27, ఫిబ్రవరి 2014, గురువారం

...... కళలూ మావే ...... అధికారం మాదే ..... మీకు ఎక్కువ ఛాయిస్ ఉండనీయం ....



"బాసూ ...."
లంచ్ అవర్ లో సరదాగా laptop లో ఏదో సినిమా పాట చూస్తున్న నన్ను కదిపాడు మూర్తి .
"చెప్పు " నాకు తెలుసు ఏదో తలనెప్పి విషయం కనిపెడతాడని .
"ఆ గ్రూప్ డాన్సు లో హీరో పక్కన డాన్సు వేస్తున్న వారిలో ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటావ్ ?"
"నీవడిగేది స్పష్టంగా లేదనుకుంటా "
"అది కాదు బాసూ .... వాళ్ళ లో టాలెంట్ ఉన్నవాళ్ళు ఉండరంటావా .... ?"
"ఉండొచ్చు .... "
"వాళ్ళు చాలా కాలం నుండి అనేకానేక గ్రూప్ డాన్సు లు చేసి ఉండొచ్చు కదా ..... "
"చాలా మంది హీరో ల తో చేసి ఉండొచ్చు కదా .... ?
"అబ్బా ... మూర్తీ చంపుకు తినక ... అసలు విషయం చెప్పమ్మా .... "
"అది కాదు బాసూ ..... మొదట్లో వీళ్ళ లో చాలా మందికి ఎప్పటికైనా ఏదో ఒక మంచి ఛాన్స్ వస్తుందనే ఆశ ఉండే ఉంటుంది కదా ...చాలా ఆశ తో camera లెన్స్ వంక చూస్తూ ఉంటారేమో కదా ?"
"ఉండి ఉంటారు .... "
"నిజాయితీగా కష్టపడి చిన్న చిన్న పాత్రలు ..... దొరికిన వన్నీ చేసి ఉంటారు కదా "
"సందేహం లేదు ... "
"వారిలో కొద్ది మందికైనా మంచి నటన ... రూపం ..... ఉండి ఉండొచ్చు కదా .... ?"
" చాలా మందికి ఉండొచ్చు "
" కొద్ది రోజులకే వాళ్లకు ....పాపం నిజాలన్నీ అర్ధం అయ్యి ఉంటాయి కదా ....?
"అంటే .... ?"
" హీరోలను చేసేవి .... పైవేవీ కాకుండా ఇంకా చాలా ఉంటాయని ..... పైన చెప్పిన లక్షణాలు ఏవీ లేక పోయినా  హీరో లు అయిపోతారని  వాళ్ళు అర్ధం చేసుకున్నాకా ఎలా ఫీలవుతారంటావ్ "
"నిజాలు అర్ధం చేసుకున్న తరువాత నిర్వేదం తో .... నిర్లిప్తతో ...... నిరుత్సాహం తో జీవితం అంతా గడిపేసి ఉండి ఉంటారు. "
"అదేంటి ... గడిపేసి ఉంటారంటావ్ ..... ఇప్పుడెవ్వరూ అలా అనుకోడం లేదా ?
"అలాంటి ఆశలు ఇప్పుడు కూడా పెట్టుకుని సినిమా రంగానికి వస్తే వాడంత వెర్రి వెధవ ఎవడూ ఉండడు ..... కేవలం ఆదాయం చాలని దిగువ మధ్య తరగతి కుర్రాళ్ళు వేరే అదనపు ఆదాయపు వనరు క్రింద ఈ గ్రూప్ డాన్సు ల లాంటి వాటిల్లో పాల్గొనాలి తప్ప భవిష్యత్తులో హీరో అవ్వొచ్చనే భ్రమలతో మాత్రం కాదు .మన తెలుగు సినీ రంగంలో హీరో అవ్వాలంటే ఆ నాలుగైదు కుటుంబాలలో పుట్టాలన్న వాస్తవం  నీకు ఇంకా తెలియక పోవచ్చు కానీ  తెలివైన కుర్రాళ్ళకు మొత్తం  తెలుసు ..... అంతే కాదు ఏదో ఒక దిక్కు మాలిన టీవీ ప్రోగ్రాం లో కనబడితే ఆ తరువాత ..... ఫేం ... అంటూ బేనర్ కట్టుకుని వినాయక చవితి పందిళ్ళ లో నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చు "
"అబ్బ ఏం చెప్పావ్ గురూ ..... పద టీ పోయిస్తాను "
laptop కట్టి బయటకు నడిచాం . 
"అంటే అవకాశాలు అన్నీ ఇలా కొద్దిమందే ఒడిసి పట్టేస్తుంటే కొత్త వారికి అవకాశాలు మాట దేవుడెరుగు ..... కొత్తదనంతో ఉండే సినిమాలు .... మనకెక్కడ దొరుకుతాయి ?"
"నీవెక్కడో ఉంటావు మూర్తీ ..... ఈ ఒక్క రంగమే నీకు కనిపిస్తుందా ..... ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని కుటుంబాలు ..... ఎప్పటి నుండో అధికారాన్ని ఒడిసి పట్టుకుంటుంటే ప్రజలకు ఏమైనా స్పందన ఉందా ... ?"
"అంటే ... ?"
"పద్దతులు మారుతున్నాయంతే మూర్తీ .... ఒకప్పుడు బలవంతుడు తనకు వోటు వేయించుకునే వాడు ..... కానీ ఇప్పుడు ...... తెలివిగా గెలిచే అవకాశాలు ఉండే పార్టీలోకి మారుతున్నారు. ప్రజలు ఇలాంటివి పట్టించుకోవడం లేదని వాళ్లకు ఎప్పుడో అర్ధం అయిపోయింది. ప్రజలు కూడా వీళ్ళ వలన ఒరిగేదీ ఏదీ పెద్దగా ఉండదనే నిర్వేదావస్థ లోకి జారి పోతున్నారు .... 5 సంవత్సరాలకొక సారి వచ్చే పండగ .... కాబట్టి ...పైగా ఆ నాలుగు రోజులు తమను పెద్ద పెద్ద వాళ్ళు పలకరిస్తారు కాబట్టి ... ఒక విధంగా పండగ రోజుల్లాగా .... ఇంకా చెప్పాలంటే ఇంకా బాగా .... చాలా వరకూ అన్నీ ఫ్రీ గా దొరుకుతాయి కాబట్టి .... ఎంజాయ్ చేస్తున్నారు ..... అసలు మన వైజాగ్ నే చూడు ..... గత నాలుగు ఎలక్షన్స్ చూడు .... పార్టీలు మారుతూ ఎంత చిద్విలాసంగా నాయకులు కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ..... అక్కడ చచ్చినట్లు వాళ్ళు తీసిన సినిమాలే చూసినట్లు .... ఇక్కడ కూడా వీళ్ళలోనే ఎవరో ఒకరిని ఎన్నుకుని తీరాలి .....పద ... కంప్లేషణ్ డ్రాయింగ్ లు చెక్ చేయాలి "
"అదేంటి .... అంత సింపుల్ గా విషయాన్ని క్లోజ్ చేసేస్తావ్ ... ముందు ముందు ఈ దేశం ..... "
"నీకు .... గవర్నమెంట్ జాబ్ ఉంది .... నాకూ ఉంది .... కాబట్టి మన వరకూ ఏ ఇబ్బందీ లేదు ..... ఇక 1000 రూపాయలకు కావలిసిన పాటలు లోడ్ చేసిన సెల్ ఫోన్ మార్కెట్లో దొరుకుతోంది ....పైసాకు ఒక మెసేజ్ పంపించు కోవచ్చు .... ఇంజనీరింగ్ కోసం కొన్న laptop లో డేటా కార్డు ఉంటే చాలు ఫేస్ బుక్ లో కొత్త కొత్త ఫోటోస్ upload చేసి మరుసటి రోజునుండీ ఎన్ని లైక్ లు వచ్చాయో లెక్క పెట్టుకుంటూ టైం పాస్ చేసుకోవచ్చు ..... కాక పొతే ఒక్క ఆశ ఉంది మూర్తీ ... ఈ ఫేస్ బుక్ కి ... సోషల్ నెట్ వర్క్ కి బయట ఇంకా చాలా పెద్ద ప్రపంచం ఉంది ..... వీటిలో ఉన్న చెత్తతో ఎంజాయ్ చేయడం ..పాపం ... వాళ్లకు తెలియదు అవసరం......  వాళ్ళను నిజాల దగ్గరకు చేరుస్తుంది ..... అఫ్ కోర్స్ .... దాని కోసం నీవు .... నేను చేయవలసింది చేయడానికి సిద్దంగా ఉందాం ..... "

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

తెగగొట్ట వలసిన అనైతిక బంధం......

నా చిన్ననాటి స్నేహితుడు యాగంటి వేంకటేశ్వర్లు ఒక మంచి జోక్ పంపించాడు .

Man was baptized and dipped in water 3 times. After the 3rd dip priest said " you are now baptized, the old one is gone, you are now a new creation, no more drinking of alcohol for you and your new name is James "
James went home, headed straight for the fridge, took out a beer and dipped it in water 3 times and said " you are a new creation now, the old one is gone and your new name is orange juice.


పై జోక్ ని తెలుగు లోకి అనువదిస్తే ఈ విధంగా ఉంటుంది . 


వ్యక్తి బాప్టిజం చేయబడి ....3 సార్లు నీటిలో ముంచబడ్డాడు. 3 వ డిప్ పూర్తయిన వెంటనే ....పూజారి "మీరు ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి ....పాత అంతా పోయింది మీరు .....మద్యం నుండి పూర్తిగా దూరంగా ఉంటారు ..... మీ కొత్త పేరు జేమ్స్ .
జేమ్స్, తిన్నగా ఇంటికి వెళ్ళి ఫ్రిజ్ తెరిచి ఒక బీరు తీసుకుని 3 సార్లు నీటిలో ముంచి మరియు మీరు ఇప్పుడు కొత్తగా సృష్టించ బడ్డారు ...మీ గతం అంతా గతించింది మీ కొత్త పేరు నారింజ రసం అన్నాడు.


అతగాడు ఇది జోక్ గానే పంపించాడు కానీ ఇది ఇప్పుడు అన్ని మతాలలోను ..... ఇంచుమించుగా ఇదేగా నడుస్తుంది .ఈ నాటి మనదౌర్భాగ్యాల కు అవినీతి కారణమని అందరూ ఒప్పుకుంటారు (ఒక్క సి. పీ.ఎం పార్టీ వారు తప్ప .....వారి విప్లవ కార్యకలాపాలలో అవినీతి ముద్ర వేసుకున్న వాళ్ళూ తోడూ నీడగా ఉండొచ్చట ). కానీ అంత యధేచ్చగా అవినీతికి పాల్పడే మనస్తత్వం గాలి చొరబడినంత సుళువుగా ఎలా చొరబడిపోతోంది? దానికి తాత్విక భూమిక సమాజం లో ఏ ఆటంకమూ లేకుండా ఎవరు వ్యాప్తి చేయగలుగుతున్నారు ? కావాలని ఒక అరాచక వాతావరణం ఎవరి వలన ఏర్పడుతోంది ? ఏ  గ్రంథాల ల లోనూ రాయని వన్నీ ప్రజలమీద రుద్ది  సమాజంలో లంపెన్ సైన్యాన్ని తయారు చేసి సిద్దాంత రాజకీయాలు లేకుండా చేయడానికి ఏ శక్తులు కృషి చేస్తున్నాయ్ ? అన్ని వయసుల వారి లో ఇంత ఉదాసీన వైఖరి ఎలా వచ్చింది ? ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్యూన్ ఉద్యోగాలకు ....కానిస్టేబుల్ ఉద్యోగాలకు .....అవీ లేకుండా చేస్తున్నా చలనం లేకుండా ఎలా ఉండగలుగు తున్నారు? హేతు బద్దంగా ఆలోచించే శక్తి ని ప్రజలనుండి దూరం చేయడానికి యధావిధిగా కృషి చేస్తున్నదెవరు?
 నల్లదుస్తులు వేసుకుంటే ...ఇంత పుణ్యం ......ఎర్ర దుస్తులు వేసుకుంటే ఈ పుణ్యం ......ఇంకా కాన్వెంట్ స్కూళ్ళకు ఎన్ని యూనిఫారాలు ఉంటాయో ....భక్తికి కూడా అన్ని యూనిఫారాలు తయారు చేసి ప్రజలను నిజంగా భక్తి మార్గంలోకే ఈ పురోహిత వర్గాలు  మళ్ళిస్తున్నాయా .....? మూఢ భక్తి /మూర్ఖ భక్తి ని అధికారిక భక్తి మార్గంగా ఎవరు చలామణి చేయగలుగుతున్నారు ? సమాజం లో బలమైన సిద్దాంతాలు లేకుండా ఉండడం కేవలం అరాచక స్వార్ధపర శక్తులకే మేలు కలుగుతుందని తెలిసి కూడా ఆ పరిస్థితి నుండి సమాజాన్ని బ్రతికించడానికి ఏ రాజకీయ పార్టీ అయినా నిజాయితీ గా కృషి చేస్తుందా ....? అంటే అన్ని మతాలలోని పురోహిత వర్గాలు ఒక అరాచక తాత్విక పునాదిని సృష్టిస్తుంటే .......దానినుపయోగించుకుని అధికారం లోకి రావడానికి సిద్దాంతాలు అవసరం లేని అన్ని రాజకీయ పార్టీలు యధావిధిగా కృషి చేస్తునాయి .అందువలనే కదా ఒక పార్టీ అధికారం లోకి అర్ధం కాగానే చొక్కా మార్చినంత సుళువుగా వేరొక రాజకీయ పార్టీలోకి మారిపోతున్నారు.మారేటప్పుడు కూడా సైద్దాంతిక నిబద్దత లేని పార్టీలోకి మారతారు తప్ప  సిద్దాంతాలను అంటి పెట్టుకునే పార్టీల లోకి మాత్రం మారరు. అది పెద్ద తప్పేమీ కాదనే విధంగా మన తాత్విక దృక్పధాన్ని ఉంచడానికి మత వర్గాలు కృషి చేస్తూనే ఉంటాయి

నిజాయితీగా .....దేశానికీ ....సమాజానికీ ఏదైనా చేయాలనుకునే అభ్యుదయ వాదులు కానీ ...విప్లవకారులు కానీ  చేయవలసిన మొదటి పని ఈ అనైతిక బంధాన్ని తెగగొట్టడం.....అది చేయకుండా ముందుకు వెళ్తే మాత్రం పునాది లేకుండా భవనం నిర్మించడమే అవుతుంది.

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

మహా నాయకులారా సిద్దాంతాల రాద్దంతాలు తెలియని వాళ్ళం ...కానీ కాస్త కళ్ళున్నాయ్

                               చాలా గట్టిగా కేకలు వినబడుతున్నాయ్. అలమండ మీదుగా మా జీప్ వెళ్తుండగా రోడ్ కి అడ్డంగా జనం నిలబడి ఉన్నారు . పక్కగా ఉన్న చిన్న ఖాళీ స్థలంలో ఒక చిన్న స్టేజీ వేసి ఉంది. దాని మీద ఎవరో కొత్త వాళ్ళు ....ఇంకొక పక్కన ఈ మధ్యే జాతీయోద్యమంలో జైలు కి వెళ్లి వచ్చినట్లు ఫోజ్ పెట్టే "దొంగ రమణ " ఉన్నారు. కాకపొతే మా పని లోకే వచ్చి తన పని తను చేసుకుపోయే వెంకట్రావ్ మాత్రం వేదిక కు క్రింద నిలబడి గట్టిగా అరుస్తున్నాడు. అతడికి సపోర్ట్ గా ఇంకా రైతులు కూడా అరుస్తున్నారు. కాస్త ఆలస్యమైనా ఫరావాలేదనుకుంటూ క్రిందకు దిగి వేదిక వైపుగా నడిచాం . మమ్మల్ని ఎరిగున్న జనమే కాబట్టి మాకు దారి ఇచ్చారు. వెంకట్రావ్ దగ్గరకి వెళ్లి నెమ్మదిగా భుజం మీద చేయి వేసాను. వెనక్కి తిరిగాడు.
"సార్.....ఇలా వచ్చేరేంటి...?"
"నీవేమిటి .....ఇంత రెచ్చి పోతున్నావ్.... వేదిక మీద ఉన్న ఆ కొత్తాయన ఎవరు ?"
" ఆయనే సార్ ....ఎవరో .....ఏదో పార్టీ నాయకుడంట .....అసలాయన పార్టీనే జనం మరిచి పోతుంటే ఎప్పటి లాగానే పిచ్చి వాగుడు వాగుతున్నాడు . "
" ఛా... ఊరుకో ఎవరో పెద్దాయన లా ఉన్నాడు "
"పెద్దాయనే సార్ ....ఆ కళ్ళకున్న అద్దాలు తీయడు ......ఆ అద్దాలు ఎప్పుడో మసక బారి పొయ్యాయి. ఆయనకా విషయం అర్ధం కాక ఆ అద్దాల లోనుండి కనబడేదే లోకం అనుకుంటాడు . "
"సరేలే ఇంతకీ ఆయనేమంటాడు ......?"
"ఉప్పుడు ఈ రమణ గురించి ఈ వూర్లో ఇప్పుడే పుట్టిన బిడ్డనడిగినా చెప్పుద్ది. యీయనొచ్చి ఆడెంత ఎదవో చెప్పకుండా యీడు ఎప్పుడు కూడా ఏ గోడ మూలా ఒంటేలు పొయ్యడు కాబట్టి చాలా   గొప్పోడనట్లు చెబుతాడు. యీడు తాగి ఆడోళ్ళను బూతులు తిడతాడు .....దొరికిందల్లా అమ్మేసి తాగేత్తాడు....ఊరుమ్మడి చెరువులో చేపలు రాత్రి పూట పట్టి మర్నాడు పక్కూరి సంతలో అమ్మేత్తాడు....అసలు యీడు .ఈడి బాబూ కలసి చెయ్యని గోరమేదన్నా ఉందా ....... అయ్యన్నీ చెప్పకుండా ఈడు పోసే ఒంటేలు గురించి చెబుతాడేంటి సారూ .....మేమేమైనా ఈయన కళ్ళకి పిచ్చెదవల్లా అగపడతన్నామా.....?" వెంకట్రావ్ ఆవేశం తో ఊగి పోతున్నాడు

వెంకట్రావ్ ....ఆయన్నంటున్నాడా.......లేక వేరే పెద్ద పార్టీ వాళ్ళ నాయకుడిని ............



మరి కొంత మూలాలలోకి........