చాలా సీరియస్ గా లేప్ టాప్ మీద వర్క్ చేసుకుంటున్నాను. డోర్ మీద ఎవరో తట్టిన శబ్దం వినబడింది.విసుగుతో వెళ్ళి తలుపు తెరిచాను.ఎవరో పెద్దాయన...తలకి తలపాగా ఉంది.. కింద పంచె కట్టే గాని పైన మాత్రం కోటు వేసుకుని ఉన్నాడు.ఎగా దిగా చూసాను. పనికి ఆటంకం కలిగించినందుకు కోపంగా కూడా ఉంది.
"బాబూ.....ప్రసాదంటే ..."
"ఆ నేనే...చెప్పండి.." విసుక్కుంటూనే అన్నాను.
"కొంచెం లోపలకి రావచ్చా బాబూ..."
యీయనెవరో తెలియదు పైగా లోపలకి రావచ్చా అని అడుగుతున్నాడు.
విసుపుగా చూస్తూ గుమ్మానికి అడ్డం తొలిగాను.ఈయన ఎవరో బోధపడ్డం లేదు.మా శ్రీమతి తరపు దూరపు బంధువేమో..
లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
"దాహంగా ఉంది ..కొంచెం మంచి తీర్ధం ఇప్పించు బాబూ.."
ఆ పెద్దాయన అలా అడిగే సరికి కాస్త మానవత్వం పైకి వచ్చింది. కొంచెం సిగ్గు పడ్డాను కూడా..
"నన్నెప్పుడూ చూడలేదా బాబూ..."
మంచినీళ్ళు తాగిన తరువాత ఆయన తాపీగా అడిగాడు.
"లేదండీ ...తను కూడా ఇప్పుడే బయటకు వెళ్ళింది..."
ఖచ్చితంగా ఈయన మా శ్రీమతి వైపు బంధువే అనే నిశ్చయంతో అన్నాను.
"అయ్యో ఆమెకు నేనెవరో తెలియదు బాబూ..."
గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఈయన ఎవరో నేనెలా గుర్తుకు తెచ్చు కోవాలి....
ఎందుకైనా మంచిదన్నట్లు ఆయన ముఖంలోకి చూసాను. ....బొద్దు మీసాలు.....విజ్ఞానంతో..జిజ్ఞాస తో కూడుకున్న ముఖం....
అలా చూస్తూ ఉండిపొయ్యాను.నిజమేనా....ఈయన ఎలా....
మనసు ఆనందంతో పరవశమవుతోంది...కళ్ళలో నుండి నీళ్ళు వాటికవే వచ్చేస్తున్నాయ్...
అప్పుడు ఆయన పెదాల మీద ముసి ముసి నవ్వులు చూసాను.
"నీ వూహ కరెక్టే... నేను అప్పా రావునే...."
నవయుగ వైతాళికుడు....తెలుగు సాహిత్య సీమను నలుదెసలా వ్యాపింప చేసిన వాడు.... ప్రపంచం లోని ఉత్తమ 10 నాటకాల ఒకటైన " కన్యా శుల్కాన్ని" రచించిన మహనీయుడు ..నా కళ్ళెదురుగా కనబడేసరికి మనసంతా ఉక్కిరి బిక్కిరి అయిపొతోంది .ఆతిధ్యం ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియడం లేదు.ఇరుగు పొరుగు వాళ్ళతో కలసి బట్టల దుకాణానికి చెక్కేసిన శ్రీమతి మీద చచ్చేటంత కోపం వచ్చింది.
" కాఫీ గాని టీ గాని.." ఏమని సంబోదించాలో కూడా తెలియడం లేదు.
"అవేమీ వద్దు బాబూ....కాస్తంత మజ్జిగ ఉంటే చాలు..."
నాలుగు పచ్చి మిర్చి కోసి ,అల్లాన్ని సన్నగా తరిగి..కరివేపాకు కూదా ముక్కలుగా చేసి మొత్తాన్ని బాగా గిలకొట్టి ఆయనకు అందించాను.
"చాలా సంతోషం నాయనా...."
తాగిన గ్లాసు అందుకొన్నాను
"ఇప్పుడు నేను వచ్చిన పని గురించి మాట్లాడదామా "
నేను దేనినైతే కదుపుదామనుకున్నానో దానిని ఆయనే కదిపే సరికి సంతోషం వేసింది.
"ఇంతకూ ఈ పెట్టెతో ఏం చేస్తున్నావోయ్..."నా లాప్ టాప్ ను చూపిస్తూ అడిగారాయన.
గతుక్కుమన్నాను...నేను రాస్తున్న యీ పోస్ట్ యీయన చదివేస్తారేమిటో ఏమిటో....
"ఫరవాలేదు ..కాస్త చూడనీయ్ నాయనా.."చనువుగా నా లాప్ టాప్ ను చేతుల్లోకి తీసుకున్నారు
కొంత సేపు అలా చదువుతూ కూర్చున్నారు...ఆ మీసాల వెనుక అప్పుడప్పుడు మెరిసిన నవ్వు చూస్తుంటే నేను నోబుల్ ప్రైజ్ అందుకోడానికి వెళ్తున్న భావన కలిగింది.
"బాగానే రాస్తున్నావ్..." నవ్వుతూ నా లాప్ టాప్ నా చేతులో పెట్టారు.
అసలు యీయన ఇలా సడన్ గా కనబడి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు.రాచమల్లు రామ చంద్రారెడ్డి గారి "సారస్వత వివేచన " చదివిన దగ్గరనుండి సవా లక్ష డౌట్లు మనసు లో ఉండేవి...అవన్నీ ఒక్కటీ బయటకు రావడం లేదు.ఏది ఏమైనా ఏదో ఒకటి అడగాలనుకున్నాను.
"మీరు పనిచేసింది ఒక మహారాజు గారి దగ్గర...కానీ సమాజాన్ని మార్చాలన్న ..అది కూడా సమూలంగా అన్న మీ భావనలకు మహారాజు గారు ఎలా ప్రోత్సాహం ఇచ్చేవారో అర్దం కావడం లేదు గురువు గారూ...సాధారణంగా రాజులు మార్పుకి వ్యతిరేకంగా ఉంటారు కదా....."
ఆయన మీసాల వెనుక మరలా చిరు నవ్వు....
"నీ అభిప్రాయం తప్పు నాయనా...మార్పు అనేది అనివార్యమని తెలివైన పాలకులందరికీ తెలుసు...కానీ బలవంతంగా ఐనా ఆ మార్పులని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకునే వాడు మూర్ఖుడిగా మిగిలి పోతారు..వస్తున్న మార్పులకి ఆహ్వానం పలికేవాడు వాటికి అనుగుణంగా ఉంటారు.మీకున్న ఒకే ఒక్క సౌలభ్యం ఏమిటంటే మీకు కావలిసిన పాలకులని మీరే తెచ్చుకో వచ్చు"
నాకు నిజంగా నవ్వు వచ్చింది...నిజంగానే నవ్వేశాను.
"అలా నవ్వావేమిటి నాయనా..."
"గురువు గారూ...మీరు రామప్పంతులు కంటే క్రూరుడిని..నయవంచకుడిని ఊహించలేరు....కానీ ఇప్పుడు ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థని చూస్తే రామప్పంతులే చాలా ఆనంద పడిపోతాడు నా వారసులు ఇంతకు వేయింతలుగా ఆ లక్షణాలను మరింతగా విస్తృత పరుచుకుని ఇంతలా అభివ్రుద్ది చెందిపొయ్యారని..."
"మరి మీకు వాళ్ళనే ఎన్నుకోవలసిన అవసరం లేదు కదా...."
"అంతా అలాంటి వాళ్ళే అయినప్పుడు"
"అదేమిటి నాయనా ...."
"నేను ఎక్కువ వివరాలు ఇచ్చేటంత జ్ణానం ఉన్నవాడిని కాను గానీ నా స్వానుభవంతో తెలుసుకుంటున్న విషయాలు కొన్ని ఉన్నాయి ..అవి మీకు చెప్పగలను. నాకు మా వూరు అంటే ఎంతో ఇష్టం. ఎవరికైనా అంతే అనుకోండి.ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఉద్యోగం చేసి ఇక మా వూరికెళ్ళి పోదామని నిర్ణయించుకోడమేమిటి అమలులో కూడా పెట్టడానికి సిద్ద పడ్డ తరువాత ....మా వూరు వెళ్ళి అక్కడున్న నా పాత స్నేహితులని సలహా అడిగాను. వాళ్ళంతా వెలిబుచ్చిన ఏకాభిప్రాయం ఏమిటంటే నాకు బుర్ర చెడిపోయిందని."
"అదేమిటి బాబూ...నీ వూరిలో నీవు స్థిరపడతానంటే నీ స్నేహితులు ఆనందించాలి కానీ ..."
"వాళ్ళకు ఆనందమే కానీ వాళ్ళనేదేమిటంటే ఏదో కాస్తో కూస్తో సుఖాన ఉన్న ప్రాణాన్ని కష్టాల లోకి ఎందుకు నెట్టుతున్నానా...అని"
" ఇరుకు ఇళ్ళు...ఇరుకు మనసులు.....పరుగులు.....ఇవి సుఖమా...."
"మీ లాగే నేనూ అనుకుటూ ఉండేవాడిని గురువు గారూ.....అసలు మా వూరి లో కాస్త వెసులు బాటు ఉన్నవాళ్ళంతా ఎప్పుడో టౌన్ కెళ్ళె పొయ్యారు. రక రకాల కారణాల వలన ...వ్యవసాయాలు కిట్టు బాటు కాక..పిల్లల చదువుల కోసం ......"
"అదేంటి బాబూ...మీ వూరిలో స్కూల్ లేదా...."
"చక్కటి స్కూల్ ఉంది"
"ఉపాధ్యాయులు లేరా..."
"బాగా చదువుకున్న వారే ఉన్నారు"
"పట్టణాల్లో ఉన్న స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు మరింత విజ్ణానవంతులా.....?"
"ఏమీ కాదు గురువు గారూ...."
"బాగా వ్యాయామం. ....అదీ నేర్పి కుస్తీ పోటీల లాంటి వాటికి తర్ఫీదు ఇస్తారేమో..."
"అసలక్కడ ఆట స్థలాలే ఉండవు"
"విజ్ఞాన శాస్త్ర అభివృద్ది కోసం మంచి ప్రయోగశాలలు ఉంటాయేమో మరి..."
"అబ్బా....అసలలాంటివేమీ ఉండంటున్నానా...."గురువుగారి అమాయకత్వానికి కాస్త విసుగు కూడా వచ్చింది.
"మరి యే ప్రత్యేకత లూ లేని ఆ స్కూళ్ళ కోసం పట్టణానికి వెళ్ళవలసిన ఆగత్యం ఏముంది నాయనా..."
" అక్కడ అహర్నిశలూ పాఠాలు వల్లె వేయిస్తుంటారు గురువుగారూ...."
"మా రోజుల్లో వేకువ ఝామునే లేచి కొంత మంది బ్రాహ్మణ కుర్రాళ్ళ చేత వేదాలు...మొదలైనవి వల్లె వేయిస్తుండే వారు...పగటి పూట కాదు...మరి యీ అహర్నిశలూ వల్లె వేసే అంశాలు ఏమిటో....?
"వాళ్ళ పాఠ్యాంశాలే స్వామీ.....అంతకు మించి ఒక్క ముక్క కూడా అధికంగా తెలియనివ్వరు.."
" యీ కాస్త దాని కోసం రోజంతా గదుల్లో బంధించి చదివిస్తారా.....అమానుషం నాయనా......అసలు వీళ్ళు యీ సమయంలో పదిమందితో కలసి ఆటలాడుతూ ...వ్యాయామం లాంటివి చేయక పోతే వీళ్ళ బాల్యావస్థ మసి బారి పోయినట్లే కదా......"
"అయ్యో గురువు గారూ...మా అబ్బాయి విషయంలో యదార్ధంగా జరిగిన సంఘటన మీకు సెలవిస్తాను.వాడు నిత్యం కోతి చేష్టలు చేస్తూ పళ్ళికిలిస్తూనే ఉంటాడు. వాడుంటేనే మా బంధువులమంతా కలసినప్పుడు గోలగా ఉండేది. కానీ స్కూల్లో ఒక టీచర్ కు మాత్రం ఇది పెద్ద అభ్యంతరకరమైన విషయమై కూర్చుంది. మిగిలిన చాలా మంది విద్యార్ధులు టెన్షన్ తో ఎప్పుడూ ముఖాలు వేళ్ళాడేసుకుని ఉంటుంటే వీడి ఒక్కడికే అలా నవ్వు ఎలా సాధ్యమౌతుందో ఆవిడకు అర్దం కాలేదు. మమ్మల్ని స్కూల్ కు రప్పించి మరీ ఆవిడ వార్నింగ్ లాంటిది ఇచ్చింది. కాబట్టి నే చెప్పేదేమిటంటే ఇప్పుడున్న తరాలకు బాల్య యౌవన దశలు అనేవి ఉండవు...వూహ వచ్చిన తరువాత డైరక్ట్ గా కౌమార దశే...."
"చాలా బాధగా ఉంది నాయనా....సమాజాన్ని ఇంతలా భ్రష్టు పట్టించినందుకు మీ నాయకులు సిగ్గు పడడం లేదా...."
"అయ్య బాబోయ్ ..నేను చెప్పింది భ్రష్టు పట్టి పోయిన ఒక రంగం గురించి మాత్రమే.....ఇటువంటివి మరెన్నో....మరి ఇక రాజకీయ రంగం గురించి విన్నారంటే ఇక్కడే భళ్ళున వాంతి చేసేసుకుంటారు."
"ఇంత కుళ్ళుని ఎలా భరిస్తున్నారు బాబూ...కష్టంగా లేదా.."
"మీరు నాలుగు రోజులుంటే మీకూ అలవాటై పోతుంది గురువుగారూ....ఒక్క ఉదాహరణ చెబుతాను. మా సినిమా రంగం లోకి చాలా మంది కొత్త హీరోలు వస్తుంటారు.అంటే వాళ్ళు గొప్ప నటులని కాదు. వాళ్ళ తాత తండ్రుల మూలాలు ఆ రంగం లో ఉన్నాయన్న ఒక్క అర్హత తోనే. మొదట్లో జనం "చీ ...వీడు హీరో ....ఏంటి " అని తిట్టుకుంటారు.కానీ కొద్ది రోజులు అలా చూసి చూసి అలవాటు చేసేసుకుంటారు. ఆ తరువాత వాళ్ళు నటనకు భాష్యాలు కూడా చెప్పేస్తారు."
"కొంపదీసి నా కన్యాశుల్కాన్ని కూడా భ్రష్టు పట్టించేస్తారో ఏమిటో నాయనా..."
"డబ్బులొస్తాయని గారంటీ ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది.అంతే కాదు దానికి నంది అవార్డ్ రాదని గారంటీ కూడా ఏమీ లేదు."
"మరి ఇంత మంది మేధావులు....... చదువుకున్న వాళ్ళు ఏమి చేస్తుంటారు నాయనా..."
" మీకా భయం ఏమీ అక్కర లేదు...ఎప్పుడూ ఎవరి పనులలో వారు చాలా బిజీగా ఉంటారు"
"నాకు సరిగా అర్ధం కావడం లేదు బాబూ....."
"మీకు బయట పెద్ద గోల వినబడుతుందా....?"
"అవును బాబూ.....అదే ఏమిటా అని అడుగుదామనుకున్నాను"
"ప్రస్తుతం వినాయక చవితి సీజన్ నడుస్తోంది..దీని తరువాత వేరే సీజన్.....ఆ గోల అలానే ఉంటుంది...దానివలన మా అపార్ట్మెంట్ లోనే కనీసం పదిమంది విద్యార్ధులు బాధ పడుతున్నారు....తెల్లవార గట్ల చూడండి ప్రశాంతమైన నిశ్శబ్దాన్ని కలుషితం చేస్తూ మైకులు ఏ స్థాయిలో అరుస్తుంటాయో..బాధపడే వాళ్ళు ఖచ్చితంగా వేలల్లోనే ఉంటారు. యీ మైకులు పెట్టి ఆనందించే వాళ్ళు పదుల సంఖ్యలోనే ఉంటారు.కానీ వాళ్ళంతా సంఘటితంగా ఉన్న వాళ్ళు. సంఘటితంగా ఉన్న కొంత మంది మొత్తం జనాన్ని కంట్రోల్ చేస్తున్నారు.మొత్తం రాజకీయ పార్టీల నాయకులంతా ఇంచుమించు ఆ కోవలోకే వస్తారు"
"అయ్యో నాయనా....ఇటువంటి వాళ్ళు ...అనేక పార్టీలు మారి మంత్రులైన వాళ్ళు ఈ మద్య నా 150 వ జయంతుత్సవాలకు ముఖ్య అతిధులైనందుకు నాకు చాలా బాధగా ఉంది "
"మేము వీటన్నిటికీ అతీతులమై పోయాం గురువు గారూ...ఇంచు మించు మాలో రక్త మాంసాలు...చీమూ..నెత్తురు లాంటివి హరించుకు పొయ్యాయి...మీరు ఆ తరంలో వీటిని మీ శరీరంలో పూర్తిగా నింపుకున్న వాళ్ళు కాబట్టి కాస్త బాధగానే ఉంటుంది మరి"
"ఇంకొక చిన్న విషయం ...నా జ్ఞాన హీనతకు కొద్దిగా సిగ్గుగా ఉన్నది.....అన్యధా భావించక నాకొక్క చిన్న సందేహ నివృత్తి చేయగలవా నాయనా.....?"
"నవుయుగ వైతాళికులు.....మహా సంస్కర్త....మీకు సందేహ నివృత్తి చేయగలగడం నిజంగా నా అదృష్టం సెలవీయండి..."
"ఏమీ లేదు నాయనా.....ఈ విశాఖలోని ఒక ముఖ్య కూడలిలో నా విగ్రహాన్ని ప్రతిష్టించారు...కానీ నాకు కొంత దూరంలోని కూడళ్ళలో ఎవరో మహనీయులనుకుంటాను ..వారి విగ్రహాలు కనబడుతున్నాయి....వారెవరో నాకు తెలియదు. నా విగ్రహం వారి పక్కన ఉండదగునో లేదో తెలియదు....కాస్త వారి గురించి సెలవిస్తే తెలుసుకుని సంతోషిస్తాను నాయనా..."
"క్షమించాలి గురువుగారూ....మేము ఇక్కడికి వచ్చి కేవలం పుష్కర కాలమే కావస్తోంది .....కాబట్టి వారి గురించి నాకేమాత్రం తెలియదు....వారి గురించి ఎక్కడా చదివిన గుర్తు కూడా లేదు......ఐనా గురువు గారూ....మీదంతా చాదస్తం కానీ విగ్రహం పెట్టాలంటే మహనీయుడే కానక్కరలేదన్న విషయం మీకింకా అర్ధం కానందుకు నాకు బాధగా ఉంది."
తననుద్దేసించోమే నన్న సంశయంతో గురువుగారు నా వంక బేలగా చూసారు.వెంటనే నాకు చేసిన తప్పు అర్ధం అయ్యింది.
"మిమ్మలనుద్దేశించి కాదు. ....మీతో వీళ్ళకు పోలికా.....
"నీవు పొరబాటుగా అర్ధం చేసుకుంటున్నట్లున్నావ్ ...మహనీయులు కాని వారి విగ్రహాల్ని ఎందుకు పెడతారు నాయనా..."
"భలే వారే......బ్రతికుంటే జైల్ లో కెళ్ళవలసి వచ్చుండే నాయకుడి విగ్రహాలు కూడా సగర్వంగా ఇంచు మించు అన్ని కూడళ్ళ లోనూ నిలబెట్టబడి ఉండడం తమరు గమనించ లేదనుకుంటాను.....అంతే కాదు.....మీకు గాంధీ మహాత్ములు...పండిట్ నెహ్రూ లాంటి మహనీయుల గురించి తెలుసు కదా..."
"అదేమిటి నాయనా వారు అటూ ఇటూగా నా సమకాలికులు కదా....గొప్ప దేశ భక్తులు... .మా రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మూల స్తంభాలు వారు"
"మరి ఆ పార్టీయే తమ నాయకుడొకరు హత్య కావించబడితే ఆ మహనీయుల విగ్రహాల సరసనే యీ నాయకుడి విగ్రహావిష్కరణ చేయించింది....."
"నేనిక భరించలేను నాయనా......వెళ్ళి వస్తాను..".గొడుగు చేతిలోకి తీసుకుని బయటకు నడిచారు.
"గురువుగారూ....ఒక్క నిముషం ...నేనింకా చాలా చెప్పాలి" అంటూ లేవ బోయాను.కానీ కాలికి ఏదో అడ్డం తగిలింది. అయినా బలంగా లేవబోయాను.
"ఏమిటి నాన్నా...నా కాలుని అలా గెంటేస్తున్నావ్" అన్న సుపుత్రిడి మాతతో నిద్రాభంగ మయ్యింది కానీ కనీసం నిద్రలో నన్నా ఆ మహనీయుడితో సంభాషించగలిగానన్న తృప్తి తో గాఢంగా నిద్రపొయ్యాను.