23, నవంబర్ 2011, బుధవారం

జరుగుతున్నదాంట్లో మన పాత్ర లేదా......

ఒక తప్పు ఒక వ్యక్తి వలన జరిగితే దానిని కేవలం వ్యక్తిగతంగా తీసుకోవచ్చు అంతే కాకుండా అది యాదృచ్చికంగా జరిగిందని కూడా భావించవచ్చు. కానీ అదే పొరబాటు  అవకాశం  దొరికిన ప్రతి వారూ చేస్తుంటే    అది మన సమాజానికున్న అధీకృత  భావజాలంలో ఉన్న పెద్ద లోపంగా భావించవలసి వస్తుంది. ఇదంతా జనం అందరికీ అర్ధం కావడం లేదా అంటే ఖచ్చితంగా అర్ధం అవుతుందనే చెప్పవచ్చు. చిన్న చిన్న వాటికి కూడా మనకు మనమే " యెం చేస్తాం ..అంతా చేస్తున్నారు" అని మనకు మనమే సర్ది చెప్పేసుకుంటుంటే ఇక కుళ్ళు యెప్పటికైనా అంతం అవుతుందా అని యెవరూ అలోచించదం లేదు. మొత్తంగా భావి తరాలకు కుళ్ళు మాత్రమే నిండి ఉన్న వాతావరణాన్ని , సంస్చృతిని ఇవ్వబోతున్నామన్న వాస్తవాన్ని గుర్తించి కూడా దీనిని అంతం చెయక పోతే నష్టం యేమిటిలే  అన్నంత ఉదాసీనతతో అంతా సరి పెట్టేసుకుంటున్నారనిపిస్తోంది. కొన్ని కొన్ని మనం సమర్ధించడానికి కూడా మనం సిగ్గు పడడం లేదు. మొన్నొక రోజు ట్రైన్ లో కూర్చుని ఒక న్యూస్ పేపర్ చదువుతున్నాను. దానిలో ఒక దివంగత ముఖ్య మంతి గారి తనయుడి మీద ముసురు కొంటున్న సీ.బీ.ఐ. కేసుల తాలూకు  న్యూస్ పెద్దగా ఉంది. పక్కన కూర్చున్న పెద్ద మనిషి యేదో పూనకం వచ్చి నట్టుగా " యీ పేపర్ ఎడిటర్ ఒకప్పుడు సైకిల్  మీద తిరిగిన వాడేనటండీ...పెద్ద ఇప్పుడు నీతిమంతుడులా రాస్తున్నాడు...." నేనడ్డుకుని కాస్త కటువుగా మాట్లాడక పోతే అతడి వాగ్ధాటి ఇంకా సాగేదే. మీడియా అంతా నిష్పాక్షికంగా ఉన్నదని నేనెప్పుడూ అనను కానీ అది అలా తయారవ్వడానికి గాని,అసలు పరిస్థితి ఇంత దిగజారడానికి మనం యెంత వరకూ కారణం అవుతున్నాం అనేది యెవరూ ఆలోచించరు. యెదుటి వాళ్ళు కాస్త బలమైన సమూహం (ఆర్గనైజ్డ్) అనిపిస్తే చాలు మనం దాని జోలికి యెంత మాత్రం పోము. ఆ విధంగానే యీ దేశం లో అతి చిన్న సమూహాలు మొత్తం జనాభాలో 70% ఉన్న రైతాంగాన్ని మోసం చేయగలుగుతున్నారు.
ఆ వివరాలలోకి మరొక్క సారి వెళదాం. కింద ఉన్న చిత్రాన్ని చూడండి.
యీ అపార్ట్మెంట్ ముందు ఒక వాహనదారుడు ప్రతి రోజూ తన వాహనాన్ని పార్క్ చేసుకునే వాడు. మొదట  ఆ అపార్ట్మెంట్ కు సంబందించిన  ఒకరు ఆ వాహనదారుడికి మర్యాదగా చెప్పి చూసాడు. కానీ ఫలితం కలగలేదు. కానీ అపార్ట్మెంట్ లోని  వారందరూ కదిలే సరికి యేకాకి ఐన ఆ వాహనదారుడు దానిని అక్కడ నుండి తీసేసాడు. 

యీ క్రింద చిత్రాన్ని చూడండి.

రోడ్ కొంచెం సన్నగా కనబడుతున్నా ఎంతో రద్దీగా ఉన్న రోడ్ మధ్యలో షామియనా...భోజనాలు.(ఇది కూడా ఆ అపార్ట్మెంట్ పక్కనే ఉన్న వీధే..) కనీసం వీధి మొదట్లో ఐనా  రోడ్ బ్లాక్ ఐనట్టు గా సూచన యేమీ ఉండదు. చచ్చినట్టు అక్కడిదాకా వచ్చిన వారు చచ్చి నట్టు వెనుకకు వెళ్ళాలి. కానీ యీ సారి చాలా అసౌకర్యం కలిగినా కూడా ఆ అపార్ట్మెంట్ లోని వారెవరూ అడగడానికి సాహసించలేదు. కారణం వేరే చెప్పనక్కర లేదు. యెదుటి వాళ్ళు మరింతగా ఆర్గనైజ్ అయిన వాళ్ళు. ఇప్పుడు మొత్తం ఇదే జరుగుతోంది. పబ్లిక్ ప్రోపర్టీ  అన్నది యెవరూ ముట్టుకో రానిది అన్న భావన స్థానంలో అందరూ వాడుకోగలిగినది  అన్న అర్ధం నెలకొంది. అది తిన్నగా యెవరికి బలం ఉంటే వాళ్ళు వాడుకొనే స్థాయికి తీసుకెళ్ళింది. అసలు పబ్లిక్ కి ఇబ్బంది కలిగే అన్నిటి మీదా తీవ్రమైన చర్యలు మొదటి నుండీ అమలయ్యి ఉంటే యీ భావజాలం ఇంత దారుణంగా వేళ్ళూనుకు పోయి ఉండకపోయేదేమో. ఒక సారి రోడ్ పై పొర ఐన టేక్  మరియు సీల్ కోట్ లు ధ్వసం ఐతే ఆ రోడ్ కి అవసాన కాలం దాపురించి  నట్టేనని అందరికీ తెలుసు. కానీ మన కళ్ళ ముందే కొంత మందికి ఆనందం.లాభం కలిగించే ప్రోగ్రాం లు జరపడం కోసం రోడ్  తవ్వేస్తున్నా మనం పట్టించుకోము సరి కదా ప్రభుత్వం రోడ్లు పట్టించు కోడం లేదని వాపోతాం.షిఫ్ట్ ద్యూటీలు ఉన్న నగరాల్లో ..తెల్లవారగట్ల వచ్చి పడుకుందాం అనుకున్న కార్మికులకి మైక్ లు లో నుండి వచ్చే ప్రార్ధనలు ఎంతో ఇబ్బంది కలిగిస్తాయని ప్రభుత్వానికి తెలియదా...? అసలు భగవన్నామ స్మరణకు అంత గోల అవసరమా...? నిశ్శబ్దం  ఒక పబ్లిక్ ప్రొపర్టీ వంటిది కాదా.....యెవడికి అవకాశం ఉంటే వాడు దానిని దోచేస్తున్నాడు. మరి సాక్షాత్తూ రాష్ట్ర అధినేతల బంధు...ఆశ్రిత  బృందాలను అడ్డుకోవడం అనేది చాలా దూరం లో ఉంది. మన బోటి సామాన్య  స్థాయిలో ఉన్న వాళ్ళకి   కనీసం రోడ్ మీద జరుగుతున్న   ప్రోగ్రాం పక్కన ఉంటున్న పెద్ద పెద్ద పోస్టర్ లను చూస్తే యీ కుళ్ళు యెక్కడి నుండి కడగాలో అర్ధం అవుతుంది. ప్రజల మూర్ఖత్వాన్ని వాడుకునే వాళ్ళ పని పట్టడమే  ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం.
కన్నూ మిన్నూ కనబడని రోజులలో చేసిందంతా యధేచ్చగా చేసి విచారణలెదుర్కుంటున్న యీ సమయంలో  ఒకరేమో చేతులు పైకి చూపించి "అన్నిటికీ భగవంతుడే...ఉన్నాడు" అంటుంటే  కొంతమంది మాత్రం యీ క్రింది విధంగా భగవత్ప్రదక్షిణాలు   చేస్తున్నారు.

పాపం భగవంతుడు దాక్కోడానికి యేదైనా చోటుందో లేదో...వీళ్ళందరికీ భవతుడంటే భయం ఉండొచ్చు..చట్టం అన్నా కూడా ఇప్పుడిప్పుడు కొంత భయం వచ్చి ఉండొచ్చు.. కానీ జనం ఉన్నారని భయ పడే స్థాయికి  మనం యెప్పుదు యెదుగుతామో.....ఆ రోజుల కోసం ఎదురు చూద్దాం.

18, నవంబర్ 2011, శుక్రవారం

నిజమైన ఆనందమంటే.....





నవంబర్ నెలలో  యేదైనా  చెట్టుకింద   కూర్చుని   పని  చేసుకునే  అవకాశం   కలగడం  ఒక  అదృష్టంగానే   భావిస్తాను నేను. వాతావరణ మార్పుల పుణ్యమా  అని నాలుగు నెలల వేసవి కాస్తా ఆరేడు నెలల వేసవి గా మారి పోయింది.  మధ్యలో  వర్షాకాలం వెళ్ళగానే కాసే నీరెండలో ప్రకృతిని ఆస్వాదిస్తూ పవర్ కనెక్షన్ బయట వరకూ తెచ్చుకుని పని చేస్తుంటే  పని చేస్తున్నామన్న భావనే ఉండదు. మా  అలమండ స్టేషన్  కు ఆనుకుని ఉన్న టేక్ ప్లాంటేషన్  లో లెవెల్స్ తీయవలసి ఉన్నదని నిన్ననే చెప్పాను. తీరా  చూస్తే టేక్ చెట్ల మద్య దట్టంగా చిన్న చిన్న పొదలు పెరిగి పోయి ఉన్నాయి.
“వాటిని తొలగించందే ఆ లెవెల్స్ తీయడం సాద్యం కాదు..ఏదో యేర్పాటు చేయండి”సైట్ ఇంజనీర్  కు చెప్పాను.
“అదెంత పని సార్…మా జంగ్లీ గాళ్ళు ఉన్నారు కదా…..”
వాళ్ళెవరన్నట్లు చూసాను.
వచ్చిన కుర్రాళ్ళను చూడగానే నవ్వు వచ్చింది. వాళ్ళు ట్రక్స్ మీద క్లీనర్స్ గా పని చేస్తుంటారు. ఒరిస్సా  నుండి వచ్చారు. మొదట నుండీ వాళ్ళను చూస్తుంటే తెలియని ముచ్చట వేస్తుండేది. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. ముందు  అన్నయ్య పనిలో చేరాడు. కొద్ది  రోజులకు తమ్ముడు చేరాడు. ఛిన్న వాడు వచ్చిన రోజు వెంటనే పనిలోకి దిగలేదు. రెండు మూడు సార్లు ఆ రోజు వాళ్ళ కేంప్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు కేంప్ ముందు కూర్చుని బిక్కు బిక్కు మంటూ చూస్తున్న వాడిని చూసి జాలి కూడా వేసింది. మద్యలో  వాళ్ళన్నయ్య క్లీనర్  గా పని చేస్తున్న ట్రక్ దూరంగా కనబడినప్పుడు వాడి కళ్ళు అటువైపే ఆత్రుతగా చూడడం గమనించాను. నెమ్మదిగా  చిన్న వాడు అలవాటు పడి పొయ్యాడు.
నాకెందుకో  వాళ్ళిద్దరినీ చూస్తున్నప్పుడు “ది గాడ్స్ మస్ట్ బి క్రేజీ” సినిమా గుర్తుకు వచ్చేది  మొదట్లో.
వాళ్ళిద్దరూ కొడవళ్ళు తీసుకున్నారు.
“ వాళ్ళు లారీ  క్లీనర్స్ …యీ పని చేయగలుగుతారా….” మనసులో  సందేహాన్ని బయటకు వెళ్ళగక్కేసాను.
“భలే వారు సార్…వాళ్ళ వూర్లో వాళ్ళు చేసే అసలు పని ఇదే సార్…వాళ్ళు గొర్రెలు మేపుకుంటానికి రోజూ తుప్పలు నరుకుతానే ఉంటారు.” మా సైట్ ఇంజనీర్  సుందర్ సామాధానం.
నేను  అలాగే చూస్తున్నాను.
వాళ్ళ చేతుల్లో కొడవళ్ళు నాట్యం  చేస్తున్నట్లుగా  అనిపించింది. ఆతి లాఘవంగా వేటు వేస్తుంటే నిముషాల మీద పొదలు ఖాళీ అవడం ప్రారంభమైంది.
మద్యలో  ఉన్న చింత చెట్లు చూడ గానే ప్రతి రోజూ  చింతకాయల కోసం రైతు బజారుకు తీసుకు వెళ్ళమంటున్న శ్రీమతి  గుర్తుకు వచ్చింది.
“  యీ పని పూర్తి కాగానే మన వాళ్ళతో కొద్దిగా చింత కాయలు కోయించ  గలరా?”
“అదెంత పని సార్..ఒరేయ్…….” మా సుందర్ వాళ్ళకు అదేశాలివ్వడం.….వాళ్ళు ఒక డొంకినీ (కర్రకు కట్టిన కొడవలి)తో చింతకాయలు రాల్చడం …నిముషాల మీద జరిగి పోయింది. రాలిన  చింత కాయలు యేరడం  మొదలు పెట్టే సరికి వీళ్ళకు పోటీగా ఒక ఇరవై మేకలు వచ్చి విందారగించడం మొదలు పెట్టాయి.వాటిని చూసి అన్నదమ్ములిద్దరూ మరలా పైకి పాకడమే కాకుండా పక్కనే ఉన్న వేప చిగుళ్ళు కూడా విరిచి వాటి విందుని సమాప్తి చేసారు. ఇదంతా  సమీపంలో చెట్టు నీడ లో కూర్చుని పని చేసుకుంటున్న  నాకు కనబడుతూనే ఉంది. మనసంతా  యెదో తెలియని ఆహ్లాదానికి..ఆనందానికి లోనయ్యింది. నాది  అసలైన ఆనందమో లేక టీవీల్లో కొన్ని కొన్ని.. అంటే  యేదో వైకుంఠ పాళీ మోడల్ లో ఆడుతున్న ఆటల్లో నిచ్చెన  తగిలినప్పుడు ఆ ఆడే వాళ్ళు వింత వింత కూతలతో ప్రకటించేది నిజమైన ఆనందమో నాకు అర్దం కాకుండా ఉంది. యెందుకంటే నాకు నా ఆనందం వలన నా నోట్లో నుండి యే వింత వింత ధ్వనులూ రాలేదు కాబట్టి నాది నిజమైన ఆనందం కాదేమోనని అనుమానంగా ఉంది. పాఠక మహాశయులే  నాకు సందేహ నివృత్తి చేయగలరని ఆశిస్తాను.
“అసలు ఇలాంటి పనికిమాలిన ఆనందాల వల్లేనమ్మా….యెక్కడికో వెళ్ళ వలసిన మీ ఆయన ఇలా జూనియర్ ఇంజనీర్  గా ఉండిపోయాడు…ఫరవాలేదులే యెంతో కొంత నయమే….పొద్దున్నే చద్దన్నం తినేసి  పుస్తకం పట్టుకుని యే చెట్టు కిందకో చేరి  పోయి …పక్షుల తోను..పశువుల తోనూ మాట్లాడుకుంటూ గడిపేస్తాడేమో నను కునే వాడిని…”
ఒకప్పటి నా బెంచ్ మేట్..ప్రస్తుతం రైల్వేలోనే  ఉన్నతాధికారి అయిన  సుబ్రమణ్యం  నా గురించి నా శ్రీమతితో  అన్న మాటలు  నన్ను పొగిడినట్లుగానే అనిపిస్తాయి నాకు.
ఫక్కనే ఉన్న చిత్రాలను ఒక్క సారి చూడండి. ఆ  అమాయక గిరిజన

 
బాలుడిని చూడండి. ప్రకృతి సౌందర్యానికి దర్పణం పట్టే ఆ కొండల పేర్పుని చూడండి. ఒరిస్సా  లోని ఒక ప్రాంతపు అందం ఇది. ఆ ప్రాంతపు పార్లమెంట్ మెంబర్  నాకు స్నేహితులు కావడం నా అదృష్టం.  యెందుకంటే ఆ ప్రాంతాన్ని నాకు పరిచయం చేసింది ఆయనే. నిజాయితీ  ఆయననింకా వీడ  లేదు కాబట్టి ఆ ప్రంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేద్దామని ఆయన ఆకాంక్ష. కానీ  ఆ తరువాత ఆ అమాయక బాలుడి  ముఖం వంటిది ఆ ప్రాంతం నుండి దూరం చేస్తామేమోనని నేను ఆయన ప్రయత్నాన్ని నిరుత్సాహ పరుస్తూనే వస్తున్నాను. రాబందుల  కళ్ళు ఆ ప్రాంతం మీద ఇంకా పడ లేదు. పడిన తరువాత నా శక్తి యే మూలకూ చాలదని నాకు తెలుసు.

9, నవంబర్ 2011, బుధవారం

ఏది ముఖ్యం...

నాకనేక సార్లు చాలా వింత వింత సందేహాలు వస్తూ ఉంటాయి. అసలు ఇలాంటి అనుమానాలు వస్తూండడం వలనే నన్ను పెళ్ళాడడానికి యెవరూ రాలేదనీ..అందువలనే ఇంటికెదురుగా ఉన్న తను దొరికి పోయానని మా శ్రీమతి తరచూ వాపోతూ ఉంటుంది. ఇంతకూ ప్రస్తుతం నాకొచ్చిన సందేహం యేమిటంటే ప్రకృతి లేదా సహజ వనరులు జాతీయ సంపత్తే కదా....అంటే నీరు,గాలి..ఇవన్నీ జాతీయ సంపత్తి అంటే ప్రజలందరికీ ఉపయోగపడ వలసినవి. మనం జల వనరులనే చూద్దాం. మనకున్న జల వనరుల వలన విద్యుదుత్పత్తి జరుగుతోంది. లేదంతే బొగ్గు అంటే అది కూడా సహజ భూగర్భ వనరులలే భాగమే కదా.... కనీ వాటి వినియోగం యెలా జరుగుతుందో ఇంతకు ముందు ఒక సారి వివరించాను. ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టాలంటే దాని నుండి తిరిగి యెంత పొందగలం అన్నది ముందుగా అంచనా వేస్తారు. కొద్దో ..గొప్పో నిర్మాణ/పారిశ్రామిక రంగాలలో పని చేసిన వారందరికీ యీ విషయం మీద కూలంకషమైన జ్ఞానం ఉంటుంది. కానీ మధ్యాహ్నం ఇళ్ళలో నిద్ర పొయ్యెందుకు వాడే విద్యుత్తు కి రిటర్న్ విలువ యెంత? మనకు అవసరానికి మించిన విద్యుదుత్పత్తి ఉన్నప్పుడు దానిని యెలా వాడుకొన్నా ఫరవాలేదు కానీ మన కనీస అవసరాలకు కూడా చాలీ చాలకుండా ఉన్నప్పుడు దానిని ఖచ్చితంగా పునరుత్పత్తికి పనికి వచ్చే పనులకి వాడాలి కానీ బిల్లు కడుతున్నారు కదా అని వృధాగా వాడడం ఎంత వరకూ సబబో విజ్ఞులు అలోచించాలి. పొలాలకి నీరు తోడడానికి వాడే పంపులకి విద్యుత్తు సరఫరా ముఖ్యమా...పట్టణాల లోని బెడ్ రూం యే.సీ. లకు సరఫరా ముఖ్యమా..? నాకొక సందేహం యేమిటంటే ముందు ముందు కార్పొరేట్ వ్యవసాయం వస్తే అంటే మన పొలాలన్నీ అంబానీలు..లేదా అటువంటి వారు పొలాల బాట పడితే యీ విద్యుత్ సరఫరా అప్పుడు కూడా ఇలానే ఉంటుందా?
ఒక్క సారి పల్లెలకు వెళ్ళి అక్కడి పరిస్థితులు చూడండి. వ్యవసాయానికి నీరు ఉండదు. పంపులకు విద్యుత్ సరఫరా ఉండదు. రైతుల పిల్లలకు చదవడానికి లైటు వెలగదు. ఇక కొంత కాలం గడిస్తే మా గ్రామాలు ఇలా ఉండేవి అని చెప్పే వీడియో  క్లిప్ లు మాత్రమే మిగులుతాయి. మా పూర్వీకులలో ఇంతటి ఉదాత్తత ఉండేది అని పెదాలతోనే చెప్పగలం. ఇక రాను రాను ఆ జ్ఞాపకాలు మనకు కళ్ళలో నీళ్ళు తెప్పించవు యెందుకంటే మన లో ఆ ఆర్ద్రత  మిగులుతుందని గారంటీ లేదు. 

8, నవంబర్ 2011, మంగళవారం

అందరిలో హజారే ఉండాలి

ఇందుగలదందు లేదని సందేహము వలదు......ఎక్కడ వెదికినా ఏదో ఒకటి మీ కంటికి కనబడుతూనే ఉంటుంది.పైనున్న చిత్రాన్ని ఒక్క సారి పరీక్షగా చూడండి. వాహనాలు పార్క్ చేసిన స్థలంలో ఏది ఉంటే బాగుంటుంది? అది ఈ మధ్య కాలం వరకూ రాష్ట్ర రవాణా శాఖ వారి ఆధీనం లోనే ఉండేదని ఈ మధ్యనే నా మిత్రుడొకడు చెప్పాడు.కాదు అసలు ఆ స్థలం రాష్ట్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్  కార్పోరేషన్ వారిదే అని కూడా అన్నాడు. నిజానిజాలు ఇంకా నాకు తెలియవలసి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ స్థలం లో ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నది. ఒక్క సారి మరలా ఆ కూడలి ప్రాముఖ్యాన్ని చూడండి.అక్కడ ఒక మంచి బస్ స్టాప్ కావాలా....లేక కమర్షియల్ కాంప్లెక్స్ కావాలా......తమరే చెప్పాలి. ఏ పేద వారికి ఉపయోగం కలుగుతుందని ఆ స్థలాన్ని అలా ధారా దత్తం చేసారో నాకైతే తెలియదు. నాకు అంత జ్ఞానం లేదు. ఆ కాంప్లెక్స్ లో చక్కగా KFC వారి ఫుడ్ కోర్ట్ ,4D theater లాంటి అత్యాధునిక సదుపాయాలూ ఉన్నాయి. కానీ వాటి వలన ఉండే ఉపయోగం కంటే హై వే కు ,ఒక గొప్ప విశ్వ విద్యాలయానికి ఆనుకుని ఉన్న ఆ స్థలం పేద వారికి, విద్యార్ధులకి ఇంకా ఎక్కువే ఉపయోగ పడుతుందని నా లాంటి పామరుడు అనుకో వచ్చు కానీ ప్రభుత్వ పెద్దల అభిప్రాయం అంత కంటే భేషుగ్గా ఉందేమో...

4, నవంబర్ 2011, శుక్రవారం

భాషా..బంధం

 ఉదయానికి మధ్యహ్నానికి మధ్యలో ఉన్న టైం అంటే 11.30  అయ్యుండొచ్చు. కాంక్రీట్ వర్క్ నడుస్తోంది. చెక్ చేసి వచ్చి చెట్టు కింద వేసిన కూర్చీలలో కూర్చున్నాను. ఆ వర్క్ నాది కాదు కానీ నా కొలీగ్ వేరొక పని మీద వెళ్ళడం వలన నేను ఆ చెకింగ్  కి వచ్చాను. కాంట్రాక్టర్  కొద్ది సేపటికి  వచ్చి నా పక్క కూర్చీలో కూర్చున్నాడు. ఆయనకు నాకు పరిచయం లేదు. తనే మాటలు ప్రారంబించాడు.
"సార్ ది గోదావరి జిల్లాయే నంట కదా..."
"అవునండీ.."
"మాదీ  అక్కడే లెండి..."
కొంత సంభాషణ నడిచింది. అతడు పెద్దగా చదువుకోలేదనీ...కష్ట పడి పైకి వచ్చిన వాడని అర్ధం అయ్యింది.
 యెదురుగా కొత్తగా కట్టిన స్టాఫ్  క్వార్టర్స్ వైపు చూపిస్తూ అడిగాడు.
" క్వార్టర్స్ బాగానే కట్టారు కానీ ...దాని చుట్టూ  మూడడుగుల వెడల్పులో ఒక ప్లాట్ ఫార్మ్  కడితే చూడ్డానికి..శుభ్రానికీ  బాగుంటుంది కదా సార్...."
"మీరు చెప్పింది బాగానే ఉంది కానీ డ్రాయింగ్ లో లేనిది మా వాళ్ళు అంత త్వరగా కట్టరు లెండి" అన్నాను
"అన్నీ  డ్రాయింగ్ లోనే ఇస్తే మేమ్మాత్రం కట్టలేమా యేంటి సారూ...అవి చూడండి బొత్తిగా మొల్తాడు లేని మగాడి లా వేలాడి పడి పోతున్నాయి కదా.."
యెందుకో నాకు తెలియదు కానీ ఆ ఆఖరి వాక్యంలో ఉన్న నుడికారం నన్ను భలే ఆకట్టుకుంది. రాను రానూ మన వాడుక  భాషలో  అందులోనూ పట్టణ  ప్రాంతంలో ఉన్న మాకు యీ నుడికారాలు లేక భాషలో భావ వ్యక్తీకరణ తగ్గిపొతోందనిపిస్తోంది. యే భాషకైనా నుడికారాలు లేకపొతే అది యూనిఫార్మ్ వేసుకున్న కాన్వెంట్ పిల్లల మాదిరిగా ఉంటుంది. ఆఫీస్ ల వరకూ ఆ భాష బాగానే ఉంటుంది కానీ వాడుకలో మాత్రం నుడికారాల సౌందర్యం బలమైన సాస్కృతిక పునాదులున్న వారికి మాత్రమే అర్దం అవుతుంది. ఆ పునాదులు లేని వారికి ఎస్ . ఏం. ఎస్ . భాషకు , తేనెలూరే తెలుగుకి తేడా తెలియదు.  బలమైన సాంస్కృతికాభిమానం లేని వారి కుటుంబ వాతావరణం కూడా బల మైన పునాదులు లేని కట్టడం లా ఉంటుంది.
యీ మద్య అనుకోకుండా ఆదిత్య 369 సినిమా చూడడం జరిగింది. మహా దర్సకులైన స్రీ సింగీతం శ్రీని వాస రావు గారు మన భాషా సౌందర్యాన్ని  ..పద్య సాహిత్యాన్ని ..ప్రేక్షకులకు యెంత అద్భుతంగా పరిచయం చేశారనిపించింది.
కేవలం భాషే కాదు సమాజం లోని పొరలు...ఘర్షణలు  కొత్త తరానికి అందించడంలో మనం విఫలమౌతున్నాము కాబట్టే ఒక తప్పు చేయడానికి వెనుకాడని యువతరం ...ఒక తప్పును గాని...అది జరుగుతున్న తీరును గాని..యెదిరించే మానసిక సామర్ధ్యాన్ని కోల్పోయి దేనిని నమ్మాలో తెలియని డోలాయమాన స్థితి లో ఉంటున్నారు.

ఒక సారి పైన  ఉన్న విడియో క్లిప్  జీవితంలొని లోతులకి ఉదాహరణగా యెలా ఉందో చూడండి.