25, డిసెంబర్ 2014, గురువారం

మనం "PK" సినిమా ఎందుకు చూడాలంటే ......



దారిన పోతున్న వ్యక్తెవరైనా
“ అయ్యా మీ తల మీద బూజు ఉంది “ అన్నాడనుకుందాం.
 దాని వెనుకే కొన్ని  ప్రతిస్పందనలుంటాయి. నా ఆలోచన సవ్యంగా ఉంటే వెంటనే తల తుడుచుకుని
“థాంక్ యూ” అంటాను. లేదంటే
”ఏ ....నీ షర్ట్ వెనక ఇంత ఆయిల్ మరక ఉంది .....దాన్ని చూసుకో ముందు ....నా తల సంగతి నీకెందుకు ?” అని గయ్యి మంటాను. లేదంటే
“ఏరా....నీ కంపెనీ షాంపూ ని ప్రమోట్ చేసుకోడం కోసం వెధవ ప్రయత్నాలు చేయకు ....నేనెప్పుడూ కుంకుడు కాయలతోనే తలంటుకుంటాను. ఎక్కడి నుండో షాంపూలు పట్టుకొచ్చి మా మీద బలవంతంగా రుద్దుతున్నారు .....అయినా నా తల మీద బూజుంటే నీకెందుకు ?...పేడ ఉంటే నీకెందుకు ?” అని కూడా గయ్యిమనొచ్చు.

                                  కాకపొతే ఈ మూడు సమాధానాలలో ఏది సవ్యమైనదో విజ్ఞులైన పాఠకులు కే తెలుసు. ఇంత ఎందుకు రాయవలసి వచ్చిందంటే ఈ మధ్యే వచ్చిన  “పీకే “ సినిమా మీద జనాలలో ఈ 3 రకాల ప్రతిస్పందనలూ కనబడుతున్నాయ్.
తమకు మోక్షం ప్రసాదించమనీ .....తమ ప్రయత్నాల వలన పరిష్కారసాధ్యం  కాని సమస్యలకు పరిష్కారం చూపమనీ  సాధారణంగా సామాన్య మానవులు భగవంతుడిని వేడుకుంటుంటారు. దానికొక మార్గం చూపించేదే మతం. ప్రతి మతమూ ఎవరో ఒకరు ప్రవక్తతో ప్రారంభం అవుతుంది(ఒక్క హిందూ మతమే దీనికి ఎక్సెప్షన్). వారు ప్రతిపాదించిన మార్గం ఆనాటి సమాజం లోని అనేకానేక ముఖ్య సమస్యలకు పరిష్కారం చూపించింది కాబట్టే సామాన్య జనం దాన్ని అవలంబించారు అంతేకాదు పరిశీలించి చూస్తే ఒక విషయం అర్ధం అవుతుంది ఇంచుమించు అన్ని మతాలూ ప్రారంభంలో  ఆనాటి పాలక వర్గాలకు వ్యతిరేకంగా పనిచేసినవే . కానీ కాలక్రమేణా పాలక వర్గాలకు జనాలలో వీటికున్న ఆదరణ అర్ధం కాకపోదు. అప్పుడు పాలక వర్గాలు ఈ కొత్త మతాలకు మారడం జరుగుతుంది ...ఎందుకంటే అది వారి మనుగడకు ముక్ఖ్యం కాబట్టి. ఆ తరువాతే అవి పాలక వర్గాల ప్రయోజనాల కోసమే ఎక్కువగా పని చేస్తాయి. సూక్ష్మంలో మతాల ప్రస్తానం ఇదే. (దీనికి మాత్రం హిందూ మతం ఎక్సెప్షన్ కాదు ....హిందూ మతంలో ఇది చాలా ముందు గానే ప్రారంభం అయ్యింది.). ఈనాటి రాజకీయ పార్టీలకు సిద్దాంతాల జోలికి పోని లంపెన్ సైన్యం కావాలి. దానికి అనుగుణంగానే నేటి యువతను లంపెన్ భావజాలంతో ఉంచడానికి మతాల సాయంతో పాలక వర్గాలు చేస్తున్నాయి. దీనికి ఇప్పుడు కొత్తగా మీడియా కూడా తన వంతు సాయం చేస్తోంది. ప్రశ్నించే శక్తిని హరించేయడంలోనే వాళ్ళందరి క్షేమం ఉంటుంది. దీనినర్ధం చేసుకోలేకపోతే మన యువత పైన నేనిచ్చిన మూడు ఉదాహరణలలో కొట్టుమిట్టాడుతుంటారు. అంతే కాదు మతం పేరు మీద అనవసరంగా జరుగుతున్న అట్టహాసాలని సంధించే ప్రశ్నలను తెలివిగా భగవంతుడి ఉనికికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంగా అమాయక జనాన్ని చాలా సుళువుగా నమ్మించేస్తున్నారు. పైగా ఈ ప్రశ్నలు అడుగుతున్న వారిని ఒకరి అభిముఖంగా ఒకరిని నిలబెట్టి వీరు చోద్యం చూస్తున్నారు. కాబట్టి తెలివైన యువత చేయవలసిన మొదటి పని ప్రశ్నించడం ....
ఇప్పుడు మనం PK సినిమా దగ్గరకు వస్తే .......ఈ సినిమా ద్వారా మధ్యలో ఉండే బ్రోకర్ ల వంటి స్వామీజీలను మన మధ్య నుండి గెంటేసే ప్రయత్నం చేసిన అమీర్ ఖాన్ అన్ని విధాలా అభినందనీయుడు. ఈ సినిమాలో ఎక్కడ కూడా భగవంతుని ఉనికిని ప్రశ్నించ లేదు. కాబట్టే ఈ సినిమా లోని విషయం మీద దాడి చేయలేని వారు ఈ సినిమాని విమర్శించడానికి అమీర్ ఖాన్ మతాన్ని వాడుకుంటున్నారు. “సత్యమేవ జయతే” లాంటి ప్రోగ్రాం ను,”పీప్లీ లైవ్ “ లాంటి సినిమాను  రూపొందించిన మనిషి లోని చైతన్యానికి ప్రేరణగా  మతాన్ని చూపించడానికి మన వాళ్ళు ఏ మాత్రం సిగ్గు పడడం లేదు.
రోజూ మనం నడుస్తున్న రోడ్ కి కూడా కొద్ది కాలానికి మరమ్మత్తులు చేయవలసి వస్తుంది. మరి ఎప్పుడో పుట్టిన మతానికి అవసరం ఉండదా ? జనం దగ్గరకి మతాన్ని తీసుకు రావడానికి బమ్మెర పోతన లాంటి మహాకవులు ప్రయత్నం చేసినా దాన్ని పాలక వర్గాలు పట్టించు కోవు ....ప్రచారం చేయవు. నిజంగానే ఏ స్వామీజీ అయినా                                  
“గుడికొచ్చి ప్రార్ధన చేయడం కంటే సమాజానికి ఏదో ఒకటి చేయి ....అంటే వినాయక చవితి పందిళ్ళు వేయడం లాంటిది కాకుండా ......అవసరమైతే సిస్టం మొత్తాన్ని ఎదిరించి నిలబడు “ అని చెప్పగలరా ?.....
కాబట్టే కొన్నిటినైనా  ప్రశ్నించిన ఈ సినిమాని ఆహ్వానిద్దాం .......



19, డిసెంబర్ 2014, శుక్రవారం

ఒక ‘క్రింద’ ఉద్యోగి ఆవేదన (ఇది ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదని మనవి )



“నాదొక చిన్న సందేహం సార్ ......మీరు అధికారి కాక ముందు , నేను నా ఉద్యోగం లోకి రాక ముందు మనిద్దరిలో సామాన్యంగా  గా  ఉన్న లక్షణం “మానవత్వమే” కదా .....కాని దాని గురించి కొంతైనా చింత లేకుండా మీలాంటోళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అర్ధం కాకుండా ఉంది .
మనం ఒక్కొక్క విషయం ఆలోచిద్దాం. పరిస్థితులు ఎంతగానో మారిపోయ్యాయి. కానీ వాటిని మీకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలో మీకు తెలుసు. మీకు మంచి జీతాలు ,సౌకర్యాలూ ఉంటాయి. మీకు వాటిని అందుబాటులోకి తెచ్చిన యంత్రాంగం పట్ల మీకు మా కంటే కృతజ్ఞతా భావం ఎక్కువగా ఉండడంలో సందేహమేమీ లేదు కానీ మీ కున్న నిబద్దత  అందరికీ ఉండాలని భావించడం న్యాయమా? మా కుటుంబాల పట్ల మాకు నిబద్దత ఉండకూడదా ....?
అసలు ఆ 8 గంటల పనిదినం కూడా ఎంత మంది మహనీయుల త్యాగఫలమో మీకు కొంతైనా తెలుసా ? అలాగే వారానికి ఒక రోజు సెలవు ఎందుకిచ్చారో ....దాని విలువెంతో మీకు తెలుసా ? అటువంటి సెలవుకి మమ్మల్ని దూరం చేస్తున్న మీకు నాగరికత ఉన్నట్టా లేనట్టా ? మాకు 8 గంటల పనిదినమే కదా. ఆ సమయంలో నిజాయితీగా ....నిబద్దతతో పనిచేయడమే కదా మీకు కావలిసింది. అంతకు మించి పని చేయడం అనేది మా ఇష్టాయిష్టాల బట్టి కదా ఉంటుంది. ఉదయాన కానీ .... వారంలో ఒక రోజు ఉదయం కానీ .....సాయంత్రం కానీ కనీసం కూరగాయలకైనా బయటకు వెళ్ళాలి కదా .....మాకు ప్రభుత్వం ఇచ్చే వాహనాలు కానీ ....మనుషులు కానీ ఉండరు కదా ......? దయుంచి ప్రభుత్వ వాహనాలు స్వంతానికి వాడడం లేదని ఆత్మవంచన చేసుకోవద్దు . అటువంటి వారి శాతం అతి కనీసంగా ఉన్నప్పుడు దానిని సున్నాగానే పరిగణించాలి.
మా పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్లకు ఆసరాగా ఉండవలసిన బాధ్యత మా మీద ఉండదా .....? కేవలం వాళ్లకు పుస్తకాలు కొనేసి కాలేజ్ ఫీజులు కట్టేస్తే మా బాధ్యత తీరిపోతుందా ? సమాజం లో పరిస్థితి అత్యంత అపసవ్యంగా ఉన్నప్పుడు వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్ద వలసిన నైతిక బాధ్యత మా పై ఉండదా ? వారికి విలాసవంతమైన జీవితాన్ని మేము అందుబాటులోకి తేలేక పోవచ్చు  కానీ మన ఆనందానికి అలాంటి జీవితం అవసరం లేదన్న విషయం వారికి అర్ధమయ్యేట్టు చేయగలిగితే వారికి కోట్ల రూపాయల సంపాదనల అవసరం ఉండదు కదా. అప్పుడు వారు నీతీ..... నిజాయితీలతో తృప్తిగా బ్రతక గలుగుతారు కదా. కొంత మంది భయం వలన కూడా నీతి ...నిజాయితీ లతో జీవిస్తారు కానీ చైతన్యం వలన వచ్చే సుగుణాలు మరింత విలువైనవి కావా ?
వాళ్ళు రేపు పరీక్షల ముందు హాల్ టికట్ వినాయకుడి విగ్రహం ముందు పెట్టి పూజ చేయిస్తానంటాడు. అవసరం లేదని చెబుతాను. అంటే దానర్ధం చర్చికి తీసుకెళ్ళి ప్రేయర్ చేయించాలని కాదని కూడా వాడికి అర్ధం కావాలి.... అంటే పరీక్షల లో విజయం కేవలం కఠోర శ్రమ ,దృఢ సంకల్పం వల్లనే సాధ్యపడుతుందనే విషయం ......అసలు జీవితంలో మరే విజయానికైనా ఇవే ప్రాధమిక అంశాలు అనే విషయం వాళ్లకు బోధపరచాలంటే మేము కూడా ఏదో పాఠం చెప్పినట్లు చెబితే పిల్లల తలకెక్కుతుందా ? ఎన్నో ఆసక్తి కరమైన ఉదాహరణలతో కదా వివరించాలి కదా. మహారాజు గారి రాణుల మధ్య తగాదాల వంటి రాజకీయాలు  .....తప్ప సామాన్యుల జీవితాల లోని విలువైన విషయాలను పట్టించుకోని మీడియా ఉన్న ఈ రోజుల్లో అటువంటి ఉదాహరణల ను వెదకాలంటే మేమెంత కష్టపడాలో మీ బోటి వారికి ఎప్పటికైనా అర్ధం అవుతుందా సార్ ?
టీ.బీ కి మందు కనిపెట్టిన నార్మన్ బెతూన్ కోట్లు సంపాదించాగలిగీ స్పానిష్ రిపబ్లిక్  పోరాటానికి ఎందుకు బాసటగా నిలిచాడు ....అక్కడ నుండి చైనా కమ్యూనిస్ట్ పార్టీ లాంగ్ మార్చ్ కు ఎలా వెళ్ళాడు ....ఒక పెన్సిలిన్ ఇంజక్షన్ లేక ఎలా చనిపోయాడు .....?ఎక్కడో అర్జెంటీనాలో పుట్టి మెడిసిన్ చదివి ....మెక్సికో మీదుగా క్యూబాకు చేరి అక్కడి విప్లవ విజయంతో సంతృప్తి చెందక మిగిలిన లాటిన్ అమెరికా ను విముక్తం చేయడానికి ప్రాణాలర్పించిన ‘చేగువేరా ‘ గురించిన నిజమైన వివరాలు చెప్పొద్దా సార్ ? లేదా అందరిలా ఆయన బొమ్మ వేసిన టీ షర్టు వేసుకుని తిరుగుతుంటే అదేదో ఫాషన్ లే అనుకుంటూ చైతన్యం లేని బ్రతుకు బ్రతకాలా ? అందరి దాకా ఎందుకు నోబెల్ ప్రైజ్ సంపాదించుకోగలిగిన మేధాశక్తి ఉన్న వాడని అందరి చేతా కొనియాడ బడ్డ బాలగోపాల్ గురించి .....అరిగిపోయిన చెప్పులతో ....చిరిగి పోయిన బట్టలతో ఆయన ఎందుకు తిరిగాడో చెప్పొద్దా ? వీరందరి ఆనందం గురించి అర్ధం చేసుకోలేక పొతే ....అర్ధం అయ్యేలా చెప్పక పొతే నేను విద్యావంతుడిగా లెక్క వేయబడతానా ? అంతే కాదు ఎలక్షన్ ఎలక్షన్ కి మధ్య మూడు పార్టీ లు మారిన వాళ్ళు తిరిగి గెలిచి మంత్రులెలా అవుతారన్న విషయం స్పష్టంగా విదీకరించక పొతే వాడు రాజకీయంగా చైతన్య వంతుడెలా అవుతాడు ?
మా ఖర్మ కొద్దీ మీ లాంటి ఉన్నతోద్యోగుల .....వ్యాపార వర్గాల సంస్కృతే మనకు అ(న)ధికార సంస్కృతిగా మిగిలింది. అలా మిగిలేట్టు చేయడంలో మీడియా చాలా చక్కని సహకారం అందించింది. వాళ్ళని ఏమని అనగలం ....వాళ్ళదీ వ్యాపారమే కదా ....ఒక పక్క రాజ్యమేలుతున్న కులరక్కసి .....గుడికి వచ్చి మొక్కులు తీర్చుకొండోహో....మీ పాపాలన్నీ ఫట్  అని నమ్మబలుకుతున్న మత సంస్కృతి .....14 సంవత్సరాలకే ప్రేమించి ....ప్రేమించబడక పోతే మనం హీరోలమే కాదని నమ్మిస్తున్న సినిమా సంస్కృతి .......వీటన్నిటి నుండీ నా వాళ్ళను రక్షించుకోడానికి నేను పడే మానసిక శ్రమ మీకు అర్ధం అవుతుందా .....రాత్రి పూట ఏదో సందర్భంలో రూట్స్ ( తెలుగులో ఏడు తరాలు ) నవల గురించి ...ఎలెక్స్  హేలీ గురించి నేను నా పిల్లలకు చెప్పే సమయంలో రాత్రి 8.00 గంటలకు కూడా మీ దగ్గర నుండి ఏదో చిన్న ఆఫీస్ విషయం గురించి ఫోన్ వస్తుంది. నాకున్న వ్యక్తిగత సమయాన్ని కూడా మీరు దురాక్రమణ చేసేస్తే ఎలా సార్ ?
ట్రైన్ లో ఏసీ కోచ్ లలో దాని maintenance గురించి మన అసెస్మెంట్ అడిగే ఫారం నింపమని ఇస్తారు . కానీ అటువంటి దేమీ ఏ డిపార్టుమెంటు లోనూ ఉండదు. ఒక అధికారి తన క్రింద పని చేసే వంద మందిని నరక యాతనకు గురి చేయగలుగుతున్నాడు. కానీ ఈ వంద మందీ అతడి తల మీద వెంట్రుక ముక్కను కదప లేరు. ఇదంతా మా ఖర్మ అని సరి పెట్టుకోవడం తప్ప .



1, డిసెంబర్ 2014, సోమవారం

తలిదండ్రులకు చిన్న విన్నపం .......





నేను చిన్నప్పుడు చదివిన తాడికొండ రెసిడెన్సియల్ స్కూల్ కు ప్రిన్సిపాల్ గా శ్రీమతి సుగుణ గారుండేవారు. సెలవులకి వచ్చిన విద్యార్ధులు తిరిగి వచ్చేటప్పుడు తినుబండారాలతో రావడం పరిపాటి. కానీ ఇది విద్యార్థుల్లో అసమానతలు పెంచుతుందనే ఉద్దేశ్యంతో ఆవిడ ఇవి పబ్లిక్ తినడాన్ని ఒప్పుకునే వారు కాదు. కనీసం విద్యార్థి దశలో అయినా అసమానతలు లేకుండా ఉండాలనే ఆవిడ ఆలోచనతో మేము ఆ రోజుల్లో అంత సమ్మతం కానప్పటికీ ఈ రోజున ఆమె ఆలోచనల విలువ అర్ధం అవుతుంది.
ఇప్పుడు చాలా కాలేజ్ లలో కాని స్కూళ్ళలో కానీ ఇటువంటి నిబంధనలేవీ కనబడవు. తమ బిడ్డ ల కళ్ళలో ఆనందం కనబడాలి అంతే......అది వారి తోటి వాళ్ళ మీద చూపే ప్రభావాలతో వాళ్లకు సంబంధం ఉండదు. ఒక క్లాసులో ఒక ధనిక విద్యార్ధి ఉంటాడనుకుందాం. అతగాడు తన బర్త్ డే కి చాలా ఖర్చు చేసి స్నేహితులందరికీ ఏదో ఒక విలాసవంతమైన హోటల్ లో పార్టీ అరేంజ్ చేస్తాడు. అటెండ్ అయిన స్నేహితులందరికీ వారి వారి బర్త్ డే లకు ఏదో విధంగా అంత స్థాయి కానప్పటికీ .....ఏదో ఒక మంచి హోటల్ లో పార్టీ యీయవలసిన అవసరం ఏర్పడుతుంది. కనీసం ఆయా తలిదండ్రులకి ...ఆనందం అనే విషయం మీద సరైన కాన్సెప్ట్ ఉంటే ఇంత చిన్న వయసులో ఉన్న పిల్లలకి ఇంత విలాసవంతమైన అలవాట్లు అవసరమా ......అనే మీమాంస వస్తుంది. పిల్లలను బాధ పెట్టలేని తలిదండ్రులు తమ అవసరాలను ఎక్కడో ఒక చోట తగ్గించుకొని పిల్లలకి ఈ పార్టీ బిల్లులు కట్టవలసిన పరిస్థితులు ఉండవచ్చు. దానిలో ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకో .....హాస్పిటల్ అవసరం ఉన్నవాళ్ళకి మందులు తగ్గించవలసిన పరిస్థితులున్నా ఆశ్చర్య పోనవసరం లేదు .
మా దగ్గర ఒక పెయింటర్ పని చేస్తూ ఉంటాడు. చాలా బాధ్యత గా పని చేస్తాడు.  క్వాలిటీ లో కాంప్రమైజ్ ఉండదు. రోజంతా ఒక హెల్పర్ ను పెట్టుకుని దుమ్ముకొట్టుకుంటూ పనిచేస్తుంటాడు. అతడికి మా అపార్త్మెంట్లోనే ఒక పెయింటింగ్ పని ఇప్పించాం . ఒక రోజు నేను క్రిందికి దిగేసరికి ‘పల్సర్ 220 CC ‘బైక్ మీద అతడిని ఎవరో కుర్రాడు డ్రాప్ చేస్తున్నాడు. ఎంక్వైరీ చేస్తే తెలిసిందేమిటంటే ఆ కుర్రాడు ఈ పెయింటర్ కొడుకే. రాజశేఖర రెడ్డి గారి దయ వలన ఏర్పడిన తామర తుంపర లోనిదే ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ వెలగపెడుతున్నాడు. కాబట్టి అతగాడు కాలేజ్ కి వెళ్లి రావడానికి instalment లో ఇది కొనిచ్చాడు. ఇది విన్న వెంటనే నా మనసులో వెంటనే మెదిలిన ప్రశ్న ఏమిటంటే  ఒక వేళ పాపం ఈ పెయింటర్ రెండు మూడు నెలలు జబ్బు పడితే ఆ instalment ఆ కుర్రాడు ఎలా కడతాడు? చైన్ స్నాచింగ్ చేశా ....

ఈ మద్య వచ్చిన సినిమాలలో “వేదం “ సినిమాకి ఒక ఉన్నత స్థానం ఉంది. దాంట్లో స్పృశించిన సామాజిక అంశాలు వర్తమానానికి అత్యంత దగ్గరగా ఉంటాయి. ఆనందానికి నేటి యువత దృష్టిలో ఉన్న అర్ధం .....దానిని ఏదో విధంగా అందుబాటులోకి తెచ్చుకోవడానికి నేరం చేయడానికి వెరవని సామాజిక పరిస్థితులు ఒక పక్క చూపిస్తూనే ........నిజమైన ఆనందం అంటే అవగాహన చేసుకున్న యవత వలన సమాజం ఎంత లాభం పొందుతుందో .....స్పష్టంగా చూపించడంలో దర్శకుడు కృతకృత్యుడయ్యాడు. కాబట్టి ఆరోగ్యవంతమైన సమాజం కావాలనుకునే చేడ్ బాధ్యత గల తలిదండ్రులు తమ పిల్లలకు అసలైన ఆనందం అంటే ఏమిటో అర్ధం అయ్యేలా చేయగలుగుతారు. ఆ భాద్యత లేదనుకునేవాళ్ళు ఏమి చేస్తారో నాకు తెలియదు.