23, జులై 2017, ఆదివారం



డ్రగ్స్ పట్టుబడిన తరువాత సినిమా రంగం లో దిగజారిన విలువలు బయట పడడం చాలా సంతోషం కలిగించే విషయమే . అయితే ఈ దిగజారడం అనేది ఎక్కడ ప్రారంభం అయ్యిందనే విషయం మీద కాస్త దృష్టి సారిస్తే సమస్య మూలాల లోనికి వెళ్లినట్లుంటుంది

కళారంగం మీద కమ్యూనిస్ట్ ల పట్టు 1960 ల ప్రారంభం వరకూ తిరుగులేనిదనే చెప్పొచ్చు . కేవలం వామ పక్ష భావజాల వ్యాప్తి కోసమే చాలా మంది కళాకారులు సినిమా రంగం వైపు ఆకర్షితులయ్యారనడం లో అనుమానం ఏమీ అవసరం లేదు . కానీ పార్టీ విడిపోయి దాయాదుల మధ్య శతృత్వం పెరిగిన తరువాత ...ముఖ్యంగా తమ సిద్దాంతమే సరైనదని ఎదుటి వారికి నిరూపించడం కోసం అన్ని విలువలకూ నీళ్ళు వదలడం ప్రారంభం అయిన తరువాత ....అదే వాతావరణం సినిమా రంగం వైపు మరలిన కళాకారులలోనూ ప్రతిఫలించింది . ఒక విచిత్రం ఏమిటంటే తన " పాకుడురాళ్లు " నవలతో పేరు తెచ్చుకుని జ్ఞానపీట్ అవార్డ్ కూడా పొందిన రావూరిభరధ్వాజ్ గారు కూడా తన నవలలో సినిమా రంగంలో దిగజారిన విలువలకు గల రాజకీయ నేపధ్యాన్ని ఎక్కడా ప్రస్తావించక పోవడానికి గల కారణం నాకు ఈనాటికీ బోధపడదు .

పార్టీ విడిపోయిన కొద్ది కాలానికే ఇందిరా గాంధీ అధికారం చేపట్టడం , ఆమె చేపట్టిన సంస్కరణలు ఒక పెద్ద పార్టీ ముక్క ఆమెకు తోకగా మారేలా చేసాయ్. ఇంచుమించు 1970 ల ఆఖరు వరకూ ఒక పెద్ద నిస్తేజం .... ఆ సమయంలో తెలుగు సినిమా రంగపు చెత్తబుట్ట పూర్తిగా నిండిందని చెప్పొచ్చు . ఆ సమయంలో మాదాల రంగారావు గారు కేవలం నినాదాలతో నిండిన సినిమాలు తీసినా ...మార్పు కోసం చేసిన ప్రయత్నం మెచ్చుకోతగిందే ..కానీ "అన్నీ వేదాల్లో ఉన్నాయిష " అన్నట్లు అన్నిటికీ ఎర్ర జెండా ప్రత్యామ్నాయం అని మనం చెప్పడం ముఖ్యం కాదుగా ప్రజలు నమ్మే వాతావరణం కదా కావలిసింది ...ఎర్రజెండా అనే ప్రత్యామ్నాయాన్ని వెదుక్కుంటూ వచ్చిన వారికి ఏ ముక్క వైపుకు వెళ్ళాలన్న సందేహం మనసుని పట్టి పీడుస్తూనే ఉంటుంది ....సాంస్కృతిక రంగంలోనూ పాలకవర్గ భావజాలానికి ప్రత్యామ్నాయం లేకుండా పోయింది . తెలుగు నేల మీద చలన చిత్ర రంగం అభివృద్ధి చేసే పేరు మీద ఎకరాల ఎకరాల భూములు కేటాయింపు చేయించుకున్న అగ్రనటులు , అగ్ర నిర్మాతలు , పత్రికాధిపతులు వెదజల్లిన సాంస్కృతిక కాలుష్యం మరే ప్రాంతం లోనూ లేనిది 

....దిగజారిన విలువలకు ఒక ఉదాహరణగా ఒక సినిమా లో ఒక సన్నివేశం గురించి చెబుతాను ....అత్తగారు వరసయ్యే స్త్రీ ని చూసినప్పుడు తన లోని కాముక ప్రవృత్తి తలెత్తిన సీన్ లో ఇప్పటికి కూడా ప్రముఖ హీరో గా వెలుగొందుతున్న ఒక హీరో నిర్లజ్జగా నటించడం జరిగింది ...ఇది ఒక ఉదాహరణ మాత్రమే ....
ఇప్పటి పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మొత్తం మీద విలువలంటే తెలియని ...విలువులే లేని ఒక పెద్ద లంపెన్ గ్రూప్ చేతిలో తెలుగు సినిమా రంగం అంటే మొత్తంగా తెలుగు కళా రంగం ఇరుక్కుని విలవిలలాడుతోంది . రాజకీయ రంగానికి కూడా విలువలు లేని సమాజమే కావాలి కాబట్టి వీళ్ళకు అడ్డనేది లేకుండా పోయింది .
ఒక మంచి సినిమా వచ్చినప్పుడు దానిని ఆకాశానికెత్తవలసిన బాధ్యత తలెత్తుకోవలసిన జనం PM మీదో ...CM మీదో ఒక కామెంట్ రాసేసి ...చేతులు దులుపుకుంటున్నారు. అదే అభ్యదయం ....లేదా అదే మార్క్సిజం అని fb లో అనుకుంటున్నారు కూడా .....

8, నవంబర్ 2015, ఆదివారం

ఆధిపత్య సంస్కృతికి ఆధిపత్య సంస్కృతే ప్రత్యామ్నాయమా ....?

                         25 సంవత్సరాల క్రితం “శివ “ సినిమా రిలీజ్ అయ్యింది. కలెక్షన్స్ లో ఆ రోజుల్లో చరిత్ర కూడా సృష్టించింది. అలా అని అదేదో గొప్ప చిత్రం అయితే కాదు. అప్పటి వరకూ వచ్చిన ఫార్ములా చిత్రాలకు కాస్త భిన్నంగా టేకింగ్ ఉంటుంది ..అంతే. అప్పటి వరకూ వచ్చిన సినిమాలలో విలన్ ని ఏడు తరాల ముందు వరకూ తిట్టి ఆ తరువాత తనేం చేయబోతున్నాడో కూడా ఉపన్యాసం ఇచ్చి గాని హీరో ఫైట్ మొదలు పెట్టడు. ఈ సినిమాలో ఒక్క డైలాగ్ కూడా లేకుండానే సైకిల్ చైన్ తెంపి హీరో చప్పట్లు కొట్టించుకుంటాడు.

                          విలన్ ని సినిమా సగభాగానికే హీరో బలహీనుడై పోతాడు . అంతకు ముందు విలన్ నాలుగైదు కారుల్లో మందీ మార్బలంతో తిరుగుతున్నప్పుడు హప్తాలు ,చందాలు ...బలవంతంగా వసూలు చేసి దర్జా వెలగపెట్టిన విలన్ మీద మనకు పీకల దాకా కోపం వస్తుంది కానీ ,అలాగే తిరుగుతున్న హీరోని చూసైతే సగటు ప్రేక్షకులెవ్వరికీ కోపం రాదు. ఎందుకంటే పురాణ వ్యాఖ్యానాలు , పఠనం మన ఆలోచనా తీరు మీద చూపే ప్రభావ ఫలితమే అది. “ఫలానా వ్యక్తి తప్పులు చేయడు ...లేదా తప్పొప్పులకి అతీతుడు” అనే భావజాలం లో కొట్టుకుని పోతున్న సమాజం లో ఉన్నవారికి ఇవన్నీ సహజమే. ఒక వీధి కావొచ్చు ,నగరం కావొచ్చు ...ఒక వ్యక్తి వలన నిరంతరం బాధననుభవిస్తున్నప్పుడు అతగాడిని ప్రజలే మూకుమ్మడి గా ఎదుర్కొనడమనేది( దానికి సహజంగా ఎవరో ఒకరు నాయకత్వం వహిస్తారు ) సరైన మార్గంగా చూపించాలి అలాగే ఆ ప్రజాకంటకుడు అంతమైన తరువాత అతగాడు బ్రతికిన విధానాన్ని కూడా రూపుమాపడమనేది అత్యంత ప్రధానమైన విషయం. అంతేగాని ఎవరో ఒకరిని ఆ స్థానం లో ప్రతిష్ఠించడమనేది ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వారెవరూ హర్షించరు.


                         ఇంత ఉపోద్ఘాతానికి గల  కారణం దగ్గరికి వస్తాను. నేను చిన్న ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం 5 రోజులు లక్నో లో గడిపాను. కొత్త ప్రాంతం కాబట్టి అక్కడ గల దర్శనీయ ప్రాంతాల  గురించి ఎంక్వైరీ చేస్తే మొదటగా పదిమందీ అంబేత్కర్ పార్క్ సజెస్ట్ చేయడం జరిగింది.
అక్కడ ఆయన విగ్రహాలు ,ఫోటోలు ఉన్న మాట వాస్తవమే కాని బయట చూస్తే వందల కొద్దీ ఏనుగుల విగ్రహాలు. అక్కడున్న సెక్యూరిటీ వాళ్లనడిగితే ఇంచుమించు 700 ఉండవచ్చునని చెప్పారు. ప్రతి ఏనుగూ ఖరీదైన పాలరాతితో చేయబడిందే. పార్క్ ని అందంగా తయారుచేయడానికి ఆ ఒక్క జంతువే ఎందుకు దొరికిందో నాకైతే కాదు ఎవరకీ అర్ధం కాదు. ఇంకొచెం ముందుకు నడిస్తే రెండు పెద్ద పెద్ద స్మారక మందిరాలున్నాయ్.
ఆ మందిరాల వైభవం గురించి నేను మాటల్లో చెప్పలేను కాబట్టి కొన్ని నేను ఫోటో లు ఇక్కడ జత చేస్తున్నాను. ఒక స్మారక మందిరంలో దూరాం. సెంటర్ లో నాలుగు వైపులా చూస్తున్న 4 మాయావతి విగ్రహాలు. చుట్టూ ఉన్న మునుల ,బుద్ద విగ్రహాలు. విగ్రహం ఎత్తు 30 అడుగులు ఉండవచ్చు. అదే విధంగా పక్క మందిరంలో కాన్షీరాం గారిది. ఆ తరువాత బయటకు వచ్చాం. బయట ఒక పెద్ద వేదిక .
వేదిక రెండు పక్కలా వారివే 70 అడుగుల విగ్రహాలు. ఆ తరువాత తెలిసిందేమిటంటే ఇటువంటి పార్కులు 5 లేదా 6 పైనే ఉన్నాయని. ఇంతకూ ఒక్క అంబేత్కర్ పార్క్ లో సెక్యూరిటీ ఏర్పాట్లు గురించి అడిగాం. మొత్తం 8 కంపెనీల సైన్యం 24 గంటలూ కాపలా కాస్తున్నారు. వారు కాకుండా తుడవడానికి 700 మంది పని చేస్తున్నారు. మరి మొత్తం పార్క్ ల సంగతి వేరే సంగతి. మరి పార్క్ లు దర్శించడానికి ఎంత మంది వస్తారన్నది నవ్వు తెప్పించే విషయం.


ఇక్కడ నాకు కొన్ని ధర్మ సందేహాలున్నాయ్.
1. తను అధికారం లోకి రాగానే తన విగ్రహాలనే నగరమంతా నింపేసిన రాజకీయ నాయకుడెవరైనా ఉన్నారా?
2. పార్క్ లు చాలా మంది కట్టి ఉంటారు కాని ఒకే జంతువు శిల్పాలతో మొత్తం పార్క్ లను నింపే అంత మూర్ఖత్వం మెచ్చుకోతగిందేనా ?
3 . ఎవరెవరు ఎలా పాలించేరో ఆ చరిత్ర కాస్త పక్కన పెడితే వారికి పూర్తి ప్రత్యామ్నాయం చూపే సిద్దాంతంతో ముందుకు వచ్చిన నాయకురాలు చూపే ప్రత్యామ్నాయం ఇదేనా ?ఆధిపత్య సంస్కృతికి ప్రత్యామ్నాయం వేరొకరి ఆధిపత్యమా లేక మొత్తం ఆధిపత్య సంస్కృతి లేకుండా చేయడమా ? అసలు దీని కోసమే “శివ “ సినిమాను ఉదహరించాను.

4.ఒక వేళ ఇది తప్పయితే ఆ సిద్దాంతాన్ని సమర్ధించే వారు ఈ విధమైన చర్యలను విమర్శించారా ?
5. సిద్దాంత బలం పెద్దగా లేకపోయినప్పటికీ కేవలం ప్రజా శ్రేయస్సు పట్ల నిజాయితీ ఉన్న వారైనా కొన్ని విషయాలను ఆలోచించి ఉండే వారు. అసలు లక్నో వంటి నగరం యొక్క గుండె కాయ వంటి ప్రాంతంలో కొన్ని వందల ఎకరాలను కేవలం పాలరాతి మందిరాల కోసం అదికూడా తాజ్ మహల్ నిర్మాణానికి మించిన ఖర్చుతో చేయడం ఎంతవరకూ సమంజసం? పచ్చని చెట్టు లేని కేవలం పాలరాతి ఎడారి కోసం.


6. కొద్దిపాటి విజ్ఞత ఉన్న ఏ నాయకుడైనా సరే ఈ మార్కెట్ ఎకానమీ రోజుల్లో కనీసం ఆలోచించే విషయం ఏమిటంటే ఏ ప్రాజెక్ట్ మీదైనా పెట్టుబడి పెడుతున్నప్పుడు తిరిగి వచ్చేదెంత ?ఎన్ని రోజుల్లో ? (Return on investment).మరి ఈ పార్కుల మీద ఈ నాటికీ అవుతున్న ఖర్చు , ఆదాయాలను పోల్చి చూస్తే ఎవరికైనా గుండె గుభేల్  మనడం ఖాయం.
7. కనీసం తను నమ్మిన సిద్దాంత వ్యాప్తికైనా ఈ విధమైన పార్కులు ఏ విధంగా సహకరిస్తాయో ఆవిడ కే తెలియాలి.
8. బెంగాల్ లో జ్యోతిబసు , త్రిపుర లో మాణిక్ సర్కార్  ఇంతకంటే ఎక్కువ కాలమే అధికారం  లో ఉన్నారు కానీ వారు కట్టుకున్న స్మారక మందిరాల దాఖలాలైతే లేవు.

9. ఒక సిద్దాంతంతో ముందుకు వెళుతున్న వారు అధికారం లోకి రాగానే వారి భవిష్యత్ ప్రణాళిక లను సులభంగానే visuvalize చేసుకోగలుగుతారు. మరి ఆవిడ visuvalaization లో పాలరాతి స్మారక మందిరాలు ఉన్నాయంటే ఆమె ఆధిపత్య ప్రత్యామ్నాయ సంస్కృతికి వారసురాలా ? ఆధిపత్య సంస్కృతికి వారసురాలా ?
10. నాకు తెలిసినంతవరకైతే యెంత ప్రజారంజకంగా పాలించిన కమ్యూనిస్ట్ యోదులకైనా ఆయన మరణాంతరం నిర్మించిన స్మారక మందిరాలున్నాయి కాని ఆయన జీవిత కాలంలో ఆయనే స్వయంగా నిర్మించుకున్న స్మారక మందిరాలైతే లేవు. ఒక వేళ నిర్మించుకోవాలనుకున్నా కూడా ఆయా పార్టీల సభ్యులు విమర్శించకుండా ఉంటారని మాత్రం భావించలేను. మరి ఈ భారీ నిర్మాణాలను మిగిలిన సభ్యులు విమర్సించలేక పోవడానికి గల కారణాలు నాకైతే అర్ధం కాలేదు.

11. విచిత్రమైన విషయం ఏమిటంటే ఈమె సమర్ధకులు కాని,ఈమె పార్టీ సమర్ధకులు కాని ఈ నాడు ఆంద్రరాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీలలో ఉండే అగ్రకుల ఆధిపత్య ధోరణి గురించి నిరంతరం ప్రస్తావిస్తూనే ఉంటారు.
12. ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం నమ్మిన  తాత్విక ,రాజకీయ సిద్దాంతాలు  మన వ్యక్తిగత జీవితం మీద అనివార్యంగా ప్రభావం
చూపుతాయి. ఒకవేళ చూపలేదంటే ఆ సిద్దాంతం అయినా బలహీనమైనదై ఉండాలి లేదా నీవు ఆ సిద్దాంత తాత్వికత ను పూర్తిగా స్వీకరించక పోయి ఉండాలి. శ్రామిక వర్గ పార్టీలో పని చేస్తున్న వ్యక్తి “ఆడి” కారు మీద చెయ్యి వేసి ఫోటో దిగి దానిని తన profile pic గా పెట్టుకున్నాడనుకోండి అతగాడికి సోషలిస్ట్ సామాజిక జీవితంలోని సౌందర్యం ,ఆవశ్యకత అర్ధం కాలేదని అవగతం చేసుకోవచ్చు. గోదావరి సినిమాలో ఆఖరి సన్నివేశం లో దొరికిన చిన్న చిన్న ఆఫర్ లతో హీరో ,హీరోయిన్ లు ఆనందపడి ఒకరినొకరు హత్తుకుని నడిచే సన్నివేశం , ఎర్ర జెండాలను చూపించిన సినిమాల లోని  చైతన్యం కంటే ఉన్నత చైతన్యం కల సన్నివేశం.

                   ఇలా ఒక్కొక్క టర్మ్ గాని ,రెండు టర్మ్ లు కాని పదవుల్లో ఉన్న వాళ్ళు తమ తమ విగ్రహాల కోసం వందల వందల ఎకరాలు కేటాయించుకుంటూ పొతే జనాలకు ఏమ్మిగులుస్తారో నాకైతే తెలియదు. పార్టీ శ్రేణులలో దార్సనికతకు ప్రాధాన్యమీయకుండా కేవలం నినాదాలకు , ప్రజాకర్షక విధానాలకు ప్రాధాన్యమిస్తూ పొతే ఆ పార్టీ పోయేది ఖాయం కాకపొతే ఈ లోపులో రాష్ట్రం గాని దేశం గాని ములగడం ఖాయం.



                  “అగ్ర వర్ణాల వారు చేస్తే తప్పు లేదు కాని మేం చేస్తే తప్పా ?” అని ఎవరైనా ప్రశ్నిస్తే నా దగ్గర సమాధానం లేదు.

1, ఫిబ్రవరి 2015, ఆదివారం

“మా పులి ....మా సింహం ....” నిర్మాతల కష్టాలు




సుపుత్రుడు కాలేజ్ నుండి రాగానే టీ. వీ . ఆన్ చేసాడు.
పెద్ద హడావుడితో నిండిన కార్యక్రమమేదో వస్తుంది
“ఏంట్రా అది ..?”
అడిగాను
“ఆడియో ఫంక్షన్ నాన్నా .....”
“దానికంత హడావుడి ఎందుకురా ....?”
“ఇప్పుడంతా అలాగే చేస్తున్నారు “
“వేదిక మీద మాట్లాడేది .....?”
“ఆ సినిమా నిర్మాతే నాన్నా ....”
“అంటే పెట్టుబడి పెట్టేది అతగాడే కదరా ....”
“మరి ఏదైనా రిస్క్ ఉంటే అతడిదే కదా ?”
“రిస్కేటి నాన్నా .....”
“అవున్రా పాపం పెట్టుబడి పెడుతున్నాడు కదా ....సినిమా ఫెయిల్ అయితే .....”
“అయితే నష్టం అతగాడిదే కదా ....”
“నాన్నా ....ఏ యుగం లో ఉన్నావ్ ....?
సుపుత్రుడు జాలి పడ్డాడు
“ అదేట్రా ఫెయిల్ అయితే నష్టం రాదా ?”
“ఈ ఆడియో ఫంక్షన్ లు ...హీరో ని పులి ...సింహం ...చేయడం ఎందుకనుకుంటున్నావ్?”
“తెలియదురా ....”
“మొత్తం సినిమా ఎన్ని ధియేటర్లలో రిలీజ్ అవుతుందో తెలుసా ?”
“తెలియదు “
“ఈ ఆడియో ఫంక్షన్ చూసిన మా లాంటి వాళ్ళు అన్ని థియేటర్  లూ హౌస్ ఫుల్ చేస్తాం ....ఒక్క సారి లెక్కేసి చూడు ....ఇంచుమించు నిర్మాత కు ఖర్చులు వచ్చేస్తాయ్. ఇక హిట్ అయ్యి రెండు మూడు వారాలు ఆడగలిగితే బంగారం పంటే ...”
“మరి నష్టం ఎవరిది ?”
“మా లాంటి పనికి మాలిన వాళ్ళదే ......సినిమా బాగుందో ...లేదో ...కూడా చూడకుండా ఎగబడి టికెట్స్ బుక్ చేసుకున్నందుకు ....ఇవి అమ్ముకుంటే సిగ్గు ....”
మా వాడి సినిమా జ్ఞానానికి నా మనసు ఆనంద పరవశమై పోయింది
మరలా మా వాడే మొదలు పెట్టాడు ..
“అందుకే ఏదో పెద్ద హీరో ని పట్టుకుంటే మినిమమ్ గారంటీ కాబట్టి  ఆ నిర్మాత హీరో ని పులి ...సింహం అంటూ పొగుడుతున్నాడు”
 “పైగా ఆ హీరో 5 అడుగుల మీద పిడికెడు కూడా లేడు “
“ఆగు నాన్నా .....హీరో మాట్లాడుతున్నాడు ....”
ఆగాను
“అదేట్రా ఆ హీరో మాట్లాడితే ....మా .....వంశం ....మా వంశం అంటూ అరిగి పోయిన డైలాగే  మాట్లాడుతున్నాడు “
“అదే నాన్నా ....ఆ పేరు మీదే లాక్కొచ్చాడు ....”
“శిక్షణ తీసుకున్న కోతి లాగే వేసే స్టెప్స్ ....ఊకదంపుడు డైలాగులు .....తన్నితే ఎగిరి పొయ్యే సుమోలు ....ఏ సినిమా చూసినా ఇంతే కదరా .....”
“మరేం చేస్తాం నాన్నా ....వారసులందరి సినిమాలు ఇంచుమించు ఇంతే కదా ......”
“ నిజమేలే మీడియా వాళ్లకు డబ్బులు కావాలి .....కొన్ని చానళ్ళు కూడా వాళ్ళవే ...కాబట్టి ఇవే చూపిస్తారు ...పాపం బంగారు తల్లి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. ఈ రోజుల్లో అయితే ముత్యాల ముగ్గు లాంటి సోషియో ఫాంటసీ లు ....శంకరాభరణం లాంటి నియో క్లాసిక్ లు కూడా ఆడక పోయి ఉండేవేమో .....”
“అంటే మీడియా లేకుండా ఉంటేనే మంచి సినిమాలు నడుస్తాయంటావా నాన్నా...?”

“కావొచ్చు ...”

30, జనవరి 2015, శుక్రవారం

స్మార్ట్ సిటీ అయితే మాత్రమేటి ?




నాల్రోజులుగా చిట్టి నాయుడు కి కంటి మీద కునుకు లేదు. కునుకు పట్టినా అన్నీ పీడకలలు ....
నాలుగో రోజున దిగాడు అప్పలనాయుడు.
నాల్రోజుల ముందు చిట్టి నాయుడు కి ఈ రోజు చిట్టి నాయుడు కి ఉన్న తేడా చూసి అప్పలనాయుడు భయపడి పోయాడు.
“ఇదేంట్రా చిట్టీ ....ప్రొబీసన్ వచ్చేత్తందని తెలిసినప్పుడు కూడా నువ్ బెదర లేదు. పైగా నాల్రోజులకే ఒరిస్సా నుండి సరుకు దింపేసి లచ్చల్లచ్చలు నొల్లేసేవ్.... మరిదేంట్రా....జబ్బు చేసిన కోడి పెట్టలాగైపోయేవ్....అసలు సంగతేటో చెప్పరా బాబూ ....నేనున్నానుగా .....”
“అదికాదు మాయ్యా.....పేపర్ చూత్తన్నావా ....?”
“ఏవుందేటి ......రోజూ ఉండే కొత్త పధకాలే కదా ....మన కొంపకేటైనా నిప్పంటుకునే సంగతులేటీ లేవు కదా ......?”
“మన కొంపక్కాదు.....డైరక్ట్ గా మనకే నిప్పంటుకునేలా ఉంది “
“నాకైతే అలాంటిదేమీ అగపడ లేదు కానీ ....చెప్పేది సరిగ్గా చెప్పరా బాబూ .....”
“మన విశాఖపట్నం స్మార్ట్ సిటీ అవుతాదట.....”
“మంచిదే కదా ....”
“రోడ్లన్నీ కరెక్ట్ గా ఉంటాయట ....మెట్రో రైలు వత్తాదట.....”
“రానీయ్రా ....మంచిదే కదా ....”
“మరదే ....నీకు తెలంది(తెలియనిది).......ఇప్పుడయ్యన్నీ వచ్చేత్తే మన వినాయక చవితి పందిళ్ళు ....దసరా పందిళ్ళు ....పైడితల్లమ్మ సంబరాలు ....యియ్యన్నీ ఎక్కడ చేత్తావ్....నీ రాజకీయం ఏటవుతాది ...?”
అప్పలనాయుడు పకాల్న నవ్వి ఆగి పోలేదు .....అరగంట నవ్వేడు. ఆపిన తరువాత మొదలెట్టేడు ...
“ ఒరేయ్ చిట్టీ .....పదేళ్ళ నుండీ కార్పొరేటర్ గా ఈ మాత్రం తెలీకుండా గెలిచేత్తానేట్రా . ఉప్పుడు నీ వయసెంత్రా?”
సమాధానానికీ....వయసుకీ సంబధం చిట్టి నాయుడు కి అర్ధం కాలేదు. అప్రస్తుత ప్రసంగంలా అనిపించింది.
“నలభై  అయిదు ....”
“ నీ పదిహేనోళ్ళ
 వయసప్పుడు కిలో రెండ్రూపాయల కి బియ్యం ఇత్తామని అప్పుడే పెట్టిన పార్టీ చెప్పేత్తే ఓట్లన్నీ దానికే గుద్దేసి అధికారం లోకి తెచ్చేసేరు. అంత కంటే పాత పార్టీలు ఇంతకంటే గొప్ప గొప్పయ్యే వాగ్దానాలు సేసేరు కానీ అవెప్పుడవుతాయన్న గారంటీ ప్రజల్లో ఎప్పుడూ లేదు. అసలాళ్ళు చెప్పే దానికీ మనీది చర్చి లో పాస్టరు గారు బైబిల్ సంగతులు సెప్పేదానికీ తేడా ఉండేది కాదంటే నమ్ము ....”
చిట్టి నాయుడు ముఖంలో పెద్ద  ప్రశ్నార్ధకం కనిపించేసరికి అప్పలనాయుడు కాసేపు ఆగి  సిగరెట్ వెలిగించి గట్టిగా దమ్ము పీల్చి వదిలి మళ్ళీ మొదలు పెట్టాడు.
“చిట్టీ  ....మరిప్పుడు కూడా రెండ్రూపాయలకే బియ్యం అన్నావనుకో జనాలు చేస్ అంటారు ....అలా అని పాత పధకాలు అలాగే ఉంచాలి. రెండ్రూపాయలకి కిలో బియ్యం మొదలు పెట్టినప్పుడు నీ ఇంట్లో కనీసం బ్లాక్ అండ్ వైట్  టీవీ ఉందా?”
లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు చిట్టి నాయుడు.
“మరిప్పుడు కలర్ టీవీ లేని ఇల్లు ఉందా ?”
మళ్ళీ తల అడ్డంగా ఊపాడు చిట్టి నాయుడు.
“కాబట్టి ఉప్పుడు ప్రతీ ఓడికీ కొన్ని కలలుంటాయా ఉండవా ....కలలు గాల్లోంచి పుట్టవు కదా .....ఉప్పుడైతే టీవీల్లోంచి...సినిమా ల్లోంచి  కలలు పుడతాయి. మన సిటీలు కూడా రోడ్ పక్కన రెస్టారెంట్ లు ...గార్డెన్ లు ...జారిపోయే రోడ్లు ....నున్నటి కార్లు .....అబ్బో......మరలాంటి కలలు నిజం చెయ్యాలి కదా .....”
“అదేకదా మాయ్యా ...చిక్కంతా ....మరలాంటి రోడ్ల మీద మన పందిళ్ళు యైనిత్తారా...?”
“ఓరి చిట్టీ .......ముందీ రోడ్ అంటే నీ చిన్నప్పుడన్న మాట .....?”
“ఇదేటి అసలు తార్రోడ్డే ఉండేది కాదు ...మనోళ్ళ ఇళ్ళన్నీ అక్కడోటి ఇక్కడోటి ఇసిరేసినట్టుండేయి కదా “
“కదా ....మరి ఆ తరువాతేటయ్యింది”
“ఇది తార్రోడ్డయ్యింది......నలభై అడుగుల రోడ్డయ్యింది .....ఆ తరువాత ఇదిగో పదేళ్ళ బట్టీ .....ఎనభై అడుగుల రోడ్డయ్యింది . కానీ మాయ్యా ఒక మంచి పనయ్యింది ...రోడ్ వెడల్పయ్యేకొద్దీ కొన్ని స్థలాలు గవర్మెంట్ లాక్కుంది కాబట్టి రోడ్ కటూ ఇటూ మన వాళ్ళే అయ్యారు. “
“మరి రోడ్ మారి పొయ్యింది కాబట్టి మనవేటన్నా పందిళ్ళు మానేసేమేటి .....ఇయ్యేసే కదా నాయకులయింది .....మనవేటన్నా ఉద్యమాలు చేసేవేటి ...అసలీ రోజుల్లో ఎవడన్నా ఇంతే అనుకో ....”
“కానిప్పుడు ఇదేదో స్మార్ట్ సిటీ అంటున్నారు కదా .....”
“ఏదైనా ఒకటే ....అద్దం లా రోడ్డ్డుందని దానిమీద ఉమ్మేయ్ కుండా ఉంటావా .......వేరే గవర్మెంటేదైనా నీవూసిన ఉమ్మి నిన్నే తియ్య మంటాడని  బయ్యం ఉంటే తప్ప ....కానీ అలాటి గవర్మెంట్ ఎలాగూ రాదు . ఎందుకంటే ఏ పార్టీ యన్నా మనలాటోళ్ళ మీదే కదా బతుకుతుంట ......మన కేటీ బయ్యం లేదు మన పందిళ్ళు మనయ్యే....ఒకేల ఏ రిలయన్సోడో ఈ పైన ఆఫీసెట్టి ఈ పందిళ్ళు అడ్డుతగుల్తాయన్నా కూడా ఏటీ కాదు. ఎందుకంటే అప్పుడు మనం మన పందిట్లోకి ఏ స్వరూపానంద స్వామినో తెత్తామన్న మాట. అప్పుడు గవర్మెంట్ ఏటి సేత్తదో తెల్సా మన పందిళ్ళు పోకుండా పైనుండి ఫ్లయ్ ఓవర్ కట్టుకుంటాదన్న మాట  ”
“మరప్పుడు కొత్తగా వచ్చిన ఈ అపార్ట్ మెంట్లోళ్ళు ఏటీ సెయ్రా.....”
“ఆళ్లా ....భలే అడిగావొరే చిట్టీ ......ఆల్లేటి సేత్తారో తెలుసా ....మీవోడు రాసుకుంటున్నట్టు అదేదో ఫేస్ బుక్ లో ......ఛీ ..ఛీ యీళ్ళలో ఎప్పటికీ మార్పు రాదంటూ రాసుకుంటూ కూసుంటారు కానీ ..గుమ్మం దాటి బయటకైతే రారు ...ఇది మాత్రం గారంటీ ....కాబట్టి ఆళ్ళని నువ్ పట్టించుకోనక్కర్లేదు. సాధారణంగా ఈ మనుషులు రెండు రకాల పనులు సేత్తా ఉంటారన్న మాట. తప్పులు సాధారణంగా అందరూ సేత్తానే ఉంటారు. దొరక్క పోతే గుడికెళ్ళి హుండీలో దక్షినేసి పాపం పోయిందనుకుంటారు. దొరికి పోతే మన లాటోళ్ళ దగ్గరికొత్తారు. అంతే గాని తప్పులు చేయకుండా బ్రతకడానికి చూడరు. నువ్వే సూడు ....ఎసిడిటీ అంటూనే ఉంటావ్. ఆ గోవిందు దుకాణానికెళ్ళి సికెన్ పకోడీ తినేసి ఇంటికెళ్ళి డైజీన్ మింగేత్తల్లేదా ....కక్కుర్తి లేకుండా ఇంటికెళ్ళి ఆనప కాయ కూర తినేసి పడుకోచ్చు కదా .....సర్లే ఇంకే శంకలూ బుర్రలో ఎట్టుకోకుండా ఇంటికెళ్ళి శుభ్రంగా పడుకో .....”

ముగించాడు అప్పలనాయుడు ......

25, డిసెంబర్ 2014, గురువారం

మనం "PK" సినిమా ఎందుకు చూడాలంటే ......



దారిన పోతున్న వ్యక్తెవరైనా
“ అయ్యా మీ తల మీద బూజు ఉంది “ అన్నాడనుకుందాం.
 దాని వెనుకే కొన్ని  ప్రతిస్పందనలుంటాయి. నా ఆలోచన సవ్యంగా ఉంటే వెంటనే తల తుడుచుకుని
“థాంక్ యూ” అంటాను. లేదంటే
”ఏ ....నీ షర్ట్ వెనక ఇంత ఆయిల్ మరక ఉంది .....దాన్ని చూసుకో ముందు ....నా తల సంగతి నీకెందుకు ?” అని గయ్యి మంటాను. లేదంటే
“ఏరా....నీ కంపెనీ షాంపూ ని ప్రమోట్ చేసుకోడం కోసం వెధవ ప్రయత్నాలు చేయకు ....నేనెప్పుడూ కుంకుడు కాయలతోనే తలంటుకుంటాను. ఎక్కడి నుండో షాంపూలు పట్టుకొచ్చి మా మీద బలవంతంగా రుద్దుతున్నారు .....అయినా నా తల మీద బూజుంటే నీకెందుకు ?...పేడ ఉంటే నీకెందుకు ?” అని కూడా గయ్యిమనొచ్చు.

                                  కాకపొతే ఈ మూడు సమాధానాలలో ఏది సవ్యమైనదో విజ్ఞులైన పాఠకులు కే తెలుసు. ఇంత ఎందుకు రాయవలసి వచ్చిందంటే ఈ మధ్యే వచ్చిన  “పీకే “ సినిమా మీద జనాలలో ఈ 3 రకాల ప్రతిస్పందనలూ కనబడుతున్నాయ్.
తమకు మోక్షం ప్రసాదించమనీ .....తమ ప్రయత్నాల వలన పరిష్కారసాధ్యం  కాని సమస్యలకు పరిష్కారం చూపమనీ  సాధారణంగా సామాన్య మానవులు భగవంతుడిని వేడుకుంటుంటారు. దానికొక మార్గం చూపించేదే మతం. ప్రతి మతమూ ఎవరో ఒకరు ప్రవక్తతో ప్రారంభం అవుతుంది(ఒక్క హిందూ మతమే దీనికి ఎక్సెప్షన్). వారు ప్రతిపాదించిన మార్గం ఆనాటి సమాజం లోని అనేకానేక ముఖ్య సమస్యలకు పరిష్కారం చూపించింది కాబట్టే సామాన్య జనం దాన్ని అవలంబించారు అంతేకాదు పరిశీలించి చూస్తే ఒక విషయం అర్ధం అవుతుంది ఇంచుమించు అన్ని మతాలూ ప్రారంభంలో  ఆనాటి పాలక వర్గాలకు వ్యతిరేకంగా పనిచేసినవే . కానీ కాలక్రమేణా పాలక వర్గాలకు జనాలలో వీటికున్న ఆదరణ అర్ధం కాకపోదు. అప్పుడు పాలక వర్గాలు ఈ కొత్త మతాలకు మారడం జరుగుతుంది ...ఎందుకంటే అది వారి మనుగడకు ముక్ఖ్యం కాబట్టి. ఆ తరువాతే అవి పాలక వర్గాల ప్రయోజనాల కోసమే ఎక్కువగా పని చేస్తాయి. సూక్ష్మంలో మతాల ప్రస్తానం ఇదే. (దీనికి మాత్రం హిందూ మతం ఎక్సెప్షన్ కాదు ....హిందూ మతంలో ఇది చాలా ముందు గానే ప్రారంభం అయ్యింది.). ఈనాటి రాజకీయ పార్టీలకు సిద్దాంతాల జోలికి పోని లంపెన్ సైన్యం కావాలి. దానికి అనుగుణంగానే నేటి యువతను లంపెన్ భావజాలంతో ఉంచడానికి మతాల సాయంతో పాలక వర్గాలు చేస్తున్నాయి. దీనికి ఇప్పుడు కొత్తగా మీడియా కూడా తన వంతు సాయం చేస్తోంది. ప్రశ్నించే శక్తిని హరించేయడంలోనే వాళ్ళందరి క్షేమం ఉంటుంది. దీనినర్ధం చేసుకోలేకపోతే మన యువత పైన నేనిచ్చిన మూడు ఉదాహరణలలో కొట్టుమిట్టాడుతుంటారు. అంతే కాదు మతం పేరు మీద అనవసరంగా జరుగుతున్న అట్టహాసాలని సంధించే ప్రశ్నలను తెలివిగా భగవంతుడి ఉనికికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంగా అమాయక జనాన్ని చాలా సుళువుగా నమ్మించేస్తున్నారు. పైగా ఈ ప్రశ్నలు అడుగుతున్న వారిని ఒకరి అభిముఖంగా ఒకరిని నిలబెట్టి వీరు చోద్యం చూస్తున్నారు. కాబట్టి తెలివైన యువత చేయవలసిన మొదటి పని ప్రశ్నించడం ....
ఇప్పుడు మనం PK సినిమా దగ్గరకు వస్తే .......ఈ సినిమా ద్వారా మధ్యలో ఉండే బ్రోకర్ ల వంటి స్వామీజీలను మన మధ్య నుండి గెంటేసే ప్రయత్నం చేసిన అమీర్ ఖాన్ అన్ని విధాలా అభినందనీయుడు. ఈ సినిమాలో ఎక్కడ కూడా భగవంతుని ఉనికిని ప్రశ్నించ లేదు. కాబట్టే ఈ సినిమా లోని విషయం మీద దాడి చేయలేని వారు ఈ సినిమాని విమర్శించడానికి అమీర్ ఖాన్ మతాన్ని వాడుకుంటున్నారు. “సత్యమేవ జయతే” లాంటి ప్రోగ్రాం ను,”పీప్లీ లైవ్ “ లాంటి సినిమాను  రూపొందించిన మనిషి లోని చైతన్యానికి ప్రేరణగా  మతాన్ని చూపించడానికి మన వాళ్ళు ఏ మాత్రం సిగ్గు పడడం లేదు.
రోజూ మనం నడుస్తున్న రోడ్ కి కూడా కొద్ది కాలానికి మరమ్మత్తులు చేయవలసి వస్తుంది. మరి ఎప్పుడో పుట్టిన మతానికి అవసరం ఉండదా ? జనం దగ్గరకి మతాన్ని తీసుకు రావడానికి బమ్మెర పోతన లాంటి మహాకవులు ప్రయత్నం చేసినా దాన్ని పాలక వర్గాలు పట్టించు కోవు ....ప్రచారం చేయవు. నిజంగానే ఏ స్వామీజీ అయినా                                  
“గుడికొచ్చి ప్రార్ధన చేయడం కంటే సమాజానికి ఏదో ఒకటి చేయి ....అంటే వినాయక చవితి పందిళ్ళు వేయడం లాంటిది కాకుండా ......అవసరమైతే సిస్టం మొత్తాన్ని ఎదిరించి నిలబడు “ అని చెప్పగలరా ?.....
కాబట్టే కొన్నిటినైనా  ప్రశ్నించిన ఈ సినిమాని ఆహ్వానిద్దాం .......



19, డిసెంబర్ 2014, శుక్రవారం

ఒక ‘క్రింద’ ఉద్యోగి ఆవేదన (ఇది ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదని మనవి )



“నాదొక చిన్న సందేహం సార్ ......మీరు అధికారి కాక ముందు , నేను నా ఉద్యోగం లోకి రాక ముందు మనిద్దరిలో సామాన్యంగా  గా  ఉన్న లక్షణం “మానవత్వమే” కదా .....కాని దాని గురించి కొంతైనా చింత లేకుండా మీలాంటోళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అర్ధం కాకుండా ఉంది .
మనం ఒక్కొక్క విషయం ఆలోచిద్దాం. పరిస్థితులు ఎంతగానో మారిపోయ్యాయి. కానీ వాటిని మీకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలో మీకు తెలుసు. మీకు మంచి జీతాలు ,సౌకర్యాలూ ఉంటాయి. మీకు వాటిని అందుబాటులోకి తెచ్చిన యంత్రాంగం పట్ల మీకు మా కంటే కృతజ్ఞతా భావం ఎక్కువగా ఉండడంలో సందేహమేమీ లేదు కానీ మీ కున్న నిబద్దత  అందరికీ ఉండాలని భావించడం న్యాయమా? మా కుటుంబాల పట్ల మాకు నిబద్దత ఉండకూడదా ....?
అసలు ఆ 8 గంటల పనిదినం కూడా ఎంత మంది మహనీయుల త్యాగఫలమో మీకు కొంతైనా తెలుసా ? అలాగే వారానికి ఒక రోజు సెలవు ఎందుకిచ్చారో ....దాని విలువెంతో మీకు తెలుసా ? అటువంటి సెలవుకి మమ్మల్ని దూరం చేస్తున్న మీకు నాగరికత ఉన్నట్టా లేనట్టా ? మాకు 8 గంటల పనిదినమే కదా. ఆ సమయంలో నిజాయితీగా ....నిబద్దతతో పనిచేయడమే కదా మీకు కావలిసింది. అంతకు మించి పని చేయడం అనేది మా ఇష్టాయిష్టాల బట్టి కదా ఉంటుంది. ఉదయాన కానీ .... వారంలో ఒక రోజు ఉదయం కానీ .....సాయంత్రం కానీ కనీసం కూరగాయలకైనా బయటకు వెళ్ళాలి కదా .....మాకు ప్రభుత్వం ఇచ్చే వాహనాలు కానీ ....మనుషులు కానీ ఉండరు కదా ......? దయుంచి ప్రభుత్వ వాహనాలు స్వంతానికి వాడడం లేదని ఆత్మవంచన చేసుకోవద్దు . అటువంటి వారి శాతం అతి కనీసంగా ఉన్నప్పుడు దానిని సున్నాగానే పరిగణించాలి.
మా పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్లకు ఆసరాగా ఉండవలసిన బాధ్యత మా మీద ఉండదా .....? కేవలం వాళ్లకు పుస్తకాలు కొనేసి కాలేజ్ ఫీజులు కట్టేస్తే మా బాధ్యత తీరిపోతుందా ? సమాజం లో పరిస్థితి అత్యంత అపసవ్యంగా ఉన్నప్పుడు వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్ద వలసిన నైతిక బాధ్యత మా పై ఉండదా ? వారికి విలాసవంతమైన జీవితాన్ని మేము అందుబాటులోకి తేలేక పోవచ్చు  కానీ మన ఆనందానికి అలాంటి జీవితం అవసరం లేదన్న విషయం వారికి అర్ధమయ్యేట్టు చేయగలిగితే వారికి కోట్ల రూపాయల సంపాదనల అవసరం ఉండదు కదా. అప్పుడు వారు నీతీ..... నిజాయితీలతో తృప్తిగా బ్రతక గలుగుతారు కదా. కొంత మంది భయం వలన కూడా నీతి ...నిజాయితీ లతో జీవిస్తారు కానీ చైతన్యం వలన వచ్చే సుగుణాలు మరింత విలువైనవి కావా ?
వాళ్ళు రేపు పరీక్షల ముందు హాల్ టికట్ వినాయకుడి విగ్రహం ముందు పెట్టి పూజ చేయిస్తానంటాడు. అవసరం లేదని చెబుతాను. అంటే దానర్ధం చర్చికి తీసుకెళ్ళి ప్రేయర్ చేయించాలని కాదని కూడా వాడికి అర్ధం కావాలి.... అంటే పరీక్షల లో విజయం కేవలం కఠోర శ్రమ ,దృఢ సంకల్పం వల్లనే సాధ్యపడుతుందనే విషయం ......అసలు జీవితంలో మరే విజయానికైనా ఇవే ప్రాధమిక అంశాలు అనే విషయం వాళ్లకు బోధపరచాలంటే మేము కూడా ఏదో పాఠం చెప్పినట్లు చెబితే పిల్లల తలకెక్కుతుందా ? ఎన్నో ఆసక్తి కరమైన ఉదాహరణలతో కదా వివరించాలి కదా. మహారాజు గారి రాణుల మధ్య తగాదాల వంటి రాజకీయాలు  .....తప్ప సామాన్యుల జీవితాల లోని విలువైన విషయాలను పట్టించుకోని మీడియా ఉన్న ఈ రోజుల్లో అటువంటి ఉదాహరణల ను వెదకాలంటే మేమెంత కష్టపడాలో మీ బోటి వారికి ఎప్పటికైనా అర్ధం అవుతుందా సార్ ?
టీ.బీ కి మందు కనిపెట్టిన నార్మన్ బెతూన్ కోట్లు సంపాదించాగలిగీ స్పానిష్ రిపబ్లిక్  పోరాటానికి ఎందుకు బాసటగా నిలిచాడు ....అక్కడ నుండి చైనా కమ్యూనిస్ట్ పార్టీ లాంగ్ మార్చ్ కు ఎలా వెళ్ళాడు ....ఒక పెన్సిలిన్ ఇంజక్షన్ లేక ఎలా చనిపోయాడు .....?ఎక్కడో అర్జెంటీనాలో పుట్టి మెడిసిన్ చదివి ....మెక్సికో మీదుగా క్యూబాకు చేరి అక్కడి విప్లవ విజయంతో సంతృప్తి చెందక మిగిలిన లాటిన్ అమెరికా ను విముక్తం చేయడానికి ప్రాణాలర్పించిన ‘చేగువేరా ‘ గురించిన నిజమైన వివరాలు చెప్పొద్దా సార్ ? లేదా అందరిలా ఆయన బొమ్మ వేసిన టీ షర్టు వేసుకుని తిరుగుతుంటే అదేదో ఫాషన్ లే అనుకుంటూ చైతన్యం లేని బ్రతుకు బ్రతకాలా ? అందరి దాకా ఎందుకు నోబెల్ ప్రైజ్ సంపాదించుకోగలిగిన మేధాశక్తి ఉన్న వాడని అందరి చేతా కొనియాడ బడ్డ బాలగోపాల్ గురించి .....అరిగిపోయిన చెప్పులతో ....చిరిగి పోయిన బట్టలతో ఆయన ఎందుకు తిరిగాడో చెప్పొద్దా ? వీరందరి ఆనందం గురించి అర్ధం చేసుకోలేక పొతే ....అర్ధం అయ్యేలా చెప్పక పొతే నేను విద్యావంతుడిగా లెక్క వేయబడతానా ? అంతే కాదు ఎలక్షన్ ఎలక్షన్ కి మధ్య మూడు పార్టీ లు మారిన వాళ్ళు తిరిగి గెలిచి మంత్రులెలా అవుతారన్న విషయం స్పష్టంగా విదీకరించక పొతే వాడు రాజకీయంగా చైతన్య వంతుడెలా అవుతాడు ?
మా ఖర్మ కొద్దీ మీ లాంటి ఉన్నతోద్యోగుల .....వ్యాపార వర్గాల సంస్కృతే మనకు అ(న)ధికార సంస్కృతిగా మిగిలింది. అలా మిగిలేట్టు చేయడంలో మీడియా చాలా చక్కని సహకారం అందించింది. వాళ్ళని ఏమని అనగలం ....వాళ్ళదీ వ్యాపారమే కదా ....ఒక పక్క రాజ్యమేలుతున్న కులరక్కసి .....గుడికి వచ్చి మొక్కులు తీర్చుకొండోహో....మీ పాపాలన్నీ ఫట్  అని నమ్మబలుకుతున్న మత సంస్కృతి .....14 సంవత్సరాలకే ప్రేమించి ....ప్రేమించబడక పోతే మనం హీరోలమే కాదని నమ్మిస్తున్న సినిమా సంస్కృతి .......వీటన్నిటి నుండీ నా వాళ్ళను రక్షించుకోడానికి నేను పడే మానసిక శ్రమ మీకు అర్ధం అవుతుందా .....రాత్రి పూట ఏదో సందర్భంలో రూట్స్ ( తెలుగులో ఏడు తరాలు ) నవల గురించి ...ఎలెక్స్  హేలీ గురించి నేను నా పిల్లలకు చెప్పే సమయంలో రాత్రి 8.00 గంటలకు కూడా మీ దగ్గర నుండి ఏదో చిన్న ఆఫీస్ విషయం గురించి ఫోన్ వస్తుంది. నాకున్న వ్యక్తిగత సమయాన్ని కూడా మీరు దురాక్రమణ చేసేస్తే ఎలా సార్ ?
ట్రైన్ లో ఏసీ కోచ్ లలో దాని maintenance గురించి మన అసెస్మెంట్ అడిగే ఫారం నింపమని ఇస్తారు . కానీ అటువంటి దేమీ ఏ డిపార్టుమెంటు లోనూ ఉండదు. ఒక అధికారి తన క్రింద పని చేసే వంద మందిని నరక యాతనకు గురి చేయగలుగుతున్నాడు. కానీ ఈ వంద మందీ అతడి తల మీద వెంట్రుక ముక్కను కదప లేరు. ఇదంతా మా ఖర్మ అని సరి పెట్టుకోవడం తప్ప .