25, డిసెంబర్ 2014, గురువారం

మనం "PK" సినిమా ఎందుకు చూడాలంటే ......



దారిన పోతున్న వ్యక్తెవరైనా
“ అయ్యా మీ తల మీద బూజు ఉంది “ అన్నాడనుకుందాం.
 దాని వెనుకే కొన్ని  ప్రతిస్పందనలుంటాయి. నా ఆలోచన సవ్యంగా ఉంటే వెంటనే తల తుడుచుకుని
“థాంక్ యూ” అంటాను. లేదంటే
”ఏ ....నీ షర్ట్ వెనక ఇంత ఆయిల్ మరక ఉంది .....దాన్ని చూసుకో ముందు ....నా తల సంగతి నీకెందుకు ?” అని గయ్యి మంటాను. లేదంటే
“ఏరా....నీ కంపెనీ షాంపూ ని ప్రమోట్ చేసుకోడం కోసం వెధవ ప్రయత్నాలు చేయకు ....నేనెప్పుడూ కుంకుడు కాయలతోనే తలంటుకుంటాను. ఎక్కడి నుండో షాంపూలు పట్టుకొచ్చి మా మీద బలవంతంగా రుద్దుతున్నారు .....అయినా నా తల మీద బూజుంటే నీకెందుకు ?...పేడ ఉంటే నీకెందుకు ?” అని కూడా గయ్యిమనొచ్చు.

                                  కాకపొతే ఈ మూడు సమాధానాలలో ఏది సవ్యమైనదో విజ్ఞులైన పాఠకులు కే తెలుసు. ఇంత ఎందుకు రాయవలసి వచ్చిందంటే ఈ మధ్యే వచ్చిన  “పీకే “ సినిమా మీద జనాలలో ఈ 3 రకాల ప్రతిస్పందనలూ కనబడుతున్నాయ్.
తమకు మోక్షం ప్రసాదించమనీ .....తమ ప్రయత్నాల వలన పరిష్కారసాధ్యం  కాని సమస్యలకు పరిష్కారం చూపమనీ  సాధారణంగా సామాన్య మానవులు భగవంతుడిని వేడుకుంటుంటారు. దానికొక మార్గం చూపించేదే మతం. ప్రతి మతమూ ఎవరో ఒకరు ప్రవక్తతో ప్రారంభం అవుతుంది(ఒక్క హిందూ మతమే దీనికి ఎక్సెప్షన్). వారు ప్రతిపాదించిన మార్గం ఆనాటి సమాజం లోని అనేకానేక ముఖ్య సమస్యలకు పరిష్కారం చూపించింది కాబట్టే సామాన్య జనం దాన్ని అవలంబించారు అంతేకాదు పరిశీలించి చూస్తే ఒక విషయం అర్ధం అవుతుంది ఇంచుమించు అన్ని మతాలూ ప్రారంభంలో  ఆనాటి పాలక వర్గాలకు వ్యతిరేకంగా పనిచేసినవే . కానీ కాలక్రమేణా పాలక వర్గాలకు జనాలలో వీటికున్న ఆదరణ అర్ధం కాకపోదు. అప్పుడు పాలక వర్గాలు ఈ కొత్త మతాలకు మారడం జరుగుతుంది ...ఎందుకంటే అది వారి మనుగడకు ముక్ఖ్యం కాబట్టి. ఆ తరువాతే అవి పాలక వర్గాల ప్రయోజనాల కోసమే ఎక్కువగా పని చేస్తాయి. సూక్ష్మంలో మతాల ప్రస్తానం ఇదే. (దీనికి మాత్రం హిందూ మతం ఎక్సెప్షన్ కాదు ....హిందూ మతంలో ఇది చాలా ముందు గానే ప్రారంభం అయ్యింది.). ఈనాటి రాజకీయ పార్టీలకు సిద్దాంతాల జోలికి పోని లంపెన్ సైన్యం కావాలి. దానికి అనుగుణంగానే నేటి యువతను లంపెన్ భావజాలంతో ఉంచడానికి మతాల సాయంతో పాలక వర్గాలు చేస్తున్నాయి. దీనికి ఇప్పుడు కొత్తగా మీడియా కూడా తన వంతు సాయం చేస్తోంది. ప్రశ్నించే శక్తిని హరించేయడంలోనే వాళ్ళందరి క్షేమం ఉంటుంది. దీనినర్ధం చేసుకోలేకపోతే మన యువత పైన నేనిచ్చిన మూడు ఉదాహరణలలో కొట్టుమిట్టాడుతుంటారు. అంతే కాదు మతం పేరు మీద అనవసరంగా జరుగుతున్న అట్టహాసాలని సంధించే ప్రశ్నలను తెలివిగా భగవంతుడి ఉనికికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంగా అమాయక జనాన్ని చాలా సుళువుగా నమ్మించేస్తున్నారు. పైగా ఈ ప్రశ్నలు అడుగుతున్న వారిని ఒకరి అభిముఖంగా ఒకరిని నిలబెట్టి వీరు చోద్యం చూస్తున్నారు. కాబట్టి తెలివైన యువత చేయవలసిన మొదటి పని ప్రశ్నించడం ....
ఇప్పుడు మనం PK సినిమా దగ్గరకు వస్తే .......ఈ సినిమా ద్వారా మధ్యలో ఉండే బ్రోకర్ ల వంటి స్వామీజీలను మన మధ్య నుండి గెంటేసే ప్రయత్నం చేసిన అమీర్ ఖాన్ అన్ని విధాలా అభినందనీయుడు. ఈ సినిమాలో ఎక్కడ కూడా భగవంతుని ఉనికిని ప్రశ్నించ లేదు. కాబట్టే ఈ సినిమా లోని విషయం మీద దాడి చేయలేని వారు ఈ సినిమాని విమర్శించడానికి అమీర్ ఖాన్ మతాన్ని వాడుకుంటున్నారు. “సత్యమేవ జయతే” లాంటి ప్రోగ్రాం ను,”పీప్లీ లైవ్ “ లాంటి సినిమాను  రూపొందించిన మనిషి లోని చైతన్యానికి ప్రేరణగా  మతాన్ని చూపించడానికి మన వాళ్ళు ఏ మాత్రం సిగ్గు పడడం లేదు.
రోజూ మనం నడుస్తున్న రోడ్ కి కూడా కొద్ది కాలానికి మరమ్మత్తులు చేయవలసి వస్తుంది. మరి ఎప్పుడో పుట్టిన మతానికి అవసరం ఉండదా ? జనం దగ్గరకి మతాన్ని తీసుకు రావడానికి బమ్మెర పోతన లాంటి మహాకవులు ప్రయత్నం చేసినా దాన్ని పాలక వర్గాలు పట్టించు కోవు ....ప్రచారం చేయవు. నిజంగానే ఏ స్వామీజీ అయినా                                  
“గుడికొచ్చి ప్రార్ధన చేయడం కంటే సమాజానికి ఏదో ఒకటి చేయి ....అంటే వినాయక చవితి పందిళ్ళు వేయడం లాంటిది కాకుండా ......అవసరమైతే సిస్టం మొత్తాన్ని ఎదిరించి నిలబడు “ అని చెప్పగలరా ?.....
కాబట్టే కొన్నిటినైనా  ప్రశ్నించిన ఈ సినిమాని ఆహ్వానిద్దాం .......