27, అక్టోబర్ 2014, సోమవారం

ఇదీ ఒక రకమైన ప్రేమే .... ఈ నాడిదే గైడింగ్ ......



"హాయ్ అంకుల్ .. "

"రామ్మా .... చాలా కాలం అయ్యింది నిన్ను చూసి ..... "

"నీకు తెలియందేముంది అంకుల్ ..... సాఫ్ట్ వేర్ కంపెనీల గురించి ...... "

"అవునమ్మా ..... మనం ఈ సర్వీసెస్ రంగం మీదే ఆధారపడడం నుండి ఎప్పుడు బయట పడతామో .....ఇంతకూ  ఇలా ఉరుమూ.  . మెరుపూ  లేని తుఫాన్ లా ఇలా  సడన్  గా వచ్చావంటే ఏదో కారణం  ఉండే ఉంటుంది "

"బాగానే guess  చేసారంకుల్ ..... "

"మరిక ఆలస్యమెందుకు సస్పెన్స్ విప్పేయ్....."

"అదే అంకుల్ ..... ఆ విషయం చెప్పగానే డాడీ మిమ్మల్ని ఒక సారి కలవమన్నారు ..... "

నిజంగా నవ్వు వచ్చింది

"ఏం కొంప ముంచావ్ ...?"

"కొంప ముంచ లేదంకుల్ .....కొంప ఏర్పరుచుకుంటున్నాను......"

"వెరీ గుడ్ .....నాన్న మీద భారం దించేసావ్....."

"డాడీ అన్నీ విన్నారు .....ఒక సారి మీకు కూడా చెప్పమన్నారు "

మా కుమార్ గాడికి కాలేజ్ రోజులనుండీ ఉన్న అలవాటే ఇది ......

"ఇంతకూ అబ్బాయి ఎవరు ....లాంటి ప్రశ్నలు అడగను లే ....సాధారణంగా నీ కొలీగ్ అయినా అయ్యుండాలి లేదా ఒకప్పటి నీ క్లాస్ మేట్ అయ్యుండాలి ..అంతేనా "

"కరెక్టే అంకుల్ ...."

"మరి అబ్బాయి ఫ్యామిలీ బేక్ గ్రౌండ్ మొత్తం తెలుసుకున్నావా .....?"

"తెలుసు అంకుల్ .....వాళ్ళ డాడీ వరంగల్ లో సెటిల్ అయ్యారు .....ఎప్పటి నుండో రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉండడం వలన బాగానే సంపాదించారు ....ఒక్కడే కొడుకు ...."

"అమ్మ.....?"

"ఆవిడ హౌస్ వైఫ్ అంతే ....."

"కుర్రాడు మంచి టేస్ట్  లు ఉన్న వాడేనా ?"

"అంటే ..... ప్రత్యేకించి టేస్ట్  లంటూ ఈ రోజుల్లో ఏముంటున్నాయంకుల్ .... ?"

నిజమేలే అనుకున్నాను .

"పుస్తకాలు చదవడం ..... లాంటివి చేస్తాడా .... ?"

"అంత టైం  ఎక్కడ ఉంటుందంకుల్ ..... ?"

"అదేంటమ్మా .... మరి రిలాక్సేషన్ ..... "

"ఫ్రెండ్స్ తో చాటింగ్ ..... వీడియో గేమ్స్ ఆడుతుంటాడు .....కాలేజ్ లో చాలా కష్టపడ్డాడు కదా అంకుల్ .... పుస్తకాలు ముట్టుకోడం మానేసాడు ...  "

"మ్యూజిక్ .... లాంటివేమన్నా ..... "

"భలే పిచ్చి అంకుల్ ..... ఒక్క సారి ఆఫీస్ నుండి బయటకు వచ్చాడంటే చెవిలో యియర్ ఫోన్స్  ఉండాల్సిందే ..... "

"ఏ సంగీతం వింటుంటాడేమిటి ?"

"అలాంటిదేమీ లేదంకుల్ ..... కొత్తవి ఏవోచ్చినా  డౌన్ లోడ్ చేసుకుని వింటూనే ఉంటాడు "

"మిగిలిన అలవాట్లు ..... "

"చాలా సిస్టమేటిక్ అంకుల్ ..... ఉదయాన్నే జాగింగ్ చేస్తాడు ..... స్నానం చేసి ఇంచుమించు ప్రతి రోజూ గుడికి వెళ్తాడు .... తన పని తప్ప వేరే ధ్యాసలేవీ ఉండవు ..... "

"సినిమాలు చూస్తాడా ...... ?"

"టైం పాస్ కోసం అప్పుడప్పుడు ..... వాటి గురించి పెద్ద సీరియస్ గా పట్టించుకోడు "

"  'షాహిద్' అంతకు ముందు 'పీప్లి లైవ్' లాంటి  సినిమాలు  చూసాడా ..... ?"

"అదేంటంకుల్  ఎవరికీ తెలియని సినిమాల గురించి అడుగుతున్నారు ?"

"పోనీ కనీసం 'ఆకాశమంత' , 'ఆ నలుగురూ ', 'పిల్ల జమీందార్', లాంటివి చూసాడా ?

"చూసే ఉంటాడు .... వాటి గురించి ఎప్పుడూ మాట్లాడ లేదు "

" o.k.  మరి మీరిద్దరూ కలిసినప్పుడు దేని గురించి మాట్లాడుకుంటారు ?"

"చాలా విషయాలు మాట్లాడుకుంటాం ...... మారేజ్ చేసుకున్న తరువాత చేసుకోవలసిన టాక్స్ సేవింగ్ గురించి .... ఏ ఏరియా లో ఫ్లాట్ కొంటే  బాగుంటుందో ..... దాని రీ సేల్  గురించి ..... ఇంటీరియర్ గురించి ..... అసలు ఈ మధ్యనైతే ఫ్లిప్ కార్ట్ ,అమెజాన్ ,స్నాప్ డీల్  లాంటి ఈ బిజినెస్ సైట్స్ లో వస్తున్న డీల్స్  గురించి ..... లంచ్ టైం  లో కూడా గంట గంటకీ వస్తున్న డీల్స్ గురించి ...... "

చాలా ఎగ్జైటింగ్  గానే చెబుతూనే ఉంది  .

" గోల్స్ ఏమైనా సెట్ చేసుకున్నారా ?"

"మారేజ్ నాటికి తను సీనియర్ మేనేజ్ మెంట్ పొజిషన్ లోకి రావాలని అనుకుంటున్నాడు ...."

"ఇక వేరే ఏమీ లేవా .... "ఈయనకు  పొలిటికల్ లింక్స్ గానీ థాట్స్ గానీ  ఉన్నాయా ..... ?"

"ఇతగాడికి రాజకీయాలంటే  మహా చిరాకు ...... ఆంధ్రా ... తెలంగాణా ఎందుకు విడిపోవాలో .... లేదా కలిసుండాలో కూడా పట్టించుకోడు. అతడి కెరీర్ కు సంబందించనిదేదీ పట్టించుకోడు "

"అతడి ఫ్యామిలీ లో అంటే నాన్న గారు కూడా ...... "

"వాళ్ళూ కూడా అంతే ...... ఎప్పుడో వాళ్ళ తాతయ్య గారు అప్పుడెప్పుడో తెలంగాణా లో జరిగిన గొడవల్లో పాల్గొన్నారట .... ఆ తరువాత పల్లెటూరు వదిలి వరంగల్ వచ్చేశారట. ఆ తరువాత వీళ్ళ నాన్నగారు బిజినెస్ లో ..... బాగానే సంపాదించారు"

నాకొక్క సారి చలసాని ప్రసాదరావు గారి "ఇలా మిగిలేం " మనసులో మెదిలింది.

"సాధారణంగా చాలా వరకూ అభిప్రాయాలు match అయితేనే కదా మేరేజ్ proposal వస్తుంది. మీ ఇద్దరి ఏ అభిప్రాయాలు అంతగా మ్యాచ్ అయ్యాయి ? ఏమీ అనుకోకు......  మా బాచ్ లో second Generation లో మొదటి పెళ్లి నీదే ..... అందువల్లే కొంచెం లోతుకెళ్ళి అడుగుతున్నాను "

"ఏముందంకుల్ .... ఒక చోట ఉద్యోగం చేస్తున్నాం. ఇద్దరం సంపాదిస్తున్నాం. పూర్వ పరిచయం కూడా ఉంది. చూడడానికి బాగానే ఉంటాడు. మార్కెటింగ్ చేసేటప్పుడు చాలా ఓపిగ్గా ఉంటాడు. పైగా నాకంటే కూడా ఎక్కువ వెరైటీస్ చెక్ చేస్తూ గైడ్ చేస్తూ ఉంటాడు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే. సినిమాల్లో బ్రహ్మానందం లాంటి వాళ్ళ యాక్షన్  కి పడీ పడీ నవ్వుతాడు....టాక్స్ సేవింగ్ గురించి చాలా మందికి భలే సలహాలు ఇస్తాడు తెలుసా ...  "

"అబ్బా ..... కానీ ఇంకొక చిన్న విషయం ..... నీలో అతగాడు ఏదైనా ప్రత్యేకత చూసాడా ?"

"చాలా చెబుతాడు .... నా ఫ్రేంక్ నెస్ ..... కలుపుగోలు తనం ..... ఇంకా ... ఇంకా .... "

"మీరు తీసుకోబోయే ఫ్లాట్ లో మంచి లైబ్రెరీ మైంటైన్ చేయండి "

"ఎందుకంకుల్ ..... ఒక అమెజాన్ కిన్డిల్ కొనుక్కుంటే చాలు కదా ..... "

"కానీ  బీరువాల్లో ఉండే గొప్ప పుస్తకాలు  ఇంటికే హుందాతనాన్ని తెచ్చి పెడతాయి కదా ..... "

" కరెక్టే .... మంచి సౌండ్ సిస్టం .... విడియో .... తీసుకోవాలి .... పైగా ఆ తరువాత అవకాశం బట్టి మంచి గేడెడ్ కమ్యూనిటీ లోకి మారిపోతాం ..... "

"బాగుందమ్మా ..... ఆల్ ది బెస్ట్ .... 

"థాంక్ యూ అంకుల్ "




**************

అనుకున్నట్లుగానే సాయంత్రం కాగానే కుమార్ ఫోన్ చేసాడు. 

"ఏరా ఎలా ఉన్నాడనిపిస్తోంది ... "

"ఫరవాలేదురా మిస్టర్ పెర్ఫెక్ట్ "

"అలా కాదు కానీ ..... మనసులో ఉన్న విషయం కరెక్ట్ గా చెప్పు "

"తమను గట్టిగా ప్రేమించుకుంటూ ఎదుటి వాళ్ళను ప్రేమిస్తున్నారు ..... "

"ఇది ప్రేమించే లక్షణమేనని  అనుకోవాలా ?"

"ఒరేయ్ మారుతున్న జెనరేషన్ గురించి ఆలోచించు .  మీ అమ్మాయి పుట్టిన సంవత్సరమే మన ఆర్ధిక  సరళీకరణ ప్రారంభమయ్యింది. మన పిల్లలను కార్పోరేట్ స్కూళ్ళలో మాత్రమే చదివించవలసిన పరిస్థితిలోకి నెట్ట బడ్డామ్ . పిల్లల భవిష్యత్తుని రిస్క్ చేయలేని పరిస్థితి. మరి వాళ్ళు ఎలా మౌల్డ్  చేస్తారో తెలియదా ? నీకు ఇంకొక విషయం చెబితే ఆశ్చర్య పోతావ్ . ఒక ఐఐఎం లో చదివిన యువకుడు మా దగ్గర ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాడు . ఒక ఆదివారం పని పెట్టుకొనడానికి పర్మిషన్ అడిగాడు. చదువుకున్న కాంట్రాక్టర్ ని ప్రోత్సహిద్దామని సరేనన్నాను . కానీ ఆ తరువాత .... మూడవ వారం కూడా అడిగాడు. కాస్త గట్టిగా టేకిల్ చేయక  తప్పలేదు. అంటే ఐఐఎం  చదివిన వాళ్ళు కూడా ఇలా తయారై వస్తుంటే .... ఇక మామ్మూలు కార్పోరేట్ కాలేజ్ ల సంగతి ..... ఎక్కువగా ఆలోచించడం అనవసరం. "

"ఒరేయ్ ..... నేను ........ జీనా హైతో మర్నా సీఖో ..... అన్న లెవెల్లో మాట్లాడడం లేదు. కనీసం ..... పావన నవ జీవన బృందావన నిర్మాత ...... కోసమే ఆలోచించాన్రా ..... "

"కాదనడం లేదు .... కానీ ఎలా దొరుకుతారు ?   ప్రతి విషయాన్నీ  పశ్నించే  హేతుబద్ద  దృక్పధం  శతాబ్దాల మూర్ఖత్వాలకు  ఒక ప్రత్యామ్నాయ తాత్విక దృక్పధంగా  సమాజంలో రూపు దిద్దుకుంటున్న సమయంలో  ఏదో మొత్తం సాధించేసినట్లుగా వంద ముక్కలయ్యి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని  ప్రజలు అసలు ఆ ఆలోచన జోలికే వెళ్ళడాన్ని  అసహ్యించుకునే విధంగా తయారు చేసిన మన కమ్యూనిస్ట్ నాయకమ్మన్యులను ఏమనాలి ? కేవలం పొత్తుల ద్వారా నాలుగు సీట్లు సంపాదించ గలిగి అధికారంలో పాలు పంచేసుకుంటే మొత్తం ప్రజల తాత్విక దృక్పధాన్ని మార్చేయగలమనుకుంటూ ప్రజలను తప్పు దారి పట్టించిన వీళ్ళు చేసిన కుట్ర భారత దేశంలో జరిగిన మరే కుట్రకూ తీసిపోదు . 

                      ఇంకొక చిన్న విషయం చూడు. చాలా మంది అంటూ ఉంటారు. ... ఇంకెక్కడి కమ్యూనిస్ట్ పార్టీలండీ ..... అవెక్కడున్నాయ్ ..... అని . అది నిజమే కావొచ్చు. కానీ ఒక్కటి చూడు ..... ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే రోడ్ ని ఆక్రమించి కట్టిన ఏ ప్రార్ధనా మందిరాన్ని  అయినా సరే అక్రమ కట్టడమని పబ్లిక్ గా డిక్లేర్ చేయమను. అంటే ఇవన్నీ బేసిగ్గా ఒకదానికొకటి ప్రత్యామ్నాయం ఎంత మాత్రం కాదు. ఒక రాజకీయ ... తాత్విక ప్రత్యామ్నాయమే లేని సమాజంలో పెరిగిన మన పిల్లలు ఇంతకంటే గొప్పగా తయారయ్యే అవకాశం లేదు. మీ అమ్మాయిది కూడా ఒక రకమైన ప్రేమే అని నమ్ముకుని ఒప్పేసుకో. నీవనుకున్నట్లు సమాజాన్ని ..... చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమించగల వాళ్ళు దొరకాలంటే చాలా కష్టం. ధైర్యం ఉంటే వేచి ఉండు "