1, ఫిబ్రవరి 2015, ఆదివారం

“మా పులి ....మా సింహం ....” నిర్మాతల కష్టాలు




సుపుత్రుడు కాలేజ్ నుండి రాగానే టీ. వీ . ఆన్ చేసాడు.
పెద్ద హడావుడితో నిండిన కార్యక్రమమేదో వస్తుంది
“ఏంట్రా అది ..?”
అడిగాను
“ఆడియో ఫంక్షన్ నాన్నా .....”
“దానికంత హడావుడి ఎందుకురా ....?”
“ఇప్పుడంతా అలాగే చేస్తున్నారు “
“వేదిక మీద మాట్లాడేది .....?”
“ఆ సినిమా నిర్మాతే నాన్నా ....”
“అంటే పెట్టుబడి పెట్టేది అతగాడే కదరా ....”
“మరి ఏదైనా రిస్క్ ఉంటే అతడిదే కదా ?”
“రిస్కేటి నాన్నా .....”
“అవున్రా పాపం పెట్టుబడి పెడుతున్నాడు కదా ....సినిమా ఫెయిల్ అయితే .....”
“అయితే నష్టం అతగాడిదే కదా ....”
“నాన్నా ....ఏ యుగం లో ఉన్నావ్ ....?
సుపుత్రుడు జాలి పడ్డాడు
“ అదేట్రా ఫెయిల్ అయితే నష్టం రాదా ?”
“ఈ ఆడియో ఫంక్షన్ లు ...హీరో ని పులి ...సింహం ...చేయడం ఎందుకనుకుంటున్నావ్?”
“తెలియదురా ....”
“మొత్తం సినిమా ఎన్ని ధియేటర్లలో రిలీజ్ అవుతుందో తెలుసా ?”
“తెలియదు “
“ఈ ఆడియో ఫంక్షన్ చూసిన మా లాంటి వాళ్ళు అన్ని థియేటర్  లూ హౌస్ ఫుల్ చేస్తాం ....ఒక్క సారి లెక్కేసి చూడు ....ఇంచుమించు నిర్మాత కు ఖర్చులు వచ్చేస్తాయ్. ఇక హిట్ అయ్యి రెండు మూడు వారాలు ఆడగలిగితే బంగారం పంటే ...”
“మరి నష్టం ఎవరిది ?”
“మా లాంటి పనికి మాలిన వాళ్ళదే ......సినిమా బాగుందో ...లేదో ...కూడా చూడకుండా ఎగబడి టికెట్స్ బుక్ చేసుకున్నందుకు ....ఇవి అమ్ముకుంటే సిగ్గు ....”
మా వాడి సినిమా జ్ఞానానికి నా మనసు ఆనంద పరవశమై పోయింది
మరలా మా వాడే మొదలు పెట్టాడు ..
“అందుకే ఏదో పెద్ద హీరో ని పట్టుకుంటే మినిమమ్ గారంటీ కాబట్టి  ఆ నిర్మాత హీరో ని పులి ...సింహం అంటూ పొగుడుతున్నాడు”
 “పైగా ఆ హీరో 5 అడుగుల మీద పిడికెడు కూడా లేడు “
“ఆగు నాన్నా .....హీరో మాట్లాడుతున్నాడు ....”
ఆగాను
“అదేట్రా ఆ హీరో మాట్లాడితే ....మా .....వంశం ....మా వంశం అంటూ అరిగి పోయిన డైలాగే  మాట్లాడుతున్నాడు “
“అదే నాన్నా ....ఆ పేరు మీదే లాక్కొచ్చాడు ....”
“శిక్షణ తీసుకున్న కోతి లాగే వేసే స్టెప్స్ ....ఊకదంపుడు డైలాగులు .....తన్నితే ఎగిరి పొయ్యే సుమోలు ....ఏ సినిమా చూసినా ఇంతే కదరా .....”
“మరేం చేస్తాం నాన్నా ....వారసులందరి సినిమాలు ఇంచుమించు ఇంతే కదా ......”
“ నిజమేలే మీడియా వాళ్లకు డబ్బులు కావాలి .....కొన్ని చానళ్ళు కూడా వాళ్ళవే ...కాబట్టి ఇవే చూపిస్తారు ...పాపం బంగారు తల్లి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. ఈ రోజుల్లో అయితే ముత్యాల ముగ్గు లాంటి సోషియో ఫాంటసీ లు ....శంకరాభరణం లాంటి నియో క్లాసిక్ లు కూడా ఆడక పోయి ఉండేవేమో .....”
“అంటే మీడియా లేకుండా ఉంటేనే మంచి సినిమాలు నడుస్తాయంటావా నాన్నా...?”

“కావొచ్చు ...”