26, మే 2013, ఆదివారం

జనజీవన స్రవంతి.....?


కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసాను. ఎదురుగా ఒక యువకుడు. మాంచి హుషారుగా ఉన్నాడు.

" సార్...ప్రసాద్ గారు......"


" అవును నేనే....."మీరెవరన్నట్లు  చూసాను.


"లోపలికి రావచ్చా సార్" 


చొరవగా లోపలికి వచ్చాడు.


"ఆశ్చర్య పోకండి సార్...నన్ను మీ ఫ్రెండ్---- పంపించారు"


వాడెందుకు పంపాడో నాకర్ధం కాలేదు.


"అంతగా అలోచించకండి సార్....మీ గురించి మీ ఫ్రెండ్ కరెక్ట్ గానే చెప్పారు"
అప్పుడే నా గురించి ఒక అంచనాకు  ఎలా వచ్చాడబ్బా అనిపించింది.
మరలా అతడే కొనసాగించాడు.


మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారటగా?"


ఉలిక్కి పడ్డాను


అమ్మాయికి సంబందాలొస్తున్నాయని వాడితో అన్నాను కానీ మా అవసరంగా వాడికి చెప్పిన గుర్తేమీ రాలేదు నాకు. అదే విషయం ఆ యువకుడికి చెప్పాను.


" మీకు ఆ ఉదేశ్యం అయితే లేదు సార్...కానీ నేను చెప్పింది వింటే మాత్రం ఇప్పుడే ఆ ఏర్పాట్లు చెయ్యమంటారు" 


"ఏ యేర్పాట్లు..." నాకంతా పజిల్ గా అనిపించింది...అసలు ఆకలే లేదన్న వాడికి తిండి తినమని బలవంత పెడుతున్నట్లు గా అనిపించింది. అందుకే అడిగాను.


"ఇంతకీ మీరెవరు?"


" భలే అడిగారు సార్..నా గురించి అడిగారంటే ఖచ్చితంగా నేను చెప్పేది వింటారు..అడిగారు కాబట్టి చెబుతున్నాను...మాది యీ టౌన్ లో కల్లా నం.1 ఈవెంట్ మేనేజింగ్ కంపెనీ. నేను దానిలో ఎగ్జిక్యూటివ్  ని" 


" కానీ మా ఇంట్లో ఇప్పుడేమీ ఫంక్షన్..గానీ ఈవెంట్ గానీ లేదే..." 


మీరెందుకొచ్చారన్నట్లు అడిగాను.

"ఉండక పోవచ్చు సార్.....నేను మీకు ఒక విషయం చెబుతాను అప్పుడు మీకు ఎలాంటి సందేహాలూ రావు.ఆకలి బాగా వేస్తుందనుకోండి....మీ అంత మీరే ఇంటికి వెళ్తారు లేదా హోటల్ కోసం వెదుక్కుంటారు. మరి ఇప్పుడు  పెరుగుతున్న మాల్స్ కు వెళ్ళి చూడండి....షాపింగ్ చేసిన తరువాత మిమ్మలని ఆకలున్నా లేకపోయినా లోపలికి వచ్చేలా చేస్తున్నాయా లేదా అక్కడి ఫుడ్ కోర్ట్ లు ....అలాగే మేమూ కూడా .."


"నాకర్దం కాలేదు"  అదే మాట పైకి కూడా అన్నాను.


"అవసరం ఉన్నవాడికి కావలిసింది సప్లై చేయడమన్నది పాత టెక్నిక్ ....కానీ లేని అవసరాన్ని సృష్టిచడమే కొత్త టెక్నిక్. ఉదాహరణకు మీకు మరో రెండు సంవత్సరాలకు కారు కొనే అవసరం పడొచ్చనుకోండి ...మీ చేత ఇప్పుడే అది కొనిపించగలగడమే కొత్త సేల్స్ టెక్నిక్. "


"అది సరే మాకు నీవు చెప్పే టెక్నిక్ లకు సంబందం ఏమిటి?"
"మీ ఫ్రెండ్ ద్వారా మాకు మీ ఇంట్లో రెండు మూడు సంవత్సరాలలో పెళ్ళి చేయవలసిన అమ్మాయి ఉందని తెలిసింది. కాబట్టి మా కంపెనీ ఈవెంట్ మేనేజ్ మెంట్ లొ కొన్ని విన్నూత్న పద్దతులు తో మార్కెట్ లో దూసుకు పోతోంది దాంట్లో కొన్ని మీకు చెబితే ఆ కొత్త దనానికి మీరే ఎప్పుడో చేయవలసిన పెళ్ళి వెంటనే చేయాలనుకుంటారు."


ఎందుకో నాక్కూడా కాస్త ఇంటరెస్టింగ్ గా ఆనిపించించింది. ఆ యువకుడిని చెప్పనిచ్చాను. 


"పెళ్ళి అనేది పెద్ద ఫంక్షన్.... కానీ దాని ముందుగా కొన్ని పిల్ల  ఫంక్షన్ లు కూడా ఉంటాయి. మన తయారీ అంత అక్కడ నుండి ఉండాలి. అవి సక్సెస్ అయితే పెద్ద ఫంక్షన్ సక్సెస్ అవుతుంది. అంతే కదా సార్..అసలు ముందుగానే మనం కొత్తదనంతో అదరగొట్టేస్తే మగ పెళ్ళి వారు మానసికంగా మనకు దాసోహమై పోతారు.ఒక్కసారి మాయా బజార్ సినిమా గుర్తుకు తెచ్చుకోండి. "


బాగానే చెప్పాడనిపించింది.


"అందుకు మనం కొన్ని కొత్త పద్దతులలో వెళ్ళాలి."


" మాంచి డెకొరేషన్ ల మీద....వంటల మీదా మా వాళ్ళు చాలా రకాల ప్రయోగాలు చేసారు...ఇంక కొత్తగా చేయడానికేమీ మిగల లేదనుకుంటా....." నా మనసులో మాట చెప్పాను.


" చూశారా మీరు కూదా మా కంపెనీ ని తక్కువగా అంచనా వేస్తున్నారు...ఎవరి దృష్టీ వెళ్ళని చోట  మేము చొచ్చుకు పోయి వినూత్న పద్దతులు ఆవిష్కరిస్తాం"


గ్రాంధికం కొంత ఎక్కువైందనిపించినప్పటికీ టాపిక్ మధ్యలో అంతరాయమెందుకని కొనసాగనిచ్చాను.


"సాధారణంగా అన్నీ ముందే మాట్లాడుకున్న తరువాత పెళ్ళికూతురింటికి నిశ్చయ తాంబూలాలు యీయడానికి లేదా పుచ్చుకొనదానికి వరుడి తరుపువారు మీ ఇంటికి వస్తారు ..అవునా...."
ThumbnailThumbnailThumbnail
"మామ్మూలే కదా.."

"ఇక్కడే మనం కొంత వెరైటీ చూపిస్తాం. పెళ్ళి కొడుకుతో బాటు అతడి ఫ్రెండ్స్ మరో పది మంది వస్తారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి మన చిన్న స్వయంవరం సీను సృష్టిస్తామన్న మాట. మీ అమ్మాయి కోసం చాలా మంది పోటీ బడితే అందులో కల్లా యోగ్యుడిని అమ్మాయి  వరించినట్లన్న  మాట"


"అదెలా కుదురుతుంది..పాత రోజుల్లో అయితే యేదో ఒక పరీక్ష పెట్టే వారు...గెలిచిన వాడికి అమ్మాయినిచ్చే వారు....."


" చూసారా....పరీక్ష పెట్టే వారని మీరే అనేసారు..గొడవే లేదు..మనం కూడా అదే చేస్తాం"


"వూరుకోవయ్యా బాబూ....అబ్బాయిని ముందుగానే ఖాయ  పరుచుకుంటాం కదా. కొంపదీసి యీ పరీక్షలో ఇంకెవడైనా  ఎక్కువ మార్కులు తెచ్చేసుకుంటే...."


"మా వాడు మరీ ముక్కు సూటిగా పోతాడు....వాడితో నీవు పడ  లేవని మీ ఫ్రెండ్ కరెక్ట్ గానే చెప్పారు సార్.....అంతే కాకుండా మీరు మరీ పాత తరం వారు కూడా సార్....పరీక్ష ఎవరెలా రాసినా మన అల్లుడి గారికే కదా ఫస్ట్ వచ్చేది...అంతా  మాచ్  ఫిక్సింగే కదా....."


"అంతా ఫిక్స్ అయిన తరువాత యీ టెస్ట్ లు పెట్టడం ..ఇవన్నీ యేమి బాగుంటుంది "


మీకెలా చెప్పాలో తెలియడం లేదు. చాలా మాచ్ లు ఫిక్స్ అవుతాయని చూసే వాళ్ళకు తెలియదా.....అయినా చూడ్డం లేదా....ఇప్పుడంతా బాగుందా ..లేదా అనే కాన్సెప్ట్ కాదండీ బాబూ...వెరైటీగా ఉందా .....లేదా....అంతే..."


నిజమే అనిపించింది. మా శ్రీమతి..మిగిలిన ఆడవాళ్ళతో  బజారుకి వెళ్ళినప్పుడు "కొత్త వెరైటీలు యేమొచ్చాయో చూపించండి" అనడం చాలా సార్లు విన్నాను.


" అసలు యే పరీక్ష పెడతాం" అడిగాను.


"ఏముంది సార్.....నీవు ఆఫీస్ నుండి ఆలశ్యంగా వచ్చావని మీ శ్రీమతి  అలిగితే నీ రియాక్షన్ ఎలా ఉంటుంది....రెందు పేజీలలో రాయండి  అని దూరంగా కూర్చో పెట్టి అందరికీ తెల్లకాగితాలిస్తాం"


"ఎలాగూ ఫిక్స్ అయ్యిందే కదా అని మిగిలిన వాళ్ళు ఏదో చెత్తంతా రాస్తారేమో...."


"అలాగేమీ ఉండదు సార్...ప్రతివాడూ చాన్స్ ఇస్తే తన తెలివికి పదును పెట్టాలనే చూస్తాడు. ఉదాహరణకు మిమ్మల్నే అడిగితే  యేమి రాస్తారో చెప్పండి" 


" ఇప్పటి దాకా టార్గెట్స్ పూర్తవలేదని బాస్ తో చీవాట్లు తిని ఇంటికి వస్తే ......నీ వెధవ కోపమొకటా వెళ్ళెహే...." అని కసిరేస్తాను. 


ఆ కుర్రాడు వంటగది వైపు జాలిగా చూసాడు.


"మీరు పెద్దవారై పొయ్యారు కాబట్టి అలా అన్నారు కానీ కుర్రాళ్ళు అలా అనరులెండి"


పాపం సాఫ్ట్ వేర్ కంపెనీ ల లో పని చేసే వారితో   యీ కుర్రాడికి అనుభవం కాలేదనుకున్నాను. 


"ఆ తరువాతేమి చేస్తారు"


"యేముంది సార్.......వాళ్ళు రాసిచ్చిన పేపర్స్ దిద్దిస్తాం.....పెళ్ళికొడుకు ఫస్ట్ వచ్చాడని అనౌన్స్ చేయిస్తాం. ఇక్కడే మాలో ఉన్న వెరైటీ   చూపిస్తాం. పరీక్ష రాసే వాళ్ళందరికీ మంచి మంచి టేబుల్స్  అరేంజ్ చేస్తాం. వాటిమీద అందమైన పూల గుత్తులు....స్వీట్స్....అల్పాహారాలు.....ఇంకా వెరైటీ  కోసం చికెన్ జాయింట్లు.. ...అబ్బో చూసే వారికి నిజమైన స్వయంవరం అన్న ఫీలింగ్ వచ్చేస్తుందన్న మాట.."


"అబ్బో ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పనేనే ..."


" అస్సలు కాదు...మేమెప్పుడూ మా కష్టమర్లను ఇబ్బందులకు గురిచేయం....ఇవన్నీ మీరు ఒరిజినల్ యేమాత్రం కొనక్కరలేదు. అవన్నీ ఒరిజినల్ కంటే బాగుండే ప్లాస్టిక్ వే  మేము సప్లై చేస్తాం..."


"హమ్మయ్య బ్రతికించారు..లేదంటే మా వాడు ఆ చికెన్ జాయింట్ల వైపే కక్కుర్తిగా చూస్తుండిపోతాడు...వధువు తమ్ముడినన్న సంగతి కూడా మరిచి......ఇంతకూ పరీక్ష సంగతేమిటి?"


" మీ బంధువులలో  ఉన్న ఒక అందమైన అమ్మాయి ..అందరి ముందుకూ వస్తుంది....ముద్దుగా ఉన్న చిన్న కుర్రాడు గానీ పాప గానీ ఆమెకు ఒక సీల్డ్ కవర్ ఇస్తారు.ఆవిడ  దానిని సుతారంగా ఓపెన్ చేసి విన్నర్ పేరు ప్రకటిస్తుంది. మిగిలిన వారంతా యీలలు చప్పట్లతో దానికి ఆమోదం చెబుతారన్న మాట."


"మరీ ఆర్టిఫీసియల్ గా అనిపించట్లేదూ...."


"మీరు చాలా మారాలి సార్...జన జీవన స్రవంతి లోకి రావాలి...మీరు మరీ ఆడివిలో  ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు......ఒరిజినల్  అనేది ఇక ఉండదు సార్...అంతా ఆర్టిఫీసియల్లే ఉంటుంది.. దాన్ని ఎంజాయ్  చేయడం అలవాటు చేసుకోండి. లేదంటే సమాజానికి దూరమైపోతారు. మిగిలిన వారంతా మారిపొయ్యారన్న ఉద్దేశ్యంతోనే  కదా పెళ్ళిళ్ళలో కూడా కాడ్బరీ డైరీ  మిల్క్ చాక్లెట్లు తింటున్నట్లు చూపిస్తున్నారు. మీరేమో ఇంకా జిలేబీ...పరమాన్నం అంటూ కూర్చుంటే.....లాభం లేదు సార్.....సరే ఇంతకూ మన వాళ్ళంతా చప్పట్లు కొట్టగానే బయట రంగురంగుల బెలూన్లు గాలిలోకి వదలదం లాంటివి ఉంటాయి...ఎలా ఉంది సార్...."


నా అభిప్రాయం చెప్పేలోగానే అతడు తరువాతి ఘట్టానికి  వెళ్ళిపోయాడు.


" ఇక పెళ్ళి తంతు అందరికీ మరుపురాని అనుభవంగా మలచడంలో  మాకు పెట్టింది పేరు సార్"


నేను మద్యలో  మాట్లాద దలుచుకోలేదు. అంతా విన్న తరువాతే నా అభిప్రాయం చెప్పేయదలుచుకున్నాను.


"సహజంగా మగ పెళ్ళి వారు విడిదింట్లో  దిగడంతో పెళ్ళి తంతు ప్రారంభమైనట్లే....."


అవునన్నట్లుగా తలకాయ వూపాను.


"విడిదింట్లో పానకం మొదలైనవన్నీ మా ప్రత్యేకమైన పర్షియన్ గాజు గ్లాసులతో యెలాగూ వడ్డిస్తామనుకొండి......ఇదంతా మామ్మూలే....అసలు విషయం దీని తరువాతుంది.అబ్బాయి విడిదింటి నుండి పెళ్ళి మండపానికి తరలి వెళ్ళడానికి యేడుగుర్రాలు లాగే రధాన్ని ఏర్పాటు చేస్తామన్న మాట. "


"నిజంగా గుర్రాలు లాగే రధం ఉందా..." మద్యలో అడగక తప్పలేదు.


"కరెక్ట్ గా అడిగారు సార్..నిజంగా గుర్రాలు లాగావు ఒక  కార్ను ఆ విధంగా తయారు చేయించాం.డ్రైవర్ నెమ్మదిగా పోనిస్తుంటాడు...గుర్రాలు జుస్ట్ నడుస్తూ ఉంటాయంతే...."


"ఏడుగుర్రాలెందుకు...రెండు మూడు సరిపోతాయిగా...."


" మరదే చిరాకు ..ప్రతి దానికీ రీజనింగ్ అడుగుతారు....మీ అమ్మాయి బాగా చదివి మంచి ఉద్యోగం చేస్తుందని మీ ఫ్రెండ్ చెప్పాడు ..మరలాంటప్పుడు ఏదో గొప్ప సంబంధమే  తెస్తారుగా...అందుకే మీ కోసం యీ స్పెషల్ ఏర్పాటు....మన దేవుళ్ళను  కూడా సప్తాశ్వ  రధ మారూఢం....అని స్తోత్రం చేయడంలేదూ....అప్పుడు యెందుకు రాదు యీ సందేహం?...ఇంకొకటి వినండి సార్...వరుడి కి అటూ ఇటూ వేరే గుర్రాల మీద కూడా నలుగురు సైనికులు శిరస్త్రాణాలు  వగైరాలు ధరించి గుర్రాల మీదే ఫాలో అవుతుంటారు."


"ఆ....." నోరు వెళ్ళ బెట్టాను


" అంతే కాదు వరుడి చెంతే వింజామరలతో నలుగురు చెలికత్తెలు ఉంటారు"


"అంటే ఐ.పీ.ఎల్. లో  చీర్ గాల్స్ లాగా"


" మొత్తానికి నేను చెప్పేదంతా బాగానే కాచ్ చేస్తున్నారు" 


"మరి గుర్రాలు పాస్ పోయడం లాంటివి చేస్తే పెళ్ళికొడుకు బట్టలు పాడవుతాయేమో. ....రధం పెద్దది గానే ఉంటుందా?


"మీకా సందేహం అక్కరలేదు...అవన్నీ స్పెషల్ గడ్డితో పెంచబడ్డవి...ఎక్కడ పడితే అక్కడ  పాస్ పోయడం....లద్దె వేయడం చేయవు....."


"ఓహో...."


"వరుడు పెళ్ళి మండపం చేరుకోగానే  రధం నుండి దిగడం అంతా...క్లోస్డ్ సర్క్యూట్ టీ వీ లలో చూపిస్తూ ఉంటాం కాబట్టి వరుడు రధం నుండి పెళ్ళి మండపం దగ్గరకు వెళ్ళే వరకూ ఆహూతులందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. అంటే వాళ్ళంత వాళ్ళు కొట్టరు.మా వాళ్ళు  ముందుగా జనం లో కలసి పోయి చప్పట్లు కొట్టడం ప్రారంభిస్తారు. పెద్దగా ఏమీ ఆలోచించకుండా పక్క వాడు చేసినట్లు చేయడం అలవాటు కాబట్టి వచ్చిన వాళ్ళంతా చప్పట్లు కొట్టేస్తారు. చూసారా సార్...వూహించుకుంటుంటే ఎంత అద్భుతంగా ఉందో"


కానీ భోజనాలవ్వగానే చాలామంది వెళ్ళి పోతున్నారు... పెళ్ళి మండపం దగ్గర చప్పగా ఉంటోంది..."


"దానికీ మా దగ్గర విరుగుడు ఉంది. ఆడ వారు భోజనం చేసేటప్పుడు అందరికీ కూపన్లు అందజేస్తాం. పెళ్ళి అయిన తరువాత డ్రా తీసి గెలిచిన వారికి 25000 రూపాయల పట్టు చీర అని ప్రకటిస్తాం. ఇక చూస్కోండి ఎక్స్ట్రా కుర్చీలు వేయించ వలసిందే."


"ఇది కూడా ఫిక్సింగేనా...."


"చాలా తెలివైన వారు సార్ ....చిన్న హింట్ దొరికితే చాలు ప్రొసీడ్ అయిపోతారు  మనమిచ్చే పట్టు చీర కోసం అన్ని పట్టు చీరలు పెళ్ళి మండపం అంతా అటూ ఇటూ తిరుగుతుంటే రంగులతో...రెప రెప లతో హాల్ కళ కళ లాడి పోతుంది సార్..."


"కానీ ఇదంతా రక్తి కట్టాలంటే ఎంత మంది జనం ఉండాలంటావ్?"


" రెండు వేలకు పైనే ఉంటే బాగుంటుంది సార్..."


"నా మొబైల్ లో 200 ఎంట్రీస్  ఉన్నాయి.....అందులో మా సివిల్ ఇంజనీరింగ్ అవసరాల కోసం ఉన్న ఆర్టిజన్లు 20 మంది....ఇలాంటివన్నీ తీసేస్తే నాక్కావాసిన వాళ్ళు మహా ఉంటే 100 మంది కంటే ఎక్కువ ఉండరు. మా శ్రీమతి నేనూ ఒక వూరి  వాళ్ళమే కాబట్టి మా ఇద్దరి బంధువులూ చాలా వరకూ కామన్ గా ఉన్న వాళ్ళే....అలాగే మా అమ్మాయికి కావాల్సిన వాళ్ళు కూడా మరో 100 మంది వరకూ ఉంటారేమో...యీ 2000 మందిని యెలా పట్టుకు రాగలను."


"మీలా అలోచిస్తే మా లాంటి వాళ్ళు బిజినెస్ చేసింట్లే....మీరు మీ ఫ్రెండ్స్ పార్టీలకు వెళ్ళి నప్పుడు పరిచయం ఐన వాళ్ళుంటారు కదా.....అలా ఒక్కొక్క ఫ్రెండ్ ని కదిపితే నేను చెప్పిన సంఖ్యకు అదే చేరుతుంది"


" కానీ చాలా ఖర్చు కూడా అవుతుందే..."


నాకెందుకో చాలా చిరాకుగా అనిపిస్తోంది.


ఇంతలో ఆ యువకుడు మరింత  దగ్గరకు జరిగాడు.


" ఇంట్లో వాళ్ళకు కూడా తెలియనీయకండి సార్....మీరంటే ఉన్న ప్రత్యేకాభిమానం వల్ల ఒక మాంచి అయిడియా చెబుతాను......ఒకే చోట రెండు వేల వోట్లు....వచ్చే సంవత్సరం ఎలక్షన్స్...కాబట్టి ఏదో ఒక రాజకీయ పార్టీ ఫ్లెక్షీలకు పర్మిషన్ ఇద్దాం...మిగిలిన దంతా వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. అందులోనూ కొత్తగా రంగం లోకి వచ్చిన పార్టీ ఒకటి ఎలాగూ ఉంది. వాళ్ళు ఎక్కడ అవాకాశం దొరికినా  ఫ్లెక్సీలు  పెట్టే చాన్స్ వదలడం లేదు.....పైగా వాళ్ళకో చానల్.....పత్రికా ఉన్నాయి....."


మెచ్చుకుంటానేమో అని ఒక్క నిముషం ఆగాడు. అంతకు ముందు వరకూ అరికాలిలో ఉన్న మంట తలకెక్కడం ప్రారంభమయ్యింది. అయినా తమాయించుకుని చెప్పడం మొదలు పెట్టాను.


" విజయా వారి జగదేక వీరుని కధ సినిమా చూసావా...."Thumbnail
Thumbnail
Thumbnail
"చూడలేదు సార్...విన్నాను...ఏదో హీరో నాలుగు లోకాల అమ్మాయిలను పెళ్ళాదతాడని...ఇంకా పాటలు బగుంటాయని..." 

"ఇవన్నీ కరెక్టే గాని యీ సినిమా ప్రారంభంలో రాజు తన కుమారుడి కోర్కెలు అంటే నీవన్న నాలుగు లోకాల రాకుమారీలను పెళ్ళి చేసుకోవలనే కోర్కె విని...ఆహా..నా కొడుకెంత గొప్ప వాడు అని ఆనందించడు....ముందు రాజ్యం విడిచి పొమ్మంటాడు...ఎందుకంటే కాబోయే రాజుకు ప్రజల క్షేమం గురించి అలోచనలుండాలి కానీ అమ్మాయిల గురించి కాదని . ఎందుకో గాని ఆ రోజుల్లో ఆ నీతి నాకు చాలా బాగా నచ్చేది. మరి దానికి పూర్తి వ్యతిరేకంగా తన సంతానం కోసం రాష్ట్రాన్ని మొత్తం ఇష్టం వచ్చినట్లు దోచుకోనిచ్చిన వాడి పేరు నా కుమార్తె పెళ్ళి లోనా....అసలు నీకు నేనెలా కనబడ్డాను. నేనూ విద్యార్ధిగా ఉన్నప్పుడు...ఆ తరువాత ఉద్యోగం లోనూ కూడా నాయకుడిగానే ఎదిగాను. ఎందుకంటే ఆనాడు పోరాటం నా అవసరం...నా అవసరమే ఉన్న వాళ్ళను ప్రోగు చేసి కొన్ని ఉద్యమాలు నడిపాను.అంతే గాని ఫ్లెక్సీలు పెట్టుకుని కాదు. పది సార్లు ...కింది నుండి ...పై కోర్ట్ వరకూ బెయిల్ నిరాకరించాయంటే నేరం చేసిన చాయలున్నాయి కాబట్టే నని అందరికీ తెలుసు ఐనా ఎంగిలి మెతుకుల కోసం కుక్కలు ఎగబడుతూనే ఉంటాయి. అలాంటి వాటిని నా గుమ్మం చాయలకే కాదు కాస్త నీతిగా బ్రతుకుతూ....  అన్నం తినేవాడెవ్వడూ రానివ్వడు. ఇంకేదైనా తినే వాళ్ళ గురించి నేను మాట్లాడను.
నీకు ఇంకొక విషయం కూడా చెబుతాను విను. నీకెదురుగా ఉన్న రేక్ లో ఉన్న పుస్తకాలు చూడు. సగం ఇంజనీరింగ్ ..మిగిలిన సగం వేరే వేరే..సబ్జక్ట్లవి. మొదటివి నా వృత్తికి న్యాయం చేయడానికైతే మిగిలినవి నా జీవితానికి ఒక పరమార్దాన్నిచ్చేవి.  మహా..మహులు రాసినవి.నేను చేసే  యే పనైనా నాకు ఉపయోగపడడం తో బాటు..నా తోటి వారెవ్వరికీ నష్టం కలగకుందా చూసే బాద్యత కూదా నాదే నన్న విధంగా అలోచించే వాళ్ళం. నా వాళ్ళంతా యేమి  తింటున్నామన్న దానికంటే ఎవరితో కలసి తింటున్నాం...ఎక్కడ తింటున్నామన్న  విషయాల గురించి ఆలోచించే వాళ్ళే. కరెక్ట్ గా చెప్పాలంటే ఆలాంటి వాళ్ళే మా వాళ్ళవుతారు..ఎందుకంటే నూటికి నూరు పాళ్ళూ మా అమ్మాయి నా లాంటిదే. మహోన్నత విద్యాలయాల్లో....చాలా కాలం గడిపి కూడా కాస్త కూడా సమాజాన్ని పట్టించుకోకుండా....జడత్వంతో బ్రతుకుతూ... ఒక రోజు రధం ఎక్కో.....గుర్రం ఎక్కో...ఏనుగు ఎక్కో...జయ  ధ్వానా లను విని మురిసి పోయే వాళ్ళను  మా ఇంటి ప్రాంగణం లోకి కూడా రానీయను. వరల్డ్ కప్ టోర్నమెంట్   లో ఎప్పుడో రొనాల్డినో కొట్టిన ఫ్రీ కిక్ నీనిక్కడ వాడక ముందే......."


ఆ యువకుడు ముందే వెళ్ళి పొయ్యాడు పాపం


**********************

నిన్న జరిగిన పెళ్ళిలో ఒక స్నేహితుడు "మీ అమ్మాయి పెళ్ళి  అంతా ఈవెంట్ మేనేజెర్ కి కాంట్రాక్ట్ కి ఇచ్చేద్దాం " అనగానే నా కళ్ళ ముందు కదలాడిన ఊహ