20, ఏప్రిల్ 2014, ఆదివారం

మా సిక్కిం యాత్ర

                       నిజమే ఇప్పటికే ఆలశ్యం అయ్యింది. సిక్కిం టూర్ ముగించిన దగ్గర నుండీ చాలా మంది చాలా వివరంగా మా టూర్ గురించి రాయమని అడుగుతూనే ఉన్నారు . ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ముందుగానే అక్కడ చూడవలసిన దాని గురించి ఇంటర్నెట్ సౌకర్యం వలన వివరాలు పూర్తిగా తెలుస్తున్నాయి. టూర్లు మాకు కొత్త కాదు కాబట్టి ముందుగానే టూర్ కి అవసరమైన మనస్తత్వాన్ని ముందుగానే రెడీ చేసుకోవాలి. చిన్న చిన్న మోసాలు జరుగుతాయి ..... వాటిని 100% తప్పించుకోవచ్చు కానీ మన దగ్గర చాలా సమయం ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి తక్కువ మోసాలతో .... తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రదేశాలు చూసే విధంగా మన మనసును మలుచుకుంటే upsets తగ్గుతాయి. మాకున్న సమయం తక్కువే కాబట్టి మా వెళ్లబోయే  టూర్ మీద ఎక్కువ పరిశోధన చేసి కేవలం మోసాలను తగ్గించే పని మీదే మా దృష్టి నిలపాలని అనుకోలేదు కాబట్టి న్యూ జల్పాయ్ గురి స్టేషన్ (హౌరా నుండి సుమారు 10-11 గంటల ప్రయాణం ) లో దిగ గానే దగ్గరలోనే ఉన్న ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు వెళ్లాం. మా అమ్మాయి కొలీగ్స్ చాలా మంది ముందుగానే టూర్ చేసి ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎక్కువగా ఎవరూ మోసం చేయలేరని మాకు తెలుసు . వాస్తవంగా అదే జరిగింది కూడా. ఇక్కడ నాకూ ..... శ్రీమతికీ తరచూ జరిగే ఒక యుద్ధం గురించి చెప్పాలి. నాకు విరమణ తరువాత వచ్చే పెన్షన్ ను కూడా లెక్క లోకి తీసుకుంటే రోజుకి ప్రభుత్వం నాకు 2500 రూపాయలు పైనే ఇస్తుంది కాబట్టి చాలా తేడా వస్తే తప్ప దూరం వెళ్లి చిన్న చిన్న మార్కెటింగ్ లు చేయకూడదంటాను ..... ఆ సమయాన్నిఉపయోగించుకుని  నా సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకుంటే మంచిదంటూ ఉంటాను .... కానీ తనే గెలుస్తూ ఉంటుంది.

మొత్తానికి చక్కటి అల్పాహారం తో మా ప్రయాణం ప్రారభించాం .29-3-13 సాయంత్రం 5. 00 గంటలకు మేము బుక్ చేసుకున్న మే ఫెయిర్ హోటల్ కి చేరుకున్నాం. అతి చక్కటి లొకేషన్ లో
అత్యంత సుందరంగా నిర్మించబడిన ఆ హోటల్ మాకు కనువిందు చేస్తుంటే స్నానాలు ముగించి Gangtok నగరంలో మార్కెట్ ప్రాంతమైన M . G . మార్కెట్ కు వెళ్ళాం. ఆ మార్కెట్ చూసి ఇక్కడనుండి వెళ్ళిన  మన వాళ్లెవరైనా ఆశ్చర్యపోక మానరు. మార్కెట్ లోకి వాహనాలను అనుమతించరు. ఇరుపక్కల  పార్క్ చేసుకోవలసిందే . షాప్ ముందు కార్ ఆపి శరీరాన్ని దాంట్లోనుండి దింపి  సెక్యూరిటీ గార్డ్  నమస్కారాన్ని అందుకుంటే గాని మార్కెటింగ్ ప్రారంబించని మన వాళ్లకు ఇది ఆశ్చర్యం కాక మరేమిటి ? మార్కెట్ ను విడదీస్తూ ఉన్న చిన్న పార్క్ ..... కింద ఉన్న టైల్స్ ఫ్లోరింగ్ ..... దాని మీదే ఆడుకుంటున్న చిన్న పిల్లలు మనలను వేరే ప్రపంచానికి తీసుకెళ్లతాయ్. ఈ మార్కెట్ ను చూడ గానే మా వైజాగ్ లో ఖాళీ అయిన జైలు స్థలం గుర్తుకు వచ్చింది. నిజంగా సరైన Architectural డిజైన్ తో అలాంటి మార్కెట్ నిర్మిస్తే ఎంత సౌలభ్యంగా ఉంటుందో ..... అనిపించింది. నిజంగా మనకు అన్నీ ఉంటాయ్ లోపించేది చిత్తశుద్ది మాత్రమే. తిరిగి వచ్చి డిన్నర్ కు ఉపక్రమించాం. అందులోనే సిక్కిం ప్రఖ్యాత వంటకం మామూస్ తిన్నాం.ఆవిరితో ఉడికించబడే ఆ వంటకం ప్రత్యేకత తింటే గాని తెలియదు.           
 మొదటి రోజు :ది 29-3-14
  మరునాడు ఉదయాన్నే తూర్పు సిక్కిం కు తలమానికం వంటి బాబా మందిర్ .... చాంగు సరసు వైపు బయలుదేరాం. ఇక్కడే ఒక సంగతి గుర్తుంచుకోవాలి. సిక్కిం లో చాలా ప్రాంతాల దర్శనానికి ముందుగానే మిలటరీ అధారిటీస్ అనుమతి తప్పని సరి. కాబట్టి టూర్ ఆపరేటర్ సహాయం లేకుండా అంతా మనమే ఏర్పాట్లు చేసుకుందామన్న ఆలోచన చేయడం వ్యర్ధం. కాస్త కమీషన్ వాళ్ళు తిన్నా కూడా కలిసొచ్చే సమయం తో పోలిస్తే మనమే లబ్ది దారులం అవుతాం. మొదటి రోజు కాబట్టి కనబడుతున్న మంచు పర్వతాలు ఎంత థ్రిల్లింగ్ కు గురి చేస్తాయంటే మనం మంత్ర ముగ్దుల్లా చూస్తూ ఉండి పోతూ ఉంటాం. చాంగూ సరసు దాటిన తరువాత రోడ్ పక్కన ఉండే " You are under Chinese observation" అన్న sign బోర్డ్ లు మనం సరిహద్దులలో ఉన్నామన్న మాట అనే థ్రిల్లింగ్ గు గురి చేస్తాయి.పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ తగ్గుతూ
ఉంటుంది. కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా ఉండడం అవసరం. అత్యుత్సాహం అనర్దాలకు దారి తీస్తుంది. మా అదృష్టం కొద్దీ మేము వెళ్ళిన రోజే బాబా మందిర్ కు రోడ్ ఓపెన్ చేసారు. లేదంటే అంత దూరం వెళ్ళి ఆ అద్భుత ప్రదేశాన్ని మిస్ అయిన బాధ మిగిలి పోయి ఉండేది. 13000 అడుగుల ఎత్తులో ఒక వీర సైనికుడి( హర్భజన్ సింగ్ 1941-67) సంస్మరణార్ధం కట్టిన ఆ మందిరం మన భారతీయులందరికీ నిజంగా దర్శనీయ స్థలం. ఎన్ని ఫోటో లు ఇక్కడ ఎన్ని ప్రచురించినా అవి ఆ అందానికి న్యాయం చేయలేవు .
మొదటి సారి ఆ మంచు పర్వతాలను చూస్తున్న మా శ్రీమతి కూడా పిల్లల్లా గంతులు వేయడం ప్రారంబించింది . ఒక్క నాలుగైదు నిముషాల బాటు నాకు ఇబ్బందిగా అనిపించినప్పటికీ మంచినీళ్ళు తాగుతూ ఉండడం వలన చాలా త్వరగా మామూలు గా అయిపోయ్యాను . అంతా మంచు ఎడారి . 
 కొంత సేపటికే చలిగాలుల ఎఫెక్ట్ కనబడింది. తలకి ఫర్    
కేప్ పెట్టుకోక తప్పలేదు. క్రింద కనబడేదే ప్రసిద్ద 
బాబా మందిర్ ఆ మందిరం యొక్క చరిత్ర ..... 
నమ్మకాలూ అన్నీ నెట్ 
లో దొరుకుతాయి .....



ఇక్కడనుండి క్రిందకు దిగడం ప్రారభించినప్పటి నుండీ   చాంగూ సరసు వరకూ ఇక్కడి జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి . చాలా ఎత్తునుండీ చాంగూ సరసు మనకు కనబడుతుంది. ఆ సరసు పవిత్రత గురించి ...... శక్తుల గురించి కూడా చాలా నమ్మకాలున్నాయ్. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా 12500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరసు అందాలు వర్ణనాతీతమే . ఎత్తైన మంచు పర్వతాల మధ్య నీలం రంగు నీళ్ళలో మంచు శిఖరాల ప్రతిబింబాలు అద్భుతంగా ప్రతిఫలిస్తూ ఉంటాయ్ . ఇక్కడ అలంకరించబడిన యాక్ ల మీద హిమాలయాల్లో విహరించడం చక్కని అనుభవం .
అక్కడ నుండి అడుగు దూరంలో కూడా మనిషి కనబడనంత వర్షం ..... అతి సన్నని దారి ..... పక్కకు జారిందంటే ఊహించుకోడానికి కూడా భయం వేస్తుంది. కానీ డ్రైవర్స్ అందరికీ ఆ దారి కొట్టిన పిండి అనుకుంటా ... ఏ మాత్రం తడబాటు లేకుండా సాయంత్రం 5.00 గంటలకల్లా Gangtok చేరాం.
మేము దిగిన స్థలం నుండి M . G రోడ్ కేవలం 2 కి.మీ. ఉంటుందని తెలిసింది కాబట్టి నెమ్మదిగా నడక ప్రారంభించాం. రోడ్ల మీద నడవని జనం ..... ఒకరి వెనుక ఫుట్ పాత్ మీదే .... ఎంతో అవసరమైతే గాని హారన్ కొట్టని వాహన చోదకులు. క్రమశిక్షణ ఉంటే అందరికీ మంచిదే ..... తప్పితే ఒకరిద్దరికే ఆనందం అనే తాత్విక దృక్పధం అంతా కనబడుతుంది. పక్కనే ఉన్న భూటాన్ ప్రపంచంలో హ్యాపీ నెస్ ఇండెక్స్ లో మొదటి 10 దేశాల్లో ఉంటుంది. దాని ప్రభావం .... తాత్విక దృక్పధం వీరి మీదా కూడా ఉందేమో అనిపిస్తుంది. జరిగిన  అభివృద్ధి ఎంత అనేది కాకుండా ఎంత మందికి చేరిందనేది ముఖ్యం. ఆ విధంగా చూస్తే  ఆ రాష్ట్రం మన కంటే చాలా అభివృద్ధి చెందినట్లే. మే ఫెయిర్ లో తృప్తిగా డిన్నర్ చేసి మూడు దినాలు ,రెండు రాత్రుల నార్త్ సిక్కిం యాత్రకు సామాను సర్దుకుని నిద్రపోయ్యాం.

రెండవ రోజు :ది 30-3-14
ఉదయం 11. 00 గంటలకు మా ప్రయాణం ప్రారంభమయ్యింది. ఊహించలేని ఎత్తైన పర్వత సానువుల మీదుగా సన్నని దారుల గుండా ప్రయాణం చేసి సాయంత్రం అయ్యేసరికి "లాచుంగ్" చేరుకున్నాం. ఇక్కడే మేము మా మొదటి మోసాన్ని రుచి చూసాం. న్యూ జల్పాయ్ గురి లో మాకు లాచుంగ్ అంటే చిన్న గ్రామం ..... ఏమీ దొరకని ప్రదేశం కాబట్టి టూరిస్ట్ లు కాస్త adjust అవవలసి ఉంటుందని చెప్పారు . నిజానికి అది అన్ని వసతులూ ఉన్న చిన్న పట్టణం. ఆ వూరిలో మంచి హోటల్స్ చాలా ఉన్నాయి. కానీ మనం గట్టిగా ముందే చెప్పక పొతే గీజర్ లు కూడా పనిచేయని టాయిలెట్ లు ఉండే ఇరుకు రూమ్స్ లో సర్దుకో వలసి వస్తుంది. 

మూడవ రోజు :ది 31-3-14
ఉదయాన్నే 6. 00 గంటలకే ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఇంచుమించు 2 గంటల సమయంలో యంటాంగ్ లోయ కు చేరుకుంటాం. అక్కడే అల్పాహారం చేయవలసి ఉంటుంది. అల్పాహారం అంటే మనకున్నట్లు చాయిస్ లు ఉండవ్ . వాళ్ళు పెట్టే నూడుల్స్ తప్ప వేరేమీ ఉండవ్. అల్పాహారం తిని కొంచెం ముందుకు వెళ్లేసరికి అల్పాహారం సంగతే మరచి పోతారు. ఉదయపు సూర్య కాంతితో మెరిసే పర్వత శిఖరాలు ....... పచ్చటి మైదానం ..... చూడాలి తప్ప వర్ణించడానికి ఏ భాషా సరిపోదు.
నిజానికీ ఫోటోగ్రఫీ అలవాటు ఉన్న వారికి ఎన్ని తీసినా తనివే తీరదు. బాబా మందిర్ దగ్గర ఉండే పరిసరాలకు ఇక్కడకు ఉండే ప్రధానమైన తేడా ఏమిటంటే ఇక్కడ పచ్చదనానికి అంచుగా వెనుక తట్టులో మంచు శిఖరాలు ఉంటాయ్ . ఆ అందం మనలను మంత్రముగ్దులను చేస్తుంది. ఇక్కడ నా విన్నపం ఏమిటంటే నార్త్ సిక్కిం యాత్ర చేయాలనుకునే వాళ్ళు సమయం తక్కువ ఉంటే బాబా మందిర్ వైపు వెళ్ళడం మానేయ వచ్చు. 
టెన్షన్స్ దూరం చేసే ఇలాంటి ప్రయాణాలు వీలయినంతమందికి అందుబాటులో ఉంటే ఎంత మంచిదో ..... అసలు ప్రతి చోటా ఏదో ఒక దర్శనీయ స్థలం ఉంటుంది ..... మనమే పట్టించుకోం . ఇక్కడొక చిన్న సెలయేరు ఉంటుంది .... మేము నీళ్ళ పక్కన ఉండే వాళ్ళమే కాబట్టి సెలయేరు మీద అంతగా దృష్టి పెట్టలేదు. చాలా మంది యాత్రికులు అటు కూడా పరుగులు తీశారు. మా పప్పీ(మా అమ్మాయి ) మాకు కూడా ఒక ఫోటో తీసింది .ఇంకొక 15 రోజుల తరువాత వస్తే ఇక్కడ పూలన్నీ వికసించడం  ప్రారంభమవుతుందని డ్రైవర్ చెప్పగానే మనసు 
చివుక్కుమంది . నిజంగా అప్పుడెంత colorful గా ఉంటుందోనని. అక్కడ నుండి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న '0' పాయింట్ (Yumesamdong )కు ప్రయాణం ప్రారంభమయ్యింది . అందరిలో ఉత్సాహం. రోడ్ కూడా బాగానే ఉంటుంది. పాటలు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంటే డ్రైవర్ స్పీడ్ పెంచాడు.
ఒక్కొక్క చోట రోడ్ మలుపులు చూస్తుంటే
ఎంత భయం కలుగుతుందంటే ....... అక్కడి డ్రైవర్స్ కు మాత్రం ఏ మాత్రం తడబాటు ఉండదు . 

హమ్మయ్య చేరుకున్నాం ..... 
అందరిలోనూ పరవళ్ళు తొక్కుతున్న హుషారు. భూమి మీదే ఇదే స్వర్గమేమో అనేంత ప్రకృతి సౌందర్యం ..... ఎన్ని ఫోటోలని ఇక్కడ upload చేయగలను ..... 

చాలా.....  ఇంకా కావాలా ...... అందం .... కళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నాయో .....





అంతా చిన్న పిల్లలై పోతామేమో ..... ఎవరైనా చూస్తారనే భయం లేదు .... నవ్వుతారనే భయం అసలు లేదు .... కాబట్టి మా శ్రీమతి కూడా పిచ్చుక గూళ్ళు కట్టడం ప్రారంభించింది .



 మరలా మేం నలుగురం .... 



పెద్ద హీరోలా వెధవ ఫోజులో మా సుపుత్రుడు .....









తను 12 సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న కూచిపూడి నాట్యంలో ఒక భంగిమను ...... ఆ పర్వత రాజాలకు చూపిస్తూ మా అమ్మాయి ......


మొత్తానికి విడవలేక విడవలేక ఆ ప్రదేశాన్ని విడిచి తిరుగు ప్రయాణమయ్యాం ..... అక్కడినుండి లాచేన్ ప్రయాణమయ్యాం.

నాలుగవ  రోజు :ది 01-4-14
ఈ  మా ఉగాది .... ఈ రోజు ఇక్కడ ఉండడం ...... భలే అనిపించింది ..... తెల్లవారగట్ల 03. 00 గంటలకు ఇంత చలిలో అసలు లేవగలమా ..... అనుకున్నాం కానీ కరెక్ట్ టైం కు తయారై కూర్చున్నాం. అసలు మేము వెళ్ళే ప్రదేశమే ..... మాకు తెలియని పేరు ..... మొత్తానికి జీప్ లో కూర్చున్నాం. వెలుగు వచ్చిన కొద్ది సేపటికే అల్పాహారం యదావిధిగా ముగించాం. అక్కడనుండి ఒక మిలిటరీ కేఫ్ ముందు ఆగిన తరువాతే మేమెంత ఎత్తులో ఉన్నామో తెలిసింది. 




ఆ కేఫ్ లో వేడి వేడి కాఫీ తాగి మా ప్రయాణాన్ని కొనసాగించాం . అంతా ఒక పెద్ద మంచు ఎడారి . మెరుస్తున్న మంచు శిఖరాలు .... మంచుని కట్ చేసి తయారు చేసిన రోడ్ .... ఇదే రోడ్ గుండా చైనా కు టిబెట్ కు పూర్వీకులు వెళ్ళేవారని తరువాత తెలిసింది .

వెళ్ళేది గురుదోమ్గార్ అనే సరసు దగ్గరకు అనీ ..... హిమాలయాల్లో ఉన్న అతి పవిత్ర సరసుల్లో ఇదొకటి అని మిలిటరీ కేఫ్ లో చదివాం.



మా అమ్మాయి వెనుకగా కనబడుతుంది అదే ..... సంవత్సరంలో కొద్ది కాలమే నీళ్ళు కనబడతాయ్. ఎప్పుడూ గడ్డ కట్టి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఉంది .


అక్కడ ఒక మూల స్వచ్చమైన నీరు కనబడుతుంది చూడండి . ఎంత చలి లో కూడా అక్కడ నీరు గడ్డ కట్టదట. దానికి కారణంగా ఒక కధ  చెబుతారు. గురునానక్ ఈ ప్రాంతం మీదుగా వెళ్తూ  ఈ కనబడుతున్న సరసు భాగం మీద తన చేతితో తాకాడనీ  ఆ ప్రభావం వలన అందరికీ ఎల్లకాలం నీరు అందించడానికి అది గడ్డకట్టకుండా ఉంటుందనీ అక్కడి వారి నమ్మకం . ఆ నీరు చాలా మంది పవిత్ర జలం గా తీసుకుని వెళ్తారు . ఏదైనప్పటికీ అది ఒక అద్భుతమే . ఇక ఈ ప్రాంతం యొక్క అందాన్ని మా ఫోటోలే చూపిస్తాయి .
ఇది కూడా చైనా కు సరిహద్దు ప్రాంతమే .... ఈ ప్రాంతం లో టూరిస్ట్ ల బాగోగులు మిలటరీ ఏ చూసుకుంటుంది . చాలా ఎత్తైన ప్రాంతం (17100ft) కాబట్టి ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది. మెడికల్ సమస్యల వల్ల తరచూ టూరిస్ట్ లు ఇబ్బందికి గురవ్వడం జరుగుతూ ఉంటుంది. 
మా సుపుత్రుడికి వాళ్ళ అక్కతో ఏదో ఖచ్చితంగా అవసరం వచ్చే ఉంటుంది. నెమ్మదిగా కాకా పడుతున్నాడు . వాడిది నిజమైన ప్రేమ అంటే నమ్మడం కష్టం .



అక్కడొక చిన్న గురునానక్ మందిరం ఉంది. పూజలూ పునస్కారాలు పెద్దగా లేనప్పటికీ అందరూ విధిగా ఒక సారి మందిరం లోనికి వెళ్లి వస్తారు. ఫొటోలైతే చాలానే ఉన్నాయి కానీ అన్నీ upload చేస్తే ఆ తరువాత వెళ్లేవారికి మజా ఉండదు . తిరిగి ఇక్కడ నుండి లాచెన్ వచ్చి సామాను ప్యాక్ చేసుకుని Gangtok బయలుదేరాం. ఇక్కడ అత్యంత సుందరమైన పర్వత గ్రామమైన లాచెన్ ఫోటో ఉంచక పోతే అన్యాయమే ..... 

రాత్రి తొమ్మిదింటికల్లా Gangtok చేరిపోయాం. 





ఇక్కడనుండి అంతా మామూలే .... మరునాడు Gangtok లోకల్ టూర్ పెట్టుకుంటే ఒక విధమైన టైం వేస్ట్ ..... త్వరగా ప్యాక్ చేసుకుని సిల్గురి చేరితే కాస్త మార్కెటింగ్ అయినా చేసుకోవచ్చు. 
                         కేవలం ప్రాంతం భౌగోళికంగా అందంగా ఉంటే సరిపోదు. అక్కడి ప్రజల జీవన సరళి కూడా బాగుంటే ఆ ప్రాంతం మరింత అందంగా ఉంటుంది. మితిమీరిన కోర్కెలే ..... దుఖానికి హేతువు అనే తాత్వికత వారు నమ్మిన మతంలో ఉంది . దానినే నమ్ముతూ శ్రమ మీద ..... నిజాయితీ మీద నమ్మకం సడలని ప్రజానీకం. భోగోళిక సౌందర్యానికి తోడైన ప్రజల జీవన సౌందర్యం ...... ఒక్క సారి వెళ్ళి చూడండి .... ఆ తరువాత పదే పదే వెళ్ళాలని అనిపిస్తూనే ఉంటుంది .