27, ఫిబ్రవరి 2014, గురువారం

...... కళలూ మావే ...... అధికారం మాదే ..... మీకు ఎక్కువ ఛాయిస్ ఉండనీయం ....



"బాసూ ...."
లంచ్ అవర్ లో సరదాగా laptop లో ఏదో సినిమా పాట చూస్తున్న నన్ను కదిపాడు మూర్తి .
"చెప్పు " నాకు తెలుసు ఏదో తలనెప్పి విషయం కనిపెడతాడని .
"ఆ గ్రూప్ డాన్సు లో హీరో పక్కన డాన్సు వేస్తున్న వారిలో ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటావ్ ?"
"నీవడిగేది స్పష్టంగా లేదనుకుంటా "
"అది కాదు బాసూ .... వాళ్ళ లో టాలెంట్ ఉన్నవాళ్ళు ఉండరంటావా .... ?"
"ఉండొచ్చు .... "
"వాళ్ళు చాలా కాలం నుండి అనేకానేక గ్రూప్ డాన్సు లు చేసి ఉండొచ్చు కదా ..... "
"చాలా మంది హీరో ల తో చేసి ఉండొచ్చు కదా .... ?
"అబ్బా ... మూర్తీ చంపుకు తినక ... అసలు విషయం చెప్పమ్మా .... "
"అది కాదు బాసూ ..... మొదట్లో వీళ్ళ లో చాలా మందికి ఎప్పటికైనా ఏదో ఒక మంచి ఛాన్స్ వస్తుందనే ఆశ ఉండే ఉంటుంది కదా ...చాలా ఆశ తో camera లెన్స్ వంక చూస్తూ ఉంటారేమో కదా ?"
"ఉండి ఉంటారు .... "
"నిజాయితీగా కష్టపడి చిన్న చిన్న పాత్రలు ..... దొరికిన వన్నీ చేసి ఉంటారు కదా "
"సందేహం లేదు ... "
"వారిలో కొద్ది మందికైనా మంచి నటన ... రూపం ..... ఉండి ఉండొచ్చు కదా .... ?"
" చాలా మందికి ఉండొచ్చు "
" కొద్ది రోజులకే వాళ్లకు ....పాపం నిజాలన్నీ అర్ధం అయ్యి ఉంటాయి కదా ....?
"అంటే .... ?"
" హీరోలను చేసేవి .... పైవేవీ కాకుండా ఇంకా చాలా ఉంటాయని ..... పైన చెప్పిన లక్షణాలు ఏవీ లేక పోయినా  హీరో లు అయిపోతారని  వాళ్ళు అర్ధం చేసుకున్నాకా ఎలా ఫీలవుతారంటావ్ "
"నిజాలు అర్ధం చేసుకున్న తరువాత నిర్వేదం తో .... నిర్లిప్తతో ...... నిరుత్సాహం తో జీవితం అంతా గడిపేసి ఉండి ఉంటారు. "
"అదేంటి ... గడిపేసి ఉంటారంటావ్ ..... ఇప్పుడెవ్వరూ అలా అనుకోడం లేదా ?
"అలాంటి ఆశలు ఇప్పుడు కూడా పెట్టుకుని సినిమా రంగానికి వస్తే వాడంత వెర్రి వెధవ ఎవడూ ఉండడు ..... కేవలం ఆదాయం చాలని దిగువ మధ్య తరగతి కుర్రాళ్ళు వేరే అదనపు ఆదాయపు వనరు క్రింద ఈ గ్రూప్ డాన్సు ల లాంటి వాటిల్లో పాల్గొనాలి తప్ప భవిష్యత్తులో హీరో అవ్వొచ్చనే భ్రమలతో మాత్రం కాదు .మన తెలుగు సినీ రంగంలో హీరో అవ్వాలంటే ఆ నాలుగైదు కుటుంబాలలో పుట్టాలన్న వాస్తవం  నీకు ఇంకా తెలియక పోవచ్చు కానీ  తెలివైన కుర్రాళ్ళకు మొత్తం  తెలుసు ..... అంతే కాదు ఏదో ఒక దిక్కు మాలిన టీవీ ప్రోగ్రాం లో కనబడితే ఆ తరువాత ..... ఫేం ... అంటూ బేనర్ కట్టుకుని వినాయక చవితి పందిళ్ళ లో నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చు "
"అబ్బ ఏం చెప్పావ్ గురూ ..... పద టీ పోయిస్తాను "
laptop కట్టి బయటకు నడిచాం . 
"అంటే అవకాశాలు అన్నీ ఇలా కొద్దిమందే ఒడిసి పట్టేస్తుంటే కొత్త వారికి అవకాశాలు మాట దేవుడెరుగు ..... కొత్తదనంతో ఉండే సినిమాలు .... మనకెక్కడ దొరుకుతాయి ?"
"నీవెక్కడో ఉంటావు మూర్తీ ..... ఈ ఒక్క రంగమే నీకు కనిపిస్తుందా ..... ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని కుటుంబాలు ..... ఎప్పటి నుండో అధికారాన్ని ఒడిసి పట్టుకుంటుంటే ప్రజలకు ఏమైనా స్పందన ఉందా ... ?"
"అంటే ... ?"
"పద్దతులు మారుతున్నాయంతే మూర్తీ .... ఒకప్పుడు బలవంతుడు తనకు వోటు వేయించుకునే వాడు ..... కానీ ఇప్పుడు ...... తెలివిగా గెలిచే అవకాశాలు ఉండే పార్టీలోకి మారుతున్నారు. ప్రజలు ఇలాంటివి పట్టించుకోవడం లేదని వాళ్లకు ఎప్పుడో అర్ధం అయిపోయింది. ప్రజలు కూడా వీళ్ళ వలన ఒరిగేదీ ఏదీ పెద్దగా ఉండదనే నిర్వేదావస్థ లోకి జారి పోతున్నారు .... 5 సంవత్సరాలకొక సారి వచ్చే పండగ .... కాబట్టి ...పైగా ఆ నాలుగు రోజులు తమను పెద్ద పెద్ద వాళ్ళు పలకరిస్తారు కాబట్టి ... ఒక విధంగా పండగ రోజుల్లాగా .... ఇంకా చెప్పాలంటే ఇంకా బాగా .... చాలా వరకూ అన్నీ ఫ్రీ గా దొరుకుతాయి కాబట్టి .... ఎంజాయ్ చేస్తున్నారు ..... అసలు మన వైజాగ్ నే చూడు ..... గత నాలుగు ఎలక్షన్స్ చూడు .... పార్టీలు మారుతూ ఎంత చిద్విలాసంగా నాయకులు కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ..... అక్కడ చచ్చినట్లు వాళ్ళు తీసిన సినిమాలే చూసినట్లు .... ఇక్కడ కూడా వీళ్ళలోనే ఎవరో ఒకరిని ఎన్నుకుని తీరాలి .....పద ... కంప్లేషణ్ డ్రాయింగ్ లు చెక్ చేయాలి "
"అదేంటి .... అంత సింపుల్ గా విషయాన్ని క్లోజ్ చేసేస్తావ్ ... ముందు ముందు ఈ దేశం ..... "
"నీకు .... గవర్నమెంట్ జాబ్ ఉంది .... నాకూ ఉంది .... కాబట్టి మన వరకూ ఏ ఇబ్బందీ లేదు ..... ఇక 1000 రూపాయలకు కావలిసిన పాటలు లోడ్ చేసిన సెల్ ఫోన్ మార్కెట్లో దొరుకుతోంది ....పైసాకు ఒక మెసేజ్ పంపించు కోవచ్చు .... ఇంజనీరింగ్ కోసం కొన్న laptop లో డేటా కార్డు ఉంటే చాలు ఫేస్ బుక్ లో కొత్త కొత్త ఫోటోస్ upload చేసి మరుసటి రోజునుండీ ఎన్ని లైక్ లు వచ్చాయో లెక్క పెట్టుకుంటూ టైం పాస్ చేసుకోవచ్చు ..... కాక పొతే ఒక్క ఆశ ఉంది మూర్తీ ... ఈ ఫేస్ బుక్ కి ... సోషల్ నెట్ వర్క్ కి బయట ఇంకా చాలా పెద్ద ప్రపంచం ఉంది ..... వీటిలో ఉన్న చెత్తతో ఎంజాయ్ చేయడం ..పాపం ... వాళ్లకు తెలియదు అవసరం......  వాళ్ళను నిజాల దగ్గరకు చేరుస్తుంది ..... అఫ్ కోర్స్ .... దాని కోసం నీవు .... నేను చేయవలసింది చేయడానికి సిద్దంగా ఉందాం ..... "