“నాదొక చిన్న
సందేహం సార్ ......మీరు అధికారి కాక ముందు , నేను నా ఉద్యోగం లోకి రాక ముందు
మనిద్దరిలో సామాన్యంగా గా ఉన్న లక్షణం “మానవత్వమే” కదా .....కాని దాని
గురించి కొంతైనా చింత లేకుండా మీలాంటోళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అర్ధం కాకుండా ఉంది .
మనం ఒక్కొక్క
విషయం ఆలోచిద్దాం. పరిస్థితులు ఎంతగానో మారిపోయ్యాయి. కానీ వాటిని మీకు అనుకూలంగా
ఎలా మలుచుకోవాలో మీకు తెలుసు. మీకు మంచి జీతాలు ,సౌకర్యాలూ ఉంటాయి. మీకు వాటిని
అందుబాటులోకి తెచ్చిన యంత్రాంగం పట్ల మీకు మా కంటే కృతజ్ఞతా భావం ఎక్కువగా ఉండడంలో
సందేహమేమీ లేదు కానీ మీ కున్న నిబద్దత అందరికీ ఉండాలని
భావించడం న్యాయమా? మా కుటుంబాల పట్ల మాకు నిబద్దత ఉండకూడదా ....?
అసలు ఆ 8 గంటల
పనిదినం కూడా ఎంత మంది మహనీయుల త్యాగఫలమో మీకు కొంతైనా తెలుసా ? అలాగే వారానికి ఒక
రోజు సెలవు ఎందుకిచ్చారో ....దాని విలువెంతో మీకు తెలుసా ? అటువంటి సెలవుకి
మమ్మల్ని దూరం చేస్తున్న మీకు నాగరికత ఉన్నట్టా లేనట్టా ? మాకు 8 గంటల పనిదినమే
కదా. ఆ సమయంలో నిజాయితీగా ....నిబద్దతతో పనిచేయడమే కదా మీకు కావలిసింది. అంతకు
మించి పని చేయడం అనేది మా ఇష్టాయిష్టాల బట్టి కదా ఉంటుంది. ఉదయాన కానీ .... వారంలో
ఒక రోజు ఉదయం కానీ .....సాయంత్రం కానీ కనీసం కూరగాయలకైనా బయటకు వెళ్ళాలి కదా .....మాకు
ప్రభుత్వం ఇచ్చే వాహనాలు కానీ ....మనుషులు కానీ ఉండరు కదా ......? దయుంచి ప్రభుత్వ
వాహనాలు స్వంతానికి వాడడం లేదని ఆత్మవంచన చేసుకోవద్దు . అటువంటి వారి శాతం అతి
కనీసంగా ఉన్నప్పుడు దానిని సున్నాగానే పరిగణించాలి.
మా పిల్లలు
చదువుకుంటున్నప్పుడు వాళ్లకు ఆసరాగా ఉండవలసిన బాధ్యత మా మీద ఉండదా .....? కేవలం వాళ్లకు
పుస్తకాలు కొనేసి కాలేజ్ ఫీజులు కట్టేస్తే మా బాధ్యత తీరిపోతుందా ? సమాజం లో
పరిస్థితి అత్యంత అపసవ్యంగా ఉన్నప్పుడు వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్ద వలసిన
నైతిక బాధ్యత మా పై ఉండదా ? వారికి విలాసవంతమైన జీవితాన్ని మేము అందుబాటులోకి తేలేక
పోవచ్చు కానీ మన ఆనందానికి అలాంటి జీవితం
అవసరం లేదన్న విషయం వారికి అర్ధమయ్యేట్టు చేయగలిగితే వారికి కోట్ల రూపాయల సంపాదనల
అవసరం ఉండదు కదా. అప్పుడు వారు నీతీ..... నిజాయితీలతో తృప్తిగా బ్రతక గలుగుతారు
కదా. కొంత మంది భయం వలన కూడా నీతి ...నిజాయితీ లతో జీవిస్తారు కానీ చైతన్యం వలన
వచ్చే సుగుణాలు మరింత విలువైనవి కావా ?
వాళ్ళు రేపు
పరీక్షల ముందు హాల్ టికట్ వినాయకుడి విగ్రహం ముందు పెట్టి పూజ చేయిస్తానంటాడు. అవసరం
లేదని చెబుతాను. అంటే దానర్ధం చర్చికి తీసుకెళ్ళి ప్రేయర్ చేయించాలని కాదని కూడా
వాడికి అర్ధం కావాలి.... అంటే పరీక్షల లో విజయం కేవలం కఠోర శ్రమ ,దృఢ సంకల్పం వల్లనే
సాధ్యపడుతుందనే విషయం ......అసలు జీవితంలో మరే విజయానికైనా ఇవే ప్రాధమిక అంశాలు
అనే విషయం వాళ్లకు బోధపరచాలంటే మేము కూడా ఏదో పాఠం చెప్పినట్లు చెబితే పిల్లల తలకెక్కుతుందా
? ఎన్నో ఆసక్తి కరమైన ఉదాహరణలతో కదా వివరించాలి కదా. మహారాజు గారి రాణుల మధ్య
తగాదాల వంటి రాజకీయాలు .....తప్ప
సామాన్యుల జీవితాల లోని విలువైన విషయాలను పట్టించుకోని మీడియా ఉన్న ఈ రోజుల్లో
అటువంటి ఉదాహరణల ను వెదకాలంటే మేమెంత కష్టపడాలో మీ బోటి వారికి ఎప్పటికైనా అర్ధం
అవుతుందా సార్ ?
టీ.బీ కి మందు
కనిపెట్టిన నార్మన్ బెతూన్ కోట్లు సంపాదించాగలిగీ స్పానిష్ రిపబ్లిక్ పోరాటానికి ఎందుకు బాసటగా నిలిచాడు ....అక్కడ
నుండి చైనా కమ్యూనిస్ట్ పార్టీ లాంగ్ మార్చ్ కు ఎలా వెళ్ళాడు ....ఒక పెన్సిలిన్
ఇంజక్షన్ లేక ఎలా చనిపోయాడు .....?ఎక్కడో అర్జెంటీనాలో పుట్టి మెడిసిన్ చదివి ....మెక్సికో
మీదుగా క్యూబాకు చేరి అక్కడి విప్లవ విజయంతో సంతృప్తి చెందక మిగిలిన లాటిన్
అమెరికా ను విముక్తం చేయడానికి ప్రాణాలర్పించిన ‘చేగువేరా ‘ గురించిన నిజమైన
వివరాలు చెప్పొద్దా సార్ ? లేదా అందరిలా ఆయన బొమ్మ వేసిన టీ షర్టు వేసుకుని తిరుగుతుంటే
అదేదో ఫాషన్ లే అనుకుంటూ చైతన్యం లేని బ్రతుకు బ్రతకాలా ? అందరి దాకా ఎందుకు నోబెల్
ప్రైజ్ సంపాదించుకోగలిగిన మేధాశక్తి ఉన్న వాడని అందరి చేతా కొనియాడ బడ్డ బాలగోపాల్
గురించి .....అరిగిపోయిన చెప్పులతో ....చిరిగి పోయిన బట్టలతో ఆయన ఎందుకు తిరిగాడో
చెప్పొద్దా ? వీరందరి ఆనందం గురించి అర్ధం చేసుకోలేక పొతే ....అర్ధం అయ్యేలా
చెప్పక పొతే నేను విద్యావంతుడిగా లెక్క వేయబడతానా ? అంతే కాదు ఎలక్షన్ ఎలక్షన్ కి
మధ్య మూడు పార్టీ లు మారిన వాళ్ళు తిరిగి గెలిచి మంత్రులెలా అవుతారన్న విషయం
స్పష్టంగా విశదీకరించక పొతే వాడు రాజకీయంగా చైతన్య వంతుడెలా అవుతాడు ?
మా ఖర్మ కొద్దీ
మీ లాంటి ఉన్నతోద్యోగుల .....వ్యాపార వర్గాల సంస్కృతే మనకు అ(న)ధికార సంస్కృతిగా
మిగిలింది. అలా మిగిలేట్టు చేయడంలో మీడియా చాలా చక్కని సహకారం అందించింది. వాళ్ళని
ఏమని అనగలం ....వాళ్ళదీ వ్యాపారమే కదా ....ఒక పక్క రాజ్యమేలుతున్న కులరక్కసి .....గుడికి
వచ్చి మొక్కులు తీర్చుకొండోహో....మీ పాపాలన్నీ ఫట్ అని నమ్మబలుకుతున్న మత సంస్కృతి .....14
సంవత్సరాలకే ప్రేమించి ....ప్రేమించబడక పోతే మనం హీరోలమే కాదని నమ్మిస్తున్న
సినిమా సంస్కృతి .......వీటన్నిటి నుండీ నా వాళ్ళను రక్షించుకోడానికి నేను పడే
మానసిక శ్రమ మీకు అర్ధం అవుతుందా .....రాత్రి పూట ఏదో సందర్భంలో రూట్స్ ( తెలుగులో
ఏడు తరాలు ) నవల గురించి ...ఎలెక్స్ హేలీ గురించి
నేను నా పిల్లలకు చెప్పే సమయంలో రాత్రి 8.00 గంటలకు కూడా మీ దగ్గర నుండి ఏదో చిన్న
ఆఫీస్ విషయం గురించి ఫోన్ వస్తుంది. నాకున్న వ్యక్తిగత సమయాన్ని కూడా మీరు
దురాక్రమణ చేసేస్తే ఎలా సార్ ?
ట్రైన్ లో ఏసీ
కోచ్ లలో దాని maintenance గురించి మన అసెస్మెంట్ అడిగే ఫారం నింపమని ఇస్తారు .
కానీ అటువంటి దేమీ ఏ డిపార్టుమెంటు లోనూ ఉండదు. ఒక అధికారి తన క్రింద పని చేసే వంద
మందిని నరక యాతనకు గురి చేయగలుగుతున్నాడు. కానీ ఈ వంద మందీ అతడి తల మీద వెంట్రుక
ముక్కను కదప లేరు. ఇదంతా మా ఖర్మ అని సరి పెట్టుకోవడం తప్ప .