1982 – 1988 మధ్య
మా వూరిలో రెండు మూడు
సంవత్సరాలు బాల్ బాడ్మింటన్ టోర్నమెంట్ లు నిర్వహించేవాళ్ళం. సంక్రాంతి సమయం
కాబట్టి వూరందరికీ హుషారుగా ఉండేది. మేము పని చేసేది వామ పక్ష విద్యార్ధి
ఉద్యమాల్లో కాబట్టి సాయంకాలం ఊరంతా మా పాటలు పాడుతూ తిరగాలని నిర్ణయించుకున్నాం.
.......ఏం బ్రతుకులు మనైరో .......అమ్మల్లారా
.....తల్లుల్లార......
పాట సాగుతోంది .
మావన్నీ మధ్య తరగతి రైతాంగ
కుటుంబాలు ...
కొత్త ఉత్సాహం .....జనం
ఉత్సాహంగా వింటున్నారు.
“ఒరేయ్ .....ఇలా వచ్చి ఇంకో
రెండు పాటలు పాడండ్రా .....”
మా అమ్మన్న మామ్మ
పిలిచింది.
“నీకీ పాటలు ఎందుకే .....నీ
కొడుకులికి 30 ఎకరాలు సంపాదించి పెట్టావ్ కదా.... “
పాపం పగలు ....రాత్రీ ....
కష్టపడి ఉమ్మడి కుటుంబాన్ని సమర్ధంగా నిర్వహించి
కేవలం పొదుపుతో ఆ ఆస్తి సంపాదించి పెట్టింది.
“నోర్ముయ్ రా ....కుక్కల
కొడకా .....ఇలా వచ్చి పాడండి .....”
చనువుగా పిలిచింది.
ఈ ముసిల్దాన్ని
వదలకూదదనుకున్నాం ......
“సాయి బాబయ్యో రారా .....”
మా సురేష్ హై పిచ్ లో
అందుకున్నాడు.
కుర్రాళ్ళలో మంచి హుషారు
వచ్చింది.
“ఒరేయ్ .....ఒరేయ్ మీకేం
పోయ్యేకాలంరా......నోళ్ళు పోతాయ్.....”
అమ్మన్న మామ్మ లబోదిబో మంది
...
“ఇంకెప్పుడూ పిలవకే ......ముందు
చందా ఇవ్వు ....”
నవ్వుతూ అడిగాను
“ఒక్క పైసా కూడా ఇవ్వను .....”
“సరే ఇంకో పాట సాయిబాబా మీద
పాడేస్తాం.....”
“ఆగోరేయ్ .....”
మొలలో చీరలో దోపుకున్న సంచి
బయటకు లాగి జాగ్రత్తగా పది సార్లు చెక్ చేసుకుని పది రూపాయలు ఇచ్చింది.
“మీ అమ్మతో చెప్తానుండేరోయ్.....ఇలా
పోకిరీ పాటలు పాడుకుంటూ తిరిగితే పిల్లనెవ్వరూ ఇవ్వరు .......”
ఆవిడ మా ఆమ్మకు వరసకు
పెద్దమ్మ అవుతుంది ...
“పోవే ముసిలీ .....నీ మనవరాలినే
చేసుకుంటాను ......”
చుట్టూ చేరిన జనం ఘొల్లున
నవ్వారు .....
(నిజంగా కూడా నేను ఆవిడ
మనవరాలినే పెళ్ళి చేసుకున్నాను )
ఆటలు .....పాటలు .....చదువు
.....ఉద్యమాలు .....ఇవి ఆనాటి మా యౌవ్వనపు
రోజులు ....
వినోదం ఉండేది ......
సినిమాలు చూసే వాళ్ళం ....కానీ
ఉద్యమాల్లో పాల్గొనడం లో ఉండే ఆనందానికే ప్రాధాన్యం ఉండేది.
కాలేజ్ లో మందు కొట్టే
వాళ్ళు అప్పుడూ ఉండే వారు .....ఆడ పిల్లలని టీజ్ చేయడం అప్పుడూ ఉండేది .....కానీ ఈ
సంస్కృతికి పూర్తి భిన్నమైన సంస్కృతి ఉన్న బలమైన సమూహం ఉండేది. కొంతమందైనా కారల్
మార్క్స్ దగ్గరనుండి .....బెర్ట్రాండ్ రస్సెల్ మీదుగా ప్రయాణం చేసే వాళ్ళు ఉండే
వారు. సిద్దాంతాల చర్చలు ఉండేవి. రెండు భిన్నమైన సంస్కృతుల వలన ప్రత్యామ్నాయం
అనేది ఎప్పుడూ సిద్దంగా ఉండేది.
*********
వర్తమానానికి వద్దాం.....
కాలేజ్ నుండి ఇంటికి వచ్చి
స్టూడెంట్ టీవీ ఆన్ చేస్తాడు. సాధారణంగా సినిమాయో ...క్రికెట్టో....చూస్తాడు ....
మధ్యలో AD తప్పదు. కారు
చక్కగా లడక్ లోని రోడ్ మీద జారుతుంటుంది .....అబ్బాయి సుతారంగా డ్రైవ్ చేస్తుంటాడు
....పక్కనున్న అమ్మాయి ముంగురులు ....సారీ ...AC కాబట్టి గాలికి ఎగరవ్. కానీ
గ్లాసెస్ లో నుండి బయట ఉన్న అద్భుత ప్రకృతి సౌందర్యం కనబడుతూ ఉంటుంది .....ఆ
కారులో ప్రయాణం ఎంత సౌకర్యమో AD వస్తుంది ......
టీవీ బోరుకొట్టినప్పుడు
కంప్యూటర్ లో నెట్ లోకి వెళ్లి పేస్ బుక్ లో కి వెళ్తాడు. తనకి కావలిసిన పేజీలు
....అప్ లోడ్స్ చూసుకుంటాడు . ఆ తరువాత ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సంగీత ప్రపంచం లోకి
వెళ్లి పోతాడు .....
తమ నిజ జీవితానికి అందని
చోట ఆనందం కోసం వెదుకులాట. ఇంచుమించు అది దొరకనిదే అని తెలుసు ......ఊహలతో ఆనందం ......ఫ్రస్ట్రేషన్
.....
ప్రశ్నించడం ......ఉద్యమించడం
.....లేని జీవితంలో నిజమైన ఆనందం ఉండదని అర్ధమయ్యేట్టు చేయలేని కుటుంబ .....సామాజిక
పరిస్థితులు .......
ఆనందం కోసం NET ను
ఆశ్రయించినప్పుడు ......విరివిగా దొరికే పోర్నో సైట్స్ .....బలహీన మనస్కులని మరింత
బలహీన పరిచే వేల అవకాశాలు ....దాని వలన
పెరుగుతున్న నేరాలు .....
ఎంత నేరం చేసినా ఫరవాలేదు .......దానికి
పరిష్కృతం మా దగ్గర ఉందని ప్రజలని మనస్ఫూర్తిగా నమ్మించగలిగిన మందిరాలు ....ప్రార్ధనలు
......
అద్భుతం కదా.......
నేరం చేయించే పరిస్థితులు .....తిరిగి
చాలా సులభంగా....చౌకగా ..... దానినుండి మానసికంగా అయినా బయట పడేసే మార్గాలు ......మరి
నేరాలు ఎందుకాగాలి ?
ఈ ఘనమైన సామాజిక
నేపధ్యాన్ని యువతరానికి వారి ముందుతరం అందిస్తోంది .......
మరి ఈ చెత్తను కూడా కాస్త
శుభ్ర పరుద్దాం ......