"నేనెక్కడున్నాను " అప్పలనాయుడు ఇబ్బందిగా అన్నాడు చుట్టూ చూసి .....
నిజానికి అక్కడెవరూ లేరు కూడా ....... కానీ భయంకరమైన శబ్దాలతో గోలగా ఉంది .అది ఏ భాషో కూడా తెలియడం లేదు
"ఇదేమన్నా సినిమా అనుకున్నావేమిటి .... అడిగిన చెత్తకంతా సమాధానం చెప్పడానికి .... "
గాలిలోనుండి సమాధానం వచ్చింది .
"నేనిక్కడ ఎందుకున్నాను ..... ?"
"చనిపోయాక ఎక్కడుంటారు మరి ?"
మరలా గాలిలోనుండే .....
"ఇది స్వర్గమా .... నరకమా ..... ?"
"నీకెలా అనిపిస్తుంది .... ?"
"ఇంత గోలా..... శబ్దమూనా .....ఖచ్చితంగా ఇది నరకమే ...... "
"నీలో కాస్త నిజాయితీ ఉంది .....కానీ ఇప్పుడర్ధమయ్యిందా ..... నీవు ఎంత మందికి నరకం చూపించావో ?"
"ఇదన్యాయం ..... నేను దేవుడి పాటలే కదా ...... అందరికీ వినిపించింది .... "
"నిన్నెవరైనా అడిగారా వినిపించమని ?"
"పుణ్యం వస్తుంది కదా......... అని "
"ఎవరికి పుణ్యం వస్తుంది ..... అసలు పుణ్యం ఎలా వస్తుందో చెప్పు ...... "
"భగవన్నామ స్మరణ ..... ధ్యానం ..... "
"శభాష్ ..... మరి స్మరణ .... ధ్యానం ఎక్కడ చేస్తారు ?"
"మనసులో ..... "
"అంటే నీకన్నీ తెలుసు ..... భక్తి మార్గానికీ ..శబ్దానికీ ఏ సంబధం లేదని ...... కానీ వేరే వెధవాలోచనతో ఈ మైకులు గట్రా వాడావు ..... అవునా ?"
"ఏదో కాస్త ఆర్భాటం చేస్తే ..... ప్రజలు పట్టించుకుంటారని ..... "
"భక్తి నీ మోక్షానికే కదా ...... మరి ప్రజల సంగతి ఎందుకు ? అంటే నీకు భక్తి కంటే ఆర్భాటం మీదే మోజేక్కువన్న మాట ..... అంటే నీ భక్తిని ప్రజలు పట్టించుకోవాలనే తపన .....కాదు .. కాదు కుతి ఎక్కువన్న మాట .... "
"నన్నొక్కడినే ఇన్ని మాటలు అంటున్నారు ...... మా ప్రాంతంలో భక్తి అంటే ఇలానే ఉంటుంది ..... మరి వాళ్ళంతా ఇక్కడికే రావాలా ?"
"ఒక్క విషయం విను ...... క్లాస్ కి రాగానే టీచర్ ఏం చేస్తాడు ?"
"పిల్లలని నిశ్సబ్దంగా ఉండమంటాడు "
"ఎందుకు ?"
"తను చెప్పేది అందరికీ వినబడడానికి "
"కరెక్ట్ గా చెప్పావ్ .....మరి ఇప్పుడు నీ భక్తి కోసం నీవేం చేసావ్ ?"
"మైకుల సంగతి వదిలేయ్ స్వామీ ..... గుడిని పెద్దది చేసాను కదా ..... "
"కొంచెం వెనుకగా ఉన్న గుడిని రోడ్ వైపుకి పెంచారు ..... ట్రాఫిక్ కి అడ్డంగా ...... అసలు పాత రోజుల్లో గుళ్ళన్నీ ఎత్తైన ప్రదేశాల్లో ఎందుకు కట్టేవారో తెలుసా .... మాకు తెలిసిన ఒక కారణం వరదల భయం అయితే .... వేరే కారణం రహదారుల కు భవిష్యత్తులో ఇబ్బంది రాకూడదని "
"ఏది ఏమైనా నేను తప్పైతే చేయలేదు కదా ..... "
"అని నీవనుకుంటే సరిపోదు .....సమాజంలో ఒక్క మతమే కాదు కదా ఉంటా .... నీ లాంటి వాళ్ళు అన్ని చోట్లా ఉంటారు కదా ..... నిన్ను చూసి వేరే రెండు మతాల వాళ్ళు కూడా మందిరాల కోసం రోడ్లు ఆక్రమించేసారు . నష్టపోయేది ........ సామాన్య జనం .... నీలాంటి వాళ్ళను నిలదీసే ధైర్యం లేని జనమే .... "
"క్లాస్ లో టీచర్ గురించి చెప్పబొయ్యారు .... "
"అక్కడికే వస్తున్నాను ... పిల్లలు నిశ్సబ్దంగా ఉంటేనే ..... టీచర్ తన కర్తవ్యాన్ని నిర్వహించగలుగుతాడు .... కానీ నీలాంటి వాళ్ళు నలుగురు చేరి అరవడం ప్రారంభిస్తే .... 60 మంది పాడవుతారు ... అవునా ... మన దేశం కూడా కిక్కిరిసిన విద్యార్ధులున్న క్లాస్ రూం లాంటిదే .... అభివృద్ధి సక్రమంగా ఉండాలంటే మతాన్ని రహదారి గా మాత్రమే ఉంచాలి . అడ్డదారి గా వాడుకునే అవకాశం ఉండకూడదు . "
"అంటే ... "
"మతం ... నీకు మోక్షానికి దారి చూపేదిగా మాత్రమే ఉండాలి తప్ప .... అధికారాన్ని సంపాదించే మార్గంగా ఉండకూడదు ..... ఉంటే గనుక అనేక మతాలు సహజీవనం చేసే అవసరమున్న మన సమాజం సంక్షోభంలో పడుతుంది . "
"అలా అయితే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రభుత్వానిదేమీ తప్పు లేదా .... ?"
"బాగానే అడిగావు .... కానీ మరింత వివరంగా అడుగు ..... "
"మా వైజాగ్ లో ఆసీల్ మెట్ట సెంటర్ లో 12 సంవత్సరాల క్రితమో ... అంతకు ముందో ... ఒక లాజిస్టిక్స్ ఆఫీస్ తాలూకు గోడలో వినాయకుడి విగ్రహం పెట్టారు .... వీధి పోటు ఉందని . కానీ అదే భవనం లో "నారాయణ కాలేజ్ " పెట్టారు. లోపలికి వెళ్ళేటప్పుడు విద్యార్ధులు కాబట్టి అలవాటుగా ఒక దణ్ణం పెట్టి పోతూ ఉండేవారు. అంతే కాని అదేమీ స్వయంభువు గా వెలసిన విగ్రహం కాదు .... దానికేమీ స్థల పురాణం లేదు . ఆ తరువాత నెమ్మదిగా మెయిన్ రోడ్ కాబట్టి టూ వీలర్స్ వాళ్ళు ఆగుతూ ఉండే వారు. అసలు అప్పుడే అక్కడ వెహికిల్స్ పార్క్ చేయడం మీద నిషేధం పెట్టి ఉంటే ..... ఈ రోజు అక్కడ ప్రతిదినం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్య ఉండేది కాదు కదా ..... మరి మా లాంటి వాళ్లకు పరోక్షంగా సహకారం అందిస్తున్న అధికార వర్గాలు వెళ్ళేదెక్కడికి ? నరకానికా .... స్వర్గానికా ?"
"కొంతైనా సమస్యల మూలాల లోకి వెళ్ళావు కాబట్టి నీకు ప్రమోషన్ ఇచ్చాం .... స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి చూడు .... "