31, డిసెంబర్ 2012, సోమవారం

సంవత్సరాంతపు ఆలోచన...సరి కొత్త సబ్సిడీ పధకం...ఫ్రీ గా ఉపయోగించొచ్చు...









"అయితే వాళ్ళు ఉదయం 7 గంటలకల్లా మన ఇంట్లో ఉంటారంటావ్"

"........"

"అంతేలే గోదావరి ఎక్స్ ప్రెస్  ఎప్పుడూ లేట్ ఉండదు"

"........."

"గోదావరి ఎక్స్ ప్రెస్  ఒకటో నంబర్ ప్లాట్ ఫార్మ్ మీదకు ఇచ్చి చస్తున్నాడు...ఎనిమిదో నంబర్ మీదకు ఇస్తేనే మన గోపాలపట్నానికి కన్వీనియెంట్..ఏది ఏమైనా 7 గంటలకల్లా ఇంటికి చేరుకుంటారులే"

"......."

"హైదరాబాదుకి మధ్యానానికల్లా ఫ్లైట్ వచ్చేస్తుంది కదా....రాత్రంతా గోదావరిలో ఏసీ లో బాగానే రెస్ట్ ఉంటుంది..ఫరవాలేదు"

".........."

"మరి టిఫిన్ ఏర్పాట్లు మాటేమిటి...మనింట్లో ఒక్క పూటే ఉంటారని అంటున్నావు కదా.."

"......."

"మనమేది పెడితే అదే తింటారని నాకు మాత్రం తెలిసి చావదేమిటి...నాలుగు సంవత్సరాల తరువాత వస్తున్నారు...ఏదో స్పెషల్ ఉంటే బెటర్ కదా..." 

"........."

"ఒక పని చేయి పెసరట్టుప్మా...చేయి"

"........."

"అలాగే అంటే కాదు...మొన్న వారం  పెసరట్ల లో ఉల్లిపాయముక్కల కంటే ఇసుకే బాగా కనిపించింది"

"......."

"ఆ దిక్కుమాలిన .....కిరాణా కొట్టుకు వెళ్ళొద్దంటే వినవు...హాయిగా మాంచి సూపర్  బజార్  కు వెళ్ళమంటే...నీకు నాలుగడుగులు వేయడమంటే గగనమై పోతుంది"

"......."

"నువ్వెన్ని చెప్పు నేను వినను....కోట్లు పెట్టి షాపులు పెట్టి క్వాలిటీ మైంటైన్ చేయక పోతే రెండో రోజే నెత్తి మీద గుడ్డ వేసుకోవాలి...కాబట్టి నీవు సూపర్ బజార్ లో పెసర పప్పు తీసుకో. అలగే ఉప్మా రవ్వ కూడా అక్కడే తీసుకో..."

"......"

"నీ స్వంత బుర్ర వాడకు. నేను చెప్పింది విను...ఇంకొక విషయం చెప్పు. పెసర పప్పు బెటరా...పెసర గుళ్ళు బెటరా...."

"........."

"పెసర గుళ్ళు ఐతే కాస్త ఎక్కువ సేపు నానాలి కానీ .....టేస్ట్  కు అవే బెటర్"

"............."

"సరదాగా కాస్సేపు మనతో గడపడానికి వస్తున్నారని నాకు పదే పదే గుర్తు చేయనక్కర లేదు.వచ్చేది మీ స్వంత తమ్ముడు కాక పోయినా అమెరికా నుండి అక్క వరసైన నిన్ను చూడడానికి ఆగుతునాడంటే ఆ మాత్రం మర్యాద చేయక పోతే ఏడ్చినట్లుంటుంది" 

"........."

"ఏమిటి....ఆ టైం కే మీ తమ్ముడి కుటుంబం కూడా ఇక్కడికే  వస్తారా?"

"......" 

"వాళ్ళు కూడా ఇక్కడే  టిఫిన్ తింటారా...సీతమ్మ ధార నుండి ఎంత సేపు వస్తారు..హాయిగా టిఫిన్ చేసి రావొచ్చు కదా..."

"......."

"అంత మందికి పెసరట్లు వేస్తూ కూర్చుంటే నీకు మధ్యాహ్నం వరకూ వంటగదిలోనే సరిపోతుంది"

"......."

"అదేమీ కుదరదు....పెసరట్లే టిఫిన్...కావాలంటే పెసరట్లు మీ తమ్ముడి కుటుంబానికి పెట్టిన తరువాత ...రుబ్బిన పిండి చాలలేదని సీతమ్మ ధార తమ్ముడి కుటుంబానికి ఉప్మా తో సరి పెట్టేయ్..."

"........."

"మీ తమ్ముడు... మరదలు ..వంటగదిలోనే పీట వేసుక్కూర్చుని కబుర్లు చెబుతారా...అంటే నేను వాళ్ళతో మాట్లాడేదేదీ ఉండదా...."

"......."

"చిన్నప్పుడు అలాగే ఉండే  వాడని ఇప్పుడు కూడా అలాగే ఉంటాడని ఎలా అనుకుంటావ్..అంత పెద్ద ఉద్యోగం చేస్తూ...మారడని గారంటీ ఏమన్నా ఉందా..మీ ఎస్ కోట  నీ చిన్నప్పటి లానే ఉందా.?"

"........"

"పెసరట్లలోకి ఎన్ని చెట్నీలు చేస్తావ్..."

"........"

"ఉప్మా ఉన్నంత మాత్రాన ఒక్క చట్నీతో సరిపెట్టేస్తే ఏమి బాగుంటుంది...కొబ్బరి చట్నీ తో బాటు అల్లం చట్నీ కూడా ఉండ  వలసిందే.అసలు మా గోదావరి జిల్లా వాళ్ళకు తెలిసినట్టు మీ ఉత్తరాంధ్రా వాళ్ళకు టేస్ట్ లు తెలిసి చావవు.."

"........."

"శ్రీ  శ్రీ ..గురజాడ ..ఇక్కడి వాళ్ళా..వెధవ కౌంటర్ లు వేయకు....ముందు పెసరట్ల గురించి అలోచించు"

".........."

"అన్నీ అంత తేలిగ్గా తీసుకో వద్దని నీకు అనేక సార్లు చెబుతున్నాను....కొబ్బరి చత్నీ మరీ పిండిలా  గ్రైండ్  చేసేస్తావ్...నంజుకుంటున్నప్పుడు కొబ్బరి తగులుతూ ఉండాలి...అందుకు ఒక పని చేయ్...మొత్తం కొబ్బరి అంతా చట్నీ చేయకుండా కొంత కోరిన కొబ్బరి చట్నీ లో కలుపు."

"......."

"పచ్చి వాసనేమీ రాదు. దేనికైనా కొంత వెరైటీ మైంటైన్ చేయాలి"

"........"

"జీవించే విధానంలో వెరైటీ ఉండాలా....మీ నాన్నకు చెప్పు...మంచి ఉద్యోగం చేతూ కూడా మడిగట్టుక్కూర్చుని ఉన్న మడి కూడా అమ్మేసాడు.సరేలే కానీ ఉల్లిపాయలేమి  చేస్తావ్?

"......."

"అబ్బా ఏదో ఐనిస్టీన్ లా మాట్లాడేసావ్. ముక్కలు కోసి వేస్తారన్న సంగతి అందరికీ తెలుసు. అలా కాకుండా అవే ముక్కలు కాస్త నూనెలో వేయించి పెసరట్ల మీద జల్లితే  మరింత టేస్ట్ గా ఉంటాయి."

"........"

"మరీ అంత ఆయిలీ ఫుడ్ తినరా....ఇండియా లో ఉన్న నాల్రోజులకు కొలెష్ట్రాల్ ఏమీ పెరిగి పోదులేవోయ్....ఒక్క నిముషం ఫోన్ పెట్టేయనా...యే పొయ్యి మీదైనా ..యేదైనా మాడబెట్టావా...?"

"......."

"మీ తమ్ముడు కాల్ చేస్తున్నాడా...సరే... "

"................"

"ఏడ్చినట్లుంది ...అనుకోకుండా లీవ్ కర్టైల్ చేసుకోవలసి వచ్చిందా...మీ చిన్నాన్న..పిన్ని రేపు ఇక్కడ నుండి ఫ్లైట్ కు బయలుదేరుతున్నారా.....నిన్నెందుకు రమ్మనడం..ఇప్పటికిప్పుడు ట్రైన్ కు రిజర్వేషన్ దొరుకుతుందా..."

"......."

"తత్కాల్....వొల్వో బస్ టికట్ తీసే అంత సీనేమీ లేదు...ఉండు వేపగుంట దాటాను....బస్ దిగిన తరువాత తిన్నగా ఇంటికే వస్తాను..అప్పుడు మాట్లాడదాం." 


కొత్తవలస నుండి గోపాల పట్నం వరకూ నా పక్కన కూర్చున్న పాసింజర్ సెల్ ఫోన్ వాడిన విధానం ఇది.దీంట్లో సెల్ లోనే మాట్లాడవలసినంత విషయం  ఏముందో పాఠకుల విజ్ణతకే వదిలేస్తున్నా....

ఇంకొక  విషయం నేను గమనించింది ఏమిటంటే మా ఇంట్లో అంట్లు తోమడానికి పెట్టుకున్న పని అమ్మాయి దగ్గర నుండి ...మా కాంక్రీట్ పనులలోకి వచ్చే మొత్తం పని వారందరికీ సెల్ ఫోన్ లు ఉన్నాయి. అంతే కాదు వీళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డ్  లు కూడా ఉన్నాయి. అంటే బియ్యం మొదలైనవన్నీ రేషన్ మీద తెచ్చుకొనే సదుపాయం ఉంది. వీళ్ళందరూ కూడా సెల్ ఫోన్ లలో మాట్లాడే విషయాలు చాలా వరకూ పై విధంగానే ఉంటాయి.
బియ్యం లాంటివి సబ్సిడీ మీద వస్తుంటే వీరందరూ  దానికి పెట్టే ఖర్చు కంటే ఎక్కువగానే సెల్ ఫోన్ రీచార్జ్ లకు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు నెలకు ఎంతోకంత రేషన్ మీద ఫ్రీ టాక్ టైం సదుపాయం కలగజేస్తే బాగుంటుందేమో....అసలు అన్ని  సబ్సిడీలు ప్రకటిస్తున్న రాజకీయ నాయకులకి ఇలాంటి దివ్యమైన ఆలోచన ఎందుకు రాలేదో అర్ధం కాదు.

అంతిమంగా  ఎవరు లబ్ది పొందుతున్నారన్నది కాకుండా ఆ పూటకి ఎంత లాభం అన్నదే పరమావధిగా ప్రజల ఆలోచనా సరళి ఉన్నంత వరకూ ప్రభుత్వ  సబ్సిడీలతోనే కార్పొరేట్ సంస్థలు పెద్దవి అవ్వొచ్చు...పేదవాడు తన అజ్ణానంతో రోజు రోజుకూ మోసగించబడుతూ క్రిందకు దిగ జారుతూనే ఉంటాడు. ఒక కొస మెరుపు ఏమిటంటే రైల్వే లాంటి పెద్ద ప్రభుత్వ సంస్థలు తమ సీ. యూ. జీ. ఫోన్ కాంట్రాక్ట్  సాటి ప్రభుత్వ  రంగ సంస్థైన బీ.ఏస్.ఎన్.ఎల్. కు కాకుండా ఎయిర్  టెల్ కు ఇచ్చింది.