21, మే 2014, బుధవారం

గెలిచే పద్దతులు ... బావమరిది దివ్యోపదేశం ...



"అర్జెంట్  గా  మన వూళ్ళో అదేదో.........  ఆటంట ...... ఆ ..గుర్తుకు వచ్చింది ...... స్క్వాష్ ....... అంట ...... దానికి డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ పెట్టేద్దాం బావా ....... "  రాంబాబు ఒగొర్చుకుంటూ వచ్చాడు.

నీకేమైనా మతి పోతోందా ...... ఆ గేమ్ గురించి నీకేమైనా తెలుసా .....?"

"నాకేం తెలీదు బావా ...... కానీ మన ఊళ్ళో ఆ టోర్నమెంట్ పెట్టాల్సిందే ..... "

"కారణం చెప్పకుండా ....... నువ్వు ....... మధ్యాన్నమే లార్జ్ .... వేసేసావా ..... ?"

"ఛా ... ఛా ఇంకా లేదు బావా ...... మన రాజు లేడూ ....... ఆడు అప్పుడెప్పుడో హైదరాబాద్ లో ఉద్యోగం వెలగపెట్టినప్పుడు కొద్దిరోజులు అదేదో క్లబ్ లో ఆడేడంట. "

"అయితే ..... "

"ఆడికింకో  ఆటేదీ  రాదు .... "

"అసలు నీవు దేని గురించి మాట్లాడుతున్నావో అర్ధం కావడం లేదు ....... నీవొక లార్జ్ వేసుకుని రా ..... కరెక్ట్ గా మాటలోస్తాయ్ .... "

"నీవెంత మంచివాడివి బావా .... ఒక్క పదినిమిషాలే ...... "

..... మాట మీద నిలబడ్డాడు . సరిగ్గా 10 నిముషాల్లో నా దగ్గర ఉన్నాడు.

"చెప్పు ..... అసలు ఆ రాజు కి వచ్చిన ఒక్క ఆట కే మనం టోర్నమెంట్ ఎందుకు పెట్టాలి ...... ఏ కబాడీ యో .... వాలీబాలో పెడితే హాయిగా మన స్కూల్ గ్రౌండ్ సరిపోతుంది ..... టీములూ ఎక్కువొస్తాయ్ ...... "

" అదే ఉండ కూడదు ..... మన రాజు ని హీరో ని చెయ్యాలంటే ఇదొక్కటే మార్గం "

"నీకో దణ్ణం రా బాబూ ...... నన్ను నమిలి పడేస్తున్నావ్ ..... "

"ఇప్పుడు కబాడీ ..... వాలీ బాల్     టోర్నమెంట్ పెట్టేవే అనుకో .... దాంట్లో గెలిచినా.....  ఆ గొప్పంతా టీమంతా పంచేసుకుంటది . పైగా మనం గెలుత్తామనే  గారంటీ లేదు ..... కాబట్టి ఈ స్క్వాషో ..... గేసో .... టోర్నమెంట్ పెడితే మన రాజు గాడు గెలవడం ఖాయం .... "

"గెలిస్తే .... ?"

" ఆ దెబ్బతో మన రాజు గాడిని హీరో చేసి ... ఆ తరువాత ... సర్పంచ్ చేయడం ఖాయం ..... "

"ఒకడిని హీరో ని చేయడం ఇలాగా .... ? వాడి చేత ఒక నాలుగేళ్ల పాటు మంచి పనులు చేయించొచ్చు కదా ... "

"నువ్వు చదువుకున్నావ్ కానీ లోకజ్ఞానం అస్సలు లేదు .... బావా ... అందుకే అక్క అలా తిట్టుద్ది ... "

"చిత్తం ..... తమరు గడించిన లోకజ్ఞానాన్ని సెలవివ్వండి ... "

"ఒక్క పది నిముషాలే ....... " మరలా  బయటకు పొయ్యాడు.


 కరక్ట్ గానే ప్రత్యక్ష మయ్యాడు

"ఉప్పుడు ...పనికి మాలినదేమీ అమ్మకూడదనేది ... మన తాతలనాటి నీతి .... మరి అలాంటి పనికి మాలిన వస్తువుని ప్రపంచం అంతా ఇదే టెక్నిక్ తో అమ్మేస్తున్నారా లేదా ?"

"నేనూ ఒక లార్జ్ వెయ్యాలో ఏమిటో ఖర్మ .... " అనుకున్నాను

"  పట్టుమని పది దేశాల్లో కూడా ఆడని క్రికెట్ ప్లేయర్స్ ని ... స్టార్లని చేసి  ..... రంగు నీళ్ళమ్ముకునే వాళ్ళు .... కోక్ కలిపిన  పొట్టు  అమ్ముకునే  వాళ్ళు .... వేల కోట్లు సంపాదించేది ఈ టెక్నిక్ మీదే కదా .... "

"ఊరుకోమ్మా ...... వాళ్ళు బోల్డన్ని టాక్స్ లు కూడా కడతారు ..... "

"ఛా .... ఈ గ్లాసుడు నీళ్ళు రేటెంత బావా? "

"పది పైసలు మించి ఉండదు "

"మరి వీటిని రూపాయికి అమ్మగలిగాననుకో .... నలభై పైసలు టాక్స్ కడితే నాకేమైనా నష్టమా ....  పైగా బావా వీళ్ళ లో ఎవరైనా క్రికెట్ టోర్నమెంట్ లకు తప్ప ... ఈ దేశంలో  ఏదైనా పెద్ద కాలేజీలు ఏమైనా కట్టారా ... హాస్పిటల్స్ కట్టారా ... ?"

"గ్లోబలైజేషన్ లో అలా మనమేమీ ఆపలేమమ్మా ..... "

"చెయ్యాలంటే ఏదైనా చేయొచ్చు బావా .... గవర్నమెంట్ కావాలనుకుంటే ఆళ్ల కుండే పెద్ద డాక్టర్లను టీవీల్లోకి పట్టుకొచ్చి .... ఒరెర్రెదవల్లారా ..... రంగునీళ్ళ కంటే .... మన కొబ్బరి నీళ్ళు ... మజ్జిగ ... పాలు చవక ... శ్రేష్టం అని చెప్పించలేదా .....

నాకు చాలా నవ్వొచ్చింది మా రాంబాబు అమాయకత్వానికి 

"రాజ్యాలే కూలిపోతాయ్ ... " మనసులోనే అనుకున్నాను

" ఆయన్నీ ఒదిలెయ్ బావా ..... ఆ స్క్వాషో మరోటో క్రీస్తు పూర్వం నుండీ ..... ఇక్కడ ఉందనీ .... ముస్లిం దండయాత్రల వల్లా ... బ్రిటిషోడి  వల్లా జనం మరిచి పోయ్యారనీ .... మన "రాజు" దానిని పైకి తేవాలని దేశ దేశాలు తిరిగి ఈ ఆట నేర్చుకోనచ్చారనీ .... పేపర్లో ఎయించేత్తాను ..... టీవీ లో కూడా చెప్పించేత్తాను . నీకేమైనా అనుమానమా ..... నాలుగు రూపాయల కోసం అడ్డంగా ఓడిపోయ్యేవాడిని కూడా ..... అఖండ విజయంతో గెలిచేస్తాడని చెప్పేస్తున్నారు .... "

మా రాంబాబు మూడో రౌండ్ కోసం బయటకు పొయ్యాడు. 






18, మే 2014, ఆదివారం

ఇది మొత్తం చదవండి .... పిల్లల్లో "కరుణ" లను ముందుగా పసిగట్టండి





"గుడ్ మార్నింగ్ సార్ "

సైట్ లో కేంప్ ఆఫీస్ లో "కరుణ " ను చూసి ఆశ్చర్య పొయ్యాను. 

ఇంజనీరింగ్ డిప్లొమా పాసయ్యి auto cad పరిజ్ఞానం తో డ్రాయింగ్స్ గీస్తూ ఉండేది కాంట్రాక్ట్ పద్దతిలో. సందేహాలు వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తూ ఉండేది. ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా ఉండేది. 

" ఇలా వచ్చేవేం ?"

"ఈ కంపెనీ లో జాయిన్ అయ్యాను సార్ ..... "

ఇంత చిన్న అమ్మాయి .... మట్టి .... కాంక్రీట్  ల మధ్య .... 

"సైట్ వర్క్ చేయగలవా .... ?"

"ఫరవాలేదు సార్ .... మా వూరు ఇక్కడికి దగ్గరే .... కొంత ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది .... డిగ్రీ చేయాలనుకుంటున్నాను కదా ...... "

"సరే .... మరి .... డౌట్స్ వస్తే అడుగుతూ ఉండు .... "

నేననుకున్న టైం కంటే త్వరగానే  పిక్-అప్ అయ్యింది. స్వంతంగా లెవెల్స్ తీయడం .... కంప్యూటర్ లో ఫీడ్ చేయడం .... రిజిస్టర్స్ మైంటైన్ చేయడం ..... మార్కింగ్ లు యీయడం అన్నీ చేసేది. 

కానీ ఒక్కటి నాకు నచ్చేది కాదు. అవకాశం దొరికితే చాలు గంటల తరబడి సెల్ ఫోన్ లో మాట్లాడుతూనే ఉండేది. 
అప్పటికీ ఒక రోజు ఆ కంపెనీ అకౌంటెంట్ ను అడిగాను. 

"ఈ అమ్మాయి జీతం సెల్ బిల్ కు సరిపోతుందా .... ?"

"భలే వారు సార్ ..... నెలాఖర్లో కూడా తనకు  బాలన్స్ ఎంతుందో కనుక్కుని తన ఫ్రెండ్స్ కు కూడా ఛార్జ్ చేయించేస్తుంది "

అప్పటికీ ఒక రోజు అడిగాను 

"కరుణా ...... నీవు సెల్ ఫోన్ మీద ఎక్కువగా depend అవుతున్నావేమో ..... "

"లేదు సార్ .... మా ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్ .... మా పిన్ని ..... "

ఇంకా ఏవేవో చెప్పింది ..... 

"నీకు 20 సంవత్సరాల వయసు లేదు ...నిన్ను జీవిత సమస్యల మీద సలహా అడుగుతున్నారా ..... ?"

" నేను బాగా అలవాటు సార్  వాళ్ళందరికీ .... "

నాకు అంతగా ఆ అమ్మాయి మాటల మీద నమ్మకం కుదరలేదు . 

వాళ్ళ కొలీగ్ సుందర్ ని అడిగాను 

"అదేమీ లేదు సార్ ..... ఆ అమ్మాయి సమస్యలు వేరు ...... వాటి కోసం చుట్టూ ఉన్న వారెవ్వరితోనూ డిస్కస్ చేయదు . ఎవెరెవరి తోనో  సెల్ ఫోన్ ఉంది కదా అని తెగ మాట్లాడుతూ ఉంటుంది ."

ఇది నేను ట్రైన్ లో రోజూ చూస్తున్న విషయమే కాబట్టి ఆశ్చర్యం కలిగించ లేదు .  
"మన చుట్టూ ఉన్న వారితో relations మైంటైన్ చేయకుండా ఉండేందుకు ...... మన చుట్టూ జరుగుతున్న  విషయాలను పట్టించుకోకుండా ఉండేందుకు ..... కేవలం మనకు .... మన భావాలకు అనుకూలంగా ఉండే వారితో మాత్రమే  రిలేషన్స్  మైంటైన్  చేసేందుకు ఈ సెల్ ఫోన్స్ చక్కగా సహకరిస్తున్నాయ్.... ఎప్పుడో దెబ్బ తగిలిన తరువాతే వీళ్ళకు తెలుస్తుంది "

మనసులోనే అనుకున్నాను.  

కొద్ది రోజులకే ఆ దెబ్బ తగిలింది. 

ఒక సోమ వారం ఉదయాన్నే సుందర్ దగ్గర నుండి ఫోన్ . 

" సార్ .... కరుణ చనిపోయింది ..... మిమ్మల్ని పికప్ చేసుకోడానికి వెహికిల్ వస్తోంది ... తయారవ్వండి సార్ .... పల్లెటూరు ....... శవాన్ని ఎక్కువ సేపు ఉంచరు "

గుడ్ మార్నింగ్ సార్ ..... అంటూ ఎదురు రావలసిన అమ్మాయి  శవంగా మారిపోయిందన్న వాస్తవాన్ని జీర్ణించు కోడానికి మనసు చాలా సేపు ఒప్పుకోలేదు. 

జీప్ దిగాం ....  నాకు పరిచయం ఉన్న ఆ అమ్మాయి క్లాస్ మేట్స్ దగ్గరకు వచ్చారు. 

"సార్ .... బాడీని తీసుకు పోయారు ..... మేము చాలా రిక్వెస్ట్ చేసాం .... కానీ పల్లెటూరు .... మా మాట ఎవరూ వినలేదు ."
  అమాయకంగా ఉండే ఆ అమ్మాయి కడసారి కూడా చూడ లేక పోయినందుకు .... ఎందుకో కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నా ముఖాన్ని చూసిన క్లాస్ మేట్స్ అంతా ఒకేసారి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. 

ఎవరో పెద్ద మనిషి మా దగ్గరికి వచ్చాడు. 

"సార్ ...ప్రసాద్ గారంటే ..... "

"నేనే చెప్పండి .... " 

" నమస్తే సార్ ..... నేను కరుణ బాబాయిని ..... మీ గురించి కరుణ చాలా సార్లు చెబుతూ ఉండేది."

" అవునూ.....  కరుణ ...ఇంత సడన్ గా ....... "

" నిన్న సాయంత్రం .... కడుపునెప్పి అని మీద గదిలోకి వెళ్లి పడుకుంది ..... మరి నిద్రలో ఏమయ్యిందో ...... "

అతడి మాటలు అబద్దం అని కాస్త బుర్ర ఉన్న వాళ్ళకెవరికైనా అర్ధం అవుతుంది.

కొంచెం గుచ్చి గుచ్చి అడిగాను. 

దగ్గరికొచ్చి నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు. 

"మీతో అబద్దం చెప్ప బుద్దేయడం లేదు సార్ .... చిన్న విషయం మీద ఆత్మహత్య చేసుకుంది సార్.  ఈ అమ్మాయికి వరసకి ఇద్దరు బావలు. ఒకరితో మాకు గొడవులున్నాయ్ .... పైగా ఆ అబ్బాయికి ఇంకా జాబ్ కూడా రాలేదు. మేం సెటిల్ చేసిన బావ కు మాకూ మంచి సంబందాలున్నాయ్ ....పైగా కుర్రాడికి మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది .....  ఇవ్వాళ నిశ్చితార్ధం జరగాలి ..... ఇదిగో ఇలా చేసింది ..... "

ఆయన కూడా భోరుమని ఏడ్చేశాడు

సుందర్ ని పిలిచాను ..... 

"నిన్న కరుణ ఫోన్ చేసిందా .... ?"

అప్పటికే అతడి కళ్ళు ఉబ్బి ఉన్నాయ్. 

"నిన్న సెల్ ఇంట్లో వదిలి సైట్ కు వచ్చేసాను సార్ ..... ఇంట్లో మా మిసెస్ చర్చి కి వెళ్ళింది ..... ఆ తరువాత వాళ్ళ రెలిటివ్స్  ఇంటికి వెళ్ళింది ..... నేను కూడా ఈ రోజు ఉదయమే చూసాను ... 20 వరకూ మిస్సిడ్ కాల్స్ ఉన్నాయ్. "

"సార్  నాకు నిన్న ఉదయమే ఒక సారి చేసింది ..... మామూలుగా ఉండే మాటలే ..... ఆ తరువాత ఇంకొక సారి చేసింది ..... బిజీ గా ఉండి ఎత్తలేదు .... మరలా చేస్తే ..... బిజీగా ఉన్నప్పుడు .... డిస్టర్బ్ చేయొద్దు ...అని సీరియస్ గా చెప్పేసాను .... " చాలా క్లోజ్ గా ఉండే క్లాస్ మేట్  ఒకరు చెప్పారు

నిజమే కరుణ ప్రతి సమస్యకూ పరిష్కారం .... సెల్ ఫోన్ లో నుండే వెదుక్కుంది. సెల్ ఫోన్  లో సమస్య కు పరిష్కారం దొరకక పొయ్యేసరికి ..... తన మార్గం తను వెదుక్కుంది. ఎందుకంటే తన సామాజిక జీవితం అంతా ఆ చిన్న సాధనం చుట్టూ అల్లుకుపోయింది. 




13, మే 2014, మంగళవారం

వూడుతున్న రాబందుల రెక్కలు .....

                        


                                ఒక విద్యార్ధి ...... పరీక్షల ముందు రోజు వరకూ face book లో updates చూసుకుంటూ ..... చాటింగ్ చేసుకుంటూ .... ear phones పెట్టుకుని సంగీత జలధి లో స్నానం చేస్తూ ...... కూడా రాయబోతున్న ఎగ్జామ్ లో తనదే అన్న ధీమాతో ఉంటాడు . ఆ ధీమా ఎవరి వలన వచ్చింది ... ?

                              ఒక ఆటోవాలా ఏ మాత్రం ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ...... ఇష్టం వచ్చిన స్పీడ్ లో డ్రైవ్ చేస్తూ .... ఫుల్ వాల్యూం లో పాటలు పెట్టి శబ్దం కాలుష్యం కూడా పెంచేస్తూ ..... ఒక ముసలి స్కూటరిస్ట్ ను గుద్దినంత పని చేసి ..... పైగా "నీవేం చేసుకుంటావో చేసుకో బే "అంటాడు .... వయసు కి కూడా మర్యాద లేకుండా ..... ఆ ధీమా ఎవరి వలన వచ్చింది ... ?


                               ఒక కాంట్రాక్టర్ ..... ఎస్టిమేట్ చేసిన రేట్ కంటే తక్కువ రేట్ కోట్ చేస్తాడు.  సిమెంట్ తగ్గించినా తనను ఎవరూ ఏమీ చేయలేరు సరి కదా ..... పరుగులు పెడుతూ బిల్స్ కూడా చేస్తారనే ధీమా . ఆ ధీమా ఎవరి వలన వచ్చింది ... ? ఆ కలలకు ప్రేరణ ఎవరు ? 


                                   అంతే కాదు రాత్రికి రాత్రే పెరిగిపోయిన కుహనా రియల్ ఎస్టేట్ వారు .... ఖనిజాలు కొల్లగొట్టే ఘనులు ..... దొంగ నోట్లు మార్చే వాళ్ళు .... ముద్రించే వాళ్ళు ..... ప్రభుత్వ భూములు ఆక్రమించుకునే వారు ..... 


                                    అందరికీ అదే కల ....ధీమా ... మేమే కాబోయే పరిపాలకులమని ...... ...... 


                          నా చుట్టూ కూర్చుంటున్న కాంట్రాక్టర్లంతా " నిజాయితీ పరులెవ్వరు సార్ ...... అంతా మోసమే ఉంటుంది సార్ .... కాబట్టి మా వాళ్ళదే రాజ్యం ..... "  అంటున్నప్పుడు కళ్ళ ముందు కదలాడిన భయానక దృశ్యం . ముందు ముందు తరాలు మొత్తం జనాభా అంతా  ఒకళ్ళనొకళ్ళు స్వచ్చత కరువై ..... ఎదుటి వాడు మోసం చేస్తున్నాడేమో అన్న అనుమానంతో ప్రవర్తిస్తూ ..... సహజత్వానికి దూరమైన బ్రతుకు ఈడుస్తూ బ్రతకాలా ..... 

                                 నిన్న మొన్నటి వరకూ ఇదే ఆలోచనతో నిద్ర కరువైన రాత్రులెన్నో ...... కానీ ఇప్పుడు నమ్మకం కుదురుతోంది ....పాముల్ని మట్టబెట్టేందుకు చీమలన్నీ దండుగా కదులుతున్నాయ్. 16 వ తారీఖు గురించి ఆశగా ఎదురు చూస్తున్నాను. అందమైన భవనాలు సృష్టించగల నా architectural పరిజ్ఞానాన్ని ఈ పాములకి గోరీ కట్టడానికి కూడా వాడతాను. కానీ పరమ భీభత్సంగా ..... ఉండేలా డిజైన్ చెయ్యాలి .....  చూసిన వారు .... కలలో కూడా ప్రజల భూములని ..... పంచ భూతాలని తాకాలంటేనే భయంతో స్పృహ తప్పాలి.

                            ప్రజలు చూపించిన ..... చూపించబోతున్న ...చైతన్యానికి నా శతకోటి వందనాలు. ఒక 1000 నోటుకి .... ఒక మందు సీసాకి లొంగి పోయే వెర్రి వాజమ్మలుగా జనాన్ని అంచనా వేసిన రాబందుల శవాల మీద నాట్యం చేయడానికి చేయీ చేయీ కలపండి .



                            

7, మే 2014, బుధవారం

లౌకిక వాదమా ..... మీదా .... సిగ్గు ...సిగ్గు ....

మన రాష్ట్రంలో సీ. పీ. ఎం .  వారి లౌకిక వాద భావనలు చాలా ఆశ్చర్యజనకంగా ఉంటాయ్. ఆంధ్రప్రదేశ్ లో పూర్తి లౌకికవాద లక్షణాలున్న పార్టీగా వారికి ఒక పార్టీని సూచిస్తున్నారు. వారి అభ్యర్ధులు లేని చోట ఆ పార్టీ కే వోటేయ్యమని  సదరు లౌకికవాద పార్టీ కోరకుండానే వీరు తమ కార్యకర్తలకు సందేశాలందించారు. (కనీసం తటస్థంగా ఉండమని కోరి ఉండొచ్చు ). కానీ వార్తల్లోకి తొంగి చూస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రార్ధనామందిరాలలో ఏ పార్టీ కోసం డబ్బు పంపిణీ జరిగిందో ఎవరికైనా అవగతమైపోతుంది (ఒక్క సీ. పీ. ఎం . నాయకులకు తప్ప ). బహుశా ఇంత బహిరంగంగా ఇంతకు ముందు మరే ప్రార్ధనా మందిరాలలో ఇలాంటి ప్రయత్నాలు జరిగి ఉండవని నా నమ్మకం.

దేశ పరిస్థితి అత్యంత విషమంగా మారి ..... యువత మొత్తం సరైన దిశా నిర్దేశం లేకుండా .... భవిష్యత్తంతా అగమ్యగోచరంగా మారిన నేటి పరిస్థితులలో  ఒక బలమైన ప్రత్యామ్నాయంగా  మొత్తం Leftist పార్టీ లను ఏకం చేసి ఎలక్షన్ లో పోటీ చేసే ఒకే ఒక్క Left party  ని తయారు చేయవలసిన ఆవశ్యకత ఉన్న ఈ పరిస్థితులలో .... కార్యకర్తలను అత్యంత అవినీతి మూలాలతో పుట్టిన పార్టీ వైపు చూసేలా చేసిన CPI (M ) నాయకత్వం యొక్క ఈ తప్పుడు నిర్ణయం ..... కొత్తగా ఏర్పడబోతున్న సీమాంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసిన గొప్ప ద్రోహం తప్ప వేరేమీ కాదు.


8. 00 గంటలకల్లా వెళ్ళి పోలింగ్ బూత్ లైన్ లో నిలబడ్డాను . నా వెనుకగా ఇద్దరు శ్రామిక వర్గానికి చెందిన వారుగా నిలబడి ఉన్నారు. నెమ్మదిగా వాళ్ళు చర్చించుకుంటున్నారు. 

"సరిగా చూసుకునెయ్యకపోతే కొంప కొల్లెరైపోద్ది. ఆ.....   పార్టీవోళ్ళు గెలిచేసినారంటే వచ్చీ ఎలక్షన్ లో ఆళ్ళు గెలిచీమని చూపించుకోడం కోసం ..... పదరా నంజికొడకా అని జుట్టట్టుగ్గుంజి మరీ లాక్కొచ్చి నీ చేత వోటేయిస్తారు ..... చూసుకో మరి ..... "

ఎంత కరెక్ట్ గా చెప్పాడో అనిపించింది.