చాలా కాలం తరువాత అయినవిల్లి లంక వెళ్ళాను.వెళ్ళిన కారణం బాధాకరమైనదే అయినప్పటికీ చాలా కాలం తరువాత ఆ రోడ్ లో ప్రయాణించడం చాలా ఆహ్లాదాన్నిచ్చింది. ఏదైనా వాహనం ఆగగానే పరుగుపెట్టుకొచ్చే పూలమ్ముకునే పిల్లలు వాళ్ళ చేతుల్లో ఉండే రంగు రంగు పూల దండలు....పేదరికంలో ఉన్నా నాలుగు గోడల మధ్యా జీవితం మొత్తం గడిపేసే చాలా రకాల ఉద్యోగుల కంటే వీళ్ళు చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది.వేమగిరి దాటగానే మొదలయ్యే నర్సరీలు హై వే మీద వెళ్ళే వాళ్ళకు కనువిందు చేస్తూ ఉంటాయి.అవి దాటగానే గోదావరి పలకరిస్తుంది.జొన్నాడ బ్రిడ్జ్ మీదుగా గోదావరి మాతకు "హలో" చెప్పుకుంటూ ముందుకు వెళ్ళగానే రావులపాలెం సెంటర్..కోనసీమ ముఖద్వారం.దానిని కూడా దాటుతున్నప్పుడు రోడ్ కు ఒక వైపు ఉండే కాలువ..వేరే వైపు ఉండే అరటి తోటలు అంతా అహ్లాదమే...కొత్త పేట రాకుండానే తగిలే జగ్గుపాలెం జంక్షన్ నుండి విడిపోయే ఇరుకు రోడ్ ముక్తేస్వరం వరకూ కాస్త ఇబ్బంది పెడుతుంది.ముక్తేస్వరం రాకముందే తగిలే అయినవిల్లి క్షేత్రం దేవాలయాలు....మొత్తానికి నాకు పెళ్ళైన మొదటి సంవత్సరం ఆషాఢానికి ఆ వూరు వెళ్ళిన దగ్గర నుండీ ఆ వూరు అంటే నాకు ఎప్పుడూ ప్రత్యేకాభిమానమే.అప్పటికే మా మామయ్యగారు ( మా శ్రీమతి కి చిన్నాన్న గారు అంటే పిన్ని గారి భర్త) యీ ప్రపంచాన్ని వీడి పది రోజులు కావస్తోంది కాబట్టి అందరి ముఖాల్లు కాస్త తెరిపిన పడ్డాయి.డెబ్భై నిండని ఆయన నిద్రలోనే యీ లోకాన్ని వీడడం మా అందరికీ ఎంతో బాధ కలిగించింది.తెల్లని పంచెలో ఉదయాన్నే చుట్ట కాల్చుతుంటే ఒక సంస్కృతికి ప్రతిబింబంగా కనబడేది.మా వూరు పట్టణానికి అత్యంత సమీపం లోనే ఉండడంతో మా వూరు..మా చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఉండే మిగిలిన బంధువుల ప్రవర్తనకూ యీయన ప్రవర్తనకూ తేడా స్పష్టంగా ఉండేది.అందులోనూ మా శ్రీను (మా శ్రీమతి పిన్ని గారి అబ్బాయి)మా శ్రీమతి కి అనుంగు శిష్యుడు కాబట్టి 2 రోజులు సెలవు పెట్టి మరీ ఆ వూరు వెళ్ళాను.
పెద్ద ఇల్లు. ఆ రోజుల్లో దగ్గర దగ్గర 15 అడుగుల ఫిల్లింగ్ చేయించి ఆ ఇల్లు కట్టారు.వరదలు ఆ వూరికి వచ్చి పోతుంటాయి కాబట్టి ఆ భయం లేకుండా ఉండడానికి అలా ఫిల్లింగ్ చేయించారు. చుట్టూ పెద్ద పెరడు. మా శ్రీను ఉద్యోగ రీత్యా తణుకు లో ఉంటాడు.ఇల్లంతా అద్దెకు ఇవ్వాల్సి వస్తుందేమో.అదే మాట మా శ్రీను తో అన్నాను.
"ఇప్పుడు అదే పెద్ద చిక్కు వచ్చి పడింది బావా..."
"యే..అద్దెకు యివ్వడానికి మీ అమ్మ ఒప్పుకోడం లేదా...."
"అదేమీ లేదు ..అద్దెకు ఉండే వాళ్ళే లేరు"
"ఇన్ని సదుపాయాలున్న ఇల్లు...కళ్ళకద్దుకుని ఉండొచ్చు కదా..."
"నీకొక్క సంగతి చెప్పనా బావా...మా వూరిలో పది సంవత్సరాల తరువాత మొన్న ఒక గృహప్రవేశ కార్యక్రమం జరిగింది."
"అంటే..."
" ఏమీ లేదు కరెక్ట్ గా చెప్పాలంటే ..మొత్తం మీద జనాభా పెరుగుతోంది...కానీ మా వూరు ..ఇదే కాదు ఈ పక్క ఉన్న లంకలన్నీ....నెమ్మదిగా ఖాళీ అవుతున్నాయి. "
"మరి వ్యవసాయం..."
"ఏదో టైం పాస్ కావాలంటే చేయాలి..."
ప్రహరీ గోడమీదుగా రోడ్ వైపుకు చూసాను. రాముల వారి కోవెల..పక్కనే పూజారి గారి ఇల్లు...కనుచూపు మేర కనబడుతున్న కొబ్బరి చెట్లు వాటి చాటున దాక్కున్నట్లుగా ఉన్న పెంకుటిల్లు....ఇక్కడ ఉండలేక జనం పట్టణాల వైపు పరుగు తీస్తున్నారు.బాధ వేసింది.
"కొబ్బరికాయకు రేటు లేదా..."
"ఉండొచ్చు..ఉండకపోవచ్చు..గారంటీ మాత్రం లేదు...నిజంగా చెప్పాలంటే పూర్తి గాలివాటం బ్రతుకులై పొయ్యాయి రైతులవి.."
"కానీ యీ స్వచ్చత...ఇవన్నీ టౌనుల్లో ఉండవు కదా శ్రీనూ..."
"నిజం బావా...నీవు చిన్నప్పటి నుండీ నన్ను చూస్తున్నావ్...నాకెప్పుడూ ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటూ బ్రతకాలనే ఉంటుంది.కానీ నా ఇష్టా ఇష్టాలకు నా పిల్ల భవిష్యత్తును పణంగా పెట్టలేనుగా." చాలా అవేదనతోనే అన్నట్లుగా అనిపించింది.
ఇంకా వేరెవరో అతిధులు వస్తే పలకరించడానికి శ్రీను వెళ్ళాడు.ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద కొబ్బరి డొక్కల ప్రోగు ఉంది.ఇంత కొబ్బరి ఇక్క్ద నుండి ఉత్పత్తి అవుతున్నప్పుడు ఇక్కడ పీచు పరిశ్రమల్లంటివి డెవలప్ చేయలేదెందుకో...
ఇంకొకటి అలోచిస్తుంటే చాల భయంగా ..బెంగగా అనిపిస్తోంది. నెమ్మదిగా ఈ గ్రామాలు ఇక కనబడవా...
భౌతిక పరిస్తితుల బట్టి వెళ్ళక తప్పదు.మన ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఆర్ధిక విధానాలబట్టే కదా భౌతిక పరిస్థితులు రూపు దిద్దుకొనేది.మనసులో అలోచనలు ముసురుకుంటున్నాయి.వంటవాడు వచ్చి తేవలసిన సామాన్ల లిస్ట్ ఇస్తున్నాడు.వింటుంటే అన్నీ పాత రకం కూరలే వినబడ్డాయి.ఆ తరువాత పంతులు గారు కార్యక్రమానికి కావలిసిన సామాన్లు చెప్పారు.ఇద్దరు కుర్రాళ్ళు బైక్ లు తీసుకుని రెడీ అయ్యారు.
శ్రీను మరలా వచ్చి కూర్చున్నాడు.
"వడ్డించడానికి కుర్రాళ్ళు నిలబడతారా...లేక దానికి కూడా బయటి వాళ్ళను పురమాయిస్తున్నావా?"
"లేదు ..ఇక్కడ కూడా సెల్ ఫోన్ లు వాడతారు కానీ మరీ అంత అర్ధం లేకుండా కాదు"
టీ లు వచ్చాయి.రాక రాక వచ్చాం..ఒక్క సారి ఎప్పుడో తిరిగిన గ్రామం కాబట్టి ఒక సారి పొలాల వైపు వెళ్ళడానికి తయారయ్యాను.
కేవలం మారిన అభిరుచులే ప్రజలను పట్టణాలవైపు పరుగెట్టుస్తున్నాయని అర్బన్ జనం అనుకొంటూ ఉంటారు.నిజాల లోతుల్లోకి ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు?"
పొలాన్నుండి ఇంటికి తిరిగి వచ్చ్హాను.
"ఎక్కడికి పోయావ్..నీకోసం ఇందాకడనుండీ సుజాత...పెద్ద కళ్ళ బుజ్జి ఎదురు చూస్తున్నారు." శ్రీమతి నా మాట కోసం ఎదురు చూడకుండా వాళ్ళను పిలవడం కోసం లోపలికి వెళ్ళింది. యీ పేర్లు విన్నట్లే గుర్తు.మనుషులు కూడా గుర్తుకు వస్తున్నారు.మొదట ఈ వూరు వచ్చినప్పుడు అంతా చాలా చనువుగా ....కలుపుగోలుగా ఉండే వారు.
"ఇడిగోనే మీ ప్రసాద్ బావ " శ్రీమతి మాట విని అటు వైపు చూసాను.శ్రీమతి కరెక్ట్ గానే కనిపించింది కానీ ఆ వెనుక ఉన్న సరీసృపాలు ఎవరు..? అంటే వీళ్ళే...అమ్మో ...ఇంతకూ కళ్ళజోడు పెట్టుకుని సన్నాగా ఉండే సుజాతెవరో...అదే మాట పైకి కూడా వచ్చేసింది.
"నేను చెప్పానా....ప్రసాద్ బావ నన్ను గుర్తుంచుకుంటాడని" ఒక సరీసృపం జవాబిచ్చింది.
హమ్మయ్య అనుకున్నాను
"బాగున్నావా సుజాతా..."పలకరించేసాను.
"ఒరేయ్....అన్నిటి నిండా నీళ్ళు నింపేయండి.ఉదయం మరలా కరెంట్ ఉండదు.
నిజమే కరెంట్ ఉండదు.
అక్కడ కూడా మా వాడి స్నేహితులు ఉన్నారు.
"రేపు స్కూల్ మానెయ్యరా...మరలా రేపు సాయంత్రం వైజాగ్ వెళ్ళిపోతాం కదరా.." మా వాడు బ్రతిమాలుతున్నాడు.
ఆ కుర్రాడికి కూడా మానెయ్యాలనే ఉన్నట్లుంది. వాళ్ళ నాన్న వైపు ఆశగా చూశాడు. అతడు నాకు తమ్ముని వరసే.
"ఒరేయ్...పెదనాన్న వాళ్ళు సిటీ లో ఉంటార్రా....అక్కడన్నీ మంచి స్కూళ్ళే ఉంటాయి.బాగా చదువు కోవచ్చు..కాబట్టి వాడు ఎన్నిరొజులు మానేసినా కవర్ చేసుకోగలడు"
నాకే బాధనిపించింది.జాలిగా పెట్టిన ఆ కుర్రాడి ముఖం లోకి చూడలేకపొయ్యాను.
చిద్రమవుతున్న పల్లె జీవితం. రైతులకు నిత్యం జీవన పోరాటం.రేసులో పాల్గొనాలనే ఆరాటం. కానీ అది వాళ్ళకు సాధ్యం కాదని వాళ్ళకు అర్ధం అవుతూనే ఉంది కానీ...ఏం చేయాలో తెలియని పరిస్థితి.
ఆ తండ్రి మాటల్లో అబద్దమేమీ లేదు.
పల్లెల్లో చదువు చెప్పరా...చదువుకు అర్ధమూ...పరమార్ధమూ మారిన పరిస్థితులు....
ఆ మధ్య " నువ్వు నాకు నచ్చావ్" అనే సినిమా బాగా హిట్ అయ్యింది. డానిలో హీరో ఒక చోట "పగలంతా పని చేసుకుని హాయిగా సినిమాకు వెళ్ళొచ్చి ..."అంటూ కోరికలు తగ్గించుకొని పల్లెల్లో కూడా సంతృప్తిగా ఎలా బ్రతకొచ్చో చక్కగా వివరిస్తాడు.ఆ రోజుల్లో ఆ ఒక్క దైలాగ్ కోసం ఆ సినిమా సీడీ కొని ఇంట్లో ఉంచుకున్నాను.
ఇప్పుడు కూడా ఆ మాత్రం సామాన్య రైతుకు అందుబాటులో ఉంటే వాళ్ళు ఆనందంగా జీవించేస్తారు.కానీ ఎలా...
నగరాల్లో.....పట్టణాల్లో ఉన్నవాళ్ళకు మాత్రమే రేస్ లో పాల్గొనే చాన్స్ ఉండేలా మన ప్రభుత్వ విధానాలు ఎందుకు రూపొందాలి?
అత్యంత ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్ చదవబొయ్యే వాళ్ళు సైన్స్ లేబొరేటరీ చూపకుండానే ఉత్తీర్ణులను చేసే కార్పొరేట్ కాలేజ్ లకు పర్మిషన్ ఎలా వచ్చింది?
రెండేళ్ళ జీవితాన్ని ఇంచుమించు సూర్యుడి ముఖం చూడనీయకుండా ...బాల్యం-యౌవనాల సంధి కాలాంలో విద్యార్ధులను పూర్తిగా సమాజానికి దూరంగా ఉంచి వాళ్ళలో అసంపూర్ణ వ్యక్తిత్వాలను ఎవరు పెంచుతున్నారు? యీ విధంగా చదువుతున్న వాళ్ళకు మాత్రమే అత్యున్నత ప్రొఫెషనల్ కాలేజ్ లలో సీట్స్ వచ్చె విధంగా మన విద్యా వ్యవస్థ ఎందుకు ఉండాలి?
కాలేజ్ లన్నీ యూనిఫార్మ్ గా ఉంటే గ్రామాలు...పట్టణాలు తేడా లేకుండా అసలైన టేలెంట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఉన్నత విద్యకు అవకాశాలు వచ్చేవి కదా...
ఇప్పుడు అందరికీ తెలిసిన ఒకే ఒక్క కామన్ విషయేమిటంటే ఏదోల నీవు ఏదో కార్పొరేట్ స్కూల్/కాలేజ్ లలో చదివితేనే టాప్ కాలేజ్ లలో సీట్ వస్తుందని.నీకు తెలియకుండానే నీవు రేస్ లోకి నెట్టబడుతున్నావు.
గిట్టుబాటు కాని వ్యవసాయాలూ చేస్తూ....కనీసం కరెంట్ ఉండని గ్రామాల్లో బ్రతికే బదులు చచ్చినట్లు రైతులంతా దొరికిన కౌలుకు తమ పొలాలని వదిలి అలవాటు లేని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ శవాల్లా బ్రతికే పరిస్థితులు ఏ ఒక్క రాజకీయ పార్టీ అన్నా గమనించిందా....
ఈ రేట్ రేస్ కు వ్యతిరేకంగా ఒక్క రాజకీయ పార్టీ అన్నా మాట్లాడే ధైర్యం చేస్తుందా?
మొత్తానికి జరగుతున్న విషయాన్ని కరెక్ట్ గా చెప్పాలంటే రైతుల చేత "పొమ్మనలేక పొగబెట్టినట్లు"గా గ్రామాలు ఖాళీ చేయిస్తున్నారు. వ్యవసాయం ఎవరు చేస్తారో పాలక వర్గాలకు కరెక్ట్ అంచనా ఉంది.గిరిజనుల చేత అడువులు....రైతుల చేత గ్రామాలు ఖాళీ చేయించే ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.
రాత్రి చాలా సేపు యీ విధమైన అలోచనా స్రవంతి నడుస్తూనే ఉంది. రేవుకి వెళ్దువుగాని లే ఇక అని శ్రీమతి మాటలకు మెలుకువ వచ్చింది.
పిల్లలెవరూ స్కూల్ మాన లేదు.బంధువులంతా పోగయ్యారనే ఆనందం వాళ్ళకు మిగల లేదు.భోజనాలయ్యాయి.కూరలు మాత్రం పాత సాంప్రదాయ కూరలే.చాలా బాగున్నాయ్. తిరిగి బయలు దేరాం.కానీ మా శ్రీను మాటలు మాత్రం నా చెవుల్లో ఇంకా గింగురుమంటూనే ఉన్నాయ్.
"నేను ఈ వూరిలో ఎందుకుండాలి?"