13, ఫిబ్రవరి 2012, సోమవారం

అభ్యుదయమా....నీ చిరునామా చెప్పు

BRTS రోడ్  మీద జీప్ స్పీడ్ గా వెళ్తోంది. ముందు కూర్చున్న నాకు చాలా దూరం వరకూ రోడ్ కనబడుతోంది. విశాఖపట్నం  లో కొత్తగా వేసిన  యీ రోడ్ ట్రాఫిక్  రూల్స్ గురించి చాలా మందికి ఒక పట్టాన అర్ధం కాదు. మొత్తానికి  ట్రాఫిక్  సమస్యలు  కొంతవరకూ తీరిన ఆనందంలోనే జనం ఉన్నారు. ఏవేవో   ఆలోచనలకు బ్రేక్ వేస్తూ జీప్ షడన్ గా స్లో అయ్యింది. కొంచెం  ముందు మూగి ఉన్న జనం బట్టి అక్కడ ఏదో  సంఘటన జరిగిందనేది అర్ధం అయ్యింది. కొంచెం  ముందుకు  వెళ్ళాం. రోడ్ కు అడ్డంగా పడి ఉన్న శవం. మధ్య లేన్ లో నుండి లెఫ్ట్ లేన్ లోకొస్తుంటే వెనుకగా వస్తున్న సిటీ బస్ ఢీకొని అక్కడికక్కడే  చనిపొయ్యాడు  ఒక యువకుడు. విచిత్రం  యేమిటంటే యెవరిదీ రాంగ్ రూట్  కాదు. మరి  తప్పెలా జరిగింది? వింటే కొంత విచిత్రంగానే ఉంటుంది. ఆ యువకుడు రోడ్ క్రాస్ చేయడం ఆ బస్ డ్రైవర్  కనబడకుండా ఒక రాజకీయ నాయకుడికి స్వాగతం పలకడానికి వెలిసిన ఒక చోటా రాజకీయ నాయకుదు యేర్పాటు  చేసుకున్న ఫ్లెక్సీ  అడ్డం వచ్చింది. డ్రైవర్ జీప్ స్టార్ట్  చేసాడు. వద్దంటున్నా వినకుండా శవం పక్కగా
తీసుకుని వెళ్ళాడు. వయసు 20-25 సంవత్సరల  మద్య  ఉండొచ్చు. నూరేళ్ళూ నిండి పొయ్యాయి. మామూలు మరణం కాదు. తల పగిలి మెదడు రోడ్ మీద పడి ఉంది. ఛాలా సేపటి వరకూ మామూలు మనిషిని కాలేక పొయ్యాను. యెవరి స్వార్దం ఆ కుర్రాడిని చంపేసిందో అర్ధం కావడం లేదు. ఆ  రాజకీయ నాయకుడి నగరాగమనం యీ కుర్రాడి మరణానికి దారితీసిన ఈక్వేషన్స్ గురించి ఆలోచనలు ముసురుకున్నాయ్. ఒక  సారి నా చిన్న  నాటి రోజులు గుర్తుకు తెచ్చుకున్నాను. నాకు  ఊహ  వచ్చీ రాకుండా ఉన్నప్పుడు అంటే  1971 లో లోక్ సభ ఎలక్షన్స్ జరిగాయి. నాకేమీ అంత గుర్తు లేదు కానీ మేమప్పుడు రాజమండ్రి  సమీపంలోని ఒక గ్రామమైన వీరవరం లో ఉండే వాళ్ళం. రాజకీయ  ప్రభంజనాల గురించి యే మాత్రం తెలియని వయసు. వూరిలోని భూస్వాములూ….దళితులూ కూడా ఇందిరా గాంధీ పక్షాన ఉండడం నాకు  బాగా గుర్తుంది. యెందుకంటే నా క్లాస్ లో వీరికి సంబందించిన ఇద్దరూ ఉండేవారు. మరి వీరికి ప్రతి పక్షంగా  కొంత మంది దేవాంగుల పిల్లలు ఉందే వారు. వాళ్ళ ఇళ్ళ  మీద ఎర్ర జండాలు ఎగురుతూ ఉండేవి. వాళ్ళ నాన్నలు చేనేత పని చేస్తుండే వారు. నేనెక్కువగా వాళ్ళతోనే ఉండే  వాడిని.  ఆ  రోజుల్లో గాలిపటాలికి  వాళ్ళే ఉచితంగా దారపు కండెలు ఇస్తుండేవారు. నాకు గుర్తున్న మొదటి  రాజకీయ సభ ఆ ఎలక్షన్లో కామ్రేడ్ చిట్టూరి ప్రభాకర చౌదరి   గారు మాట్లాడిందే .  తన కాంగ్రెస్ ప్రత్యర్ధి అయిన కపిళేశ్వరపురం   జమీందారీ వంశస్తుడైన   పట్టాభి రామారావు గారి మీద నిప్పులు కురిపిస్తూంటే చేనేత కార్మికులు మాటి మాటికి చప్పట్లు కొట్టడమొక్కటే నాకు గుర్తుంది. ఆ  తరువాత మరలా తాడికొండ స్కూల్ లో మా టీచర్స్ అలహాబాద్   హై కోర్ట్ తీర్పు గురించి  మాట్లాడు కొంటుంటే ఏదో ఒక అపూర్వ సంఘటన జరిగిందని అర్ధం అయ్యింది. ఆ తరువాత కొద్దికాలానికే ఎమెర్జన్సీ డిక్లేర్  అవడం …దాని గురించి చాలా గొప్పగా చెప్పుకోడం వింటుండే వాడిని. భారత దేశం అంతా ఒక విన్నూత్నమైన   క్రమ శిక్షన  వచ్చేస్తోందని మాకు
 మీటింగ్స్  పెట్టి మరీ చెబుతుండేవారు. నాకు అప్పటికి అంతగా రాజకీయ పరిజ్ఞానం లేదు కానీ తాడికొండ స్కూల్ లో మాకు ఇంగ్లీష్ సబ్జక్ట్ కు విల్సన్ రావు గారనే మేస్టారు ఉండే వారు. టెంత్ క్లాస్ లో మాకు "ది  చేంజింగ్ వరల్డ్ " అనే పాఠం ఉండేది. అది బహుశా నాలుగు పేజీల లెసన్ అన్నట్లు గుర్తు. కానీ ఆ పాఠాన్ని ఆయన పది రోజుల పైనే చెప్పినట్లు గుర్తు. ఎక్కడెక్కడివో  ఉదాహరణలు తీసుకుంటూ అసలు ప్రపంచం ఎందుకు మారుతుందో ఆయన చెప్పిన తీరు మాపై చూపిన ప్రభావాన్ని  గురించి సింపుల్ గా చెప్పడం కష్టం.( ఆయన గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక్క విషయం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోడం చాలా అవసరం. ఆయన అదే టెక్స్ట్  బుక్  లో ఉన్న రవీంద్రుడి " ది హోం కమింగ్ " పాఠాన్ని చెబుతుంటే ఇంటికి దూరంగా ఉన్న మేమంతా కంట తడి పెట్టామనడంలో  అతిశయోక్తి యేమీ లేదు. ) సరే ఇంతకూ అసలు విషయం యేమిటంటే మూడు సంవత్సరాలు జైల్ లో ఉన్నట్టుగా  ఉన్న నాకు అవకాశం దొరికినప్పుడల్లా  సినిమాలు  చూడ్డం అలవాటు అయ్యింది. సినిమాకు ముందు తప్పనిసరిగా న్యుఎస్ రీల్ వేసే వారు. అందులో అప్పటి ప్రధాని ఐన స్రీమతి గాంధీని ,ఆమె కనిష్ట పుత్రుడైన సంజయ్ గాంధీని ఆకాసానికెత్తే తీరు నాకు ఎందుకో నచ్చేది కాదు. కారణం ఇదమిద్దంగా యీనాటికి కూడా చెప్ప లేను. అందుకే జనతా పార్టీ అధికారంలోకి రావడం ఎందుకో చాలా ఆనందాన్ని కలిగించింది. ఆ తరువాత ఎమర్జన్సీ లో జరిగిన వాటి గురించి పేపర్ లో చదివి ఆవేశం తెచ్చు కొనే వాడిని. ఆ వయసుకి ..నేను పెరిగిన పరిస్థితులకీ అంతకు మించిన రాజకీయ అవగాహన ఉండే అవకాశం లేదు. ఆ తరువాత జరిగిన సంఘటనలు..... మార్పులు చూస్తుంటే యేమీ అర్ధం కాక తల పగిలి పోతూ ఉండేది. ఇంతకు ముందు ఒక పోస్ట్ లో రాసి  నట్లుగా "జాబ్ అయినా చూపండి ..లేదా జైల్ లో అయినా పెట్టండి"  అనే స్లోగన్ నన్ను ఒక వూరేగింపులో పాల్గొనడానికి పురికొల్పింది. అంతకు ముందు సాహిత్యంలో భాగంగా "అమ్మ" నవల చదవడం జరిగింది కానీ యీ వూరేగింపు నన్ను ఒక సైద్దాంతిక రాజకీయాల పరిచయం కలిగించింది. విస్తృతంగా పాల్గొన నప్పటికీ ఎంతో కొంత చతన్యం  ఉన్న యువకుడిగా మాత్రం నన్ను నేను మలచు కొనడానికి ప్రయత్నం మొదలయ్యింది. 1977-80 జనతా పార్టీ  కాలం పోటెత్తిన రాజకీయ చైతన్యంతో ప్రారంభం అయ్యి కుళ్ళు కంపు కొట్టేతంటగా  దిగజారిన విలువలతో అంతం అయ్యింది. మొట్టమొదటి సైద్దాంతిక సందేహం నాకు 1980 పార్లమెంట్ ఎలక్షన్స్ లోనే వచ్చింది. అప్పట్లో సీ.పీ.ఐ. పార్టీ చరణ్ సింగ్ నేతృత్వంలోని గ్రూప్ ను సమర్ధిస్తే ...సీ.పీ.యం  పార్టీ మొరార్జీ నేతృత్వం లోని  జనతా పార్టీ తో కలసి పోటీ చేసింది. నిజంగానే నేనొక రాజకీయ పామరుడనే అప్పటికి. నాకు వచ్చిన సందేహం యేమిటంటే లోక్దళ్ ..జనతా పార్టీలతో ఉన్న భావ  సారూప్యత కన్నా...యీ రెండు కమ్యూనిస్ట్ పార్టీల మధ్య భావ సారూప్యత యెక్కువా కాదా అని.... సైద్దాంతిక నిబద్దత లేని పార్టీ  ల గురించి నేను మాట్లాడడం లేదు. కానె ఎంతో కొంత నిబద్దత ఉందని నమ్మిన కార్యకర్తల..ప్రజల మనసుల్లో కూడా ఒక గందరగోళాన్ని నింపారు. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. నేనప్పుడు అప్పుడప్పుడు మా కాలేజ్ దగ్గరలో ఉన్న  సీ.పీ.ఐ. ఆఫీస్ కు వెళ్తుండే వాడిని. ఒక సారి అక్కడ  జాతీయ బూర్జువా ..ప్రాంతీయ లేదా పెట్టీ బూర్జువా అన్న పదాల మీద  వివరణ ఇస్తూ అక్కడ ఉన్న నాయకులు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్ ను జాతీయ బూర్జువా పార్టీగాను..మిగిలిన వారిని పెట్టీ బూర్జువా పార్టీల గానూ గుర్తించాలని ముగించారు. ఆ తరువాత కొద్దికాలానికే అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి. తణుకు  మున్సిపాలిటీ కి  అప్పటి కాంగ్రెస్ యెం. పీ. అయిన చిట్టూరి సుబ్బా రావు గారి నేతృత్వం లో ఒక గ్రూప్ ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన శ్రీ  ముళ్ళపూడి హరిస్చంద్ర ప్రసాద్ నాయకత్వం లో ఒక గ్రూప్ పోటీకి దిగాయి. అప్పటికి సీ.పీ.ఐ. పాటీ రాజకీయ అవగాహన మేరకు వారు హరిస్చంద్ర ప్రసాద్ తో కలసి పోటీ  చేయాలి...కానీ అందుకు విరుద్దంగా జరిగింది. కారణమడిగితే యీ టౌన్ కి ఆయన పెద్ద బూర్జువా ...చిట్టూరి సుబ్బా రావు గారు చిన్న బూర్జువా అన్నారు. ఇలాంటి హాస్యాస్పదమైన నిర్ణయాల ఫలితమే యీ రోజు యే సిద్దంతమూ లేని ...అవకాశవాద...దిగజారుడు పార్టీల తోకలుగా కమ్యూనిస్ట్ పార్టీలు మిగిలి పోవలసి వచ్చింది.  కమ్మ్యూనిస్ట్ పార్టీ ల రాజకీయ సిద్దాంతాన్ని ఆ  రోజుల్లో అందరూ 100% సమర్ధించక పోవచ్చు..కానీ నమ్మిన సిద్దంతమంటూ ఒకటి ఉన్న పార్టీలు గా గుర్తించే వారు.  నా యీ సందేహాలు చదివిన పార్టీ నాయకులు..సమర్ధకులు...నాకొక పెద్ద సైద్దంతిక వ్యాసాన్ని పంపవచ్చు. కానీ వారు దృస్తిలో పెట్టుకోవలసింది......ఒక అతి సాధారణ పౌరిడికి అర్ధం అయ్యె రాజకీయ పరిభాషనే ఉపయోగించి చెప్పండి.బిల్గేట్స్ ని బిల్ క్లింటన్ ను భుజాన వేసుకుని తిరిగిన చంద్ర బాబు కాంగ్రెస్ కంటే యే విధంగా వామ పక్షానికి దగ్గరో నాకు అర్ధం కాదు. అంతే కాదు అధికారం కోసం అత్యంత దివాళా కోరు పనులని చేసిన కాంగ్రెస్ తో జత కట్టడానికి యీ వామ పక్షాలు సంకోచించ లేదు. అలా అంటే మత తత్వానికి అడ్డు కట్ట వేయడానికంటారు. కానీ "షాబాను మచ్చ ...బాబ్రీమసీదు కూల్చి వేత పత్ల ఉపేక్షభావం..లాంటివి...ఆ పార్టీని మతతత్వ పార్టీ ల కంటే తక్కువగా యెలా చూడగలరో అర్ధం కాదు. అంతకన్న దారుణమైన విషయమేమిటంటే 1989 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వారు వూరూరా గాంధీ,నెహ్రూ విగ్రహాల పక్కనే వారు  ప్రతిస్టించిన విగ్రహాన్ని చూస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అసలు నైజం అర్ధం వుతుంది. తమ పర్టీ నాయకుల విగ్రహాలను ప్రతిస్టిచడం తప్పు కాకపోవచ్చు...కానీ అవి యెవరి పక్కన ప్రతిష్టిస్తున్నామన్నది కూడా ముఖ్యం కాదా......
1950 ల నాటి పత్రికలు  ఒక్క సారి అర్చీవ్స్ కెళ్ళి  తిరగెయ్యండి. ఒక్క చోట కూడా " సామాజిక వర్గం " అన్న పదం కన బదదు. యీ నాదు పంచాయితీ వార్డ్ మెంబెర్ ఎలెక్షన్స్ కు కూడా మెడియా వారు సామాజిక వర్గాల విస్లేషన అందిస్తారు. యీ అలోచన తప్పు అని చెప్పరు సరి కదా...దానికి ఆహార్యాన్ని అంద జేస్తారు. యెవరి ప్రయోజనాలు వారివి. యీ పరిస్థితి చూస్తుంటే మొన్ననే వచ్చిన "రాజన్న" చిత్రంలోని పాట పదే పదే వినాలనిపిస్తొంది. ఆ పాటలో రచయిత "యెగిరిపోవె..యాడికైనా..." అని అర్ధిస్తాదు. కానీ మనం ఇక్కడే ఉందాలి కదా....గదులలో కూర్చుని ....మనకెందుకులే అనుకుంటున్న అభ్యుదయ మేధావి వర్గమంత.....వీధులొకి కదలాల్సిన సమయం వచ్చింది. ళేకుంటే మరేమీ ఇక మిగలదు. మన సిద్దాంత వాదోపవాదాలు వినిపించాలంటే కనీసం మనం బ్రతికి ఉందాలి కదా.......అన్నీ ఒక్క సారి పక్కన పెట్టి ముందు యీ కుళ్ళును కడిగి ఆ తరువాత వచ్చే మంచి వాతావరణంలో తీరిగ్గా వాదించుకొందాం.