22, ఫిబ్రవరి 2011, మంగళవారం

యుగానికొక్క మాస్టారు



పందొనిమిది వందల తొంబ్బై మూడు మార్చ్ ముప్పై ఒకటి ....రాజవోలు గ్రామం మొత్తం శోక సముద్రమై ఆయనను కడసారి గా చూసుకొనడానికి ఎదురు చూస్తోంది. నెమ్మదిగా వూరి లోకి పొరుగు గ్రామాల నుండి కూడా జనం రాసాగారు చూస్తుండగానే జనం తో గ్రామం నిండి పోయింది. ఇంతకు మించిన జనం ఆయన విగత దేహం వెనుక ...అందరికీ కళ్ళ నుండి కారుతున్న నీరు..... కానీ అందరికీ మనస్సులో అనేక ప్రశ్నార్ధకాలు. వ్యక్తీ కి స్వగ్రామం లో కూడా యింత గుర్తింపు ఉందా అని పొరుగూరి జనం బయట కూడా యింత గుర్తింపా అని ఊరిలో జనం ఆలోచనల్లో ఉండగానే ఆయన భౌతికంగా యెవరికీ అందనంత దూరం వెళ్లి పొయ్యారు. మొదటి సారి వూరి లోకి వచ్చిన కొంత మంది మిత్రులు కుటుంబ సభ్యులను పరామర్సించడానికి ఇంటికి వెళ్లి మరొక్క సారి షాక్ అయ్యారు. కూలడానికి సిద్దంగా వున్నా పై కప్పు, కూర్చోడానికి కుర్చీ కూడా లేకుండా ఉన్న ఇల్లు ....కానీ ఇంటి నిండా పుస్తకాలు .....మట్టి అరుగులు....ఏ విధంగా చూసినా దారిద్రానికి సమీపం లోనే.......ఆ చిరు నవ్వు వెనుక ఇన్ని కష్టాలా....ఆ జనం కోసం ఆలోచించే బదులు నాలుగు ప్రైవేట్ లు చెప్పుకోవచ్చు కదా....ఆయన ఆలోచనలు అంత భిన్నంగా ఎందుకున్నాయ్? ఎక్కడ నుండి ఆయన ప్రస్త్హానం మొదలైంది. ఇంతకూ ఎవరాయన?
చరిత్రలోకి వెళ్తే అలేగ్జాందర్ విజయాల వెనుక రెండు తరాల కృషి కనబడుతుంది . అంత చిన్న రాజ్యాన్నుండి ఒక విశ్వ విజేత ఆవిర్భవించాడంటే గొప్పదనం ఆయన గురువులికిఇంకా చెప్పాలంటే ఆయన గురువుల గురువులకి కూడా చెందుతుంది . సోక్రాటీస్ ప్లేటో ని తయారు చేస్తే ..ప్లేటో ఆరిస్టొటిల్ ను తయారుచేసాడు . ఆయన తన అఖండ మేదావిత్వంతో అలెగ్జాందర్ ను ప్రభావితం చేయగలిగాడు . మాసిడోనియా అనే చిన్న రాజ్యానికి ప్రపంచ చరిత్రలో ఒక స్థానం సంపాదించిపెట్టాడు . మా ఊరికి అటువంటి ఆరిస్టొటిల్ గా చెప్పుకోడానికి అన్ని అర్హతలు వున్న వ్యక్తీ ….అందరు ఆప్యాయంగా ఆచారి మేష్టారు గా పిలుచుకొనే శ్రీ ములుగు అనంత వెంకట లక్ష్మి నరసింహాచార్యులు . ఇంచు మించు ముప్పై సంవత్సరాల వయసు వరకు ఆయనది అతి సామాన్యమైన రాజవోలు సగటు కుర్రాడి చరిత్రే . యవ్వనంలో వున్నప్పుడు చేసిన చేష్టలకు పెద్దల చేత తిట్లు తినడం (ఆ పెద్దలు కూడా కుర్రాల్లుగా ఉన్నప్పుడు వాళ్ళ పెద్దల చేత “ చెడిపోతున్నందుకు” తిట్లు తిని వుండే వుంటారనడంలో సందేహం ఏమీ ఉండనవసరం లేదు ) కానీ మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండడు . మన అవసరార్డమే ఒకొక్క సారి మనం తీసుకొనే నిర్ణయం మనలనే కాక మన చుట్టూ వుండే సమాజాన్ని కూడా ఎక్కడికో లేవనేట్టుతాయి . మేష్టారు టీచర్స్ ఫెడరేషన్ లో జేరడం ఆయనకెంత మేలు చేసిందో ఊరికి కూడా అంతే మేలు చేసింది . తెలివైన మనిషి తన విద్య వలన , చుట్టూ వున్న సమాజం వలన ప్రభావితుడై వాటి ఆధారం మీద ముందుకు సాగి తన చుట్టూ ఉన్న సమాజం మీద ప్రభావం చూపుతాడు . ఇది ఒక విధంగా చాలామందికి తెలిసిన నిరంతర క్రియ , ప్రతిక్రియలే…..కానీ మనిషి లో వుండే చైతన్యం బట్టి వీటియొక్క ఫలితాలు ఉంటాయి . బాల్య దశ నుండి యౌవన దశకు మారుతున్న మాకు అప్పట్లో మాస్తారిలో వచ్చిన మార్పు అర్దమయ్యేది కాదు . ఆశ్రమ పాథశాల నుండి వచ్చిన నాకు వూరిలో పెద్ద సర్కిలే వుండేది . వొక రోజున మమ్మల్ని పిలిచి ఒకాయనను చూపించి ఈయన కాకినాడ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్ …మీతో మాట్లాడడానికి వచ్చారు అని పరిచయం చేసారు . ఆయన శ్రీ క్రిష్నయ్య .......స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు . ఆయన తో మాట్లాడింది కొంత సేపే అయినప్పటికీ ఇది మామీద చాలా ప్రభావం చూపింది . ఒక కొత్త భావజాలం మా ఆలోచనలకు కొత్త దారులు చూపించినట్లయ్యింది…ఆ తరువాతే తెలిసింది మాస్టారు అప్పటికే ఆ దారిలో చాలా దూరం ప్రయాణం చేసారని . అక్కడ నుండి మా ఇద్దరి మధ్య అనుబంధం వ్యక్తిగత స్తాయి నుండి సైద్ధాంతిక స్థాయికి ఎదిగింది . బహుశా మా ఊరిలో ఆ అనుబంధం నా ఒక్కడితోనే ఆఖరి వరకు ఉండి పోయింది .
మాస్తారిది సూర్ఫద్రూపం. . సంభాషణలో హాస్య చతురత వుండేది . చిరు నవ్వు ఆ ముఖానికి ఒక ఆభరణం అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుండే వారు. అన్నివయసుల వారు ఆయన స్నేహితులే...సాధారణంగా ఉద్యమాల్లో సీరియస్ గా నిమగ్నమై వుండే వారికి లౌక్యం కాస్త తక్కువ గానే వుంటుంది.( దీనికి ఉదాహరణగా అప్పట్లో ఒక సీనియర్ సేపేఐ నాయకులోకరి తో నా సంభాషణ గురించి చెప్పాలి.పందొనిమిది వందల యాభై ఐదు లో జరిగిన జనరల్ ఎలక్షన్ లో కమ్యూనిస్ట్ పార్టీ మన రాష్ట్రంలో ఖచ్చితంగా గెలిచే పరిస్థితిని ఈ లౌక్యం లేకపోవడం ఎలా దెబ్బ తీసిందో ఆయన వివరించారు.ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్స్ కు జనం విపరీతంగా వచ్చే వారు. కానీ ఆ మీటింగ్స్ లో ఎవరో ఒక తెలివైన ప్రతి పక్ష సానుభూతి పరుడు ఒక చీటీ ని వేదిక మీదకు పంపేవాడు. దానిలో ప్రశ్నలకు కొన్ని ఉదాహరణలు కూడా ఆయన చెప్పాడు.అందులో ఒకటి " మీకు దేవుడి మీద విశ్వాసం ఉందా? " దానికి సమాధానంగా చండ్ర రాజేశ్వర రావు గారి లాంటి గొప్ప నాయకులు కూడా " లేదు...మేము దేవుడిని నమ్మం.".అని సూటిగా చెప్పేసే వారు. అది ఆ రోజుల్లో జనం అందులోనూ స్త్రీల మీద ఎలా పని చేస్తుందో ..వేరే చెప్పనవసరం లేదు. మరి వోట్స్ సంగతి వేరే..చెప్పనవసరం లేదుగా...పూర్తిగా ఇదొక్కటే కారణం కాకపోవచ్చు కానీ యిదీ ఒక కారణమని ఆయన చెప్పే వారు.) ఆయన కానీ మాస్టారికి హాస్య చతురతలో ఈ లౌక్యం కలవడం వలన జనం ఆయనతో అలా మాట్లాడుతూనే వుండే వారు. కమ్మూనిస్ట్ పార్టీలు వాటికుండ వలసిన స్తానాని కన్నా యెప్పుదూ దిగువన ఎండుకున్నారన్నది ...చాలా మంది మేధావులు చాలా రకాలుగా చర్ర్చించారు కాబట్టి టాపిక్ ని అక్కడితో వదిలేద్దాం . కానీ మేష్టారు మాత్రం ఆఖరి వరకు మార్క్సిస్ట్ పార్టీ అభిమాని గానే వున్నారు. కేవలం అభిమాని గానే కాదు మా లాంటి వాళ్ళను ఎంతో మందిని మార్గం లోకి మళ్ళించ గలిగారు. నేను సిద్దాంత గ్రంధాలు ఎక్కువగా చదివే వాడిని కాదు కానీ సాహిత్యం మాత్రం ఎక్కువగానే చదివేవాడిని. నా చేత గోర్కీ రాసిన అమ్మ మొట్ట మొదట చదివించింది మాస్టారే. పుస్తకం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించవలసిన అవసరం లేదు. అలాగే నా మీద జీవితంలో తొలి దశ లో ఎంతో ప్రభావం చూపిన "రక్తాశ్రువులు " లాంటి జీవిత చరిత్రలు ... జమీల్యా లాంటి అద్భుత విప్లవ దశ ప్రేమ కావ్యాలు నాకు నాటికీ మార్గ దర్సకంగా వున్న" కుటుంబం...వ్యక్తిగత ఆస్తి.....రాజ్యం ...పుట్టుక ...(ఎంగెల్స్ ) యివన్నీ మాస్టారి దగ్గర తీసుకుని చదివనవే.
ఆరు బయట మొక్కల మద్య వాలు కుర్చీలో కుర్చుని చదవడం నాకు మొదటి నుండీ అలవాటు. మాస్టారు స్కూటర్ సౌండ్ నాకు ఎప్పుడూ ఆనవాలే. రాత్రి పది గంటల తరువాత మా ఇంటి ముందు స్కూటర్ ఆపి సెంటర్ లో వున్న రామాలయం అరుగు మీదకు తీసుకెళ్ళి ఒక సిగరెట్ వెలిగించి రాజకీయాల మీద ...పుస్తకాల మీద అలా మాట్లాడుతూనే వుండే వారు. వ్యక్తిగతంగా మేమిద్దరం ఎప్పుడూ అత్యంత సన్నిహితంగా వున్నా ..... పందొనిమిది వందల ఎనభై ఐదు లో వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్స్ తరువాత మార్క్సిస్ట్ పార్టీ రాజకీయ పంధా నాకు అంతగా సమ్మతం కాలేదు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలలో ఏ మార్పు లేక పోయినప్పటికీ ఆ పార్టీ తో కలసి పోటీ చేయడం నాకు ఎందుకో మింగుడు పడ లేదు. సామాన్య జనానికి సైద్ధాంతిక విశ్లేషణలు పనికి రావని......అవి కార్యకర్తల నోళ్లకు సీల్ వేయడానికే పనికి వస్తాయని అంటుండే వాడిని.
పందొనిమిది వందల ఎనభై ఐదు తరువాత నాలో అనేక కొత్త కొత్త ఆలోచనలు వచ్చేవి. యూత్ ని గేదర్ చేయడం వరకు వోకే కానీ ఎవరి ఆలోచనల్లోనూ పెద్దగా మార్పులైతే నాకు కనిపించేవి కాదు. ఇప్పుడైతే క్లియర్ గా మేము చేసిన పొరబాటు స్పష్టంగా కనబడుతోంది. ఎవరికైతే సమాజంలో వచ్చే మార్పుల వలన ఎక్కువ ఉపయోగం వుంటుందో ఆ యూత్ ని మేము నిర్లక్ష్యం చేసాము. ఎవరికైతే ఈ మార్పుల వలన ఉపయోగం ఉండదో వాళ్ళతో ఎక్కువగా గడిపే వాళ్ళం. మా గ్రామం లో భుస్వాములని చెప్పుకో తగ్గ కుటుంబాలు లేవనే చెప్పాలి. ఎగువ మధ్య తరగతి వర్గానికి చెందిన కుటుంబాలు మాత్రం ఉన్నాయి కానీ "పీడన" లాంటివి లేవనే చెప్పాలి. చిన్న చిన్న కుల పోరాటాలే తప్ప వర్గ పోరాట చాయలు కూడా ఉండేవి కావు. ఒక విషయం స్పష్టంగా కనబడేది. నడుస్తున్న సమాజ నిర్మాణం సక్రమంగా లేదు. అప్పటికి ఇప్పుడున్నంత కన్స్యూమరిస్తిక్ గా సమాజం లేదు...కానీ నెమ్మదిగా విలువలు గాలిలో కలిసి పోవడం కనిపిస్తూనే వుండేది. కానీ యుద్ధం ఎవరి మీద చేయాలో అర్ధం అయ్యేది కాదు. తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చాక వారితో కొత్తగా బంధుత్వం ఏర్పడిన కారణంగా మార్క్సిస్ట్ పార్టీ వారు ప్రజా ఉద్యమాలను నిర్లక్ష్యం చేసారు.
ఆ సమయంలోనే మాస్టారు అక్షర దీక్ష కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై పోయారు. అప్పటికింకా చదువు అనే విషయం మీద నాకు పూర్తి అవగాహన లేదు. " పాండిత్యం కంటే జ్ఞానం ముఖ్యం " అనే జగద్విఖ్యాత (మాయా బజార్ సినిమా లోనిది ) డైలాగ్ ని అస్తమానూ అంటుండే వాడిని. మాస్టారు మాత్రం "జ్ఞానం రావాలంటే పుస్తకాలు చదివించాలి కదా " అని అంటుండే వారు. ఆ తరువాతే కొడవటిగంటి కుటుంబ రావు గారి " చదువు " నవలిక చదివిన తరువాత నాకైతే చదువు అనే విషయం గురించి అవగాహన ఏర్పడింది కాని మాస్టారు ఈ అక్షర దీక్ష కార్యక్రమంలో ఏమి నేర్పుతున్నారో నేను తెలుసుకోలేదు. ఎందుకంటే నేను ప్రభుత్వోద్యోగం సంపాదించడం ,దాని కోసం నాగపూర్ వెళ్ళడం జరిగాయి. ఆ తరువాత అప్పుడప్పుడు రాసుకొనే లేఖలే మా యిద్దరి మద్య బంధాన్ని కొనసాగించాయి. అనుకోకుండా పందోనిమిది వందల తొంభై రెండు లో నేను సికింద్రాబాద్ ట్రాన్స్ఫర్ ఐనప్పుడు ఆయన చాలా సంతోషించారు. కనీసం మనం యిప్పుడు తరచూ కలసికోవచ్చు అని అంటుండే వారు అలా ఆనందం లో ఉండగానే ...ఈ మహాభినిష్క్రమణ జరిగి పోయింది.
సాధారణంగా సమాజంలో అమలులో వున్నపద్దతుల్లో పోతే ఏ రిస్కూ ఉండదని ఆలోచించే రోజులవి. కొత్త ఆలోచనలనల గురించి చర్చిచడానికి కూడా మా గ్రామం లో ఎవరూ ఇష్టపడే వారు కాదు. పబ్లిక్ గా ఎందుకు మాట్లాడడం...ఏదైనా వుంటే సీక్రెట్ గా చేయాలి గానీ...అనే పలాయన వాదం. స్త్రీ స్వేచ్చ గురించి యెంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఒక విధంగా అప్పట్లో...ఇప్పుడు కూడాను స్త్రీ కి స్త్రీలే శత్రువులు గా అనిపించే వారు. నగల గురించి ...చీరల గురించి యెంత గట్టిగా డిమాండ్ చేసినా భర్త హ్యాపీ గా ఫీలవడాన్నే వీళ్ళు గొప్ప స్వేచ్చగా ఈ నాటికీ ఫీలవుతూనే వుంటారు. డబ్బు తాలూకు మదంతో కామ ప్రకోపంతో తిరుగుతున్న పుత్ర రత్నాలకు యింట్లో ప్రోత్సాహకాలు ఉండేవి.అటు వంటి వాతావరణం తో నిండి వున్న మా గ్రామం లో వేరొక తరహా ఆలోచన చేయగలగడమే ఒక సాహసం ..పైగా ఆ విధంగా నమ్మిన బాటను జీవితాంతం విడవకుండా ఉండగలగడం మాస్టారి వంటి స్థిత ప్రజ్నులకే సాధ్యం. ( ఒక విధంగా ఇది జీవిత విధానం అంటూ పెద్దగా ఎవరికీ వుండేది కాదు ). ఇప్పుడు మన ఎదురుగా వున్న బిటుమేన్ రోడ్ లను చూసినప్పుడు ఒకప్పుడు పొదలతో నిండి వున్న ప్రాంతం లో మట్టి రోడ్ వేసిన వారి కష్టాన్ని గురించి ఆలోచించాలి. మాస్టారు వేసిన మార్గంలో మేము కొంత ముందుకు వెల్లగలిగాం కాబట్టి మా గ్రామానికి సంబదించిన వరకూ ఆయనే ఆరిస్టొటిల్. ఆయన చివరి వరకూ ఉంటె ఎవరో వొకరిని అలేక్జాందర్ గా తయారు చేసి వుండే వారేమో..కానీ విధి యాక్సిడెంట్ రూపంలో ఆయన కుటుంబానికే కాక మా గ్రామం మొత్తానికి తీరని అన్యాయం చేసింది.
కానీ మేము కూడా గ్రామాన్ని వదిలి వేయడం వలన అది ఇప్పుడు పొడలతోనే కాదు మొత్తం చిత్తడి గా తయారై పోయింది. దానికి కారణం ముందుగానే విన్నవించుకున్నాను....మార్పు అవసమైన వారి దగ్గరకు మేము అంతగా మా భావాలను చేర వేయ లేక పోయ్యాము. కానీ ఇప్పుడు ఆంతా మరొక్క సారి మేల్కొలుపు కూడా కనబడుతోంది. గ్రామంలో పేరుకు పోయిన సాంస్క్రుతిక రొచ్చుకు కొంత మంది ముక్కులైనా బద్దలయ్యాయి. యిదే అదనుగా మా గ్రామాన్ని ఆదర్శ ప్రాయంగా చేయడానికి నెమ్మదిగా ఏకం అవుతున్నారు. ఆ కంపును దూరం చేయడం కోసం ఆయన సహచరులు,శిష్యులు, వారి తాలూకు పిల్లలు నడుము బిగించి కలసి కష్టపడి ....గ్రామంలో ఒక నందన వనం లాంటి వాతావరణం సృష్టించి ..ఆకాశం వైపు చూసి...." చూడండి .....మాస్టారూ.....మీ కలను నిజం చేస్తున్నాం....." అని చూపిద్దాం. అప్పుడే మనందరి జీవితాలు కూడా ధన్యమౌతాయని నేను విశ్వసిస్తున్నాను.( మేస్టారి వర్ధంతి....మార్చ్ ముప్పై....)




15, ఫిబ్రవరి 2011, మంగళవారం

ఎత్తరుగుల మండువా లోగిళ్ళు

ఒక తరానికి ప్రతీకలుగా ప్రతి ప్రాంతం లోను కొన్ని కొన్ని గుర్తులు మిగిలి ఉంటాయి కానీ కొన్ని తరాలకు ప్రతీకలుగా ఈనాటికి మా గోదావరి జిల్లాలో మండువా లోగిళ్ళు నిలిచి వున్నాయి .అసలు విధమైన నిర్మాణం ఎప్పుడు మొదలైందో తెలుసుకోడానికి చరిత్ర లోకి వెళ్లి వలసి రావొచ్చు. కానీ ప్రస్తుతం మాత్రం వీటికి అవసాన దశ ప్రాప్తిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచు . స్థూలంగా వీటి నిర్మాణాన్ని చూద్దాం . వీధి దిక్కులో ఉన్నా కానీ వీధి వైపు సింహద్వారం తప్పని సరి .దానికి ఎదురుగా మెట్లు ,వాటికి రెండు పక్కలా ..ఎత్తు అరుగులు తప్పనిసరి . దానిని దాటుకుని లోనికి వెళ్తే తగిలే దీర్ఘ చతురస్రాకారపు పెద్ద హాల్ నే మండువా అని పిలుస్తారు . దీని లోనుండి ఖచ్చితంగా కనీసం ప్రక్కలకు సరి సంఖ్య లోనే గదులు ఉంటాయి . సాధారణంగా రెండు లేక నాలుగు గదులు తప్పని సరిగా ఉంటాయి . ఇంకా పెద్ద ఇల్లయితే బెడ్ రూమ్స్ కు ఆనుకొని వరండా, దానికి అటు ఇటుగా స్టోర్ రూమ్స్ ఉడటం సాధారణం . విధంగా ఉన్న ఇంటినిచుట్టు వసారాలిల్లుఅని కూడా పిలిచే వారు . మండువా దాటి వెనుక వైపుకు దారి తీస్తే అక్కడొక వరండా దానికి ఆనుకొని వంటగది ఉంటాయి . సాధారణ నిర్మాణం అంతా ఇంచు మించు విధంగానే ఉంటుంది . ఆర్దిక సానుకూలత బట్టి గదుల కొలతలలోను . గుమ్మాలు , కిటికీ తాలూకు కలప ,పనితనం విషయాలలో తేడా కనబడేది . అదే విధంగా మిద్ది (సరంబీ అని ఈనాటికి అంటారు) తాలూకు పనులలో కూడా కొంత కొంత తేడాలు కనబడతాయి . పై కప్పు అంతా కూడా మట్టి పెంకులతోనే ఉంటుంది . పక్కన ఉన్న గదుల పైకప్పు మీద నుండి వచ్చే వర్షపు నీరు బయటకు పంపడం కోసం మధ్యలో ఒక దోనె( గట్టర్) ఉంటుంది . అది కోనికల్ గా కొనలో ఒక పైప్ ఉంటుంది . పైప్ గుండా వచ్చే నీరు మండువా లో ఫ్లోర్ లోనే కట్టబడిన ఒక గోతి లో కలెక్ట్ చేసి దానిని వేరే పైప్ ద్వారా బయటకు పంపేవారు . ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్ అయినప్పుడు గోతినే వాష్ బేసిన్ గా కూడా వాడేసే వారు . ఇప్పటిలా అప్పుడు వాస్తు తాలూకు విపరీత నమ్మకాలైతే ఉండేవి కావని వీటి నిర్మాణం చూస్తే అర్ధం అవుతుంది . చాలా మండువా లోగిళ్ళకు ఇప్పుడు చలామణి లో ఉన్న వాస్తు సూత్రాలు అప్లై చేస్తే అవన్నీ పడగొట్ట వలసి వస్తుంది . నిర్మాణంలో సౌలభ్యం గురించి కాకుండా ఇళ్ళ లోని స్త్రీల ప్రస్తానం ఎక్కడకు వచ్చిన్దనేదే యిక్కడ చూడవలసింది.

వర్షాధారిత వ్యవసాయం , వరదలలో కొట్టుకు పోయే పంటలున్నంత వరకు ఆంతా శ్రమ జీవులే. బహుశా కాటన్ ఆనకట్ నిర్మాణం జరిగిన తరువాత స్త్రీలకు జిల్లాలలో మిగులు సమయం చిక్కి ఉండవచు మగవాళ్ళు నెమ్మదిగా వీళ్ళని పొలం పనుల నుండి తప్పించేయడంతో వీళ్ళది కుటంబంలో సహాయక పాత్రకే పరిమితమై పోయింది .ఆఫీసుల్లో పని చేసే వాళ్లకు ఒకప్పుడైతే అర్ధం చేసుకోడం కష్టమయ్యేదేమో గాని ఇప్పుడు అందరికీ ఒక విషయం చక్కగా అర్ధం అవుతుంది. ఎవరికైనా భాద్యతలు తగ్గించారంటే వాళ్ళ కుర్చీ క్రిందకు నీళ్ళు వస్తున్నాయనే అర్ధం. అదే విధంగా స్త్రీల హక్కులు నెమ్మదిగా ఉపసంహరించ బడటమే కాకుండా వీరికి లేని పోని కొత్త అలవాట్లు కూడా మండువా లోగిల్ల లోనే వచ్చి ఉండవచ్చని నా అభిప్రాయం . శ్రామిక శక్తి గా ఉన్నంత కాలం స్త్రీలు అబలగా ఉండరు . నెమ్మదిగా వీరి కుటంబ శ్రమను ప్రొడక్టివ్ శ్రమగా గుర్తించడం మానేశారు . స్త్రీలు కూడా ఇదే పంధాకు అలవాటు పడి పొయ్యారు . మగ వాళ్ళు పొలం వెళ్ళగానే నలుగురూ మండువా లోగిల్ల లోనికి చేరి పోసుకోలు కబుర్లకి ప్రాధాన్యమున్న పనులు మొదలు పెట్టడం అత్యంత పరిపాటి గా మారింది ఇది నెమ్మదిగా ఎక్కడికి దారి తీసిందంటే స్త్రీలు చేసే ప్రతి పని తమకు నచ్చడం కంటే పక్కవాళ్ళకు నచ్చడమే ప్రధానంగా మారింది. స్వతంత్ర వ్యక్తిత్వాలు చాలా త్వరగా కనుమరుగై పొయ్యాయి. బలమైన వ్యకిత్వం లేని వాడికి పక్క వాడో , పై వాడో చెప్పిందే వేదం. అంతే నీకు మొగుడినా చెప్పాలి ..లేదా పక్కనున్న వాళ్లైనా చెప్పాలి. ఇదంతా మొగవాళ్ళకి అత్యంత అనుకూలమైన వ్యవస్థ. ఇది అలా ..అలా ఆడంబరాలకు దారి తీసింది. అందం అనే భావనను ఆడంబరం మింగేసింది. అత్యంత హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే తన భర్తకు అందంగా కనిపించాలనే తపన పోయి స్థానం లోకి పదిమందిలో ఆడంబరంగా కనిపించాలనే తాపత్రయం మొదలైంది. శృంగార భావనలు మనసు లో నుండి కానీ ....చాలా వరకు శరీరాల్లో నుండి కానీ ఇంకిపోతున్నాయనే సత్యాన్ని గుర్తించడం మానేశారు. నేను ఇంతకు ముందు వేరొక పోస్ట్ ( వీరూ గురించి ) లో రాసి నట్లుగా తమకు చీరలు, నగలు ఇంట్లో నింపిన మగవాడే మొగాడు గా మారాడు. ఒక విధంగా స్త్రీలకూ దేవుడిగా మారాడు. ఒక విధంగా ఇదంతా సమాజాన్ని పూర్తి పురుషాధిక్యత లోనికి నెట్టేసింది . తరాలు మారిన కొద్దీ దిగజారుడు పెరిగింది. మంచి,చెడు ఒకదాని కొకటి పెనవేసుకు పొయ్యాయి. మనకు మంచి జరుగుతున్నా ఒక పని వలన సమాజానికి చెడు జరుగుతుంటే అది " చెడు" కిందే లెక్క , మనకు ఒక వేళ కొంత నష్టం కలిగినా కూడా సమాజానికి దాని వలన మంచి జరుగుతుంటే అది 'మంచి" కిందే లెక్క విధమైన భావనలు మచ్చు కెక్కడా కనబడని స్థితి కి గ్రామ సీమలు దిగజారి పొయ్యాయి. మధ్య నే మా ఊరిలో ఒక పెద్దాయన పొయ్యాడు. వారి ఒక్క గానొక్క కుమార్తె చాలా ఘనంగా వారి కర్మ కాండలు చేసింది. ఊరంతా వెళ్లి సుష్ట్టుగా భోజనం చేసి ఆయన పేరిట ఇచ్చిన జ్ఞాపికలు అందుకొని వచ్చారు. వెనుకే " ఆయన మందులకి డబ్బు యీయక పొతే నెప్పికి తట్టుకోలేక ఆత్మహత్యచేసుకున్నాడని ......బ్రతికుండగా ఆయన చేత మహా తల్లి మరుగు దొడ్లు కూడా శుభ్రం చేయించేదని" చెప్పుకున్నారు. కానీ ఒక్కళ్ళు కూడా భోజనానికి వెళ్ళడం మాన లేదు. జ్ఞాపికలు తెచ్చుకోడం ఆపలేదు.

మురుగు కాలువ కంపుతో చచ్చేవాడికి కెమికల్ ఫ్యాక్టరీ కంపు తోడైనట్లు ఇప్పుడు దుర్ఘందానికి టీవి కంపు కలిసి దుర్ఘందాన్ని నలు వైపులా వెదజల్ల జేస్తోంది. దీనికి ఇక అంతం లేదా....అని మాత్రం బాధ పడనవసరం లేదు. ఒక కొత్త కల్చర్ పుట్టి ...... చక్కగా మరలా స్త్రీలు శ్రామిక శక్తి గా ఎదిగి మండువా లోగిల్ల నుండి బయటకు వచ్చి చక్కగా భర్తతో పొలం వెళ్లి పొలంలో కూడా చిన్న చిన్న పనులు కనీసం కూరగాయలు పండించడం లాంటి ఆదాయ వనరులు పెంచే పనులు చేసుకుంటూ మిగిలిన సమయాన్ని పది మంది కోసం వినియోగించ వలసిన అవసరం కలిగినప్పుడు..దీని నుండి స్త్రీలు ,సమాజం విముక్తి చెందుతారు . రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆశిద్దాం.