3, మే 2012, గురువారం

మత్తు వదలరా.....ఐ.పీ.ఎల్...మత్తు....




బాగా ఎండగా ఉంది. రోజూ కూర్చున్నట్లే అదే మామిడి చెట్టు క్రింద కూర్చుని మాట్లాడుకుంటున్నాం.ఒక విధంగా చెప్పాలంటే మాట్లాడుకుంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం.ఎవరో మోకాలి క్రింద ఫాంట్ పై ఎవరో తట్టినట్ట్లుగా అనిపించింది. టేబుల్ క్రింద చూస్తే ఒక కోడిపిల్ల...ఫాంట్ మీద యేదో పురుగు పాకి ఉంటుంది. దాని ఆహారాన్ని అది సంగ్రహించే ప్రయత్నం చేసింది. అవి పుట్టినప్పటి నుండీ మా సైట్ ఆఫీస్ లోనే పెరిగాయి కాబట్టి మరీ మనుషులంటే భయపడకుండా ఉండడం నేర్చుకున్నాయి.ఇవన్నీ చిన్నగా ఉన్నప్పుడు వీటిని చూస్తుంటే ఎప్పుడైనా ఉండే టెన్షన్స్ అన్నీ పోతుండేవి. మరీ ముఖ్యంగా యేదైనా  చెట్టు నీడన ఇవి చేరి మట్టిని కొద్దిగా తొలిచి తల్లి కోడి పడుకుని ఉంటే దాని మీదకు ఎక్కి ఇవి ఆడే ఆటలు....వాటిని కొద్దిగా తన భాషలో  గదమాయించే  తల్లి కోడి...సహజత్వానికి దూరమవుతున్న మనకు మరలా సహజత్వం లోకి జారుతున్నప్పుడు కలిగే  ఆనందం...అంతే కాదు మా వంటావిడ బియ్యం చెరుగుతున్నప్పుడు కిచ కిచ లాడుతూ అవి చుట్టూ చేరడం పైగా ఆ చిన్ని చిన్ని నూకలు తినడడానికి కూడా అవి వాటి బుల్లి బుల్లి కాళ్ళతో నేలను దువ్వడం అవి వాటి సహజత్వం లోకి ఎంత త్వరగా ఇమిడిపోతాయో చూస్తుంటే ముచ్చట వేసేది పైగా మనకు లేనిది అవి అనుభవించేస్తున్నందుకు అసూయ కూడా కలిగేది.


నా ఖర్మ కొద్దీ నేను రోజూ యీ కోడి పిల్లలతో ఆనందపడుతున్నప్పుడే మా విశాఖకు ఐ.పీ.ఎల్. మాచ్ లు వచ్చాయి.మొదటి నుండీ ఐ.పీ.ఎల్. నేపధ్యాన్ని చూస్తే నాకు పాత కాలం నాటి రోమన్ సామ్రాజ్యం ఉచ్చ స్థితి లో ఉన్నప్పుడు అంటే వాళ్ళు బానిసలను పూర్తిగా వాడుకోగల స్థితి లో ఉన్నప్పుడు కొంత మంది సెలెక్టెడ్ బానిసలను బాగా మేపి వాళ్ళ మధ్య కుస్తీ పోటీలు పెట్టి వాళ్ళలో ఒకడు చనిపోయే వరకూ ఆ పోటీని పెట్టి ..తిలకించి ఆ నాటి ఉన్నత వర్గాల వారు పొందే  లాంటి ఆనందాన్ని మనం పొందుతున్నామేమో అనిపించేది.ఎవరో కొంతమంది కోటీశ్వరులు ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసుకుని కొంతమంది ఆటగాళ్ళను అద్దెకు తీసుకుని ఆడిస్తుంటే వాటిని చూసి మనం ముచ్చట పడిపోతున్నాం.కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కొంత మంది ఆటగాళ్ళను కొని టీం లు తయారు చేసి ఆడిస్తుంటే మనం గంటల తరబడి రోజూ మాచ్ లు చూడడమే కాకుండా మరునాడు లోకల్ ట్రైన్ లోనో మరే విధంగానో ఉద్యోగానికి వెళ్తూ కూడా ఆ మాచ్ స్టాటిస్టిక్స్ మాట్లాడుకొంటాం.కొంత మంది యూరోప్ లో ఫుట్ బాల్ లీగ్ లకు దీనికి పోలిక  తెస్తున్నారు.  శతాబ్దాల తరబడి ఆసియా,ఆఫ్రికా దేశాలను దోచుకుని...దోచుకుంటూ ఎంతో ఆర్ధికాభివృద్ది లో ఉన్న వాళ్ళ ఆనందాలకు  ..మనకూ పోలికా...?

అంతవరకూ బాగానే ఉంది కానీ మాకు కాంప్లిమెంటరీ పాస్ లు దొరకడంతో మా వాడిని తీసుకుని వెళ్ళడానికైనా నేను ఒక ఐ.పీ.ఎల్. మాచ్ కు వెళ్ళక తప్ప లేదు. ఆ ఎరేంజ్ మెంట్ అంతా క్రికెట్ మాచ్ కు తక్కువగానూ,డెవలప్ చేసిన రికార్డింగ్  డాన్స్ కు ఎక్కువగానూ  ఉన్నట్లుగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే క్రికెట్ కు మించి వేరే ఏదో ఆశించే  వాళ్ళతో స్టేడియం నిండిందని అనిపించింది. చాలా మందికి క్రికెట్ బేసిక్స్ తెలియవు. టీవీల్లో రోజూ చూపిస్తున్నారు కాబట్టి అందులోనూ చీర్ గర్ల్స్  సగం సగం దుస్తులతో కనువిందు చేస్తున్నారు కాబట్టి అక్కడికి  వెళ్ళిన వారికి ఏదో ఆనందం దొరికి పోతుందన్న భ్రమ లో వచ్చిన వాళ్ళు ప్రతి సిక్స్ కు ,ఫోర్ కు కుర్చీల మీదకు ఎక్కి డాన్స్ లు చేస్తుంటే వీళ్ళంతా క్రికెట్ కు వీరాభిమానులుగా చూపిస్తూ చానల్స్ టీ.ఆర్.పీ రేటింగ్ పెంచుకుంటుంటే ......ఈ దేశం లో కేవలం సర్వీసెస్ సెక్టార్ వలన మాత్రమే మన అభివృద్ది రేట్ నిలబడిందన్న నిజం....అది యే మాత్రం శాశ్వతం కాదన్న నిజం...మాన్యుఫేక్చరింగ్ రంగం లో మనం తిరోగమనం లో ఉన్నామన్న నిజం......ఇప్పుడున్న ఇంజినీరింగ్ విద్యార్ధులలో కేవలం 3% మందికే ఉద్యోగాలున్నాయన్న నిజం.....మరి ఐనా కూడా ప్రభుత్వం ఎవరి వృద్ది కోసమో  ఇన్ని ఇంజినీరింగ్ కాలేజ్ లకు అనుమతి ఇస్తుందన్న వాస్తవం.....అసలు ఈ మద్య కాలంలో ఎన్నికైన అసెంబ్లీ సభ్యులకు ...చాలా మందికి ఈ కాలేజ్ లు ఎందుకున్నాయన్న ప్రశ్న....ఇంకా ఇటువంటి కొన్ని వేల ప్రశ్నలు మన ముందు నృత్యం చేస్తున్నా కూడా ఇవన్నీ  మనకు అలోచించుకొనే ఓపిక....టైం....ఉండవు...ఉన్నా మనకేమీ పట్టనట్టు ఆనందంగా కాలక్షేపం చేయడానికి..... యువతరానికి మత్తు జల్లి వాళ్ళని నిర్వీర్యం చేయడానికే ఈ ఐ.పీ.ఎల్.పనికి వస్తుందన్న వాస్తవం కనీసం తలిదండ్రులు....అందులోనూ...బయటకు రావడానికే జడిసే మధ్య తరగతి తలిదండ్ర్రులు..గ్రహిస్తే.....పనీ పాటా లేకుండా ఇటువంటి పోస్ట్ లు రాసే నా లాంటి వాడు కొంత ఆనంద పడతాడు. 


ఆఖర్న ఒక్క విషయం అందులోనూ నాలో దాగున్న ఇన్నొవేటివ్ ఐడియా ను ఈ సందర్భంగా బయట పెట్టక పోతే మన కార్పొరేట్ ప్రపంచానికి ద్రోహం చసిన వాడనవుతాను. సమాజంలో  మారకపు విలువున్న ప్రతి వస్తువూ..సరుకే కాబట్టి....అందులోనూ కొంత యీ ఐడియాను సినిమా వాళ్ళు వాడుకున్నారు  కూడా కాబట్టి మరీ అంత గర్వ కారణమైనదేమీ కానప్పటికీ విన్నవించేస్తే కొంత మందికైనా మేలు చేసిన వాడనవుతానన్న తృప్తి ఉంటుంది. నేను రోజూ ట్రైన్ లో ప్రయాణం చేస్తుంటాను. పాపం కొంతమంది చప్పట్లు కొడుతూ అడుక్కొంటున్నారు. వారిని కించపరచడం నా ఉద్దేస్యం కాదని అందరికీ మనవి చేసుకుంటూ వారిని కూడా మన ఐ.పీ.ఎల్ వారు తగు విధంగా వాడుకోగలిగితే ..........వాట్..ఏ...బ్రిల్లియేంట్  ఐడియా...ఇప్పటికైనా నా ఇన్నొవేటివ్ నెస్ ను ప్రజలు గుర్తిస్తారని నమ్ముతాను.