7, జులై 2013, ఆదివారం

.ఓ మహర్షీ ..ఓ మహాత్మా.........

    నా చిన్నప్పుడు మా నాన్న గారు వీరవరం అనే గ్రామంలో మేష్టారి గా పని
చేస్తున్నప్పుడు ఆయన పక్క గ్రామమైన కడియం లో  తన స్నేహితుల  దగ్గరకు వెళ్ళినప్పుడుల్లా నన్ను కూడా తన సైకిల్ మీద కూర్చోపెట్టుకుని తీసుకుని వెళ్ళేవారు.కానీ వూరి ప్రారంభంలోనే ఉన్న లైబ్రరీ  లో నన్ను వదిలి వెళ్ళేవారు.ఆ విధంగా నాకు పుస్తకాలతో  స్నేహం ప్రారంభమయ్యింది. అదెలా పరిణమించిందంటే దొరికిన ప్రతి పుస్తకాన్నీ నమిలెయ్యడమే.. సరిగ్గా  తెలిసీ తెలియని వయసు లోనే నాకు మా తాతయ్య గారి ఇంట్లో ఒక పాత సినిమా పత్రిక దొరికింది. బహుశా దాని పేరూ అదే కావొచ్చు వేరే  ఏదైనా కూడా కావొచ్చు....కానీ దానిలో ఒక సమీక్ష కొనసాగింపు ఉంది. బహుశా  దానికి ముందు సంచికలో "పాండవ వనవాసం"  సినిమాలో అరణ్యవాసానికి  వెళ్తున్న సన్నివేశంలో  భీముని పాత్ర ధారి ఐన రామా రావు గారి నడక మీద  సునీత గారనే ఆవిడ దుమ్మెత్తి పోసారు.(అది వాస్తవమేనని ఇప్పుడు కూడా ఆ సినిమా చూస్తే అర్ధం అవుతుంది).ఇది నాకు అక్షరాలు  చదవడం వచ్చిన కొత్తలో చదివిన పుస్తకం.ఆ తరువాత సంచికలో ఆమె మీద చాలా మంది విమర్శలు గుప్పిస్తూ ఆ సినిమా సాధించిన బాక్సాఫీస్ విజయాన్ని  ప్రస్తావించారు. కానీ అప్పటికే మన వాళ్ళకు నిజాలను అంగీకరించగల సంస్కారం కంటే వెర్రితలలు వేసే వీరాభిమానం పెరిగి పోయి ఉండొచ్చు. నేను చదివిన సంచికలో ఆమె (సునీత గారు) ఒక్కటే సమాధానం ఇచ్చారు. అదే సంవత్సరంలో రిలీజ్ ఐన "సత్య హరిశ్చంద్ర" పెద్దగా విజయం సాధించక పోవచ్చు అంత మాత్రం చేత ఆ సినిమా బాగా లేదని అనలేమంటూ ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పారు. అదేమంటే పాండవ వనవాసం సినిమా ని పొగడడం మాత్రం దిగజారుతున్న కళా ప్రమాణాలకు నిదర్సనమని. 


    కానీ నిజాయితీగా ఆలోచిస్తే ఒక్క విషయం అర్ధం అవుతుంది....ప్రమాణాలు పడిపోలేదు సమాజంలో ఉన్నాయి కానీ వాటిమీద మీడియా అనే మబ్బు కమ్మేసింది.1992 వరకూ టీ.వీ లో ఒక్క చానల్ మాత్రమే ఉన్నప్పుడు ప్రోగ్రాంస్ మీద లెక్క లేనన్ని జోక్స్ ఉండేవి. దానిలో కొంత వాస్తవం ఉండొచ్చు. కానీ చిరస్మరణీయమైన సీరియల్స్ ఆ కాలంలో వచ్చినన్ని ఇప్పుడు అన్ని చానళ్ళు కలిపి చూసినా రావడం లేదు.నాకు గుర్తున్నంత వరకు 1992 లొ ప్రైవేట్ చానళ్ళు ప్రారంభమయ్యాయి.ముఖ్యంగా "యీ'  టీవీ స్టార్ట్ కాగానే చాలా మంది తెలుగు ప్రేక్షకులు యేవేవో వూహించుకున్నారు. అభ్యుదయ రచయితలు కూడా చాలామంది వెళ్ళారని చెప్పుకునే వారు. కానీ గోడకు కొట్టిన బంతుల్లా వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లు వెనక్కు రావడానికి ఎంతో సమయం పట్ట లేదు.ఆ తరువాత పొడి పొడి మాటలు కూడా ఈ  టీవీ ద్వారా మహా కవిత్వంగా ప్రాచుర్యం పొందడానికి ఎంతో సమయం పట్ట లేదు.ఒక విధంగా చానల్ ఒకటి చేతిలో ఉంటే చాలు తిమ్మిని
బమ్మి చేయొచ్చన్న తెలివి తేటలను ప్రత్యర్ధులకి నేర్పింది శ్రీ రామోజీ రావు గారేనేమో..అలా మొదలైన తెలుగు మీడియా ప్రస్థానం మరింత లోతుల్లోకి దిగజారుతూనే ఉంది. న్యూస్ రిపోర్ట్ చేసే వారి మీద న్యూస్ తయారు చేసే వారి ఆధిపత్యం నడుస్తోంది.నిజాలను ప్రజలకు చెప్పే కంటే తాము చెప్పవలసిన దానికే మసి బూసి మారేడు కాయ చేసి యానిమేషన్ టెక్నిక్లతో  అసలు విషయాన్ని  మరుగున  పడేటట్లు చేస్తున్నారు.
    మనకు భ్రష్టు  పడుతున్న రెండు రంగాలు ఉన్నాయి. (వేరు కుళ్ళుతున్నప్పుడు కాండాలు ..కొమ్మలూ కుళ్ళడం  చాలా సహజం). దేన్నీ విడివిడిగా చూడలేం. ఒక రంగం భ్రష్టు పడుతున్నప్పుడు అదే రంగం సమాజానికి మార్గదర్శిగా   పనిచేసే  రోజులనాటి  విషయాలు పదే పదే చూపించడం ద్వారా కనీసం యీ తరాలకు కొంత మార్గ నిర్దేశకత్వం చేయడం జరుగుతుంది.మన పూర్వీకులు యెన్నెన్ని త్యాగాలు చేస్తే మనం యీనాడు యీ స్థితిలో  ఉన్నామో యీ తరాలకు చెప్ప వలసిన అవసరం లేదా....? పాఠకుల  సంఖ్య తగ్గి ప్రేక్షకుల సంఖ్య పెరుగుతున్నప్పుడు ఆ బాధ్యత మీడియా మీద ఉంటుంది. కానీ వారు పాటిస్తున్న విలువలకు ఉదాహరణ ఒకటి చెబుతాను. హైదరాబాద్ లో నగర శివార్లలో ఒక అమ్మాయి హత్యకు గురయ్యింది. చానల్ వాళ్ళందరూ చేరారు. పోలీస్ వారి చుట్టూ చేరారు. వాస్తవాలు కారణాల గురించి అడుగుతున్నారు. అంత వరకూ బాగానే ఉంది. మామ్మూలు ప్రశ్నలు అడిగితే టీ.ఆర్.పీ రేటింగ్ ఎందుకు పెరుగుతుంది? ఒక రిపోర్టర్ మరింత ఉత్సాహంగా అక్కడున్న పోలీస్ ఇన్స్పెక్టర్ ని " యీ హత్య జరగక ముందు యీ అమ్మాయి మీద అత్యాచారం లాంటిది జరిగి ఉంటుందని భావిస్తున్నారా...?" అని అడిగింది. దిగజారుడుకు ఇంతకంటే నిదర్శనం  అవసరం లేదనుకుంటున్నాను.
   
    45 సంవత్సరాల క్రితం నాటి ఆ విమర్శ యీ నాటికీ నాకు గుర్తుండి పోడానికి ఇప్పుడు వేరే కారణాలు చెప్పనక్కర లేదు.ఆనాటికే సూపర్   స్టార్ ఐన రామా రావు గారి నటన లో లోపాలను ఒక్క విమర్శకురాలు రాస్తే  ఒక చిన్న సినిమా పత్రిక ప్రచురించింది. దాని మీద చర్చ నడిచింది. కానీ ఇన్ని చానల్లలో అనేక చర్చలు జరుగుతున్నాయి....ఫలితం ఏమిటంటే మొత్తం సమాజంలో సిద్దాంతాలంటూ  ఏమీ లేవని ప్రజలు భావించుకునే స్థితికి దిగ జార్చారు.

"నీవెందుకు అలా వర్రీ ఐపోతావు...వ్యాపారం కోసం పెట్టుకున్న వాడు వాడి ప్రయోజనాలు చూసుకుంటాడు...అది సహజం కూడా. నీవు చెబుతున్న సినిమాలకు అవార్డ్ లు ఇస్తే ఆ చానళ్ళ టీ.ఆర్.పీ రేటింగ్ ఎక్కడి కెళ్తుందో నీకేమైనా తెలుసా..." ఒక రోజు మా మూర్తి నా మీద గయ్యి మన్నాడు.

"వాళ్ళిష్టం   వచ్చింది ప్రచారం చేసుకోమను మూర్తీ కానీ అదే ఆదర్శమన్నట్లు మాత్రం చెప్పవద్దను..... వాతావరణానికి హాని కలిగించేదేదీ వాడని ఆర్చిడ్ హోటల్ ను బ్రోతల్ పనులు కూడా నిరాటంకంగా చేయనిచ్చే హోటల్ ను ఒకే గాటన కట్టేస్తే .....ఏ విలువలూ  నేర్పకుండా కేవలం గారాబంతో పెంచి ...ఆ తరువాత పుటుక్కున ఏ ఫేస్ బుక్ లోనో పరిచయమైన వాడిని పెళ్ళి చెసెసుకుంటుంటే తలిదండ్రులు లబో దిబో మంటున్నారు. అప్పుడు కూడా విలువలు నేర్పని విషయాన్ని పరిగణన లోనికి తీసుకోలేక పోతున్నారు. ప్రేమకు కూడా ఒక పునాది ఉంటుంది. గాలిలో దానిని నిలబెట్టలేము. మనం పాటించే విలువలే దానికి పునాదిగా పనిచేస్తాయి. ఇదే సూత్రం సమాజానికి కూడా వర్తిస్తుంది. పోలీస్ డ్యూటీ దొంగని పట్టడం...అలాగే అది పేపర్ కావచ్చు ...చానల్ కావచ్చు ...కానీ ఓవరాల్ గా దానినుండి ఎక్కువగా ఆశించేది మాత్రం కాస్తో కూస్తో మార్గ దర్శకత్వమే.

    పల్లెలతో సహితంగా రోడ్లకడ్డంగా పందిళ్ళు వేసి "డాన్స్ బేబీ డాన్స్ " ప్రోగ్రాం లు పెట్టగలుగుతున్నారంటే అది మీడియా చలవేనంటే కాదనే వాళ్ళుండరేమో....రోడ్ల మీద డాన్స్ వేయాలంటే "జయ భేరి", "విప్రనారాయణ" పాటలు పనికి రావు కదా....ప్రజలు ఆదరించడమన్నది ఒక్కటే ఎప్పుడూ గీటు రాయి గా పనికి రాదు. యీ తరహా ప్రోగ్రాంస్ అన్నీ ప్రమోట్ చేసే వాళ్ళంతా
ప్రభుత్వం తరపునుండి అభ్యతరాలు లేక పోతే ఇంకా నీచాతి నీచమైన వ్యాపారాలు కూడా చేయడానికి వెనుకాడరేమో అనిపిస్తుంది.ఎందుకంటే వీళ్ళంతా పనిగట్టుకుని విలువలు ధ్వంసం చేస్తున్నారు.

    రూపాయి విలువ పడిపోడానికీ .....పేదవాడి జీవితానికీ సంబందం ఏమిటి...ఆర్ధిక నేరాగాళ్ళు క్రీం  మొత్తం మింగేస్తూ ..మెతుకులు విసిరి పేదలను....ఆర్ధిక వ్యవస్థనూ ఎలా భ్రష్టు పట్టిస్తున్నారు..లాంటి విషయాల కంటే  కొన్ని చిన్న చిన్న ముఠాలకు సంబందించిన  సినిమాల ఆడియో ఫంక్షన్ లు...విజయోత్సవాలు....నాగార్జున గారి గురించి అక్కినేని నాగేస్వర రావు గారి పొగడ్తలు...నాగ చైతన్య గురించి నాగార్జున గారి పొగడ్తలు ...అలాగే పేరు పేరునా చెప్పక పోయినప్పటికీ మిగిలిన సినిమాల కుటుంబాల వారు వారి వారి వారసుల గురించి చెప్పుకునే గొప్పలు.....వీటితో నిండి పోతోంది  చానళ్ళ టైం ......

    సమాజంలో ఉంటున్న ప్రతి వారికీ సుఖంగా బ్రతకాలనే కోరిక సహజం. కానీ దాని కోసం యేమి చేయాలో కూడా స్పష్టత కావాలి కదా... మనకు సినిమాల ఆడియో ఫంక్షన్ లు ముఖ్యమా.....మన పిల్లలకు ఉద్యోగాలు ముఖ్యమా... ఉద్యోగాలు ముఖ్యం అయినప్పుడు
అవెందుకు రావడం లేదు....రావాలంటే పారిశ్రామిక అభివృద్ది కావాలి...కావడం లేదంటే కారణాలు ఏమిటి....మనం కడుతున్న టాక్స్ లు ఎక్కడికి వెళుతున్నాయి. కాగ్ రిపోర్ట్ ప్రకారం ఒక్క జల యజ్ఞం ప్రాజెక్ట్ లోనే 22000కోట్ల ప్రజా ధనం వృధా అయ్యింది.దీనికి కారణం ఎవెరు? కొన్ని విషయాల గురించి అనవసరమైన వాదోపవాదాలు అనవసరం.అలాగే  యీ.డీ.  డిపార్ట్మెంట్ కొన్ని కోట్ల  రూపాయలను రికవర్ చేసింది.అది ఖరారైన వార్తే కదా... దాని మీద వాదోప వాదాలు ఎందుకు. అది ప్రచారం చేసి వదిలేయడానికి బదులు దాని మీద స్టూడియోలలో గంటల తరబడి చర్చలు ఎందుకు..?  ప్రజలను తప్పు దోవ పట్టించడానికి తప్ప.

    ఇప్పుడున్న మీడియా మీద ప్రజలకున్న అభిప్రాయం తెలియాలంటే నాకెదురైన ఒక యదార్ధ ఘటనను ఇక్కడ చెప్పాలి. మా కాంట్రాక్టర్స్ దగ్గర ఇంజనీర్ గా పనిచేస్తున్న అమ్మాయి ఆత్మ హత్య చేసుకుందని ఉదయాన్నే ఫోన్ వచ్చి ఆ వూరు పరిగెట్టాం. అది విజయనగరానికి ఆనుకుని వున్న చిన్న పల్లెటూరు.అయినప్పటికీ త్వరగానే చేరాం.అప్పటికే శవాన్ని తీసుకెళ్ళి కాల్చేసారు.
పెద్దవాళ్ళను కలిసి కారణాలు.అడిగాము. కడుపునొప్పితో చనిపోయిందన్నారు.ఎందుకో మాకు నమ్మ బుద్ది కాక ఆ అమ్మాయి కుటంబీకులని తరచి తరచి అడిగాం.ఆ అమ్మాయి బాబాయ్ అనుకుంటా మమ్మలని పక్కకు తీసుకెళ్ళాడు.

"సార్ మీరంతా ఆ అమ్మాయిని మీలో ఒకరిగా చూసుకున్నారు.మీ దగ్గర అబద్దం ఆడడం మహా పాపం.నిజానికి తను ఆత్మ హత్య చేసుకుంది...చానల్ వాళ్ళకు తెలిసి నానా విధంగా ప్రచారం చేస్తారని ఉదయాన్నే శవాన్ని తీసుకెళ్ళి పోయాం సార్..మీలో ఒకమ్మాయిని కడసారి చూసే అవకాశం లేకుండా చేసాం.యేమీ అనుకోకండి సార్" అంటూ బావురు మన్నాడు.

యీ విషయం ఒక వార్తగా ప్రచారం చేయడంలో తప్పేమీ లేదు...నేను మొదట్లో చెప్పినట్లు యే న్యూస్ ఐటం లేనప్పుడు ఇటువంటి సంఘటనల ఆధారంగా న్యూస్ అల్లబడుతోంది.  మన కొంప ముంచుతున్న విషయాల పట్ల నిర్లిప్తత యేర్పడేటట్లు చేయడం లో కూడా మీడియా తన వంతు పాత్ర తను చక్కగా పోషిస్తోంది. ఒక టెర్రరిస్ట్ తుపాకీ లోని బుల్లెట్ల వలన కొంత మంది అప్పటికప్పుడు చనిపోతారు. ఆ వార్త ప్రచారం చేయడంలో ఉన్న శ్రద్ద ఆర్ధిక నేరగాళ్ళ గురించి ఆ నేరాల ఫలితాల గురించి ఉండదు.ఏక్సిడెంట్ అయ్యి చనిపోడానికి ....కాన్సర్ తో గాని యెయిడ్స్ తో కాని కృశించి  చని పోడానికి ఉన్న తేడా  లాంటిదే ఇది కూడాను. ఆర్ధిక నేరాల వలన సమాజం నెమ్మదిగా నిర్వీర్య మవుతుంది. చని పోతున్నట్లు పేషెంట్ కు అర్ధమయ్యేసరికి కంట్రోల్  అతడి చేతుల్లో లేకుండా పోతుంది.  ఎందుకంటే చాలా వరకూ యీ నేరగాళ్ళంతా  ఏదో ఒక రాజకీయ పార్టీ వారు అయి ఉంటారు. నిజంగా ప్రజలను చైతన్య వంతులను చేసే బాధ్యత మీడియా తీసుకుని ఉంటే 2జీ రాజా తీహార్ జైల్ నుండి చెన్నై రాగానే అంత స్వాగతం లభించి ఉండేది కాదు.అమెరికా లో యీ మద్యే శిక్ష  విధించబడిన రజత్ గుప్తా కేస్ ఒక్క సారి చూడండి. అతడి ప్రాసిక్యూషన్ పట్టిన సమయమెంతో కూడా చూడండి.
               ఇక్కడి డబ్బు విదేశాలకు ప్రయాణం చేసి మరొకరి ద్వారా ఇక్కడి కంపెనీ లలో పెట్టు బడి పెట్టబడిగా మారింది.అంటే ఇది యెన్నెన్నో దారుల్లో ప్రయాణించిందని అర్ధమవుతోంది. కొన్ని దేశాల్లో ఉండే మాఫియా సహకారాలు కూడా దీనికి లభించి ఉండొచ్చు. యీ విషయాల మీద ఎన్ని చానళ్ళు దృష్టి పెడుతున్నాయో తెలియదు.

    ఇక్కడొక చిన్న విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఎన్నెన్నో సమస్యల మీద ఎన్నో కోణాల్లో రాయబడిన సాహిత్యం మనకు ఉంది. వాటిని సీరియల్స్ గా తీసే ఔన్నత్యం మన చానళ్ళకు లేదు కానీ ఒక హిందీ విజయవంతమైన సీరియల్ ని తెలుగులో అనువదించారు. సామాజిక చైతన్యం కొన్ని జీవితాలను యెలా మారుస్తుందో చూపించిన ఆ సీరియల్ చక్కగా విజయవంతమయ్యింది. కాబట్టి ఇక్కడ అర్ధం చేసుకోవలసింది ఏమిటంటే ప్రేక్షకుల చైతన్యం కంటే చానళ్ళ వాళ్ళ స్థాయి చాలా తక్కువని.

    మా మూర్తికి అన్నీ విచిత్రమైన సందేహాలొస్తాయని ఇంతకు ముందు విన్నవించుకున్నాను.
" మన రూల్స్ కాస్త రిలాక్స్ చేసి కసబ్ కు కూడా చానల్ ...పత్రిక పెట్టుకునే చాన్సిచ్చి చూడవలిసింది బాస్....అలాగే అతడి కుటుంబ సభ్యులను కూడా పాదయాత్రలకు అనుమతిస్తే పాపం వాళ్ళు కూడా మా వాడు చాలా అమాయుకుడు కోర్ట్ లే అన్యాయంగా శిక్ష  విధించింది అని  ప్రచారం చేసుకుంటుంటే కొత్తగా పదవుల్లోకి రావాలనుకునే వాళ్ళు వాళ్ళకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు తగిల్స్తుంటే పిచ్చి వెధవల్లా మనం చూస్తూ ఉండేవాళ్ళం కదా.....  " అంటుంటాడు 
                  యీ క్రింది లింక్ లోని ఆర్టికల్ చదివితే మూర్తి ఏమంటాడో...



http://www.mediacrooks.com/2012/01/medias-mask-of-morality.html#.UdmW4q54g3t