10, మార్చి 2014, సోమవారం

ఎప్పటికైనా...... తాతే ... కుర్రాడు



"అరే .... గోవిందు దుకాణం తెరిచాడే ..... "అనుకుంటూ బండి ఆపాను . 

"రండి సార్ ..... 10 రూపాయలదా ...... 15 రూపాయలదా ... 20 రూపాయలకు మూడా  ..... " గోవిందు మామూలు పాట పాడేసాడు 

"సరే కానీ నిన్నెక్కడకు పోయ్యావ్ ..... పైగా ..... దేవుడికి జుట్టిచ్చి నట్టున్నావ్ " నున్నగా మెరుస్తున్న గోవిందు గుండును చూస్తూ అడిగాను.

"సింహాచలం కొండకెళ్ళాను సార్ .... ఈ సంవత్సరం ఒక్కసారీ యెల్ల లేదు ...సరే 10 రూపాయల బొండాం కొట్టేత్తాను"

గోవిందు కొట్టిచ్చిన బొండాం అందుకున్నాను.

"ఇంత అర్జెంట్ గా కొండ కెందుకెళ్ళావ్ ...... ?"

"మార్చి నెలోచ్చేసింది .... ఒక్క సరైన ఎండ కాయలేదు ..... ఇలా అయితే నా యాపారం మూసుకోవాలిసిందే ...... "

"అమ్మ ..... నీ ..... అంటే నీ వ్యాపారం కోసం ఎండలు కాయించేయమని దేవుడికి అప్లికేషన్ పెట్టావన్న మాట ..... అదే  దారిలో ఇంకా చర్చి ..... మసీదుల క్కూడా వెళ్ళకపోయావా ...ఒక  పనై పోయి ఉండేది "

"సారూ .... మీరు నవ్వుతారని చెప్పలేదు .... నిజంగానే వెళ్లి ...... "

నిజంగానే నవ్వుకున్నాను 

"ఇంతకు ముందేమైనా చర్చి ... మసీదుల కెళ్లావా ?"

"లేదు సారూ ..... ఏదో యాపారం కోసం ..... "

" మరి ... వాళ్ళ పద్దతులు అవీ తెలుసా ?"

"అదేంటి సారూ ..... అంత ఎదవనా .... ఆళ్ళ లో ఉండే ఫ్రెండ్స్ తోనే కదా ఎల్తా ... ఆళ్లు ముందే అన్నీ చెప్పారు .... "

" మొత్తానికి ఎక్కడా వాళ్లకు అపచారం కలక్కుండా చూసుకున్నానంటావ్ ..... "

"అదేంటి సారూ ..... అంత కళ్ళు నెత్తికెక్కటానికి మా నాన్నేమన్నా గవర్నరా .... ముఖ్యమంత్రా ..... ?"

"అమ్మ .... గోవిందూ .... నువ్వూ రాజకీయాల్లోకి వచ్చేయొచ్చు .... చాలా విషయాలు తెలిసి పోతున్నాయ్ ... కానీ ఒక్కటేమిటంటే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న చాలా మంది కంటే నీకు కాస్త మంచి సంస్కారమే ఉంది . "

" సారూ ... మా తాత పోయి ... ఐదారేళ్లు అవుతోంది ..... ఆడు బతికినన్నాళ్ళూ ఏవేవో చెబుతూనే ఉండే వాడు ... ఎప్పుడూ .... అంతా అయిపోయిందిరా ... తలో ముక్కా అయిపోయ్యార్రా ... అని గొణుకుతూనే ఉండేవాడు ... ఆడు చెప్పే మాటలు సగం అర్దమయ్యేవి కావు "

"మీ తాతది ఈ వూరు కాదా ?"

"కాదు సారూ ....విజయనగరం జిల్లా .... ...... మా నాన్న పదేళ్ళప్పుడు అక్కడ పెద్ద పెద్ద గొడవలైనాయట ...... మా తాత ను కూడా పోలీసులు చంపేద్దురంట .... మొత్తానికి తప్పించుకుని ఇక్కడికొచ్చి పడ్డాడట .... అసలు మా తాతకు అలా తప్పించుకుని రావడం ఇష్టం లేదట ... అన్నీ బాగున్నప్పుడు తిరిగొద్దువు లే అంటూ అయినోళ్లంతా పంపేసారట సారూ ....."

"అబ్బో .. నీ వెనకాల కూడా చాలా రాజకీయ చరిత్రుంది .... ఏదైనా ఎలక్షన్ లో పోటీ చేయకపోయ్యావా .....? "

ఎందుకో తెలియదు .... గోవిందు ముఖం కందగడ్డలా మారిపోయింది. 

"సారూ ... మా అయ్య ఆక్సిడెంట్ లో చనిపోయిన తరువాత ఆడే నన్ను పెంచాడు. ఆడెలాటోడో   నాకు తెలుసు సారూ .... ఆళ్లూరిలో ఆడిని దేవుడిలా చూడడం నేను చూసాను సార్ .... జనం చూపించే నిజమైన ప్రేమ అక్కడే చూసాను సార్ ... ఆడేదో నమ్ముకున్నాడు .... బతుకంతా దానికతుక్కు పోయి ఉన్నాడు. నమ్మిన దాని కోసం ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. తన వాళ్ళను చచ్చే వరకూ గుర్తుకు తెచ్చుకుంటూనే ఉన్నాడు. ఈడి లాంటోళ్ళు ఎంతో మంది ఉన్నారనే వాడు. నా లాగే ఆళ్ళ తాలూకోళ్ళు కూడా గంజి తాగినా సుఖంగానే ఉంటారనే వాడు. సారూ .... దయుంచి మా తాత రాజకీయాలతో .... ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలను పోల్చొద్దు. ఆడి తరువాత కూడా ఆడు పని చేసిన పార్టీ ఉంది కానీ వంద ముక్కలైంది ..... ఏ ముక్క ఎక్కడికి పోతుందో తెలీకుండా ఉన్నందువల్ల మేమిలా ఉండిపోయాం ..... కానీ సారూ రోజులన్నీ ఒకేలా ఉండవ్ .... మంచి రోజులు రాకపోవు .... ఫ్రీ గా అదిత్తాం .... ఇదిత్తాం ... అని చెప్పే దొంగ మాటలు మా కొద్దు ... మాకు ఓపిక ఉంది ... మా కష్టానికి దారి చూపెడితే ..... మా బతుకులు మేం బతగ్గలం ....... సారూ నా సోదంతా ఓపిగ్గా విన్నారు.... ఇంకో బొండాం తాగండి .... దీనికి డబ్బులొద్దులెండి .... "
అప్పటికే గోవిందు అంతకు ముందిచ్చిన బొండాం లోని నీళ్ళు కళ్ళ లో నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్త్తున్నాయ్ .....