31, జులై 2014, గురువారం

'దృశ్యం ' సినిమా నాకెందుకు నచ్చిందంటే ......



నిజం .... ఇప్పుడొస్తున్న సినిమాలలో ఇది ఉత్తమమైనదే ...... 

ఇదేమీ పారలల్ సినిమా కాదు ..... వ్యాపారాత్మక చిత్రమే .... కానీ ఆరోగ్యపరమైన వ్యాపారం .... 

మంచి మందుల తయారు చేసి వ్యాపారం చేయవచ్చు ..... కానీ లాభాలు తక్కువ ఉండొచ్చు .... కల్తీ మందులమ్మి  కూడా వ్యాపారం చేయవచ్చు . దీంట్లో లాభాల శాతం ఎక్కువుండొచ్చు. కానీ ఇది మొదట చెప్పిన తరహా వ్యాపారం. 

ఎలా ......

కుటుంబాన్ని చక్కగా నడిపిస్తున్న కెప్టన్ లాంటి తండ్రి ..... 

తనకున్న వనరులని చక్కగా వాడుకునే వాడే మంచి కెప్టెన్ అవుతాడన్నది అందరికీ తెలిసిన విషయమే .... తను నిరంతరం శ్రమ పడడమే కాకుండా తనకున్న వనరులతో తను ఆనందంగా ఉండగలగడం కాకుండా తన కుటుంబాన్ని కూడా ఆనందంగా ఉంచగలిగే నేర్పు కూడా ఉన్నవాడు . తనకున్న ఆర్ధిక పరిమితులు తెలుసుకోవడమే కాకుండా తన కుటుంబం మొత్తం ఆ పరిమితుల లోపల ఆనందించేలా చేయడానికి ఈ రోజుల్లో చాలా నేర్పు కావాలి .... ఆ లక్షణాలు ఉన్నవాడిని హీరోగా చూపించారు కాబట్టి ఇది మానసిక ఆరోగ్యాన్నిచ్చేదే ..... 

ఇతడికి పెద్ద పెద్ద సిద్దాంతాలు తెలియవు కానీ ఎదురుగా కనబడే చిన్న చిన్న అన్యాయాలు ఎదుర్కునే .... ఎదుర్కోగలిగే పాటి ధైర్యం ఉన్నవాడు .....కాబట్టి హీరోగా చూపించారు సంతోషం .... 

మితిమీరిన అంటే అత్యంత అసహజమైన తెలివితేటలు  ..... ఆలోచనా ధోరణి ..... కలిగి ఉండి వెకిలి వేషాలు మాత్రమే వేస్తూ ..... వాటినే హీరో లక్షణా లన్నట్లు చూపించలేదు . అంతే కాదు వంశాల గురించి చేంతాడంత  డైలాగ్స్ లేవు . ఒక సామాన్యుడిని హీరో చేసారు ....నేనూ ... మీరూ కూడా హీరోలవ్వొచ్చు .... కొద్దిగా మారితే.  కాబట్టి సంతోషించాలి .... అభినందించాలి. ఇప్పుడు మనకు కావలిసిన ఒక ప్రధాన ఔషధం ఇదే .... కాస్త చైతన్యం పెంచుకుంటే అందరం హీరోలు కావొచ్చు ..... ఎవడో హీరో ఎందుకు ....

కుటుంబాలలో లో కూడా సంక్షోభం ఏదైనా సంభవించినప్పుడు అది మిగిలిన సభ్యులమీదకు నెట్టివేయడం చాలా పరిపాటి . కానీ పెద్దగా ఆ బాధ్యత తీసుకుని సంక్షోభాన్నుండి కుటుంబం బయట పడే వరకూ స్థైర్యం కోల్పోకుండా ఉండడం .... మిగిలిన వారిని కూడా ఉంచగలగడం .... చాలా మంచి positive attitude ...... దానిని highlight చేయడం చాలా ముదావహం.  అటువంటి కుటుంబం కెప్టన్ మీద పూర్తి విశ్వాసం గల టీం లా ఉంటుంది కాబట్టి నిత్యం ఆ కుటుంబంలో ఆనందం వెల్లి  విరుస్తూ ఉంటుంది.


మీడియాను కూడా సరైన పద్దతిలో వాడు కోవచ్చు .... అంతే కాకుండా సామాజిక పోరాటాలలో ఉండే వారికి మరింత మెరుగైన అవగాహన ఉంటుందని చూపించిన విధానం మెచ్చుకోతగినది.

ఈ సినిమాలో నాకు కనబడిన ఒకే ఒక negative అంశం ఏమిటంటే సాక్ష్యాలు పగడ్బందీగా ఉంటే ఎటువంటి నేరాన్నుండైనా తప్పించుకోవచ్చు అన్న ఆలోచన వక్రమార్గంలో ఉన్న వారికి catalyst గా పనికి వస్తుందేమో ..... (హీరో చాలా సార్లు" మనం తప్పు చేయలేదని నమ్ముతున్నాం కాబట్టి " అన్న డైలాగ్ వాడాడు కానీ జిహాదీలు ..... మసీదులు కూలగొట్టేవాళ్ళు ..... ఫ్లైట్స్  ని పేల్చేసే వాళ్ళు ..... ఇదంతా లోక కల్యాణం కోసమే అన్న ఆలోచన తోనే ఉంటారు )


 

21, జులై 2014, సోమవారం

మా వాడి నోరైతే మూతబడింది .... మరి మిగిలిన వాళ్ళవి ?



"ఎవర్రా ఆవిడ ?"

"అరె ... నీకు తెలియదా ?" 

వేస్ట్  ఫెలో అన్నట్లు అడిగాడు మా వాడు 

ఆవిడ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూనే ఉంది 

"ఆవిడ అమెరికాలోనో ... ఇంగ్లాండ్ లోనో  పుట్టి .... పెరిగి ..... తెలుగు నేర్చుకుందా ?"

"నీ కళ్ళకు అలా కనబడుతుందా ?"

మళ్ళీ సుపుత్రుడు విసుక్కున్నాడు 

"ఆవిడ ఈ ప్రోగ్రాం కు ఎందుకు వచ్చింది ?"

"నిన్న వచ్చిన నటీమణి ఎందుకు వచ్చింది ?"

ఈ వెధవకు విసుగు బాగా పెరిగిపోతోంది 

"ఈవిడ మాంచి విజ్ఞాన వంతురాలేమో ?"

"కాదు సెలబ్రిటీ ..... "

"ఓహొ ... గొప్ప నటీమణా ....? "

వీడు అలా వెర్రి నవ్వు నవ్వుతాడేమిటి ? పైగా వెధవ ముఖంలో విచిత్రమైన ఫీలింగ్స్ పెడుతున్నాడు . 

"అసలు క్విజ్ ప్రోగ్రాం తో ఈవిడకు ఏమైనా సంబంధం ఉందా అసలు ?"

"TRP Rating......"

"మనమంతా క్విజ్ ప్రోగ్రాం చూస్తున్నాం కదా ..... "

"ఆవిడ లాంటి వాళ్ళను చూపిస్తే ..... మరి కొంత మంది కలవడంలా ... "

"మరీ అంత కమర్షియల్ గా ఉండాలా ..... "

"ఆయన గురించి నీకు అంతగా తెలియదనుకుంటా ..... "

"తెలుసురా బాబూ .... "మనం " సినిమా మొన్ననే చూసాం కదా "

"అయితే ఇంకెందుకు ? వాళ్ళ చానల్ .... వాళ్ళిష్టం ..... అలాగే వాళ్ళ స్టూడియో వాళ్ళిష్టం వచ్చిన వాళ్ళను పెట్టి సినిమా తీస్తారు ..... వాళ్ళెలా ఉంటే  నీకెందుకు .... నిన్నేమైనా బలవంతంగా చూడమన్నారా ... ఏ గతీ లేక నీవు చూసినా అది నీ తప్పే కదా   "

" అలా ఏ గతీ లేకుండా చేస్తున్నదెవరంటావ్?"

హమ్మయ్య ..... మా వాడి నోరు తాత్కాలికంగా అయినా మూయించగలిగాను . 



 

19, జులై 2014, శనివారం

ఆణిముత్యాలను వెలుగులోకి తెద్దాం


అన్ని రంగాల మీదా గ్లోబలైజేషన్ ప్రభావం గురించి అనేకానేక వ్యాసాలు దొరుకుతాయి ..... కానీ మధ్య .... క్రింది స్థాయి ఉద్యోగుల బాధలు ..... ప్రత్యక్షంగా.....  పరోక్షంగా వారి మీద పడుతున్న అదనపు భారం .... ఆ భారం వలన వారు కోల్పోతున్న కుటుంబ జీవితం ..... 

అన్ని రంగాలలో మార్పులు వస్తున్నా ..... బ్రిటిష్ కాలం నాటి విశేష అధికారాలు ఇంకా కొన సాగడం వలన పై అధికారులు తమ ఆనందాల కోసమే కాక తమ సతీమణుల .. కుటుంబ సభ్యుల ఆనందాల కోసం క్రింది వారిని ఎలా వాడుకుంటున్నారో .... వారిని ఎంత వేదనకు గురి చేస్తున్నారో తెలుసుకుంటే వేదనా భరిత సత్యాలు ఎన్నో బయటకు వస్తాయి . ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగాలలో ఇది మరీ దారుణంగా ఉంటుంది . ఒక కంటకుడైన రాజకీయ నాయకుడిని ప్రజలు ఓటు ద్వారా ఓడించగలుగుతున్నారు. కానీ వికృత మనస్తత్వం కలిగిన అధికారుల గురించి పై స్థాయి కి తెలియజేయగల మెకానిజం ఫీడ్ బాక్ షీట్ లాంటివి అమలులోకి తెస్తే బాగుంటుందేమో .... 

అసలు మొదటి నుండీ ప్రభుత్వ శాఖలు అన్నీ ఇలానే ఉండేవా ?....... విలువలు ఎప్పుడూ అధమంగానే ఉండేవా అనే సందేహం ఈనాడు కొత్తగా ఉద్యోగాల్లోకి చేరే వారందరికీ వస్తోంది. ఒక ముఖ్యమైన సంధి దశలో అంటే  గ్లోబలైజేషన్ ప్రారంభం కాక ముందు ... అయిన తరువాత ... ఉద్యోగం లో ఉన్న మా లాంటి వారికి దిగజారుతున్న విలువలు అత్యంత స్పష్టంగా కనబడుతున్నాయి . నా విన్నపం ఏమిటంటే .... రిటైర్ అయిన ఉద్యోగులు తమ తమ కాలాలలో విలువలు ఎలా ఉండేవో .... రాయగలిగితే వాటిని తిరిగి తెచ్చుకోడానికి కొంతమందైనా సమాయత్తమవుతారు. అలాగే చాలా మంది అనేకానేక ఉద్యమాలలో గడిపి .... ఉదాత్తమైన .... స్ఫూర్తిదాయక మైన జీవితాన్ని గడిపి ఉంటారు . అటువంటి వారి జీవితానుభవాలు ఈ తరానికి అందజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నాను. 

ఈ పోస్ట్ కు వచ్చే స్పందన బట్టి పేస్ బుక్ లో ఒక పేజ్ ఓపెన్ చేస్తాను . ఇంకా ఎవరైనా మంచి సలహాలు ఇవ్వగలరని ఆశిస్తాను.


15, జులై 2014, మంగళవారం

మనో నేత్రాలు తెరిస్తే ......... స్వర్గ ద్వారాలు వాటంతట అవే .....



"నేనెక్కడున్నాను " అప్పలనాయుడు ఇబ్బందిగా అన్నాడు చుట్టూ చూసి .....

నిజానికి అక్కడెవరూ లేరు కూడా ....... కానీ భయంకరమైన శబ్దాలతో గోలగా ఉంది .అది ఏ భాషో కూడా తెలియడం లేదు 

"ఇదేమన్నా సినిమా అనుకున్నావేమిటి .... అడిగిన చెత్తకంతా సమాధానం చెప్పడానికి .... "

గాలిలోనుండి సమాధానం వచ్చింది .

"నేనిక్కడ ఎందుకున్నాను ..... ?"

"చనిపోయాక ఎక్కడుంటారు మరి ?"

మరలా గాలిలోనుండే .....

"ఇది స్వర్గమా .... నరకమా ..... ?"

"నీకెలా అనిపిస్తుంది .... ?"

"ఇంత గోలా..... శబ్దమూనా .....ఖచ్చితంగా ఇది నరకమే ...... "

"నీలో కాస్త  నిజాయితీ ఉంది .....కానీ  ఇప్పుడర్ధమయ్యిందా ..... నీవు ఎంత మందికి నరకం చూపించావో ?"

"ఇదన్యాయం ..... నేను దేవుడి పాటలే కదా ...... అందరికీ వినిపించింది .... "

"నిన్నెవరైనా అడిగారా వినిపించమని ?"

"పుణ్యం వస్తుంది కదా.........  అని "

"ఎవరికి పుణ్యం వస్తుంది ..... అసలు పుణ్యం ఎలా వస్తుందో చెప్పు ...... "

"భగవన్నామ స్మరణ ..... ధ్యానం ..... "

"శభాష్ ..... మరి స్మరణ .... ధ్యానం ఎక్కడ చేస్తారు ?"

"మనసులో ..... "

"అంటే నీకన్నీ తెలుసు ..... భక్తి మార్గానికీ ..శబ్దానికీ  ఏ సంబధం  లేదని ...... కానీ వేరే వెధవాలోచనతో  ఈ మైకులు గట్రా వాడావు ..... అవునా ?"

"ఏదో కాస్త ఆర్భాటం చేస్తే ..... ప్రజలు పట్టించుకుంటారని ..... "

"భక్తి నీ మోక్షానికే కదా ...... మరి ప్రజల సంగతి ఎందుకు ? అంటే నీకు భక్తి కంటే ఆర్భాటం మీదే మోజేక్కువన్న మాట ..... అంటే నీ భక్తిని ప్రజలు పట్టించుకోవాలనే తపన .....కాదు .. కాదు కుతి ఎక్కువన్న మాట .... "

"నన్నొక్కడినే ఇన్ని మాటలు అంటున్నారు ...... మా ప్రాంతంలో భక్తి అంటే ఇలానే ఉంటుంది ..... మరి వాళ్ళంతా ఇక్కడికే రావాలా ?"

"ఒక్క విషయం విను ...... క్లాస్ కి రాగానే టీచర్ ఏం చేస్తాడు ?"

"పిల్లలని నిశ్సబ్దంగా ఉండమంటాడు "

"ఎందుకు ?"

"తను చెప్పేది అందరికీ వినబడడానికి "

"కరెక్ట్ గా చెప్పావ్ .....మరి ఇప్పుడు నీ భక్తి కోసం నీవేం చేసావ్ ?"

"మైకుల సంగతి వదిలేయ్ స్వామీ ..... గుడిని పెద్దది చేసాను కదా ..... " 

"కొంచెం వెనుకగా ఉన్న గుడిని రోడ్ వైపుకి పెంచారు ..... ట్రాఫిక్ కి అడ్డంగా ...... అసలు పాత రోజుల్లో గుళ్ళన్నీ ఎత్తైన ప్రదేశాల్లో ఎందుకు కట్టేవారో తెలుసా .... మాకు తెలిసిన ఒక కారణం వరదల భయం అయితే .... వేరే కారణం రహదారుల కు భవిష్యత్తులో ఇబ్బంది రాకూడదని "

"ఏది ఏమైనా నేను తప్పైతే చేయలేదు కదా ..... "

"అని నీవనుకుంటే సరిపోదు .....సమాజంలో ఒక్క మతమే కాదు కదా ఉంటా .... నీ లాంటి వాళ్ళు అన్ని చోట్లా ఉంటారు కదా ..... నిన్ను చూసి వేరే రెండు మతాల వాళ్ళు కూడా మందిరాల కోసం రోడ్లు ఆక్రమించేసారు . నష్టపోయేది ........ సామాన్య జనం .... నీలాంటి వాళ్ళను నిలదీసే ధైర్యం లేని జనమే .... "

"క్లాస్ లో టీచర్ గురించి చెప్పబొయ్యారు .... "

"అక్కడికే వస్తున్నాను ... పిల్లలు నిశ్సబ్దంగా ఉంటేనే ..... టీచర్ తన కర్తవ్యాన్ని నిర్వహించగలుగుతాడు  .... కానీ నీలాంటి వాళ్ళు నలుగురు చేరి అరవడం ప్రారంభిస్తే .... 60 మంది పాడవుతారు ... అవునా ... మన దేశం కూడా కిక్కిరిసిన విద్యార్ధులున్న క్లాస్ రూం లాంటిదే .... అభివృద్ధి సక్రమంగా ఉండాలంటే  మతాన్ని రహదారి గా మాత్రమే ఉంచాలి . అడ్డదారి గా వాడుకునే అవకాశం ఉండకూడదు . "

"అంటే ... "

"మతం ... నీకు మోక్షానికి దారి చూపేదిగా మాత్రమే ఉండాలి తప్ప .... అధికారాన్ని సంపాదించే మార్గంగా ఉండకూడదు ..... ఉంటే గనుక అనేక మతాలు సహజీవనం చేసే అవసరమున్న మన సమాజం సంక్షోభంలో పడుతుంది . "

"అలా అయితే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రభుత్వానిదేమీ తప్పు లేదా .... ?" 

"బాగానే అడిగావు .... కానీ మరింత వివరంగా అడుగు ..... "

"మా వైజాగ్ లో ఆసీల్ మెట్ట  సెంటర్ లో 12 సంవత్సరాల క్రితమో ... అంతకు ముందో ... ఒక లాజిస్టిక్స్ ఆఫీస్ తాలూకు గోడలో వినాయకుడి విగ్రహం పెట్టారు .... వీధి పోటు ఉందని . కానీ అదే భవనం లో "నారాయణ కాలేజ్ " పెట్టారు. లోపలికి వెళ్ళేటప్పుడు విద్యార్ధులు కాబట్టి అలవాటుగా ఒక దణ్ణం పెట్టి పోతూ ఉండేవారు. అంతే కాని అదేమీ స్వయంభువు గా వెలసిన విగ్రహం కాదు .... దానికేమీ స్థల పురాణం లేదు . ఆ తరువాత నెమ్మదిగా మెయిన్ రోడ్ కాబట్టి టూ వీలర్స్ వాళ్ళు ఆగుతూ ఉండే వారు. అసలు అప్పుడే అక్కడ వెహికిల్స్ పార్క్ చేయడం మీద నిషేధం పెట్టి ఉంటే ..... ఈ రోజు అక్కడ ప్రతిదినం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్య ఉండేది కాదు కదా ..... మరి మా లాంటి వాళ్లకు పరోక్షంగా సహకారం అందిస్తున్న అధికార వర్గాలు వెళ్ళేదెక్కడికి ? నరకానికా .... స్వర్గానికా ?"

"కొంతైనా సమస్యల మూలాల లోకి వెళ్ళావు కాబట్టి నీకు ప్రమోషన్ ఇచ్చాం .... స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి చూడు .... "












3, జులై 2014, గురువారం

వారసుల కోసమేనా ..... తెలుగు సినిమా రంగం ? .......రక్షించుకుందాం రండి



టీ వీ లో ఏదో సినిమా వస్తోంది ..... పెద్దగా ఎవరూ చూడ్డం లేదని కట్టేయబోయాను .

"ఉండు నాన్నా ..... " సుపుత్రుడు అరిచాడు

"ఏం సినిమా ఇది ..... తెలిసిన యాక్టర్స్ ఎవరూ కనబడి చావడం లేదు ....."

"బాగుంటుంది ... చూడు " మరలా ఉపదేశం ......

చూస్తూ ఉండి పోయాను . సినిమా బాగుంది . ఎందుకో ఒక సన్నివేశం  నన్ను చాలా ఆకట్టుకుంది . "ఆకట్టుకుంది " అనడం చిన్న పదం అనిపిస్తోంది. ఎందుకో తెలియకుండానే కళ్ళు చెమరుస్తాయ్ . చాలా రోజుల నుండి ఎడారిలో మండు వేసవిలో దారి తప్పి తిరిగేవాడికి ఒయాసిస్ కనబడిన  ఫీలింగ్ .ఆ సన్నివేశాన్ని నా భాషలో చెబుతాను.

                 అందరికీ తలలో నాలుకగా ఉండే ఆ వూరి పెద్దమనిషికి తేలు కుట్టి ఒక పెళ్ళికి వెళ్ళ లేక పోతాడు. కానీ  అతడంటే ఎంతో గౌరవం ... అభిమానం ఉన్న ఆ పెళ్ళికూతురి కుటుంబం యావన్మందీ ..... ఈ పెద్దాయన ఇంటికి తరలి వచ్చి ఇతడి సమక్షం లోనే వివాహ వేడుక కానిస్తారు. క్లుప్తంగా ఆ సన్నివేశం ఇంతే . కానీ అమాయకత్వం ..... స్వచ్చత .... నిజాయితీ  లాంటివి 100% ఆ సన్నివేశంలో ప్రతిఫలింపజేయడంలో దర్శకుడు కృతకృత్యుడయ్యాడు కాబట్టి ఆ సన్నివేశం మిమ్మల్ని పట్టి వదలదు ..... నిజంగా మీలో ఆర్ద్రత అనేది మిగిలి ఉంటే ....

ఆ సినిమా పేరు "అందరి బంధువయా " ..... దర్శకుడు చంద్ర సిద్దార్థ . నిజమైన హీరో అంటే ఇలా ఉండాలి అని చూపించిన చిత్రం . మొత్తం అంతా సామాజిక సంబంధాల మీదే . మోటార్ రేసులు .... మితిమీరిన తెలివి తేటల ప్రదర్శన ..... చాలెంజ్ లు .... వంశాల .... ప్రాంతాల ప్రగల్భ సంభాషణలు లేకుండా మనసున్న మనిషిని హీరోగా చూపించిన నిజమైన ప్రజా చిత్రం .

కేవలం ఈ ఒక్క చిత్రాన్ని  మాత్రమే పొగడడం నా ఉద్దేశ్యం కాదు . తెలుగు చిత్ర సీమలో ఇటువంటి మాణిక్యాలు వస్తూనే ఉన్నాయి ....వచ్చి పోతూనే ఉన్నాయ్ . "గోదావరి ", " ఆ నలుగురూ ","ఓనమాలు "," గమ్యం ","వేదం ","పిల్ల జమిందార్ " లాంటివి వస్తూనే ఉన్నాయ్. ఆడగలిగినవి ఆడుతున్నాయి .... అంతే ....

ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే ఈ సినిమాల నిర్మాతలు ప్రభుత్వం దగ్గరనుండి ఎకరాల స్థలాలు .... మంత్రి పదవులు పొందిన వారు కాదు . ఇలా పొందిన వారు .... మరి మంచి సినిమాలు ఎందుకు తీయడం లేదు ? మంచి సినిమా అనిపించుకోవాలంటే కష్టపడి నటించవలసి వస్తుంది. మరి వారసులు అంతగా కష్టపడడం సినిమా పెద్దలు సహించలేరు. కాబట్టి నాలుగు స్టెప్పులు వేయడం ..... మోటార్ సైకిల్  లేదా కారు నడపగలగడం .... లాంటి చిన్న చిన్న విద్యలతో పెద్ద హీరోలుగా చూపించగలిగే కధాంశాలు కావాలి. హీరోకి కొన్ని అతీత లక్షణాలు ఉండాలి. ఈ అతీత లక్షణాలలో ఒక భాగం హీరో గారి రూప లావణ్య విన్యాసాలకు పడి పోయే హీరోయిన్ లు . నలుగురినీ చేర్చి ఒక సిద్దాంత బలంతో ఏకం చేసి చెడుని ఎదిరించ గలిగే  స్థాయికి సామాజిక చైతన్యాన్ని పెంచి నలుగురినీ మారుస్తూ ..... కాలంతో బాటు తను కూడా మారే వాడే నిజమైన హీరో అవగలుగుతాడనే వాస్తవాన్ని ఎన్ని సినిమాలలో మనం చూడ గలుగుతున్నాం ? కనీసం ఆహ్లాద కరమైన హాస్యాన్ని కూడా మనకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే కొంత మంది సినీ పెద్దల వారసుల ముఖాలలో పలికే హావభావ విన్యాసాలకు పనికి వచ్చే కధలు ..... వాటికి మాత్రమే పరిమితమైన సినిమాలు తెలుగు ప్రేక్షకుల మీద రుద్దబడుతున్నాయి. మరి మధ్యలో అప్పుడప్పుడు మంచి సినిమాలు వస్తుంటాయి ..... కాబట్టి వాటికి థియేటర్స్ దొరకకుండా చేస్తే పీడా పోతుంది . 

ఈ దౌర్భాగ్యాన్నుండి తెలుగు ప్రేక్షకుడిని రక్షించడానికి ... మరి కొత్త ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకుంటాయో చూడాలి.కొన్ని కుటుంబాల కబంధ హస్తాల మధ్య నలిగి పోతున్న తెలుగు సినిమాకి ఇప్పుడన్నా స్వేచ్చ లభిస్తుందని ఆశించవచ్చేమో ......