10, ఫిబ్రవరి 2011, గురువారం

బాడ్మింటన్-వీరాధి"వీరూ"


ఒక్కొక్క సారి కొంతమంది తెలియకుండానే సమాజానికి ఎంతోసహాయం చేస్తూ ఉంటారు . అలాగే కొంత మందితెలియకుండానే హాని కూడా చేస్తారు . జరుగుతున్న దాంట్లోవాళ్ళ ప్రమేయం గురించి వాళ్లకు ఏ మాత్రం అవగాహనఉండదు . కానీ వొక వ్యక్తి వలన వొక జెనరేషన్ మొత్తం మాగ్రామంలో బాడ్మింటన్ ఆటను ఎంతగానో ఎంజాయ్ చేసారు . పక్క ఫోటోలో ఉన్న ఆ వ్యక్తి పేరు వీర్రాఘవులు , అందరూ ఈనాటికీ ముద్దుగా పిలుచుకొనే “వీరూ". నేనైతే యిప్పటికీ ఒక ఆదర్శ గ్రామీణ వ్యక్తికి ఉదాహరణగా అతడినే చూపిస్తాను . అతని కోరికలు అతి సాధారణం కొన్ని చుట్టలు , మామ్మూలు భోజనం ,వీలయితే రాత్రి భోజనం లోనికి రెండు చేపపరిగెలు. ఉదయాన్నే లేవడం . భుజం మీద పాల కావిడి వేసుకుని ఒక చుట్ట వెలిగించుకుని పొలం వెళ్ళడం పాలతోఇంటికి వచ్చి మిగిలిన పొలం పనులకి ఉపక్రమించడం . మధ్యాహ్నం కాస్త కునుకు , ఆ తరువాత ఇక బాడ్మింటన్ కోర్ట్ లోనే. ఇంత సింపుల్ గా అందరూ ఉండ గలిగితే ఈ లోకం యెంత బాగుంటుంది అనిపిస్తుంది . ఈ ఆలోచనలనే దర్శకులుశ్రీ విజయ్ భాస్కర్ గారు “నువ్వు నాకు నచ్చావ్ ” సినిమాలో హీరో చేత చక్కగా చెప్పించారు.అతనిలో ఉన్న ఉత్సాహంఅంకిత భావం ఆ ఆటను మా ఊరిలో అత్యున్నత స్త్తాయికి తీసుకెళ్ళాయి. అది అతనికి ఆనందం ఇస్తూనె గ్రామానికికూడా ఆనందాన్నిచ్చింది . అతని ఇన్స్పిరేషన్ తో మా ఊరిలో ఎంతో మంది బాడ్మింటన్ ఆటగాళ్ళు తయారయ్యారు . ఊరిలోని కుర్రాల్లందరికి బాడ్మింటన్ కోర్ట్ ఒక కేంద్రంగా వుండేది . ఇప్పుడేమో గానీ అప్పుడు పది మంది , ఎప్పుడైతే ఒకచోట కలిసామో అక్కడ ఏదైనా ఒక మంచి పని చేయడానికి ఇన్స్పిరేషన్ దొరికేది . అప్పటికింకా గ్రామాలు టీవి మత్తులోములిగి పోలేదు .అఫ్కోర్స్ ఇప్పుడు సెల్ ఫోన్ మత్తనుకోండి …ఇదంతా ఎందుకంటె ఒక వ్యక్తి కి వుండే మంచి అభిరుచితనకే కాకుండా తన చుట్టూ ఉన్నవారికి కూడా యెంత మేలు చేస్తుందో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ . ఆతరువాత నెమ్మదిగా ఒక్కక్కటి భ్రష్టు పట్టినట్లు గానే మా ఊరిలో ఆ బాడ్మింటన్ కూడా కనుమరుగై పోయింది . మావీరూ ఎక్కువ కాలం వొంటరి పోరాటం చేయలేక పొయ్యాడు .
ఈ సందర్భం లోనే అతడి తల్లి అంటే మేమంతా లచ్చంమామ్మ అని పిలుచుకొనే శ్రీమతి మల్లిపూడి లక్షమ్మ గారి గురించికొంచెం ఇక్కడ చెప్పుకోవాలి. ఆవిడకు వున్న ఒక్క కొడుకంటే వల్లమాలిన ప్రేమ . ఆవిడకు మరణ ఘడియలు దగ్గరపడ్డాయని ముందే తెలిసిందేమో తెలియదు కాని కోడలిని ( మనమరాలే ) పిలిచి చేతికున్న గాజులు భద్రంగాఉంచుకోమని చెప్పి ,వరండా లో చాప వేసుకుని( మంచంమీద మరణిస్తే ఇల్లు ఆరు నెలలు ఖాలీ చేయవలసి వస్తుందనివొత్తిగిల్లి పడుకోగానే చని పోయింది. యెంత గొప్ప ఆయాచిత మరణం.)

అలాగే అందరూ " అనంతక్క " అని పిలుచుకొనే శ్రీమతి అనంత లక్ష్మి మా వీరూ ధర్మ పత్ని. నిజమైన సహధర్మ చారిణి.  మా వురి సమాజం లోనే తనుంటూ కూడా ఏ రోజు కూడా బాడ్మింటన్ కోసం సమయం,డబ్బువృధా చేస్తున్నాడని తన భర్తను ఒక్క మాట కూడా అనని ఆమె నిజంగా అభినందనీయురాలు.వీరిద్దరికీ ఒక నాటిరాజోవోలు కుర్రాడిగా శతాధిక వందనాలు సమర్పించుకుంటున్నాము.