16, ఫిబ్రవరి 2014, ఆదివారం

మహా నాయకులారా సిద్దాంతాల రాద్దంతాలు తెలియని వాళ్ళం ...కానీ కాస్త కళ్ళున్నాయ్

                               చాలా గట్టిగా కేకలు వినబడుతున్నాయ్. అలమండ మీదుగా మా జీప్ వెళ్తుండగా రోడ్ కి అడ్డంగా జనం నిలబడి ఉన్నారు . పక్కగా ఉన్న చిన్న ఖాళీ స్థలంలో ఒక చిన్న స్టేజీ వేసి ఉంది. దాని మీద ఎవరో కొత్త వాళ్ళు ....ఇంకొక పక్కన ఈ మధ్యే జాతీయోద్యమంలో జైలు కి వెళ్లి వచ్చినట్లు ఫోజ్ పెట్టే "దొంగ రమణ " ఉన్నారు. కాకపొతే మా పని లోకే వచ్చి తన పని తను చేసుకుపోయే వెంకట్రావ్ మాత్రం వేదిక కు క్రింద నిలబడి గట్టిగా అరుస్తున్నాడు. అతడికి సపోర్ట్ గా ఇంకా రైతులు కూడా అరుస్తున్నారు. కాస్త ఆలస్యమైనా ఫరావాలేదనుకుంటూ క్రిందకు దిగి వేదిక వైపుగా నడిచాం . మమ్మల్ని ఎరిగున్న జనమే కాబట్టి మాకు దారి ఇచ్చారు. వెంకట్రావ్ దగ్గరకి వెళ్లి నెమ్మదిగా భుజం మీద చేయి వేసాను. వెనక్కి తిరిగాడు.
"సార్.....ఇలా వచ్చేరేంటి...?"
"నీవేమిటి .....ఇంత రెచ్చి పోతున్నావ్.... వేదిక మీద ఉన్న ఆ కొత్తాయన ఎవరు ?"
" ఆయనే సార్ ....ఎవరో .....ఏదో పార్టీ నాయకుడంట .....అసలాయన పార్టీనే జనం మరిచి పోతుంటే ఎప్పటి లాగానే పిచ్చి వాగుడు వాగుతున్నాడు . "
" ఛా... ఊరుకో ఎవరో పెద్దాయన లా ఉన్నాడు "
"పెద్దాయనే సార్ ....ఆ కళ్ళకున్న అద్దాలు తీయడు ......ఆ అద్దాలు ఎప్పుడో మసక బారి పొయ్యాయి. ఆయనకా విషయం అర్ధం కాక ఆ అద్దాల లోనుండి కనబడేదే లోకం అనుకుంటాడు . "
"సరేలే ఇంతకీ ఆయనేమంటాడు ......?"
"ఉప్పుడు ఈ రమణ గురించి ఈ వూర్లో ఇప్పుడే పుట్టిన బిడ్డనడిగినా చెప్పుద్ది. యీయనొచ్చి ఆడెంత ఎదవో చెప్పకుండా యీడు ఎప్పుడు కూడా ఏ గోడ మూలా ఒంటేలు పొయ్యడు కాబట్టి చాలా   గొప్పోడనట్లు చెబుతాడు. యీడు తాగి ఆడోళ్ళను బూతులు తిడతాడు .....దొరికిందల్లా అమ్మేసి తాగేత్తాడు....ఊరుమ్మడి చెరువులో చేపలు రాత్రి పూట పట్టి మర్నాడు పక్కూరి సంతలో అమ్మేత్తాడు....అసలు యీడు .ఈడి బాబూ కలసి చెయ్యని గోరమేదన్నా ఉందా ....... అయ్యన్నీ చెప్పకుండా ఈడు పోసే ఒంటేలు గురించి చెబుతాడేంటి సారూ .....మేమేమైనా ఈయన కళ్ళకి పిచ్చెదవల్లా అగపడతన్నామా.....?" వెంకట్రావ్ ఆవేశం తో ఊగి పోతున్నాడు

వెంకట్రావ్ ....ఆయన్నంటున్నాడా.......లేక వేరే పెద్ద పార్టీ వాళ్ళ నాయకుడిని ............



మరి కొంత మూలాలలోకి........