18, నవంబర్ 2011, శుక్రవారం

నిజమైన ఆనందమంటే.....





నవంబర్ నెలలో  యేదైనా  చెట్టుకింద   కూర్చుని   పని  చేసుకునే  అవకాశం   కలగడం  ఒక  అదృష్టంగానే   భావిస్తాను నేను. వాతావరణ మార్పుల పుణ్యమా  అని నాలుగు నెలల వేసవి కాస్తా ఆరేడు నెలల వేసవి గా మారి పోయింది.  మధ్యలో  వర్షాకాలం వెళ్ళగానే కాసే నీరెండలో ప్రకృతిని ఆస్వాదిస్తూ పవర్ కనెక్షన్ బయట వరకూ తెచ్చుకుని పని చేస్తుంటే  పని చేస్తున్నామన్న భావనే ఉండదు. మా  అలమండ స్టేషన్  కు ఆనుకుని ఉన్న టేక్ ప్లాంటేషన్  లో లెవెల్స్ తీయవలసి ఉన్నదని నిన్ననే చెప్పాను. తీరా  చూస్తే టేక్ చెట్ల మద్య దట్టంగా చిన్న చిన్న పొదలు పెరిగి పోయి ఉన్నాయి.
“వాటిని తొలగించందే ఆ లెవెల్స్ తీయడం సాద్యం కాదు..ఏదో యేర్పాటు చేయండి”సైట్ ఇంజనీర్  కు చెప్పాను.
“అదెంత పని సార్…మా జంగ్లీ గాళ్ళు ఉన్నారు కదా…..”
వాళ్ళెవరన్నట్లు చూసాను.
వచ్చిన కుర్రాళ్ళను చూడగానే నవ్వు వచ్చింది. వాళ్ళు ట్రక్స్ మీద క్లీనర్స్ గా పని చేస్తుంటారు. ఒరిస్సా  నుండి వచ్చారు. మొదట నుండీ వాళ్ళను చూస్తుంటే తెలియని ముచ్చట వేస్తుండేది. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. ముందు  అన్నయ్య పనిలో చేరాడు. కొద్ది  రోజులకు తమ్ముడు చేరాడు. ఛిన్న వాడు వచ్చిన రోజు వెంటనే పనిలోకి దిగలేదు. రెండు మూడు సార్లు ఆ రోజు వాళ్ళ కేంప్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు కేంప్ ముందు కూర్చుని బిక్కు బిక్కు మంటూ చూస్తున్న వాడిని చూసి జాలి కూడా వేసింది. మద్యలో  వాళ్ళన్నయ్య క్లీనర్  గా పని చేస్తున్న ట్రక్ దూరంగా కనబడినప్పుడు వాడి కళ్ళు అటువైపే ఆత్రుతగా చూడడం గమనించాను. నెమ్మదిగా  చిన్న వాడు అలవాటు పడి పొయ్యాడు.
నాకెందుకో  వాళ్ళిద్దరినీ చూస్తున్నప్పుడు “ది గాడ్స్ మస్ట్ బి క్రేజీ” సినిమా గుర్తుకు వచ్చేది  మొదట్లో.
వాళ్ళిద్దరూ కొడవళ్ళు తీసుకున్నారు.
“ వాళ్ళు లారీ  క్లీనర్స్ …యీ పని చేయగలుగుతారా….” మనసులో  సందేహాన్ని బయటకు వెళ్ళగక్కేసాను.
“భలే వారు సార్…వాళ్ళ వూర్లో వాళ్ళు చేసే అసలు పని ఇదే సార్…వాళ్ళు గొర్రెలు మేపుకుంటానికి రోజూ తుప్పలు నరుకుతానే ఉంటారు.” మా సైట్ ఇంజనీర్  సుందర్ సామాధానం.
నేను  అలాగే చూస్తున్నాను.
వాళ్ళ చేతుల్లో కొడవళ్ళు నాట్యం  చేస్తున్నట్లుగా  అనిపించింది. ఆతి లాఘవంగా వేటు వేస్తుంటే నిముషాల మీద పొదలు ఖాళీ అవడం ప్రారంభమైంది.
మద్యలో  ఉన్న చింత చెట్లు చూడ గానే ప్రతి రోజూ  చింతకాయల కోసం రైతు బజారుకు తీసుకు వెళ్ళమంటున్న శ్రీమతి  గుర్తుకు వచ్చింది.
“  యీ పని పూర్తి కాగానే మన వాళ్ళతో కొద్దిగా చింత కాయలు కోయించ  గలరా?”
“అదెంత పని సార్..ఒరేయ్…….” మా సుందర్ వాళ్ళకు అదేశాలివ్వడం.….వాళ్ళు ఒక డొంకినీ (కర్రకు కట్టిన కొడవలి)తో చింతకాయలు రాల్చడం …నిముషాల మీద జరిగి పోయింది. రాలిన  చింత కాయలు యేరడం  మొదలు పెట్టే సరికి వీళ్ళకు పోటీగా ఒక ఇరవై మేకలు వచ్చి విందారగించడం మొదలు పెట్టాయి.వాటిని చూసి అన్నదమ్ములిద్దరూ మరలా పైకి పాకడమే కాకుండా పక్కనే ఉన్న వేప చిగుళ్ళు కూడా విరిచి వాటి విందుని సమాప్తి చేసారు. ఇదంతా  సమీపంలో చెట్టు నీడ లో కూర్చుని పని చేసుకుంటున్న  నాకు కనబడుతూనే ఉంది. మనసంతా  యెదో తెలియని ఆహ్లాదానికి..ఆనందానికి లోనయ్యింది. నాది  అసలైన ఆనందమో లేక టీవీల్లో కొన్ని కొన్ని.. అంటే  యేదో వైకుంఠ పాళీ మోడల్ లో ఆడుతున్న ఆటల్లో నిచ్చెన  తగిలినప్పుడు ఆ ఆడే వాళ్ళు వింత వింత కూతలతో ప్రకటించేది నిజమైన ఆనందమో నాకు అర్దం కాకుండా ఉంది. యెందుకంటే నాకు నా ఆనందం వలన నా నోట్లో నుండి యే వింత వింత ధ్వనులూ రాలేదు కాబట్టి నాది నిజమైన ఆనందం కాదేమోనని అనుమానంగా ఉంది. పాఠక మహాశయులే  నాకు సందేహ నివృత్తి చేయగలరని ఆశిస్తాను.
“అసలు ఇలాంటి పనికిమాలిన ఆనందాల వల్లేనమ్మా….యెక్కడికో వెళ్ళ వలసిన మీ ఆయన ఇలా జూనియర్ ఇంజనీర్  గా ఉండిపోయాడు…ఫరవాలేదులే యెంతో కొంత నయమే….పొద్దున్నే చద్దన్నం తినేసి  పుస్తకం పట్టుకుని యే చెట్టు కిందకో చేరి  పోయి …పక్షుల తోను..పశువుల తోనూ మాట్లాడుకుంటూ గడిపేస్తాడేమో నను కునే వాడిని…”
ఒకప్పటి నా బెంచ్ మేట్..ప్రస్తుతం రైల్వేలోనే  ఉన్నతాధికారి అయిన  సుబ్రమణ్యం  నా గురించి నా శ్రీమతితో  అన్న మాటలు  నన్ను పొగిడినట్లుగానే అనిపిస్తాయి నాకు.
ఫక్కనే ఉన్న చిత్రాలను ఒక్క సారి చూడండి. ఆ  అమాయక గిరిజన

 
బాలుడిని చూడండి. ప్రకృతి సౌందర్యానికి దర్పణం పట్టే ఆ కొండల పేర్పుని చూడండి. ఒరిస్సా  లోని ఒక ప్రాంతపు అందం ఇది. ఆ ప్రాంతపు పార్లమెంట్ మెంబర్  నాకు స్నేహితులు కావడం నా అదృష్టం.  యెందుకంటే ఆ ప్రాంతాన్ని నాకు పరిచయం చేసింది ఆయనే. నిజాయితీ  ఆయననింకా వీడ  లేదు కాబట్టి ఆ ప్రంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేద్దామని ఆయన ఆకాంక్ష. కానీ  ఆ తరువాత ఆ అమాయక బాలుడి  ముఖం వంటిది ఆ ప్రాంతం నుండి దూరం చేస్తామేమోనని నేను ఆయన ప్రయత్నాన్ని నిరుత్సాహ పరుస్తూనే వస్తున్నాను. రాబందుల  కళ్ళు ఆ ప్రాంతం మీద ఇంకా పడ లేదు. పడిన తరువాత నా శక్తి యే మూలకూ చాలదని నాకు తెలుసు.