8, జూన్ 2014, ఆదివారం

ఉనికి కాపాడుకునే కనీస IQ మన కమ్యూనిస్టులకు ఉంటుందా ....



"ఒరేయ్ ...... చిన్నా ఇలా రారా ...... "

 5 సంవత్సరాల చిన్నా వచ్చాడు.

"నిన్ను వీడు కొట్టడానికి వచ్చాడనుకో ...... ఏం చేస్తావ్ ?"

7 సంవత్సరాల టింకూను చూపించి అడిగాను

"ఇంటికెళ్ళి మా అన్నయ్యను తీసుకుని వస్తాను . "

" మరి వీడు కూడా కొట్టడానికి వస్తే ?"

పక్కనే ఉన్న 9 సంవత్సరాల రాము ని చూపించి అడిగాను.

"నేనేమీ ఊరుకోను ...... మా మామయ్య గారి సురేష్ బావను తీసుకుని వస్తాను ....మా  పక్కింట్లోనే కదా ఉంటారు "

"శభాష్ .... నీవెళ్ళి ఆడుకోరా చిన్నా ....."

"ఎందుకలా అడిగావు? "

పక్కనే ఉన్న మూర్తి అడిగాడు

"వీడి IQ మన కమ్యూనిస్టు పార్టీ నాయకుల IQ కంటే ఎక్కువా కాదా అని "

"ఏం అర్ధం అయ్యింది ?"

"నిస్సందేహంగా చాలా ఎక్కువ "

"ఎలా తెలిసింది ?"

"మొత్తం కార్పొరేట్ శక్తులన్నీ ఎప్పుడూ లేని విధంగా ఏకమయ్యి  ఎదురు లేని అధికారంలోకి వస్తున్నారని తెలిసి కూడా వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకున్నారు తప్ప ..... కనీసం ఏకాభిప్రాయానికి రావడానికి ఒక్క ప్రయత్నం చేయలేక పొయ్యారు . "

"ఏకాభిప్రాయానికి వస్తే గెలిచి ఉండేవారా ?"

" నా మొఖం ...... కనీసం ఒకే జెండా క్రిందకు వచ్చి ..... పూర్తి సైద్దాంతిక నిజాయితీ ఉండే లోకసత్తా వంటి పార్టీ లతో కలసి పూర్తి స్థాయిలో ప్రజా పోరాటాలు అవి కూడా అర్ధవంతమైనవాటిలో పాలు పంచుకుంటుంటే ఉనికి నిలబడుతుంది . "

"అంటే ఇప్పుడు అధికారం లోకి వచ్చిన పార్టీల మీద నీకు పూర్తి నమ్మకం లేదా ?"

"నమ్మకాల కంటే నిజాల మీద ఆధారపడడం నాకు అలవాటు ........ "

"అంటే ..... "

"చాలా మంచి మంచి సిద్దాంతాలతో .... విప్లవం ద్వారా అధికారం లోకి వచ్చిన పార్టీలు కూడా ప్రత్యామ్నాయ విధానాలు, సిద్దాంతాలు ...... లేక   మొత్తం దేశ ఆర్ధిక వ్యవస్థను సంక్షోభం లోకి నెట్టడం చరిత్రలో చాలా చూసాం ..... "

"అలాంటప్పుడు మరలా నేరగాళ్ళ ముఠాలు ప్రత్యమ్నాయం  మేమే అంటూ ముందుకు వచ్చేస్తారేమో ...... "

"అందుకే మంచి బలమైన  ప్రత్యామ్నాయం కూడా ప్రజలే తయారు చేసుకోవాలి ..... అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ ఆరోగ్యం గా ఉంటుంది ...... నిజానికిది కమ్యూనిస్టుల మూల సూత్రాల లోనే ఉంది ..... "

" మరి ..... ఏ విధానాలు మనకు బాగుంటాయంటావ్ ?"

"నాకు నచ్చిన చైనా సామెత చెబుతాను విను ..... పిల్లి ఎలుకలను పట్టే పని చేసున్నంత సేపు అది తెల్లదా .... నల్లదా అనే విషయాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఇక్కడ కూడా అంతే. మన వాళ్ళ కోర్కెలు చాలా చిన్నవి. కాస్త నిజాయితీ ఉంటే చాలు .... వారికుండే చిన్న చిన్న కోర్కెలు తీర్చడం పెద్ద కష్టం కాబోదు . బలమైన ప్రత్యామ్నాయం ఉంటే .... అధికార పార్టీలోకి దూరి పోయి తమ పబ్బం గడుపుకోవాలనుకునే వృత్తి  రాజకీయ నాయకుల ఆటలు  కూడా సాగవ్ . నీవు అన్నట్లుగా నేరగాళ్ళ ముఠాలు మరలా రాజకీయ ప్రత్యామ్నాయం గా ఎదిగే  అవకాశం  కూడా ఉండదు "