17, మార్చి 2014, సోమవారం

ఆధారం లేని నమ్మకం

అనుకోకుండా ఎండలు ఒకే సారి పెరిగి పోయాయ్ . 

పాపం ఇంత ఎండలో ఆ పెద్దతను ఎందుకు పని చేయవలసి వస్తుందో .... .    బ్రిడ్జ్ ల మీదా .... ట్రాక్ మీదా  నీట్  గా గుండ్రంగా మా రైల్వే స్టాండర్డ్స్ ప్రకారం  లెటరింగ్  చేయించవలసిన అవసరం కలిగినప్పుడు  ఆ పెయింటర్ ను నా దగ్గరకు పంపే ముందు నా కొలీగ్ చెప్పిన మాటలు నా మనసులో మెదులుతూనే ఉన్నాయి .

" మీ అవసరానికి తగ్గ మంచి పెయింటర్ ని పంపిస్తున్నాను ..... మన రైల్వే లోనే రిటైర్ అయ్యాడు . అతడికి ఏం చేయాలో కాస్త వివరించి చెప్పండి చాలు .... ఆ తరువాత మీరు హాపీ గా వేరే పనులకు మీ టైం కేటాయించుకోవచ్చు .  అక్షరాలైతే ముత్యాల్లా రాస్తాడు. కానీ ఒక్క ఇబ్బంది మాత్రం ఉంది .  అతగాడి అవసరం ఏమిటో తెలియదు కానీ పని జరుగుతున్నప్పుడు ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేయాలి . "

అతగాడు పని ప్రారంభించిన రెండు రోజుల వరకూ అతగాడి ని కలవలేక పోయాను .  అతగాడు  మరీ అంత వయసు పై బడిన వాడని అనుకోలేదు .  ఏ అవసరాలు అతగాడిని ఇంకా పని చేయడానికి పురికొల్పుతున్నాయో ...... 

" మంచి నీళ్ళు తెచ్చుకున్నావా .... ?"

చూపించాడు 

"ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ట్రాక్ మీద ఉండకు. ఏదైనా చెట్టు కింద గానీ .... బ్రిడ్జ్ క్రింద గానీ రెస్ట్ తీసుకో .... "
వెనక్కు తిరిగి రెండడుగులు వేసాను . మరలా అతగాడి దగ్గరకు వెళ్ళాను. 

"నీ దగ్గర మొబైల్ ఉందా.....? "

తలూపాడు . దాంట్లో నా నంబర్ ఫీడ్ చేయిచాను.  

"ఏదైనా అవసరం వస్తే వెంటనే ఫోన్ చేయి "

"అదేంటి సార్ .... మేమేలాగ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాంగా .... " కాంట్రాక్టర్ సూపర్వైజర్ రాజు నవ్వాడు. 

"కరెక్టే రాజూ ...  మా అమ్మా ... నాన్నా మా వూరిలో ఉంటారని తెలుసుగా .... ఈ ఉద్యోగంలో ఆదివారం కూడా సెలవుండదు .... మా పిల్లలక్కూడా ఈ రెండు మూడు సంవత్సరాలు  కొంచెం ముఖ్యమైనవే.  ఒక షిప్ కెప్టైన్ గా ఆ భాద్యతలు కూడా సక్రమంగా నిర్వర్తించాలి.  గత రెండు మూడేళ్ళలో మా అమ్మా ... నాన్నలు   రెండు మూడు సార్లు మరణం అంచుల దాకా వెళ్ళారు. కానీ పక్కనే ఉన్న బంధువులు .... స్నేహితులు సమయానికి ఆదుకోబట్టి  ప్రమాదాలనుండి బయట పడ్డారు . కనీసం ఇక్కడ నా చుట్టుపక్కల ఉన్న పెద్ద వాళ్ళను నాకు అవకాశం ఉన్న మేరకు ఆదుకుంటే ..... అక్కడ నా తలిదండ్రులను ఎప్పటికీ ఎవరో ఒకరు అలానే ఆదుకుంటారని అనిపిస్తూ ఉంటుంది. ఈ నమ్మకానికి ఆధారం ఏమీ లేదు ....కేవలం నా ఫీలింగ్ అంతే ..... "