11, అక్టోబర్ 2013, శుక్రవారం

మంచి పుస్తకాలు ....... బ్రతికే కళ

" నేను ఎకనామిక్స్ ఎందుకు చదవాలి నాన్నా ...... ?

సుపుత్రుడు ప్రశ్నించాడు . నేను కొంచెం బిజీ గానే ఉన్నాను .

"మొత్తానికి ఏదో ఒకటి చదవాలి కదా ... "

"కానీ అదే ఎందుకు చదవమంటున్నావ్ ... "

ఇప్పడే చెప్పాలి అన్నట్టుగా అడిగాడు .

బుర్ర పైకి ఎత్తక తప్ప లేదు .

"పోయిన వారం ఉల్లి పాయలు ఏ రేటు లో కొన్నావ్ ?"

"కిలో 60 రూపాయలు . "

"నిన్నెంత ?"

"కిలో 48 రూపాయలు "

"ఎందుకంత తేడా ... ?"

"పోయిన వారమంతా సమైక్యాంద్ర సమ్మె కదా .... "

"అయితే ... "

"బస్సులు అదీ తిరగ లేదు కదా .... "

"ఉల్లిపాయలు బస్సుల మీద ట్రాన్స్ పోర్ట్ అవుతాయా ?

"కాదనుకో .... "

"ఓరి పనికిమాలిన వెధవా ... చాలా మంది నీలానే ఉంటారు . ప్రతి విషయానికి పై పై నే ఆలోచించి ఏదో ఒక కారణాన్ని ఆపాదించేసుకుంటారు తప్ప లోతు ల్లోకి వెళ్లి ఆలోచించరు . ఇప్పుడు నీవు చెప్పిన సమాధానం లో పాక్షికంగా నిజం ఉండొచ్చు . కానీ నీవు అంత  ఆలోచించలేదని నాకు తెలుసు "

"సరేలే .... ఎకనామిక్స్ చదివితే ఇవన్నీ తెలుస్తాయా ..."

"ఖచ్చితంగా ఇవే అని చెప్పలేను కానీ ప్రస్తుత పరిస్థితుల గురించి వీటి నేపధ్యం గురించి నీవు బాగా అర్ధం చేసుకోగాలుగుతావ్ . "

"నాన్నా .... మరి ..... ఎకనామిక్స్ చదివితే మంచి ఉద్యోగం రాదేమో .... ?"

అమ్మ ....నా కొడకా ..... అని మనసులోనే అనుకున్నాను .

"ఫరవాలేదు ..... సమాజం మీద మంచి అవగాహన తో మంచి పౌరుడిగా బ్రతుకుదువు గాని .... "

"సరైన ఉద్యోగం లేక పొతే ఎలా ..... "

ఎందుకో నాకు నేను చిన్నప్పుడు చదివిన తాడికొండ స్కూల్ లో పని చేసిన సి . ఎస్ . రావు మాస్టారు గుర్తుకు వచ్చారు . ప్రిన్సిపాల్ తో కొద్ది కమ్యూనికేషన్ గేప్ వలన ఆయన ఆకస్మాత్తుగా రిజైన్ చేసారు . ఆయన వెళ్ళే ముందు జరిగిన మీటింగ్ లో ఆయన
ఒకటే చెప్పారు.

 "మా కుటుంబ వృత్తి వడ్రంగి పని ... నాకు వేరే ఉద్యోగం దొరికే వరకూ ఆ పని చేసుకుని బ్రతగ గలను  కానీ ఇష్టం లేని చోట ఒక్క నిముషం కూడా ఉండ లేను ."

ఇది గుర్తుకు రాగానే మా వాడితో అదే చెప్పాను .

"కాబట్టి నీవు మోటార్ సైకిల్ మీద తిరగ గలిగే ఉద్యోగం సంపాదించుకుంటే చాలు . "

"నాన్నా ... "

మా వాడు అరిచిన అరుపుకు కాస్సేపు నా గుండె ఆగిపోయిందేమో అనుకున్నాను .

"మోటార్ సైకిల్ ఏమిటి ..... నాన్నా ... "

వాడు అరిచాడు కానీ నిజానికి 10 వ తరగతి చదువుతున్నా వాడి లో ఎక్కువ భాగం బాల్యం పాలే ఎక్కువ . మనకు నచ్చే జీవిత దశను
 కొంత పొడిగించడం మంచిదేనని నా ఉద్దేశ్యం . అంటే మెదడు లేకుండా చేయమని కాదు కానీ అనవసరమయిన ఒత్తిడి తో బాల్యాన్ని కుదించేయడమంటే వాళ్లకు ద్రోహం చేయడమేనని నా ఉద్దేశ్యం .

నేనెప్పుడూ ఆశావాదిని . రోజులెప్పుడూ ఒకేలా ఉండవని నా నమ్మకం . మన దేశ రాజకీయాల నడిపిస్తున్న అసలైన ఆర్ధిక శక్తుల నిజ స్వరూపాలను బయట పెట్టి సిద్దాంతాల ప్రాతిపదిక మీదే మాట్లాడే నాయకులనే జనం నమ్ముతారని అనిపిస్తోంది . భారత దేశ రాజకీయాల మీద లంపెన్ పెట్టుబడి దారీ వర్గానికి పట్టు ఎలా బిగిసిందో అర్ధం చేసుకోగలిగితే నేటి ఈ పరిస్థితి అర్ధం అవుతుంది . ఇంతకూ చాలా మందికి ఈ లంపెన్ పెట్టుబడిదారులంటే అర్ధం కాదు .  నిజానికి వాటి నిర్వచనాలకు వెళ్ళడం కంటే వారి లక్షణాలబట్టి చెబితే ఉత్తమం . నిజమైన పెట్టుబడి దారులు తనున్న సమాజావసరాలకి పెద్ద పీట వేస్తారు . అంతే గాని విలాసాలకు కాదు . దేశం నిండా ఉన్న టాటా .... బిర్లా ల విద్యాలయాలు .. పరిశోధనా శాలలు ఈ నిజాన్ని విసదీకరిస్తాయ్ . కానీ ముంబై లో వెలిసిన అత్యాధునిక రాజభవనాలు 70 వ దశకం ఆఖరు నుండి కొనసాగుతున్న కొత్త రూపం సంతరించుకున్న పెట్టుబడిదారీ విధానానికి దర్పణం పడతాయ్ . అడ్డదారులతో పైకి ఎదిగిన పెట్టుబడిదారీ వర్గాలు ఇదే అసలైన  విధానమని ప్రజలను నమ్మించి మభ్య పెట్టడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు . పుట్టుక లోనే అనేకానేక కుంభ కోణా ల ఆవాసంగా మారిన I.P.L. ను ప్రమోట్ చేసిన వారిని ఒక్క సారి గమనించండి . దీనికి తన వంతుగా కాకుండా శాయశక్తులా తన సహాయ సహకారాలను మన మీడియా అందిస్తోంది . నేను చెప్పేది I.P.L మాచ్ గురించి కాదు . సరికొత్తగా పుట్టుకొస్తున్న లంపెన్ వర్గాలను అధికారం లోకి తేవడానికి ఇవి నిర్విరామంగా కృషి చేస్తూనే ఉన్నాయి .


నిజాయితీ పరులు......  మేధావులని పేరు తెచ్చుకున్న వారిని ఏదో నామ మాత్రంగా తమ చానళ్ళ లో చూపించిన వారు ..... నేర విచారణ మద్య లో ఉన్న ( ముఖ్య విషయం ఏమిటంటే నేరారోపణలను కోర్ట్ కొట్టేయ లేదు . ). సదరు నాయకుడి జైలు నుండి మొదలైన బెయిల్  యాత్ర చాలా ఛానళ్లలో  లైవ్ టెలి కాస్ట్ కాబడిందంటే అది కేవలం ఈ రాష్ట్రంలో నిజాయితీ మీద ... క్రింద నుండి పైకి ..... పై నుండి క్రిందికి వ్యాపించిన లంపెన్ ఆలోచనా ధోరణి విజయమే అని చెప్పొచ్చు.

1. వయసు పైబడిన స్త్రీ నెమ్మదిగా ట్రైన్ లో నుండి దిగుతూండ గానే దున్న పోతులా ఉన్న యువకుడు ఆవిడను గెంటుకుంటూ సీటు కోసం లోపలికి దూరి పోతాడు . "ఇదేమిటి" అని అడిగితే తన సీట్లో హాయిగా కూర్చుని చెవిలో యియర్ ఫోన్స్ పెట్టుకుని నీవంక కూడా చూడడు . 2. వన్ వే లో రాంగ్ రూట్ లో వచ్చి నిన్ను గుద్దేసి అదే స్పీడ్ లో నవ్వుకుంటూ సాగి పొతాడు . 3.. గుడి లో క్యూ లో నించున్న వారి పక్కగా ముందుకు పోయి పూజారి గారికి తన కొబ్బరికాయ ఇచ్చి దణ్ణం పెట్టేసి "ఆఫీస్ కు టైం అయిపోతోంది " అనేసి ప్రసాదం తీసుకుని హాయిగా వెళ్లి పోతాడు .

                    ఇలా రాసుకుంటూ పొతే కొన్ని వందల ఉదాహరణలు రాసుకుంటూ పోవచ్చు . దీనంతిటినీ ఒక నాయకుడి పేరు మీదే ..... జం అని పెట్టేస్తే బాగుంటుందేమో .

                      మాంచి ఇంజనీరింగ్ చదివేస్తే భేషైన ఉద్యోగం గారంటీ అవ్వొచ్చు కానీ అనేకానేక జటిలమయిన విషయాలు అర్ధం చేసుకొనడానికి ఎకనామిక్స్ మంచి సాధన మవుతుందని నా నమ్మకమ్. ..... ఇక ఉద్యోగ విషయానికొస్తే  మాకు పెద్ద లిచ్చిన నాలుగెకరాల పంట భూమి ..... మంచి ఇల్లు ఉన్నాయి .... మంచి పుస్తకాలు .... మోటార్ సైకిల్ తో బ్రతికే కళను మావాడికి నేను నేర్పగలిగితే చాలు.. వాడు అందరికంటే ఆనందంగా ఉంటాడు .
.