6, ఫిబ్రవరి 2011, ఆదివారం

శ్రీ మార్ని నారాయణ మూర్తి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్

నేను టెన్త్ తాడికొండ ఆశ్రమ స్కూల్ లో చదవడం వలన యేవో గేమ్స్ ఆడడం, వ్యాయామం చేయడం కొద్దిగా అలవాటే. మా వూరి నుండి రాజమండ్రి కాలేజీ కి సైకిల్ తొక్కుకుని వెళ్ళడం వ్యాయామం లేని లోటు తీరుస్తున్నప్పటికి గేమ్స్ మాత్రం ఊర్లో పెద్దగా ఆడేవాళ్ళు కారు. కొద్ది రోజులు బిళ్ళంగోడు ప్రయత్నించాము కానీ ఆటలో ఒకసారి బిళ్ళ కూరలు అమ్ముకునే వాడి కంట్లోకి దూసుకు పోవడంతో దానికి ఫుల్ స్టాప్ పడింది. అప్పుడు క్రికెట్ ఆడే ప్రయత్నం మొదలు పెట్టాం. అప్పుడు మేము బాట్ తాయారు చేసుకొనడం మొదలైనవి "లగాన్ " సినిమా కధను పోలి ఉంటాయి కానీ కొన్ని తేడా లు ఏమిటంటే మేము ఎవరినీ సవాలు చేయ లేదు. మొదట మాకు గ్రౌండ్ పెద్ద సమస్య అయ్యింది. వూరి చివర వున్న రాజు కొండ దిగువన స్థలం ఐతే వుంది కానీ దాని నిండా పొదలు నిండి ఉండేయి. కాబట్టి అప్పట్లో మేము ఒక నిర్ణయం తీసుకొన్నాం. రోజు ఆట ఐన తరువాత ఒక్క పొదనైనా తొలగించాలి. నిర్ణయం చాలా సంవత్సరాలు రెగ్యులర్ గా కాక పోయినప్పటికీ నడిచింది. ౧౯౮౪ నాటికి ఇంచుమించు వంద గజాల రెడిఅస్ తో ఉన్న అతి విశాల మైన గ్రౌండ్ తయారు అయ్యింది. ౧౯౮౬ లో అనుకుంటా డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని అనుకొన్నాం. కానీ ప్రైజెస్ మిగిలిన ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుండి సంపాదించాలి ? ఊరిలో క్రికెట్ మీద అట్టే సదభిప్రాయం లేదు. క్రీడలు చదువులో భాగమని నమ్మే విశాలత్వం ఇప్పటి లాగే అప్పుడు కూడా లేదు. కానీ టైం లో నిజంగా దేవత లా మా అమ్మమ్మ వరసైన శ్రీమతి యింగయమ్మ గారు మొత్తం ఖర్చు భరించడానికి సిద్దమయ్యారు. వెంటనే అప్పటికే దివంగతులైన మా తాతయ్య శ్రీ మార్నినారాయణ మూర్తి గారి పేరుతొ నిర్వహించిన టోర్నమెంట్ మా వూరి చరిత్ర లోనే ఒక మైలు రాయి వంటిది. తరువాత సంవత్సరం కూడా టోర్నమెంట్ దిగ్విజయంగా నిర్వహించాం. తరువాత ఉద్యోగ, వ్యాపార నిమిత్తం మా బాచ్ లో చాలా మంది వూరు వదిలేయడంతో సంప్రదాయం ఆగిపాయింది.
ఇక్కడొక ముఖ్యమైన ఆలోచించే రేకిత్తెంచే విషయం ఏమిటంటే ఎవరో ఒకరు మిస్ అయినంత మాత్రాన ఒక గొప్ప స్పూర్తి ఎందుకు ఆగిపూయిందనేది ఇప్పుడు చూద్దాం.

నిజం చెప్పాలంటే నాకు “ లగాన్ ' చూసిన తరువాత కొన్ని విషయాలు అర్ధం అయ్యాయి . మేము ఆ రోజుల్లో కేవలం మా కులం లో ఉన్న కుర్రాళ్ళతోనే టీం తయారు చేసుకోన్నాం. రైతాంగ కుటుంబాలకు చెందిన వీళ్ళు డబ్బు పెట్టుబడి పెట్టి ఆటలు ఆడే కల్చర్ కు ఎక్కువగా అలవాటు బడలెదు. నేను అప్పటికే జాబ్ లో ఉన్నాను కాబట్టి కొంత పెట్టుబడి పెడుతూ ఉండేవాడిని

ఆ తరువాతి కాలంలో నేను గమనించిందేమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్దిక వనరులు తక్కువ కాబట్టి తక్కువ ఖర్చు తో కూడుకున్న ఆటలే ఎక్కువ కాలం మనగలుగుతాయి . కబడ్డీ ,balbadmintan లు అందుకే గ్రామాల్లో చాలాకాలం ఆడారు .

ముత్యాల ముగ్గు సినిమా లో ముళ్ళపూడి వారు రావు గోపాల రావు ద్వారా మంచి సామెత ఒకటి చెప్పించారు . “వెనకటికొకడికి దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమంటే ….మా మేనమామ చెవులో వెంట్రుకలు మోలిపిచ్చు ….మిగిలింది నేను చూసు కుంటా నన్నాడట”. ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే పంతోనిమిది వందల ఎనభై రెండు లో మనకు కలర్ టీవి ప్రసారాలు మొదలయ్యాయి . గ్రామీణ భారతంలోకి వస్తు వినిమయ కల్చర్ కి యిది తలుపులు తెరిచిందనవచ్చు . దాని ఫలితంగానే సమిష్టి కృషి తో గెలిచే ఆటలకు నెమ్మదిగా కాలం చెల్లిపోయింది . యువతరం ఇంట్లో కూర్చుని ఆనందించ గలిగే అవకాశాలు పెరిగాయి . పైగా క్రికెట్ బాల్ ఖర్చుకు ఐదు రూపాయలు ఇవ్వడానికి వొప్పుకోని కుటుంబ పెద్దలు టీవి సెట్స్ కొనడానికి అభ్యంతరం పెట్ట లెదు . టీవి లు ఇళ్ళల్లోకి వచ్చాయి . మనిషి బయటకు రావడం మానేసాడు .సమాజమ్మీద టీవీల ద్వారా కొత్త కల్చర్ పట్టు సాధించింది . అలా నాటబడిన విత్తనాల తాలూకు చెట్లు ఇప్పుడు కాయలు కాస్తున్నాయి.. వాటినుండి వస్తున్న దుర్వాసనకు మనమే ముక్కులు మూసుకుంటున్నాం .