ఆ మధ్యనెప్పుడో మా మేనల్లుడు తను తీయాలనుకుంటున్న సినిమా ట్రైలర్ నాకు పంపించాడు. ఒక అమ్మాయి నడుచుకుంటూ మెట్లెక్కుతూ ఉంటుంది. ఎవడో ఒక యువకుడు లెన్స్ జూమ్ చేస్తూ ఆ అమ్మాయినే తెగ చూసేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి మెట్లెక్కుతూ ఉంటుంది ..... ఆ యువకుడు జూమ్ చేస్తూ చూస్తూనే ఉంటాడు. కొంత సేపటికి మన మీద దయతలచి ఒక్క డైలాగ్ ఉంటుంది .....
" మనసుకి నచ్చిందే చేయమని అందరూ అంటారు ..... కానీ నా మనసు నా దగ్గర ఉంటే కదా ...... "
ఈ డైలాగ్ విన్న వెంటనే మన ప్రేమైక జీవులందరూ ఉబ్బి తబ్బిబ్బై పోతారని ఆ దర్శకుడి అంచనా అన్న మాట .....
ఏదో కుర్ర కుంకలందరూ కలసి ఏదో అఘోరిస్తున్నారు కాబట్టి వాళ్ళ అపరిపక్వ మనసులని కొద్దిగా అర్ధం చేసుకోవచ్చు.
కానీ 70 వసంతాలు కళాకారుడిగా జీవించిన వ్యక్తి ఇంచు మించు ఆఖరి దశ లో తీసిన సినిమా కూడా ఇటువంటి అపరిపక్వతతో తీయడం చాలా శోచనీయం. స్వాతంత్ర్య పోరాటం సమయంలో సినిమా రంగం లోనికి అడుగుపెట్టిన కళాకారుడికి ఇచ్చిన నివాళి ఇదైతే మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక్కడున్న ఇబ్బంది ఏమిటంటే ..... అలాంటి కధలను తయారు చెయ్యాలంటే చాలా భూత ... వర్తమాన సామాజిక పరిణామం మీద అవగాహన ..... పరిపక్వత ...... నిజాయితీ ..... లాంటి లక్షణాలున్న కళాకారుల సమూహం కావాలి. కానీ ఇవన్నీ లేకుండానే ఏ పనికి మాలిన సబ్జెక్ట్ తో తీసినా హిట్ అయిపోయే పరిస్థితులలో విడుదల చేయడానికి సిద్దం చేయబడ్డ సినిమా కాబట్టి నిర్మాతలకు అంత రిస్క్ చేయవలసిన అవసరం లేకుండా పోయింది.
ఇక్కడొక ముఖ్యమైన విషయమేమిటంటే సినిమా హిట్ అవుతుందన్న గారంటీ ఉన్నప్పుడు ఒక ఉదాత్తతతో నిండిన సినిమాను ప్లాన్ చేయొచ్చు ..... పైగా ఒక్క సినిమా ఫెయిల్ అయినంత మాత్రాన సర్వం కోల్పోయే ప్రమాదం కూడా లేని నిర్మాణ సంస్థ ....... అయినా అలాంటి ప్రయత్నం చేయరు. ఒక ఉదాత్తతతో నిండిన కధ అంటే దాంట్లో సమాజం లోని చాలా పొరలను స్పృశిం చవలసిన అవసరం ఉంటుంది ..... దానికి కనీసం అలాంటి పొరలంటూ ఉంటాయని సూత్రప్రాయంగా అయినా తెలిసిన నటులు కావాలి. అలాంటప్పుడు ఒకే కుటుంబం లో(ఆగర్భ శ్రీమంతులు ) నుండి ఉద్భవించిన నటులు ఆ పాత్రలకు అతకకపోవచ్చు. కానీ ఒక గారంటీ గా విజయవంతమయ్యే అవకాశమున్న సినిమా ద్వారా తన వారసులని తారలుగా చేసే అవకాశాన్ని వ్యాపారాత్మకంగా విజయవంత మవుతున్న నిర్మాత ఎవరూ వదులుకోరు. ఈ విషయంలో నిర్మాతల వ్యాపార దక్షతను చాలా మెచ్చుకోవాల్సిందే. తండ్రికి కళాకారుడిగా ఉన్న ఇమేజ్ ని తన వారసుల భవిష్యత్తుకి కరెక్ట్ గా వాడగలిగిన నాగార్జున గారి వ్యాపార దక్షతకు కార్పొరేట్ ప్రపంచం జేజేలు పలకొచ్చు ...... కానీ నిజంగా ఒక కళాకారుడికి ఇలాంటి సినిమాతో వీడ్కోలు పలకవలసి రావడం నిజంగా తెలుగు ప్రజల దౌర్భాగ్యం .
..... ఈ సినిమా బాగోలేదంటే తమ యొక్క "క్లాస్ " ను ఎదుటి వాళ్ళు తక్కువగా అంచనా వేస్తారన్న భ్రమలో చాలా మంది ప్రేక్షక దేముళ్ళు ఉన్నారు ..... వారిలో కొంతమందైనా కళ్ళు తెరవాలనే ఆశతో .....