29, మే 2011, ఆదివారం

ఇలాగూ బతకొచ్చు

చదివే ముందు ఒక చిన్న విన్నపం ....సి అనేది ఒక ఉదాహరణ గానే తీసుకున్నాను కానీ .సి లు వాడే వారందరినీ విమర్శించాలని మాత్రం కాదని అర్ధం చేసుకోగలరు...

"
చూడమ్మా..హరి బాబూ....అక్కడెవరో...చేపలు పడుతున్నలున్నారు....." బ్రిడ్జ్ దగ్గర నుండి దూరంగా చేపలుపడుతున్న వాళ్ళను చూసి అడిగాను.
నేను అన్నదే తడవుగా మా సూపర్వైజర్ హరి బాబు రెచ్చి పొయ్యాడు.
"అవును సార్... నిజంగానే ...పట్టేస్తున్నారు...నా కొడుకులు'
నా ఉద్దేశ్యం అతనికి అర్ధం కాలేదని నాకు అర్ధమయ్యింది.
" చూడు వాళ్ళు పట్టుకుంటే పట్టు కొనియ్యి ..కానీ ఒక్క సారి వాళ్ళని ఇటు పిలు ..కొంచెం మాట్లాడాలి..." వాళ్ళతో నేనేడీల్ చేస్తే బాగుంటుందని అనిపిచ్చింది.
పట్టిన చేపల బుట్టలతో వాళ్ళు వచ్చారు.
" చూడండి బాబూ మీ దగ్గర ఏమేం ఉన్నాయి....'
వాళ్ళు భయం భయం గానే ఒక ఖాళీ సిమెంట్ సంచి మీద మొత్తం ఓంపారు.
ఫ్రెష్ గా పట్టినవి కాబట్టి మిల మిల మెరుస్తున్నాయి.
" పెద్దవి ఏమీ పడ నేదు బాబూ"
సంజాయిషీ గానో ....మీకు పనికి రావట్టుగా అన్నారు
కానీ నిజానికి నాకు కావలిసింది అలాంటివే.....సెలవులుకి వచ్చిన మా అమ్మాయికి వాటి కూర చాలా ఇష్టం.

" సరేలే కానీ ఇవన్నీ ఎంతకిస్తారు ..'
వాళ్ళు ఇద్దరూ ముఖ ముఖ ముఖాలు చూసు కొంటున్నారు
" నూట యాభై ఇప్పించండి బాబూ..."
" అమ్మ నాకొడకల్లారా...రైల్వే ఏరియా లో చేపలు పట్టేసి రైల్వే సార్ కే అమేస్తార్రా...' మళ్ళీ మా హరి బాబు కేకలు
నీళ్ళు ....జలచరాలు వాళ్ళవేనని ఇతడికి ఎప్పటికీ అర్ధం కాదని నాకు తెలుసు.
' రెండు కేజీలు ఉంటాయి కాబట్టి ...వంద రూపాయలు ఇస్తాను..."
మా హరి బాబు కి తృప్తి గా లేదు
" సరేలే శుభ్రంగా చేసేసి వెళ్లి పొండి..." ఎంతో కొంత గిల్లిన తృప్తి..పక్క పొలం లో మిరప కాయలు ,టమాటో పంటలు ఉన్నాయి ...వాటిని కూడా తెచ్చి కూర వండేయమని అడగనందుకు సంతోషం కలిగినా అలా వండుకు తింటే యెంత బాగుంటుందని అనిపించింది . చక్కగా పారుతున్న నీరు...చెట్లు...వేడి వేడి అన్నం ..దాని లోకి చేపల కూర....
అసలు మనకు సరిగ్గా మనసు ఉంటె ఎక్కడైనా తృప్తిగా ఉండొచ్చు ..చిన్న పాటి ఆదాయం ఉండాలి గానీ అనిపిచ్చింది..of course కొత్త మోడల్ కార్ల గురించి ...బాలే దీవి లో ఉండే అందాల గురించి అహర్నిశం చర్చించే నా స్నేహితులందరికీ నాది పిచ్చి ప్రేలాపన కిందే అనిపిస్తుంది..
చాలా మందికి అసలు సమస్య అర్ధం కాదు. ఎవరైనా సరే వారికి దేని వలన ఆనందం కలుగుతుందన్న విషయాన్ని సరిగా తెలుసుకో లేక ఎక్కడెక్కడో దేనికోసమో దేవులాడుతుంటారు.కాక పొతే డబ్బుంటే చాలు సుఖం ఉంటుందన్న సిద్దాంతం మాత్రం కామన్ గా అందరిలో వ్యవస్థీకృత మై పోయింది. అసలు అది యెంత వరకు అవసరం ..దాన్ని సంపాదించడానికి మనం ఎన్నుకున్న మార్గాన్ని బట్టే మన సుఖ సంతోషాలు ఉంటాయన్న వాస్తవం చాలా మందికి అర్ధం కాదు.
అందరూ ఇలా ఆలోచిస్తే ఉత్పత్తి అవుతున్న వస్తువులు ఎవరు కొంటారు?..
.నా ఆలోచనా పరిధిని మరి కొంత పెంచుదామని పిస్తోంది..
అసలు మన కొంటున్న వినిమయ వస్తువులు అందరికీ అవసరమే...
కొన్ని వస్తువుల ఉత్పాదనకి ..వాటి వినిమయానికి ...వాటిలో వుండే వైరుధ్యాల గురించి కొంత ఆలోచిద్దాం. రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒక వినిమయ వస్తువుగా అందరూ కొంటున్న .సి గురించి ఒక్క సారి ఆలోచిద్దాం. వేడిని తట్టుకో లేక మనం దీనిని కోనేస్తున్నాం. కానీ అది మన గది లో వేడిని తగ్గిస్తుంది కానీ వాతావరణం లో వేడిని పెంచుతుందా లేదా...అంటే డబ్బులుండి .సి. కొనగలిగే వారి వేడిని అది కొన లేని పేద జనం భరిస్తున్నారన్న మాటే కదా . అంతే కాదు..అవి రిలీజ్ చేసే ఫ్లోరో కార్బన్ కణాల మాటేంటి? దాని వలన నాశనం అవుతున్న ఓజోన్ కణాల వలన వస్తున్న రేడియేషన్ ఫలితాలు ఎవరు భరిస్తున్నారు...ఇవన్నీ ప్రభుత్వాలకు తెలియవా..
నేననేది ఒక్కటే డబ్బున్న వారికి దానిని అనుభవించే హక్కు ఉంది . కానీ దాని వలన వేరే వాళ్ళను ఇబ్బంది పెట్టె అధికారం వాళ్లకు ఎవరిస్తున్నారు? నేను రాసింది ఒక్క ఇంకా చాలా విషయాలకు వర్తిస్తుంది. అకారణంగా కార్లలో కూడా మితిమీరిన . సి. లు వాడడం ఫ్యాషన్ అయి కూర్చుంది. మనం శరీరానికి ...మనసుకి కష్టం వోర్చుకొనే శక్తిని దూరం చేస్తున్నాం. పట్టణాల్లో వృధా చేస్తున్న ఎలెక్ట్రిక్ పవర్ ను పల్లెలకు మళ్ళించాలేమో.... అసలు ఒక ఏ.సి కి ఎన్ని లైట్స్ వెలుగుతాయి? పల్లెల్లో పూర్తి పవర్ సప్లయ్ వుంటే వాళ్ళలో సాగిన వాళ్ళు ..పట్టణాలకు వలస పోయే ఆలోచనలు చేయరేమో...మొత్తానికి వ్యవస్థంతా ఎలా తయారయ్యిందంటే నీకు డబ్బుంటే చాలు ... కష్టం లేకుండా బ్రతికేయ వచ్చు. అందుకే మార్గంలో అయినా సరే డబ్బు సంపాదించడమే అందరి ధ్యేయమై కూర్చుంది. అలా కాకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ పద్ధతులకి పెద్ద పీట వేస్తె ప్రజలు కొంత వరకైనా పాటిస్తారేమో ...కనీసం ప్రభుత్వ అధికార భవనాలు...అధికార్ల నివాస,విశ్రాంతి భవనాలైనా ప్రత్యామ్నాయ పద్దతులలో( గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ ) నిర్మించి ...సి. అవసరం లేకుండా సహజ సిద్ద మైన చల్ల ధనంతో ఆనందంగా ఉండొచ్చు అని నిరూపించ వచ్చు. ముందు నిజాయితీ విధానాలు అమలు పరిచే వారిలో వుండాలి. ఇవన్నీ అమలు పరిస్తే వాళ్లకు .సి లు ఉండవు కదా...
మన దేశం అనేక మతాల ..జాతుల...వర్గాల..పొరల మిశ్రమమని అందరికీ తెలుసు. రోడ్ మీద కార్ లో వెళ్ళే వాడికి సైకిల్ మీద వెళ్ళే వాడు అడ్డు వచ్చినంత మాత్రాన కోపం తెచ్చేసు కోవలసిన అవసరం లేదనీ...అందరికీ రోడ్ మీద హక్కు ఉందనీ ...ఎదుటి వాడు తప్పు దారిలో వెల్లితేనే నీకు అడిగే హక్కు ఉంటుందని గుర్తించాలి. కాస్త సర్దుకు పోయే స్వభావం ఉంటే అంతా సుఖంగా గడపొచ్చనే వాస్తవాన్ని పిల్లలకు ఎవరూ నేర్పరు
సరి కదా ఎదురుగా ఘోరాతి ఘోరమైన అన్యాయాలు జరుగుతున్నా నీకెందుకు అన్నట్లుగా తప్పించుకునో...వదిలించుకు రమ్మనో చెబుతారు.
అందుకే పిల్లలను ఒక ఖచ్చితమైన ఐడియాలజీ తో పెంచడం చాలా అవసరం. ఒక ఖచ్చిత మైన ఐడియాలజీ వున్న వాడికి ఫ్రెండ్స్ ని వెదుక్కో వలసిన అవసరం వుండదు. ఆ ఐడియాలజీ తో మ్యాచ్ అయ్యే వాళ్ళు సహజంగా ఫ్రెండ్స్ అయి పోతూ ఉంటారు. ఏ ఐడియాలజీ లేని వాళ్లకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఆ
ఫ్రెండ్ షిప్ కు బలమైన పునాది ఉండదు. " నీ వలన ఎవ్వరూ ఇబ్బంది పడకుండా చెక్ చేసుకో చాలు" అని చిన్నప్పటి నుండీ పిల్లలకు అలవాటు చేయండి చాలు..వాడు ఖచ్చితంగా మంచి పౌరుడు గా తయారౌతాడు. కానీ ఇప్పుడు తలిదండ్రులకు తమ పిల్లలకు మంచి పౌరులుగానో..మంచి వ్యక్తిత్వం వున్న వాళ్లుగానో తయారవ్వక పోయినా ....మంచి సంపాదనా పరులుగా తయారైతే చాలు. చాలా సున్నితమైన విషయాలను భావి తరాల వారికి అర్ధమయ్యేలా చేయడంలో ఇప్పుడున్న జెనరేషన్ ఫెయిల్ అవుతున్నదనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎనభై సంవత్సరాల క్రితమే చలం లాంటి మహోన్నత రచయితలు తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసినా మనం ఎక్కడకు వెళ్తున్నామో తెలియడం లేదు. లేదంటే ఒక ఐఐఎం విద్యార్ధి తన భార్యను అనుమానించి హత్య చేయడమేమిటి...? అంటే ఆ తలిదండ్రులు కేవలం ఆదాయాన్నిచ్చే చదువుకి మాత్రమె ప్రాదాన్యాన్నిచ్చేరన్న మాట...ఇదొక ఉదాహరణ మాత్రమె..శీలం అంటే ఏమిటి..దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి....అసలు జీవితంలో ఇలాంటి విషయాలను .....సామాజిక ..భౌతిక ..పరిస్తితులకు అన్వయించి ఎలా అర్ధం చేసుకోవాలి....ఎప్పు డైనా ఎక్కడైనా చర్చిస్తామా...పోనీ చర్చించిన పుస్తకాలను పిల్లలకు అందు బాటులో పెడతామా....ఎక్కడైనా ఫంక్షన్ ఐతే చాలు..లేటెస్ట్ ఫాషన్ డిజైన్స్ ఉన్న బట్టలు వేసుకున్నారా...లేదా అని చూస్తాం...వాళ్ళ భావజాలం లేదా ఐడియాలజీ ఇప్పుడున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా ఉన్నదా లేదా...అని మాత్రం చూడం. జరగరానిది ఏదైనా జరిగినప్పుడు మాత్రం నెత్తీ ..నోరూ కొట్టుకుంటూ గగ్గోలు పెట్టేస్తాం.
జీవితం లోని గోల్స్ ని యిరవై ఐదేళ్ళకే పరిమితం చేసుకుంటున్నాం. మిగిలిన ఏభై ఏళ్ళ సంగతి ఎక్కడా మన జీవిత ఎజెండా లో ఉండదు. అందు వలనే ఆనందానికి, విలాసానికి తేడా తెలియకుండా పోతోంది. విలాసంగా బ్రతకడమే ..ఆనందంగా బ్రతకడం క్రింద లెక్క పెట్టుకుంటున్నారు. అందువలనే మనం ఆనందంగా ఉన్నామని పది మందికీ తెలియాలంటే మనకో మంచి కార్ ... ఆడవాళ్ళ మెడ నిండా నగలు..పట్టు చీరల ధగ దగలు మొదలైనవన్నీ ఉండాలి. అలా కాకుండా ఉదయాన్నే మీ వూరి చివర ఉండే పొలాల పక్కనో ..చెరువు పక్కనో..చిన్న ఇయర్ ఫోన్ లో శివకుమార్ శర్మ గారి జలతరంగిణి వాద్యాన్నో..ఎల్లా వెంకటేశ్వర్లు గారి మృదంగ వాద్యాన్నో వింటుంటే అది యెంత మంచి అనుభూతి నిస్తుందో చెబితే ...నేను పిచ్చి వెధవనై పోనూ....పెదవి చివరి నుండి మాత్రమె వచ్చే మాటలను ...నటనతో మాత్రమె రప్పించే దొంగ నవరస హావ భావాలను చూసి...చూసి...ఎండిన మనసు మీద మొన్న చిన్న పన్నీరు జల్లు కురిసింది..డెబ్భై రెండు సంవత్సరాల తమ్ముడిని సాగనంపడానికి ..మే నెల ఎండలో భుజమ్మీద తుండైనా లేకుండా మిట్ట మద్ద్యాహ్నం ఎండలో నడుచుకుంటూ రోడ్ వరకూ వచ్చిన ఎనభై సంవత్సరాల వృద్దుడిని చూసినప్పుడు....
తమ్ముడు .మా నాన్న గారు....అన్న మా పెద నాన్న.. ఆశ్చర్యంగా చూస్తున్న మా అమ్మాయికి చెప్పాలనుకున్నాను." మనసులో ఆర్ద్రత అనేది ఉన్నప్పుడు ఈ ఎండలు...వానలు శరీరాన్ని పెద్దగా బాధించవు....అది కోల్పోయాం కాబట్టే శారీరక సుఖాలకు బానిసలం " అని కానీ దాని ముఖం చూస్తె ఆ విషయాన్ని అప్పటికే అర్ధం చేసుకుందని నాకనిపిచ్చింది..
జీవితానికి "ఉత్తేజం" అనేది చాలా అవసరం అనేది మన అందరం మరచి పోయి చాలా రోజులయ్యింది. జీవితానికి ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్క విషయం ఉత్తేజాన్నిస్తుంది. అన్ని వయస్సుల వారికి ఒకే విషయం ఉత్తేజం ఇస్తుందని గారంటీ ఏమీ లేదు. అనేకానేక విషయాలు మనలో ఘర్షణ సృస్టిస్తాయి. పాత భావాల స్థానం లో కొత్త భావాలు పుట్టుకొస్తాయి. ఇది సమాజం లో కూడా నిరంతరం సాగే ప్రక్రియ. ఇది లేని చోట జడత్వం ఆవహిస్తుంది. అప్పుడు మనిషి జీవన్మ్రుతుడవుతాడు. ఇప్పుడు ఎక్కువ మంది అదే స్థాయిలో ఉన్నారు. అది కప్పి పుచ్చు కోడానికి జరుగు తున్నవే అర్ధం పర్ధం లేని ఫంక్షన్ లు. మనం ఆహ్వానిస్తున్న గెస్ట్ లలో నిత్యం యెంత మందితో మనం మాట్లాడ గలుగుతున్నాం.నాకు తెలిసిన కొన్ని ఫంక్షన్ లలో వచ్చిన గెస్ట్ లలో పది శాతం మందితో మాత్రమే జీవితంలో ఒక్క సారైనా మాట్లాడిన హోస్ట్ లు ఉన్నారు. అసలు పెళ్లి అంటే యెంత కళాత్మకంగా ..తమకు బాగా కావలిసిన వాళ్ళతో మాత్రమే కలసి ఆ మధురమైన అనుభూతులు మిగుల్చుకుంటూ జీవితాంతం గుర్తుంచుకోవసిన కార్యక్రమమని అందరికీ తెలుసు. కానీ అక్కడ నిజంగా మనసు పెట్టి చూసే వాళ్లకి చీదరించు కొనేవే తప్ప ...ఆనందించేవి ఏవీ ఉండవు. మనకు మంత్రాలు అర్ధం కావు...అయినా వందల సార్లు వింటూనే ఉంటాం. వాటి మీద పూర్తి నమ్మకం ఆ చదివే పంతులు గారికే ఉండవు. అయినా మనం వాటినే పాటిస్తాం. కనీసం వాటిని శ్రావ్యంగా అయినా ఉచ్చరించడానికి ప్రయత్నం చేయడం మానేశారు.