23, డిసెంబర్ 2013, సోమవారం

చట్టానికి మేము అతీతులమ్మరి ..... కాకపోతే అది అమెరికా ...

నేను ఒక సారి ఏదో ఆలోచిస్తూ నా టూ వీలర్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా జరిగింది ఆ సంఘటన . చాలా స్పీడ్ గా పక్క వీధి నుండి వచ్చిన ఒక టూ వీలర్ యువకుడు రాంగ్ టర్న్ తీసుకుని నన్ను ఢీ కొట్టినంత పని చేసాడు . నేను నెమ్మదిగా డ్రైవ్ చేయడం వలన అదృష్టం కొద్దీ నాకేమీ కాలేదు కానీ ఈ ఆకస్మాత్తు సంఘటన నన్ను చాలా ఉలికి పాటు కు గురి చేసింది . ఆ ఉలికి పాటులో నా నోటి నుండి కాస్త పరుషమైన పదజాలమే బయటకు వచ్చింది . నిజంగా చెప్పాలంటే ఆ ఉలికిపాటు వలన కాస్త గట్టిగానే తిట్టేసిన మాట వాస్తవం . మా మద్య వాదోప వాదం పెరిగింది. సహజంగానే చోద్యం చూసే జనం మా చుట్టూ చేరారు . అతగాడు తను చేసిన పని లోని తప్పుని ..... అంటే పబ్లిక్ ను తప్పుదారి పట్టించడం కోసం నేను తిట్టిన తిట్లనే హైలైట్ చేస్తాడు కానీ అంతకు ముందు నన్ను అంతగా కలవరబాటుకి గురి చేసిన అతగాడి పొరబాటు గురించి మాట్లాడే ఛాన్స్ నాకు దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు . చోద్యం చూసే జనమే కాబట్టి అంత లోతుల్లోకి వెళ్ళరన్న అతగాడి నమ్మకాన్ని కూడా జనం నిజం చేస్తూ జనం మా ఇద్దరినీ వేరుజేయడానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్లి పొయ్యారు . 

అటువంటిదే మరలా ఇన్నాళ్ళకి మన మీడియా లో మరలా చూస్తున్నాను . మన  IFS అధికారిణి ని అమెరికా వారు చాలా చిన్న చూపు చూసారన్న వార్త మొత్తం పత్రికలన్నీ ఊదరగొట్టేసాయి. అది నిజం అనే దాంట్లో ఆక్షేపణ అయితే ఏమీ లేదు కానీ అంతకు ముందు ఆమె చేసిన చట్ట ఉల్లంఘన గురించి మాత్రం ఎవరూ రాయలేదు. ఆమేమీ సామాన్యురాలేమీ కాదు . ఒక IFS అధికారిణి. ఏ దేశంలో అయితే తను భాద్యత లు నిర్వర్తిస్తుందో ఆ దేశ చట్టాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన భాద్యత ఆమెదే . కానీ మన మీడియా వారికి వార్తను సరుకుగా మార్చుకోగల తెలివితేటలు ఎక్కువే కాబట్టి ఆమె నేరం కాస్తా వెనక్కు పోయింది . మన అదృష్టం కొద్దీ నిన్న ..... ఈ రోజు మాత్రం కొన్ని పత్రికల్లో ఆదర్స్ హౌసింగ్ లో ఆమెకున్న అక్రమంగా పొందిన ఫ్లాట్ ..... అంతకు ముందు ఆవిడ తండ్రి గారి అధికారిక బలం వలన ఆవిడ కు ఒనగూరిన undue advantage గురించి వార్తలు వచ్చాయి. "ఇది అందరూ చేసేదే...... దీన్ని పెద్ద విషయం చేసేస్తున్నారు" అని నెమ్మదిగా దీన్ని పలచన చేసే ప్రయత్నం కూడా మొదలయ్యింది . అసలే ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి పాపం ...... దీన్ని ఎలా వాడుకోవచ్చో అని రాజకీయ పార్టీలు కూడా తర్జనభర్జనలు పడిపోతున్నాయ్ పాపం .