టీ వీ లో ఏదో సినిమా వస్తోంది ..... పెద్దగా ఎవరూ చూడ్డం లేదని కట్టేయబోయాను .
"ఉండు నాన్నా ..... " సుపుత్రుడు అరిచాడు
"ఏం సినిమా ఇది ..... తెలిసిన యాక్టర్స్ ఎవరూ కనబడి చావడం లేదు ....."
"బాగుంటుంది ... చూడు " మరలా ఉపదేశం ......
చూస్తూ ఉండి పోయాను . సినిమా బాగుంది . ఎందుకో ఒక సన్నివేశం నన్ను చాలా ఆకట్టుకుంది . "ఆకట్టుకుంది " అనడం చిన్న పదం అనిపిస్తోంది. ఎందుకో తెలియకుండానే కళ్ళు చెమరుస్తాయ్ . చాలా రోజుల నుండి ఎడారిలో మండు వేసవిలో దారి తప్పి తిరిగేవాడికి ఒయాసిస్ కనబడిన ఫీలింగ్ .ఆ సన్నివేశాన్ని నా భాషలో చెబుతాను.
అందరికీ తలలో నాలుకగా ఉండే ఆ వూరి పెద్దమనిషికి తేలు కుట్టి ఒక పెళ్ళికి వెళ్ళ లేక పోతాడు. కానీ అతడంటే ఎంతో గౌరవం ... అభిమానం ఉన్న ఆ పెళ్ళికూతురి కుటుంబం యావన్మందీ ..... ఈ పెద్దాయన ఇంటికి తరలి వచ్చి ఇతడి సమక్షం లోనే వివాహ వేడుక కానిస్తారు. క్లుప్తంగా ఆ సన్నివేశం ఇంతే . కానీ అమాయకత్వం ..... స్వచ్చత .... నిజాయితీ లాంటివి 100% ఆ సన్నివేశంలో ప్రతిఫలింపజేయడంలో దర్శకుడు కృతకృత్యుడయ్యాడు కాబట్టి ఆ సన్నివేశం మిమ్మల్ని పట్టి వదలదు ..... నిజంగా మీలో ఆర్ద్రత అనేది మిగిలి ఉంటే ....
ఆ సినిమా పేరు "అందరి బంధువయా " ..... దర్శకుడు చంద్ర సిద్దార్థ . నిజమైన హీరో అంటే ఇలా ఉండాలి అని చూపించిన చిత్రం . మొత్తం అంతా సామాజిక సంబంధాల మీదే . మోటార్ రేసులు .... మితిమీరిన తెలివి తేటల ప్రదర్శన ..... చాలెంజ్ లు .... వంశాల .... ప్రాంతాల ప్రగల్భ సంభాషణలు లేకుండా మనసున్న మనిషిని హీరోగా చూపించిన నిజమైన ప్రజా చిత్రం .
కేవలం ఈ ఒక్క చిత్రాన్ని మాత్రమే పొగడడం నా ఉద్దేశ్యం కాదు . తెలుగు చిత్ర సీమలో ఇటువంటి మాణిక్యాలు వస్తూనే ఉన్నాయి ....వచ్చి పోతూనే ఉన్నాయ్ . "గోదావరి ", " ఆ నలుగురూ ","ఓనమాలు "," గమ్యం ","వేదం ","పిల్ల జమిందార్ " లాంటివి వస్తూనే ఉన్నాయ్. ఆడగలిగినవి ఆడుతున్నాయి .... అంతే ....
ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే ఈ సినిమాల నిర్మాతలు ప్రభుత్వం దగ్గరనుండి ఎకరాల స్థలాలు .... మంత్రి పదవులు పొందిన వారు కాదు . ఇలా పొందిన వారు .... మరి మంచి సినిమాలు ఎందుకు తీయడం లేదు ? మంచి సినిమా అనిపించుకోవాలంటే కష్టపడి నటించవలసి వస్తుంది. మరి వారసులు అంతగా కష్టపడడం సినిమా పెద్దలు సహించలేరు. కాబట్టి నాలుగు స్టెప్పులు వేయడం ..... మోటార్ సైకిల్ లేదా కారు నడపగలగడం .... లాంటి చిన్న చిన్న విద్యలతో పెద్ద హీరోలుగా చూపించగలిగే కధాంశాలు కావాలి. హీరోకి కొన్ని అతీత లక్షణాలు ఉండాలి. ఈ అతీత లక్షణాలలో ఒక భాగం హీరో గారి రూప లావణ్య విన్యాసాలకు పడి పోయే హీరోయిన్ లు . నలుగురినీ చేర్చి ఒక సిద్దాంత బలంతో ఏకం చేసి చెడుని ఎదిరించ గలిగే స్థాయికి సామాజిక చైతన్యాన్ని పెంచి నలుగురినీ మారుస్తూ ..... కాలంతో బాటు తను కూడా మారే వాడే నిజమైన హీరో అవగలుగుతాడనే వాస్తవాన్ని ఎన్ని సినిమాలలో మనం చూడ గలుగుతున్నాం ? కనీసం ఆహ్లాద కరమైన హాస్యాన్ని కూడా మనకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే కొంత మంది సినీ పెద్దల వారసుల ముఖాలలో పలికే హావభావ విన్యాసాలకు పనికి వచ్చే కధలు ..... వాటికి మాత్రమే పరిమితమైన సినిమాలు తెలుగు ప్రేక్షకుల మీద రుద్దబడుతున్నాయి. మరి మధ్యలో అప్పుడప్పుడు మంచి సినిమాలు వస్తుంటాయి ..... కాబట్టి వాటికి థియేటర్స్ దొరకకుండా చేస్తే పీడా పోతుంది .
ఈ దౌర్భాగ్యాన్నుండి తెలుగు ప్రేక్షకుడిని రక్షించడానికి ... మరి కొత్త ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకుంటాయో చూడాలి.కొన్ని కుటుంబాల కబంధ హస్తాల మధ్య నలిగి పోతున్న తెలుగు సినిమాకి ఇప్పుడన్నా స్వేచ్చ లభిస్తుందని ఆశించవచ్చేమో ......