4, ఫిబ్రవరి 2011, శుక్రవారం

సిటీ బస్సు -కల్చర్


ప్రతి ఊరికి కొన్ని కధలున్నట్లే అన్ని ప్రయాణ మాధ్యమాలలోను కొన్ని కధలు పుడతాయి,పెరుగుతాయి. కొన్ని అక్కడే ఆగిపోతాయి..మరి కొన్ని మాత్రం కొనసాగుతాయి. రాజమండ్రి లాంటి టౌన్ కి పక్కనే ఉన్నా గాని ౧౯౭౮ వరకు మాకు బస్ సౌకర్యం లేదు. మోటార్ సైకిల్ కొనే సామర్ధ్యం అప్పట్లో చాలా మందికి ఉండేది కాదు. పైగా మంచి స్కూటర్ కావాలంటే బుక్ చేసుకుని ఎదురు చూడవలసి వచ్చేది. ఎక్కువగా సైకిల్ మీదే ఆధార పడే వాళ్ళం. సిటీ బస్ ను మా వూరి సెంటర్ లో చూడ గానే మాకెంత ఆనందం కలిగిందంటే అదేదో దేవతల వరం వలన మాకు ప్రాప్తించినట్లుగా ఫీలయ్యాం. ఇదంతా మొదట్లో బాగానే వుండేది.
అసలు కధలన్నీ తరువాతే ప్రారంభం అయ్యాయి. రోజుల్లో ఇప్పుడున్న ట్రాఫిక్ ఉండేది కాదు. బస్ బొమ్మూరు సబ్ స్టేసన్ వదిలితే గాలిలో వచినట్లుగా వచ్చి మా ఊర్లో వాలేది. దానిని అల్లంత దూరంలోనే చూసే రోడ్ నుండి క్రిందకు దిగి పొయ్యే వాళ్ళం. ఇప్పుడున్న డబల్ రోడ్ కూడా కాదు అప్పుడు. రోడ్ కి సరిగా బెర్మ్స్ కూడా ఉండేవి కాదు. సైక్లిస్త్స్ ఇబ్బందులను బస్ డ్రైవర్స్ మాత్రం లెక్క చేసే వారు కాదు. రెండు మూడు సార్లు కింద పడ్డం కూడా జరిగింది. అప్పుడే కావలిసిన సంఘటన జరిగింది. ఒక కోమటాయన సైకిల్ నిండా సామాను కట్టుకుని రాజమండ్రి నుండి తిరిగొస్తున్నాడు. రాత్రి పది గంటల సమయం. చిమ్మ చీకటి.....జెట్ వేగంతోబస్ షావుకారుని రాసుకుంటూ పోయింది. పాపం ఆయన సైకిల్ కంట్రోల్ కాక రోడ్ పక్కన ఉన్నచిన్న చెరువులో పడ్డాడు.బస్ సెంటర్ లో ఆగింది. షావుకారు డ్రైవర్ తో కొంచెం స్పీడ్ తగ్గిస్తే తన సొమ్మేమీ పోదుగా అని అడిగాడు. డ్రైవర్ పొగరుగా తమ బస్ కు ఎక్కువ టాక్స్ కడుతున్నాం కాబట్టి రోడ్ అంతా తమదే అన్నట్లు మాట్లాడాడు. అదే టైం కు అక్కడ నిలబడి ఇదంతా చూస్తూ .. చుట్ట కాల్చుకుంటున్న ఒక పెద్ద మనిషికి సమాధానం తో చిర్రెత్తుకొచ్చింది. డ్రైవర్ ను గట్టిగా నిలదీశాడు. డ్రైవర్ మరీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. అసలే గ్రామస్తుల్లో ఉక్రోషం పేరుకు పోయి ఉందేమో ... పెద్ద మనిషి డ్రైవర్ ను పట్టుకుని రెండు తగల్నిచ్చాడు. డ్రైవర్ వెంటనే బస్ వేసుకుని రాజముండ్రి వెళ్ళిపొయ్యాడు. అప్పట్లో మోటార్ వర్కర్స్ యూనియన్ అంటే అందరికీ హడల్. కానీ ఊరంతా షావుకారికి సపోర్ట్ గా నిలబడింది. మొత్తం జనం అంతా అన్ని విభేదాలు మరిచిపోయి చేతికి దొరికిన ఆయుధంతో ఉపద్రవాన్నైనా ఎదుర్కొనడానికి సెంటర్ లో సిద్దంగా కూర్చున్నారు. నాలుగు బస్ తో యూనియన్ జనం వూరి మొదలు వరకు వచ్చారు కానీ పరిస్థితిని తెలుసుకుని వెనుకకు తిరిగి వెళ్లి పొయ్యారు. కానీ మరుసటి రోజు నుండి బస్ లు బంద్. మా మామయ్య శ్రీ మార్ని సత్యనారాయణ తదితరులు అప్పటి మా ఎమ్మెల్యే శ్రీ వెంకటస్వామి నాయుడు గారి సహకారంతో మా ఊరికి ఆర్టీసి బస్ లు తిరిగేటట్లు చేయగలిగారు. దాంతో యూనియన్ పెద్దలు రాజీకి వచ్చారు. డ్రైవర్ క్షమాపణతో కధ సుఖాన్తమయ్యింది.
ఇదంతా ఎందుకు రాసానంటే నాకు వూహ వచ్చిన తరువాత నేను చూస్తుండగా ఏదో విధంగా ఎవరో ఒకరి ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా జనం అంతా ఏకమయ్యి దానిని ఎదిరించి ఓడించిన మొదటి పోరాటం అది. అది నాకు జీవితానికి సరిపడిన ఇన్స్పిరేసన్ ఇచ్చింది
బస్సుల్లో ఫోజులు కొడుతూ ప్రయాణించిన ఎంతో మంది జీరోలుగా మిగిలిపోతే "ముగ్ద" అనే పదానికి నిర్వచనంగా నిలిచిన ఒకమ్మాయి మా గ్రామం నుండి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న మొదటి అమ్మాయి గా చరిత్రలోకి ఎక్కింది. అమ్మాయి ఎవరో కాదు...శ్రీమతి మాధవి మా మావయ్య కూతురే...