4, నవంబర్ 2011, శుక్రవారం

భాషా..బంధం

 ఉదయానికి మధ్యహ్నానికి మధ్యలో ఉన్న టైం అంటే 11.30  అయ్యుండొచ్చు. కాంక్రీట్ వర్క్ నడుస్తోంది. చెక్ చేసి వచ్చి చెట్టు కింద వేసిన కూర్చీలలో కూర్చున్నాను. ఆ వర్క్ నాది కాదు కానీ నా కొలీగ్ వేరొక పని మీద వెళ్ళడం వలన నేను ఆ చెకింగ్  కి వచ్చాను. కాంట్రాక్టర్  కొద్ది సేపటికి  వచ్చి నా పక్క కూర్చీలో కూర్చున్నాడు. ఆయనకు నాకు పరిచయం లేదు. తనే మాటలు ప్రారంబించాడు.
"సార్ ది గోదావరి జిల్లాయే నంట కదా..."
"అవునండీ.."
"మాదీ  అక్కడే లెండి..."
కొంత సంభాషణ నడిచింది. అతడు పెద్దగా చదువుకోలేదనీ...కష్ట పడి పైకి వచ్చిన వాడని అర్ధం అయ్యింది.
 యెదురుగా కొత్తగా కట్టిన స్టాఫ్  క్వార్టర్స్ వైపు చూపిస్తూ అడిగాడు.
" క్వార్టర్స్ బాగానే కట్టారు కానీ ...దాని చుట్టూ  మూడడుగుల వెడల్పులో ఒక ప్లాట్ ఫార్మ్  కడితే చూడ్డానికి..శుభ్రానికీ  బాగుంటుంది కదా సార్...."
"మీరు చెప్పింది బాగానే ఉంది కానీ డ్రాయింగ్ లో లేనిది మా వాళ్ళు అంత త్వరగా కట్టరు లెండి" అన్నాను
"అన్నీ  డ్రాయింగ్ లోనే ఇస్తే మేమ్మాత్రం కట్టలేమా యేంటి సారూ...అవి చూడండి బొత్తిగా మొల్తాడు లేని మగాడి లా వేలాడి పడి పోతున్నాయి కదా.."
యెందుకో నాకు తెలియదు కానీ ఆ ఆఖరి వాక్యంలో ఉన్న నుడికారం నన్ను భలే ఆకట్టుకుంది. రాను రానూ మన వాడుక  భాషలో  అందులోనూ పట్టణ  ప్రాంతంలో ఉన్న మాకు యీ నుడికారాలు లేక భాషలో భావ వ్యక్తీకరణ తగ్గిపొతోందనిపిస్తోంది. యే భాషకైనా నుడికారాలు లేకపొతే అది యూనిఫార్మ్ వేసుకున్న కాన్వెంట్ పిల్లల మాదిరిగా ఉంటుంది. ఆఫీస్ ల వరకూ ఆ భాష బాగానే ఉంటుంది కానీ వాడుకలో మాత్రం నుడికారాల సౌందర్యం బలమైన సాస్కృతిక పునాదులున్న వారికి మాత్రమే అర్దం అవుతుంది. ఆ పునాదులు లేని వారికి ఎస్ . ఏం. ఎస్ . భాషకు , తేనెలూరే తెలుగుకి తేడా తెలియదు.  బలమైన సాంస్కృతికాభిమానం లేని వారి కుటుంబ వాతావరణం కూడా బల మైన పునాదులు లేని కట్టడం లా ఉంటుంది.
యీ మద్య అనుకోకుండా ఆదిత్య 369 సినిమా చూడడం జరిగింది. మహా దర్సకులైన స్రీ సింగీతం శ్రీని వాస రావు గారు మన భాషా సౌందర్యాన్ని  ..పద్య సాహిత్యాన్ని ..ప్రేక్షకులకు యెంత అద్భుతంగా పరిచయం చేశారనిపించింది.
కేవలం భాషే కాదు సమాజం లోని పొరలు...ఘర్షణలు  కొత్త తరానికి అందించడంలో మనం విఫలమౌతున్నాము కాబట్టే ఒక తప్పు చేయడానికి వెనుకాడని యువతరం ...ఒక తప్పును గాని...అది జరుగుతున్న తీరును గాని..యెదిరించే మానసిక సామర్ధ్యాన్ని కోల్పోయి దేనిని నమ్మాలో తెలియని డోలాయమాన స్థితి లో ఉంటున్నారు.

ఒక సారి పైన  ఉన్న విడియో క్లిప్  జీవితంలొని లోతులకి ఉదాహరణగా యెలా ఉందో చూడండి.