ప్రతి విషయం హేతుబద్దతకు నిలబడ లేక పోవచ్చు. కానీ కానీ కొన్ని అలా జరిగితేనే బాగుంటుందనిపిస్తుంది.దాంట్లో చాలా విషయాలు మిళితమై ఉంటాయి. మా అమ్మాయి వాళ్ళ డాన్స్ స్కూల్ వారు నిర్వహించే చాలా ప్రోగ్రాంస్ లో చిన్న చిన్న పాత్రలు వేస్తూనే ఉండేది. 9 వ తరగతి నుండి అది ఒక్క సారే పొడుగు ఎదగడం వలన దానికి ఒకే సారి సీనియర్ అమ్మాయిలతో కలసి ప్రోగ్రాం చేసే అదృష్టం కలిగింది. అంతవరకూ బాగానే ఉంది కానీ దానిని రిహార్సల్ నుండి తీసుకు రావడానికి చాలా సాయంత్రాలు /రాత్రులు అంటే ఇంచుమించు సాయంకాలాన్నుండి మొదలుపెట్టి రాత్రి వరకూ వేచి ఉండాల్సి వచ్చేది. నిజం చెప్పాలంటే ఆ వేచి ఉంటంలోనే నా సైట్ వర్క్ వలన కలిగిన అలసట అంతా పోతూ ఉండేది. ఎం.వీ.పీ. కాలనీ లో సెక్టర్ .5 లో ఉండే ఆ నాట్య కళాశాల లో నుండి మంద్రంగా వినిపించే పాటల వింటూ మానసికంగా పునరుత్తేజం పొందుతూ ఉండే వాడిని.ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఐన "బాలక్క" అని అందరూ పిలుచుకునే శ్రీమతి బాల గారి గురించి ప్రస్తుత కూచిపూడి నాట్య కుటుంబం లో తెలియని వారెవారూ ఉండరు.కానీ ఆవిడ ముక్కోపానికి భయపడని శిష్యులూ ఉండరు.అప్పుడప్పుడు నేను ఆ సంగీతంలో మునిగి ఉన్నప్పుడు " ఒసేవ్ ..నీహారికా.ఎక్కడ చూస్తున్నావే" అన్న అరుపుకు మా అమ్మాయికంటే నేనె ఎక్కువ భయపడే వాడిని. పాపం మా అమ్మాయి భయపడిందేమో నన్న బాధతో లోపలికి తొంగి చూస్తుండే వాడిని.
మొత్తానికి ప్రొగ్రాం అనుకున్న దాని కంటే బాగా జరిగింది. విశాఖ ఉత్సవ్ మొదటి రోజున జరిగిన మొట్ట మొదటగా జరిగిన ఆ ప్రోగ్రాం కి ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన కరతాళ ధ్వనుల రూపంగా బయటకు వచ్చినప్పుడు మాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ప్రోగ్రాం అంతా అయిన తరువాత మా అమ్మాయిని మేము తీసుకు పోదామని నెమ్మదిగా స్టేజ్ దగ్గరికి నడిచి అదే విషయం బాలక్కకు చెప్పాం. ఆవిడ అంతెత్తున లేచి "ముందు అంతా ఇంటికి నడవండి"
ఆవిడ ఇంటికేనని అర్ధం అయ్యింది ఎందుకంటే ఆవిడ ఇల్లే నాట్య కళాశాల కాబట్టి .
మరలా ఇప్పుడు ఆవిడ ఇంటి దగ్గర పనేంట్రా బాబూ అనుకుంటూ వాళ్ళింటి దారి పట్టాం కళాకారులంతా వేన్ లోనుండి దిగారు. బాలక్క హారతి వెలిగించింది. అందరి చుట్టూ తిప్పింది. ఏవో మంత్రాలు కూడా చదివినట్లు గుర్తు.పెద్ద గుమ్మిడి కాయ పట్టుకుని అందరి చుట్టూ తిప్పి నేలనేసి కొట్టింది. అదంతా దిష్టి పోవడం కోసమని అర్ధమయ్యింది. నిజం చెప్పాలంటే నాకు అటువంటి వాటి మీద నమ్మకం ఎంత మాత్రం లేదు.కానీ ఆవిడ చేసిన ఆ చిన్న కార్యక్రమం నాలో ఎటువంటి ఫీలింగ్స్ కలగ చేసాయో నేనెప్పటికీ మాటలలో ఐతే చెప్పలేను. కొంత సేపు అలా ఉండి పోయాను. కళ్ళలో నుండి నీళ్ళు బయటకైతే రాలేదు కానీ....
కళలో ఉండే మనుషులలో ఎన్నెన్ని ఫీలింగ్స్ ఏ స్థాయి లో కలగ చేస్తుందో ఆ రోజులో అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను.ఆ స్పందన అనుభవించిన వారికే అది తెలుస్తుంది. ఇది నిజమైన కళ యొక్క ప్రతిస్పందన అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
కానీ ఈ మధ్య కాలంలో "కళ" అనే పదానికి చాలా నిర్వచనాలు వచ్చాయి.కొత్త నిర్వచనాలలో స్పందన అనేదాని కంటే అది సృష్టించే రికార్డ్ ల మీదే ఎక్కువ దృష్టి ఉంటోంది. ఐనా ఫరవాలేదులే ...ఏదో ఒక విధంగా మన కళళను ప్రపంచ వ్యాప్తం చేస్తున్నారన్న ఆనందం మిగలాలన్నా కూడా ఆ..యా.. ప్రోగ్రాంస్ నిర్వహించేటప్పుడు ఆ రంగాలలో లబ్ద ప్రతిష్ఠులుగా ఉన్న వారిని ఎక్కువగా వేదికల పై ఆశీనులయ్యేటట్లు చేస్తే కొంత ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా మూడు సంవత్సరాల క్రితం నిర్వహించిన "అన్నమయ్య లక్ష గళార్చన " కార్యక్రమమానికి ఆహ్వానించబడిన సినీ ప్రముఖులు మన కళామ తల్లికి ఎలాంటి సేవలు చేసారో....వారిని చూస్తే ఏ కళలు గుర్తుకు వస్తాయో ఆ కార్యక్రమ నిర్వాహకులకి తెలియదని అనుకోలేము. నాకర్ధమయ్యిందేమిటంటే వాళ్ళ కార్యక్రమానికి వచ్చే ప్రచారం వాళ్ళకి ముఖ్యం . రెండు సంవత్సరాల క్రితం నిర్వహించిన "కూచిపూడి మహా బృంద నాట్యం " నిజంగా కూచిపూడి నాట్యానికి యే విధంగా ఉపయోగపడుతుందో నాకు అర్ధం కాలేదు. కొన్ని వేల మంది కేవలం ఒక చోట చేరి చేతులు ఊపితే అది నాట్యమవుతుందేమో నాకు తెలియదు.ఎలా ఐతేనే రెండూ గిన్నిస్ బుక్ లోకి ఎక్కేసాయి. అంటే అవి సృష్టించే ఆనందం ..స్పందనలు...ఇవన్నీ అర్ధం లేనివిగా మారిపోతున్నాయ్. రికార్డులు పరంగా మన సంస్థ వార్తల్లోకి ఎక్కేస్తే చాలు...మనం మన వంతు గా కళామ తల్లికి మన వంతు సేవ చేసేసి నట్లే....
బహుసా అందువలనేనేమో మా విశాఖ లో రోడ్ లు బ్లాక్ చేసి నిర్వహించే ప్రోగ్రాం బేనర్స్ నిండా కళాకారుల పేర్లు రాసి పక్కన " డేన్స్ బేబీ డేన్స్ ఫేం" ...ఇంకేదో ఫేం ..అని గొప్పగా రాయగలుగుతున్నారు. నిర్వహించే వాళ్ళకి మాత్రమే ప్రచారం రావాలనుకునే ప్రోగ్రాంస్ అన్నీ ఒక్కటే...వాశి లో తేడా ఉండదు...రాశి లో తప్ప.