేసాడు. మా స్నేహితుడు పని చేస్తున్న పార్టీ వాళ్ళే 80 ల మొదటి అర్ధ భాగంలో బెంగాల్ లో అధికారం లో ఉండే వారు. వాళ్ళ ద్వారా కలకత్తా లో stastical institute లో కంప్యూటర్ సైన్స్ లో PG కోర్స్ వచ్చిందని తెలిసింది. అదృష్టం కొద్దీ వీడికి అక్కడ సీటు దొరికింది. ఒక విధంగా అది మా జీవితాలను మార్చి వేసింది. అమెరికా లో ఒక software company లో మంచి ఉద్యోగం వచ్చింది. కొద్ది కాలం లోనే అప్పులు తీర్చేసి మిగులు లో పడ్డాం. ఆ తరువాత మా వాడు పంపుతున్న డబ్బుతో ఒక మంచి వ్యవసాయ భూమి కొనాలనుకుని సిటీ కి 8,9 కిలోమీటర్లలో రైల్వే ట్రాక్ ఆవలగా ఉండే గ్రామాల్లో చౌకగానే భూములు కొంటూ వచ్చాను. 90 లలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి పధకం మరలా నా జీవితాన్ని మార్చి వేసింది . బోర్ గానీ కొట్టిస్తున్నానా ..... ?"
నిర్మాత చెప్పడం ఆపాడు . 
"అయ్యో లేదు సార్ .... చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. మరొక వెంకటేష్ కామత్ ను చూస్తున్నట్లు గా ఉంది. "
టీ లు వచ్చాయి. 
నిర్మాత కొనసాగించాడు 
"మా భూములున్న వూరికి .... నగరానికి మధ్య ఫ్లై ఓవర్ ప్రారంభమవగానే నేను కొన్న భూములన్నీ రేట్లు పెరగడం ప్రారంభమయ్యింది. అది పూర్తయ్యేసరికి నిజంగానే ధరలు చుక్కల్నంటాయ్. నిజమే పెద్దగా నా ప్రమేయం లేకుండానే నేను డబ్బున్నవాడినయ్యాను. కానీ జీవితంలో ఏదో తెలియని వెలితి. మంచి జనాలకు దూరమయ్యానన్న ఫీలింగ్. పచ్చడి మెతుకులు తిన్నా ..... ఆనందంగా టీలు తాగుతూ .... మంచి  మార్పు కోసం ఏదో ఒకటి చేస్తూ బ్రతికిన ఆ జీవితాన్ని మరిచి పోలేకుండా ఉన్నాను. 90 ల తరువాత వచ్చిన మార్పులకనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకోలేని ఈ దేశపు మార్క్సిస్ట్ పార్టీలు ఉనికి కోల్పోవడం ప్రారంభమయ్యింది. ఇక కళా రూపాల సంగతి చెప్పనక్కర లేదు. 
                            ఇక్కడ ముఖ్యంగా నా భార్య గురించి చెప్పుకోవాలి. తన ఆరోగ్యం బాగున్నంత వరకూ తను కూడా అప్పుడప్పుడు నాతొ బాటు తిరుగుతూనే ఉండేది. మా షాపు దగ్గర నలుగురూ మాట్లాడుకుంటుంటే శ్రద్దగానే వినేది. అలాగే మా అబ్బాయి ఇక్కడి సాంస్కృతిక కాలుష్యం గురించి రోజూ తిడుతూనే ఉంటాడు. అందరం కలిసే ఈ నిర్ణయానికి వచ్చాం. నిజానికి కొంతమంది మహానుభావులు ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేస్తూనే ఉన్నారు. మా  వంతు ప్రయత్నం కూడా మేము చేద్దామని మిమ్మల్ని పిలిపించాను. మిమ్మల్నే పిలవడానికి కూడా కారణం ఉంది. పని పట్ల మీకొక అంకిత భావం ఉంది. ఈ సినిమా ప్రజల దగ్గరకు వెళ్ళాలంటే మీలాంటి రచయిత అలాగే దర్శకుల అవసరం నాకుంది. ప్రజలు చూడక పొతే దానికున్న ప్రయోజనం నెరవేరినట్లు కాదు. 
ఒక్క సినిమాతో కాలుష్యమంతా పోతుందని గాని ఒక సారి ఎర్ర జెండా ఎగిరేస్తే వాటంతటవే అన్ని సమస్యలూ పరిష్కారం  అయిపోతాయి అనే నమ్మకాలు మాత్రం లేవులే . ప్రేక్షకుల ఆలోచనలో చిన్నపాటి కుదుపు తెప్పించగలిగితే చాలు. ఆనందంగా గడపడానికి ఒక చిన్నపాటి పోరాట మార్గం ఒక ప్రత్యామ్నాయ మార్గమని యువతకు కొంతైనా అర్ధం కావాలి . నా ప్రతిపాదనలన్నీ నచ్చితే మనం అగ్రిమెంట్ రాసుకుందాం. లేదంటే మీ సమయం వృధా చేసినందుకు క్షమించండి. "
నిర్మాత ఆగాడు. 
రచయిత కుర్చీ లో నుండి లేచాడు. నిర్మాత దగ్గరగా వెళ్ళాడు. ఆయన రెండు చేతులూ తన కళ్ళకద్దుకున్నాడు. తడైన తన చేతులను చూసుకుని నిర్మాత కంగారు పడ్డాడు. 
"ఇదేంటి బాబూ ..... ?"
"సార్ .... నన్ను కుళ్ళు లో నుండి లాగుతున్నారు సార్ ..... మీతో అగ్రిమెంటేమిటి సార్ ..... ఈ సినిమా కు నాకు ఒక్క పైసా కూడా వద్దు. ఈ సినిమా కోసం నా సర్వశక్తులూ ధారపోస్తాను. దీంట్లో మీకే సందేహం వద్దు. 
                      ఎలాంటి వాళ్ళతో బ్రతుకుతున్నాను సార్ ...... ఛీ .... ఛీ .... ఆలోచిస్తుంటే రోత పుడుతుంది. ప్రభుత్వాల దగ్గరనుండి భూములు పొంది ..... ఇంకా ఆక్రమణలు కూడా చేసేవాళ్ళు  ..... అంతే  కాకుండా ఈ ప్రజలు సినిమాలు హిట్ చేసినండువల్లే  కోట్ల రూపాయలు ఆర్జించి కూడా ఇంకా వారసులని మాత్రమే హీరో లను చేసే ప్రయత్నంలో ఉన్న నిర్మాతలు ..... హీరోలు ........ ఛీ ...చీ .... నిజంగా ఈ కుళ్ళు లోకి ... రొచ్చు లోకి పన్నీరులా ప్రవేశించారు సార్ ..... మీకు అండగా మనస్పూర్తిగా ఉంటాను ..... నిజం సార్ ..... "
"నీ కళ్ళే నీ పట్టుదలను చూపిస్తున్నాయి .... "
నిర్మాత ఆదరంగా రచయిత చేయి పట్టుకున్నాడు.