5, అక్టోబర్ 2011, బుధవారం

స్వచ్చత...ముందు ముందు ఎండ మావేనా

కళ్ళలో సన్నటి కన్నీటి  పొర. ఈ రోజు "కౌన్ బనేగా కరోడ్ పతి" ప్రోగ్రాం చూస్తున్నంత సేపూ అది ఆనందమో తెలియదు ...మరేదో తెలియదు ..ఒక నిజమైన భారతీయత మొత్తం ఆ మరాఠీ  రైతు రూపం లో ప్రత్యక్షమైంది. చాలా సార్లు యేదో ఒక పొర లో నుండి సమాధానాలిచ్చిన  ..ఇస్తున్న మనుషులను చూసీ  చూసీ ఉన్న  మా అందరికీ ఆ సమున్నత గ్రామీణ వ్యక్తిత్వం ...ఆ స్వచ్చత ...మాటల్లోని నిజాయితీ ..... యెక్కడో  కోల్పోతున్న మానవీయతను ఆ ఎపిసోడ్ చూసిన వారందరికీ రుచి చూపించింది. బహుశా  ఆ స్వచ్చతను యే పొరలూ లేకుండా మిగిలిన వారు మాత్రమే ఆఘ్రాణించగలనుకుంటాను. కేవలం విలువలే కాదు..యీ నాటి రైతాంగ జీవితంలోని కష్టాలను  ,కఠోర వాస్తవాలను సున్నిత మైన భాషలోనే చెబుతూ ..కష్టాలైనప్పటికీ వాటికి యెదిరొడ్డగల సరళ జీవన తత్వాన్ని ఆవిష్కరించిన  ఆ నిలువెత్తు మానవతా మూర్తి మాటలకు ...ఆ మహా కళాకారుడైన అమితాబ్ కూడా మంత్ర ముగ్ధుదయ్యాడనడం యెంత మాత్రం అతిశయోక్తి కాదు.
పట్టణ  జీవిత మసాళాలు మరిగిన వారికి తమాషా గా అనిపిచే వేషధారణతో.. .   ..అందులోనూ స్వచ్చమైన మరాఠీ రైతాంగ వేషధారణతో  వచ్చిన యీ వ్యక్తి ధైర్యం ముందు తమాషాగా అనిపించినా ..."యీ డబ్బుతో మీరేమి చేస్తారు " అన్న ప్ర్స్నకు ఆయనిచ్చిన సున్నిత సమాధానం యీ నాటి రైతాంగ జీవనాన్ని మొత్తం ప్రేక్షకులందరికీ వివరించగలిగింది. నాలుగు ఎకరాల వ్యవసాయంలో కేవలం 30000 రూపాయల ఆదాయం తెచ్చుకో గలిగే ఆ రైతు ఆకాంక్షలు ....ఒక్కొక్క చెక్కూ అందుకుంటన్నప్పుడు ఆ రైతు ..ఆయన భార్య ముఖంలోని ఆనందం చూస్తున్నప్పుదు కలిగిన భావాలను చెప్పడానికి ఇంతకంటే పది రెట్లు బలమైన భాష కావాలేమో. అంతే  కాకుండా సమకాలీన సామాజిక పరిస్థితుల గురించి " ఈ ఐదు కోట్లు రానియ్యండి సార్ ...ఒక్కక్కడి సంగతి చూస్తాను" అని అన్న అతడి మాటలు రానున్న కాలంలో రైతులు చేయబోయే గర్జన లా వినబడింది. ఆ కసి యీనాడు ప్రతి భారతీయ రైతు గుండెల్లో నిండి ఉన్నదే.

వృత్తి రీత్యా సివిల్ ఇంజనీర్ కావడం ప్రారంభంలో ఇబ్బందిగా ఉండేది కానీ రాను రాను అందులో కూడా కొన్ని కొన్ని ఆనందాలను కూడా  గమనించాను. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు ప్రారంభం అయినప్పుడు  చుట్టు పక్కల రైతులతో తప్పనిసరిగా సంబంధాలు ఉంటాయి. ఎంతోకొంత రైతాంగ నేపధ్యం ఉంది కాబట్టి వారందరితో సంభాషించడం ...గాలి...నీరు..తో బాటు వాళ్ళ మాటల స్వచ్చతను కూడా సంపూర్ణంగా  ఆస్వాదించడం అలవాటుగా మారింది." బాబూ ...ఈ నాలుగు మామిడి పళ్ళూ ఉంచండి ..." అంటూ అప్యాయంగా వాళ్ళిస్తున్నప్పుడు తిరిగి వాళ్ళకేమి ఇవ్వాలో అర్దం కాని పరిస్థితి అనేక సార్లు ఎదురయ్యింది. ప్రభుత్వాలు స్వచ్చమైన నీటి కోసం పధకాలు తేవచ్చేమో కాని..స్వచ్చమైన మనసుల కోసం తేలేవుగా.....

ఆనందం అనేది సాపేక్షమైనదే అని ఇంతకు ముందు ఒక పోస్ట్ లో రాసిన గుర్తు. ఆ మాట ఎందుకంటున్నానంటే  ఈ టీవీలు..అంతర్జాలం ...సెల్ ఫోన్లు లేకమందు కూడా మనిషి ఆనందంగానే ఉన్నాడు. ఒక్కటే తేడా యేమిటంటే ఇంకొకరి ప్రమేయం లేకుండా మాత్రం ఆనందం పొందడమనేది ఇంచుమించు లేదనే చెప్పవచ్చు.  భోజన ప్రియులకు మాత్రం ఇది వర్తించక పోవచ్చు. కానీ యీనాటి యువతరం మాత్రం వారి వారి మూలాల గురించి యే కోశానా అలోచించలేని  మత్తులో ఊగి పోతున్నారు. యేమో ప్రతి జనరేషన్  తన తరువాతి జనరేషన్ గురించి ఇలాగే అలోచిస్తారేమో.. కానీ ఒక్కటి మాత్రం అనుభవంతో  చెప్పగలుగుతున్నాను.. నేను కాలేజ్ లోకి అడుగు పెట్టేసరికి బ్రతికి ఉన్న స్వాతంత్ర సమర యోధులు కూడా మమ్మల్ని చూసి గర్వపడే పనులు మేము కొన్ని చేసాం అని కొంత గర్వంగా చెప్పగలను . ఓక బలమైన గాలి వీచినప్పుడు రోడ్లు మీద మట్టి, ధూళి  మొత్తం యెగిరి పోతాయి. అప్పట్లో  యేదో ఒక ఉద్యమ గాలి ఉండేది కాబట్టి  కొంతైనా మనసులలో ఉండే చెత్త పోయి కొత్త భావజాలాలతో  శుభ్ర పడుతూ ఉండేవేమో. ఇప్పుడు ఉద్యమమే పెద్ద మార్కెట్ సరుకై కూర్చుంది. ఆ పాట యెవరు రాసారో గుర్తు లేదు కానీ "పూజ" సినిమా లోనిది అనుకుంటా. " నిప్పు రగిలి జ్వాల రేగ నీళ్ళ వలన ఆరును..నీళ్ళలోనె జ్వాల రేగ మంట యెటుల ఆరును"... 

పిల్లలలో ఒకటి  చూడవచ్చు. సాధారణంగా వాల్లకిస్టమైన పదార్ధాలు మితం లేకుండా తింటూ ఉంటారు. వాళ్ళకిష్టం లేనివి ముట్టరు. మా బంధువుల పిల్లలు చాలామంది ఆకు కూరలు ముట్టరు. అలా అనడం కంటే వాళ్ళ పెద్దలే వారిని అవి తినడానికి ప్రోత్సహించరు. యెందుకంటే అవి వీళ్ళకు కూడా పెద్దగా రుచించవు కాబట్టే. కానీ  మా ఇంటికి వచ్చి నప్పుడు మాత్రం మా ఇంట్లో ఉన్న కొద్ది కాలం లోనే నెమ్మదిగా అలవాటు పడతారు. ఇదే విషయం అన్ని రంగాలకూ వర్తిస్తుంది. మన ఉపఖండానికున్న ప్రత్యేక పరిస్థితుల వలన మొత్తం సమాజం అనేక పొరల దొంతరగా మారి పోయింది. మనుషులు తమ స్వార్ధాన్ని కప్పి పుచ్చుకునేందుకు వాళ్ళు ప్రస్తుతం ఉండే పొరలను సునాయాసంగా పక్కన పెట్టి వేరే పొరల లోని భావాలను సునాయాసంగా అరువు తెచ్చుకోగలుగుతున్నారు. కంప్యూటర్ మీద మరీ ముఖ్యంగా ఆటో కేడ్ అనే సాఫ్ట్ వేర్  వాడే వాళ్ళకు యీ పొరల గురించి మంచి అవగాహన ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ గా చెప్పుకోవాలంటే స్వచ్చత అంతే నీవు ప్రస్తుతం ఉన్న పొర తాలూకు భావ జాలాన్ని మాత్రమే అన్ని వేళలా విశ్వసించడం.