23, నవంబర్ 2011, బుధవారం

జరుగుతున్నదాంట్లో మన పాత్ర లేదా......

ఒక తప్పు ఒక వ్యక్తి వలన జరిగితే దానిని కేవలం వ్యక్తిగతంగా తీసుకోవచ్చు అంతే కాకుండా అది యాదృచ్చికంగా జరిగిందని కూడా భావించవచ్చు. కానీ అదే పొరబాటు  అవకాశం  దొరికిన ప్రతి వారూ చేస్తుంటే    అది మన సమాజానికున్న అధీకృత  భావజాలంలో ఉన్న పెద్ద లోపంగా భావించవలసి వస్తుంది. ఇదంతా జనం అందరికీ అర్ధం కావడం లేదా అంటే ఖచ్చితంగా అర్ధం అవుతుందనే చెప్పవచ్చు. చిన్న చిన్న వాటికి కూడా మనకు మనమే " యెం చేస్తాం ..అంతా చేస్తున్నారు" అని మనకు మనమే సర్ది చెప్పేసుకుంటుంటే ఇక కుళ్ళు యెప్పటికైనా అంతం అవుతుందా అని యెవరూ అలోచించదం లేదు. మొత్తంగా భావి తరాలకు కుళ్ళు మాత్రమే నిండి ఉన్న వాతావరణాన్ని , సంస్చృతిని ఇవ్వబోతున్నామన్న వాస్తవాన్ని గుర్తించి కూడా దీనిని అంతం చెయక పోతే నష్టం యేమిటిలే  అన్నంత ఉదాసీనతతో అంతా సరి పెట్టేసుకుంటున్నారనిపిస్తోంది. కొన్ని కొన్ని మనం సమర్ధించడానికి కూడా మనం సిగ్గు పడడం లేదు. మొన్నొక రోజు ట్రైన్ లో కూర్చుని ఒక న్యూస్ పేపర్ చదువుతున్నాను. దానిలో ఒక దివంగత ముఖ్య మంతి గారి తనయుడి మీద ముసురు కొంటున్న సీ.బీ.ఐ. కేసుల తాలూకు  న్యూస్ పెద్దగా ఉంది. పక్కన కూర్చున్న పెద్ద మనిషి యేదో పూనకం వచ్చి నట్టుగా " యీ పేపర్ ఎడిటర్ ఒకప్పుడు సైకిల్  మీద తిరిగిన వాడేనటండీ...పెద్ద ఇప్పుడు నీతిమంతుడులా రాస్తున్నాడు...." నేనడ్డుకుని కాస్త కటువుగా మాట్లాడక పోతే అతడి వాగ్ధాటి ఇంకా సాగేదే. మీడియా అంతా నిష్పాక్షికంగా ఉన్నదని నేనెప్పుడూ అనను కానీ అది అలా తయారవ్వడానికి గాని,అసలు పరిస్థితి ఇంత దిగజారడానికి మనం యెంత వరకూ కారణం అవుతున్నాం అనేది యెవరూ ఆలోచించరు. యెదుటి వాళ్ళు కాస్త బలమైన సమూహం (ఆర్గనైజ్డ్) అనిపిస్తే చాలు మనం దాని జోలికి యెంత మాత్రం పోము. ఆ విధంగానే యీ దేశం లో అతి చిన్న సమూహాలు మొత్తం జనాభాలో 70% ఉన్న రైతాంగాన్ని మోసం చేయగలుగుతున్నారు.
ఆ వివరాలలోకి మరొక్క సారి వెళదాం. కింద ఉన్న చిత్రాన్ని చూడండి.
యీ అపార్ట్మెంట్ ముందు ఒక వాహనదారుడు ప్రతి రోజూ తన వాహనాన్ని పార్క్ చేసుకునే వాడు. మొదట  ఆ అపార్ట్మెంట్ కు సంబందించిన  ఒకరు ఆ వాహనదారుడికి మర్యాదగా చెప్పి చూసాడు. కానీ ఫలితం కలగలేదు. కానీ అపార్ట్మెంట్ లోని  వారందరూ కదిలే సరికి యేకాకి ఐన ఆ వాహనదారుడు దానిని అక్కడ నుండి తీసేసాడు. 

యీ క్రింద చిత్రాన్ని చూడండి.

రోడ్ కొంచెం సన్నగా కనబడుతున్నా ఎంతో రద్దీగా ఉన్న రోడ్ మధ్యలో షామియనా...భోజనాలు.(ఇది కూడా ఆ అపార్ట్మెంట్ పక్కనే ఉన్న వీధే..) కనీసం వీధి మొదట్లో ఐనా  రోడ్ బ్లాక్ ఐనట్టు గా సూచన యేమీ ఉండదు. చచ్చినట్టు అక్కడిదాకా వచ్చిన వారు చచ్చి నట్టు వెనుకకు వెళ్ళాలి. కానీ యీ సారి చాలా అసౌకర్యం కలిగినా కూడా ఆ అపార్ట్మెంట్ లోని వారెవరూ అడగడానికి సాహసించలేదు. కారణం వేరే చెప్పనక్కర లేదు. యెదుటి వాళ్ళు మరింతగా ఆర్గనైజ్ అయిన వాళ్ళు. ఇప్పుడు మొత్తం ఇదే జరుగుతోంది. పబ్లిక్ ప్రోపర్టీ  అన్నది యెవరూ ముట్టుకో రానిది అన్న భావన స్థానంలో అందరూ వాడుకోగలిగినది  అన్న అర్ధం నెలకొంది. అది తిన్నగా యెవరికి బలం ఉంటే వాళ్ళు వాడుకొనే స్థాయికి తీసుకెళ్ళింది. అసలు పబ్లిక్ కి ఇబ్బంది కలిగే అన్నిటి మీదా తీవ్రమైన చర్యలు మొదటి నుండీ అమలయ్యి ఉంటే యీ భావజాలం ఇంత దారుణంగా వేళ్ళూనుకు పోయి ఉండకపోయేదేమో. ఒక సారి రోడ్ పై పొర ఐన టేక్  మరియు సీల్ కోట్ లు ధ్వసం ఐతే ఆ రోడ్ కి అవసాన కాలం దాపురించి  నట్టేనని అందరికీ తెలుసు. కానీ మన కళ్ళ ముందే కొంత మందికి ఆనందం.లాభం కలిగించే ప్రోగ్రాం లు జరపడం కోసం రోడ్  తవ్వేస్తున్నా మనం పట్టించుకోము సరి కదా ప్రభుత్వం రోడ్లు పట్టించు కోడం లేదని వాపోతాం.షిఫ్ట్ ద్యూటీలు ఉన్న నగరాల్లో ..తెల్లవారగట్ల వచ్చి పడుకుందాం అనుకున్న కార్మికులకి మైక్ లు లో నుండి వచ్చే ప్రార్ధనలు ఎంతో ఇబ్బంది కలిగిస్తాయని ప్రభుత్వానికి తెలియదా...? అసలు భగవన్నామ స్మరణకు అంత గోల అవసరమా...? నిశ్శబ్దం  ఒక పబ్లిక్ ప్రొపర్టీ వంటిది కాదా.....యెవడికి అవకాశం ఉంటే వాడు దానిని దోచేస్తున్నాడు. మరి సాక్షాత్తూ రాష్ట్ర అధినేతల బంధు...ఆశ్రిత  బృందాలను అడ్డుకోవడం అనేది చాలా దూరం లో ఉంది. మన బోటి సామాన్య  స్థాయిలో ఉన్న వాళ్ళకి   కనీసం రోడ్ మీద జరుగుతున్న   ప్రోగ్రాం పక్కన ఉంటున్న పెద్ద పెద్ద పోస్టర్ లను చూస్తే యీ కుళ్ళు యెక్కడి నుండి కడగాలో అర్ధం అవుతుంది. ప్రజల మూర్ఖత్వాన్ని వాడుకునే వాళ్ళ పని పట్టడమే  ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం.
కన్నూ మిన్నూ కనబడని రోజులలో చేసిందంతా యధేచ్చగా చేసి విచారణలెదుర్కుంటున్న యీ సమయంలో  ఒకరేమో చేతులు పైకి చూపించి "అన్నిటికీ భగవంతుడే...ఉన్నాడు" అంటుంటే  కొంతమంది మాత్రం యీ క్రింది విధంగా భగవత్ప్రదక్షిణాలు   చేస్తున్నారు.

పాపం భగవంతుడు దాక్కోడానికి యేదైనా చోటుందో లేదో...వీళ్ళందరికీ భవతుడంటే భయం ఉండొచ్చు..చట్టం అన్నా కూడా ఇప్పుడిప్పుడు కొంత భయం వచ్చి ఉండొచ్చు.. కానీ జనం ఉన్నారని భయ పడే స్థాయికి  మనం యెప్పుదు యెదుగుతామో.....ఆ రోజుల కోసం ఎదురు చూద్దాం.