"ఎవరు నాన్నా పై నున్న వాళ్ళు ...... ఏం చేస్తున్నారు ?" సుపుత్రుడు అడిగాడు
వీడికింత లోక జ్ఞానం తగ్గినందుకు ఒకింత బాధ .... కోపం కలిసిన ఫీలింగ్ వచ్చింది .
"అంత పెద్ద నటులు ... రాజకీయ నాయకుడు ..... పీఠాదిపతులని పట్టుకుని ఎవరాళ్ళు అని అడుగుతావేంట్రా .... ?
"సరేలే కానీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు ?"
"పేపర్ చదవరా వెధవా తాటికాయలంత అక్షరాలతో రాసారు ..... పుట్టిన రోజు వేడుకల గురించి ..... "
"బాగుంది ...... ఈ సారి నా పుట్టిన రోజుకి కూడా పిలుద్దాం "
"ఏడ్చినట్లుంది ..... నీ పుట్టిన రోజుకి .... నా పుట్టిన రోజుకి వచ్చే అంత చిన్న వాళ్ళలా కనబడుతున్నారా వాళ్ళు ..... ఏదో ఆయన పెద్దవాడు కాబట్టి ఇంతమంది పోగుబడ్డారు "
"సరేలే ....ఉత్తి రోజులలో ఈ స్వామీజీలు ఏం చేస్తూ ఉంటారు ?"
"ఒరేయ్ .... వారంతా హిందూ ధర్మ పరిరక్షకులురా ..... "
"అంటే .... ?"
"అంటే .... మన మతానికి సంబందించిన కార్యక్రమాలు నిర్వహించడం ..... మనమతం లోని గొప్పదనం గురించి నీ లాంటి పామరులకి చెప్పడం ..... "
"ఆగాగు ..... అంటే మన వినాయక నిమజ్జనానికి రమ్మంటే కూడా వస్తారా ..... ?"
"ఒరేయోరేయ్ ..... నోరు అదుపులో పెట్టుకో .... వెధవా ..... బూతు పాటలు పెట్టుకుని .... దానికి పిచ్చి గంతులు వేసే మీ కుర్రకుంకల ఊరేగింపు కి ఈ మహానుభావులని రమ్మంటావా .... కళ్ళు పోతాయ్ .... ఆయనేదో రోజూ శివలింగాలకు పూజ చేసే పెద్దాయన పిలిచాడని వచ్చారు కానీ ...... "
"ఊరుకో నాన్నా ..... నేను కావాలంటే సంవత్సరం పాటు రోజూ బీచ్ కెళ్లి ఇసుకతో శివలింగాలు చేసి ప్రతిష్టిస్తాను ..... మరి నా పుట్టిన రోజుకి ఎందుకు రారు ...... ? మన ఇంటికే కాదు ..... సాధారణంగా ఏ పేదవాడి ఇంటికి కూడా వచ్చినట్టుగా నాకు తెలియదు ...... నువ్వన్నావు చూడు ..... బూతు పాటలని ..... ఆ వేదిక మీద ఉన్న వాళ్ళలో కూడా బూతు డైలాగుల తో సినిమాలు తీసిన వాళ్ళున్నారు ..... మరి ..... అంతే కాదు ..... ఈ బూతు పాటల వూరేగింపులని...... బలవంతపు చందా వసూళ్ళ ని వీళ్ళు ఖండించినట్లు కూడా నేనెక్కడా వినలేదు ..... ఒక వేళ నీకు తెలిస్తే నాకు చెప్పు .... సంతోషిస్తాను .... "