"గుడ్ మార్నింగ్ సార్ "
సైట్ లో కేంప్ ఆఫీస్ లో "కరుణ " ను చూసి ఆశ్చర్య పొయ్యాను.
ఇంజనీరింగ్ డిప్లొమా పాసయ్యి auto cad పరిజ్ఞానం తో డ్రాయింగ్స్ గీస్తూ ఉండేది కాంట్రాక్ట్ పద్దతిలో. సందేహాలు వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తూ ఉండేది. ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా ఉండేది.
" ఇలా వచ్చేవేం ?"
"ఈ కంపెనీ లో జాయిన్ అయ్యాను సార్ ..... "
ఇంత చిన్న అమ్మాయి .... మట్టి .... కాంక్రీట్ ల మధ్య ....
"సైట్ వర్క్ చేయగలవా .... ?"
"ఫరవాలేదు సార్ .... మా వూరు ఇక్కడికి దగ్గరే .... కొంత ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది .... డిగ్రీ చేయాలనుకుంటున్నాను కదా ...... "
"సరే .... మరి .... డౌట్స్ వస్తే అడుగుతూ ఉండు .... "
నేననుకున్న టైం కంటే త్వరగానే పిక్-అప్ అయ్యింది. స్వంతంగా లెవెల్స్ తీయడం .... కంప్యూటర్ లో ఫీడ్ చేయడం .... రిజిస్టర్స్ మైంటైన్ చేయడం ..... మార్కింగ్ లు యీయడం అన్నీ చేసేది.
కానీ ఒక్కటి నాకు నచ్చేది కాదు. అవకాశం దొరికితే చాలు గంటల తరబడి సెల్ ఫోన్ లో మాట్లాడుతూనే ఉండేది.
అప్పటికీ ఒక రోజు ఆ కంపెనీ అకౌంటెంట్ ను అడిగాను.
"ఈ అమ్మాయి జీతం సెల్ బిల్ కు సరిపోతుందా .... ?"
"భలే వారు సార్ ..... నెలాఖర్లో కూడా తనకు బాలన్స్ ఎంతుందో కనుక్కుని తన ఫ్రెండ్స్ కు కూడా ఛార్జ్ చేయించేస్తుంది "
అప్పటికీ ఒక రోజు అడిగాను
"కరుణా ...... నీవు సెల్ ఫోన్ మీద ఎక్కువగా depend అవుతున్నావేమో ..... "
"లేదు సార్ .... మా ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్ .... మా పిన్ని ..... "
ఇంకా ఏవేవో చెప్పింది .....
"నీకు 20 సంవత్సరాల వయసు లేదు ...నిన్ను జీవిత సమస్యల మీద సలహా అడుగుతున్నారా ..... ?"
" నేను బాగా అలవాటు సార్ వాళ్ళందరికీ .... "
నాకు అంతగా ఆ అమ్మాయి మాటల మీద నమ్మకం కుదరలేదు .
వాళ్ళ కొలీగ్ సుందర్ ని అడిగాను
"అదేమీ లేదు సార్ ..... ఆ అమ్మాయి సమస్యలు వేరు ...... వాటి కోసం చుట్టూ ఉన్న వారెవ్వరితోనూ డిస్కస్ చేయదు . ఎవెరెవరి తోనో సెల్ ఫోన్ ఉంది కదా అని తెగ మాట్లాడుతూ ఉంటుంది ."
ఇది నేను ట్రైన్ లో రోజూ చూస్తున్న విషయమే కాబట్టి ఆశ్చర్యం కలిగించ లేదు .
"మన చుట్టూ ఉన్న వారితో relations మైంటైన్ చేయకుండా ఉండేందుకు ...... మన చుట్టూ జరుగుతున్న విషయాలను పట్టించుకోకుండా ఉండేందుకు ..... కేవలం మనకు .... మన భావాలకు అనుకూలంగా ఉండే వారితో మాత్రమే రిలేషన్స్ మైంటైన్ చేసేందుకు ఈ సెల్ ఫోన్స్ చక్కగా సహకరిస్తున్నాయ్.... ఎప్పుడో దెబ్బ తగిలిన తరువాతే వీళ్ళకు తెలుస్తుంది "
మనసులోనే అనుకున్నాను.
కొద్ది రోజులకే ఆ దెబ్బ తగిలింది.
ఒక సోమ వారం ఉదయాన్నే సుందర్ దగ్గర నుండి ఫోన్ .
" సార్ .... కరుణ చనిపోయింది ..... మిమ్మల్ని పికప్ చేసుకోడానికి వెహికిల్ వస్తోంది ... తయారవ్వండి సార్ .... పల్లెటూరు ....... శవాన్ని ఎక్కువ సేపు ఉంచరు "
గుడ్ మార్నింగ్ సార్ ..... అంటూ ఎదురు రావలసిన అమ్మాయి శవంగా మారిపోయిందన్న వాస్తవాన్ని జీర్ణించు కోడానికి మనసు చాలా సేపు ఒప్పుకోలేదు.
జీప్ దిగాం .... నాకు పరిచయం ఉన్న ఆ అమ్మాయి క్లాస్ మేట్స్ దగ్గరకు వచ్చారు.
"సార్ .... బాడీని తీసుకు పోయారు ..... మేము చాలా రిక్వెస్ట్ చేసాం .... కానీ పల్లెటూరు .... మా మాట ఎవరూ వినలేదు ."
అమాయకంగా ఉండే ఆ అమ్మాయి కడసారి కూడా చూడ లేక పోయినందుకు .... ఎందుకో కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నా ముఖాన్ని చూసిన క్లాస్ మేట్స్ అంతా ఒకేసారి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు.
ఎవరో పెద్ద మనిషి మా దగ్గరికి వచ్చాడు.
"సార్ ...ప్రసాద్ గారంటే ..... "
"నేనే చెప్పండి .... "
" నమస్తే సార్ ..... నేను కరుణ బాబాయిని ..... మీ గురించి కరుణ చాలా సార్లు చెబుతూ ఉండేది."
" అవునూ..... కరుణ ...ఇంత సడన్ గా ....... "
" నిన్న సాయంత్రం .... కడుపునెప్పి అని మీద గదిలోకి వెళ్లి పడుకుంది ..... మరి నిద్రలో ఏమయ్యిందో ...... "
అతడి మాటలు అబద్దం అని కాస్త బుర్ర ఉన్న వాళ్ళకెవరికైనా అర్ధం అవుతుంది.
కొంచెం గుచ్చి గుచ్చి అడిగాను.
దగ్గరికొచ్చి నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు.
"మీతో అబద్దం చెప్ప బుద్దేయడం లేదు సార్ .... చిన్న విషయం మీద ఆత్మహత్య చేసుకుంది సార్. ఈ అమ్మాయికి వరసకి ఇద్దరు బావలు. ఒకరితో మాకు గొడవులున్నాయ్ .... పైగా ఆ అబ్బాయికి ఇంకా జాబ్ కూడా రాలేదు. మేం సెటిల్ చేసిన బావ కు మాకూ మంచి సంబందాలున్నాయ్ ....పైగా కుర్రాడికి మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది ..... ఇవ్వాళ నిశ్చితార్ధం జరగాలి ..... ఇదిగో ఇలా చేసింది ..... "
ఆయన కూడా భోరుమని ఏడ్చేశాడు
సుందర్ ని పిలిచాను .....
"నిన్న కరుణ ఫోన్ చేసిందా .... ?"
అప్పటికే అతడి కళ్ళు ఉబ్బి ఉన్నాయ్.
"నిన్న సెల్ ఇంట్లో వదిలి సైట్ కు వచ్చేసాను సార్ ..... ఇంట్లో మా మిసెస్ చర్చి కి వెళ్ళింది ..... ఆ తరువాత వాళ్ళ రెలిటివ్స్ ఇంటికి వెళ్ళింది ..... నేను కూడా ఈ రోజు ఉదయమే చూసాను ... 20 వరకూ మిస్సిడ్ కాల్స్ ఉన్నాయ్. "
"సార్ నాకు నిన్న ఉదయమే ఒక సారి చేసింది ..... మామూలుగా ఉండే మాటలే ..... ఆ తరువాత ఇంకొక సారి చేసింది ..... బిజీ గా ఉండి ఎత్తలేదు .... మరలా చేస్తే ..... బిజీగా ఉన్నప్పుడు .... డిస్టర్బ్ చేయొద్దు ...అని సీరియస్ గా చెప్పేసాను .... " చాలా క్లోజ్ గా ఉండే క్లాస్ మేట్ ఒకరు చెప్పారు
నిజమే కరుణ ప్రతి సమస్యకూ పరిష్కారం .... సెల్ ఫోన్ లో నుండే వెదుక్కుంది. సెల్ ఫోన్ లో సమస్య కు పరిష్కారం దొరకక పొయ్యేసరికి ..... తన మార్గం తను వెదుక్కుంది. ఎందుకంటే తన సామాజిక జీవితం అంతా ఆ చిన్న సాధనం చుట్టూ అల్లుకుపోయింది.